మరక కాదు మట్టి మీద తారక | Sangeet Som comments over Taj mahal should condemn | Sakshi
Sakshi News home page

మరక కాదు మట్టి మీద తారక

Published Tue, Oct 24 2017 12:55 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

Sangeet Som comments over Taj mahal should condemn - Sakshi

రెండో మాట
బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ వంటి వారు సెక్యులర్‌ రాజ్యాంగాన్ని భగ్నం చేసే దారులకు వెళ్లరాదు. కానీ ఈ పనికిమాలిన వివాదంతో వచ్చిన అపకీర్తి నుంచి బీజేపీ–ఆరెస్సెస్‌లను కాపాడుకునేందుకు మోదీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, నష్ట నివారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక ప్రయత్నం చేశారు. ‘తాజ్‌ భారతీయ శ్రమజీవుల చెమట చుక్కల, రక్తతర్పణల ఫలితం’ అన్నారాయన. గుండెలలో నుంచి కాకున్నా, పెదవుల చప్పుడుతో అయినా ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు.

తాజ్‌మహల్‌ను నిర్మించినది హిందూ పాలకుడే గానీ, మొగల్‌ వంశీకుడు షాజహాన్‌ కాదు; అది శివాలయమే కానీ, ముంతాజ్‌ జ్ఞాపక చిహ్నం కాదు... హిందూత్వవాద రచయిత పీఎన్‌ ఓక్‌ 1980లో చేసిన సిద్ధాంతమిది. ‘భారత చరిత్ర’ను తిరగరాయవలసిన అవసరం ఉన్నదంటూ ఆయన 2000 సంవత్సరంలో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. తాజ్‌మహల్‌ నిర్మాత హిందూ రాజేనని ప్రకటించాలని కోరారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ సందర్భంగా, ‘తాజ్‌ గురించి ఇతడు పాత పాటే పాడుతున్నాడు’ అంటూ కోర్టు చురక కూడా వేసింది. అలాగే తాజ్‌ మహల్‌ నిర్మించిన స్థలంలో అంతకు ముందు మరొక కట్టడం ఉన్నట్టు చెప్పే చారిత్రక ఆధారాలేవీ లేవని 2007 ఆగస్ట్‌లో భారత పురావస్తు పరిశోధన శాఖ చేసిన సర్వే కూడా ధ్రువపరిచింది.
– (వికీ పీడియా విజ్ఞాన సర్వస్వం నుంచి)
‘తాజ్‌ భారతీయ సంస్కృతికే ఒక మచ్చ. చరిత్ర గ్రంథాల నుంచి దీని ప్రస్తావన తొలగించాలి. పాఠ్యపుస్తకాల నుంచి రూపుమాపాలి. కనుకనే బాబర్, అక్బర్, ఔరంగజేబు–ఎవరైతేనేమి, వీళ్లను చరిత్ర నుంచి తుడిచివేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.’
– సంగీత్‌ సోమ్‌ (యూపీ శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే, 16–10–2017)

‘చూస్తూ ఉంటే మేస్తూ పోయింద’న్నట్టు బీజేపీ–ఆరెస్సెస్‌ పాలకవర్గం సెక్యులర్‌ రాజ్యాంగ ధర్మాలకూ, నియమాలకూ విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పార్లమెంట్‌లో బ్రూట్‌ మెజారిటీతో పాలక వర్గం తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు కనిపిస్తున్నది. తాజ్‌మహల్‌ గురించి మరోసారి రేపిన వివాదం ఈ రాజ్యాంగ విరుద్ధ పోకడలలో భాగమే. తన ప్రేయసి ముంతాజ్‌తో తనకు ఉన్న అనురాగానికి గుర్తుగా మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌ ఆగ్రాలో నిర్మించినదే ప్రపంచ ప్రఖ్యాత సుందర తాజ్‌. ఇప్పటి వివాదం దీని మీదే. పురుషోత్తం నగేశ్‌ ఓక్‌ (1917–2007) ఈ వివాదానికి మూలపురుషుడు.

కొందరు కుహనా మేధావుల దృష్టిలో భూమి మీద తొలిగా ఆవిర్భవించినదే భారతదేశం. మిగిలిన దేశాలు తరువాత ఆవిర్భవించినవేనని వారి అభిప్రాయం. మానవ ప్రస్థానంలో కనిపించే అన్ని తాత్విక, గణిత, సాహిత్య, సాంస్కృతిక, ఖగోళ, జ్యోతిషాలకు పుట్టినిల్లు భారతదేశమేనని కూడా వారి నమ్మకం. అలాగే ఇతర మతాలనూ, సంస్కృతినీ తూలనాడడం కూడా వారికో దురలవాటు. ‘నా సంస్కృతి, తాత్వికతలు మహోన్నతమైన’ వంటూ చెప్పుకోవడం సబబైనదే. కానీ ఆ మైకంలో ఇతర దేశాల, జాతుల, ఖండాల వారి చారిత్రక వారసత్వాలను, కళా సంస్కృతులను కించపరచడం స్వదేశీ, విదేశీ భావజాలాలకు చెరుపేనన్న సంగతిని గ్రహించవలసిన రోజు వచ్చింది. నేటి తాజ్‌ రగడ పూర్వరంగాన్ని తెలుసుకున్నప్పుడు మన తాత్విక భావజాలంలో మార్పు అనివార్యమనిపిస్తుంది కూడా.

ఈ రగడకు మూలమైన ఓక్‌ పుస్తకం (తాజ్, ది ట్రూ స్టోరీ) చదివితే ఆ తాత్వికతలోని వైరుధ్యాలు బయటపడతాయి. తాజ్‌ నిర్మాణం హిందూ దేవాలయాల శిల్ప రీతులలో జరిగిందని వాదించినప్పుడు, క్రీస్తుశకం ఏడో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు ఇక్కడ జరిగిన నిర్మాణాలన్నీ ఇండో–ఇస్లామిక్‌ శిల్ప రీతులతో సాగాయన్న వాస్తవాన్నీ, ఆ కాలంలో వాస్తు, కళారీతుల మధ్య ఆదానప్రదానాలు జరిగాయన్న సత్యాన్నీ అంగీకరించవలసి ఉంటుంది. హిందూ వాస్తుశిల్పంతో తాజ్‌ రూపొందిందని చెప్పిన ఓక్‌ అక్కడితో ఆగలేదు. క్రైస్తవమతమనేది లేదు, క్రైస్తవం వైదిక క్రైస్త్తవం లేదా కృష్ణనీతి సిద్ధాంతమేనని ఓక్‌ సూత్రీకరించారు కూడా. ఇంకా, పోప్‌ మతాధికార వర్గమంటూ ఏదీ లేదనీ, వైదిక పురోహిత వర్గమే పోప్‌ మతస్తులనీ కూడా వాపోయారు. వాటికన్‌ను కూడా వైదిక పదం వాటిక నుంచి సాగలాగి వైదిక పురోహిత వర్గమే క్రైస్తవ మతాచార్యులని ఓక్‌ విశ్లేషించారు. అలా కశ్మీర్‌ నుంచి కేప్‌ కొమరిన్‌ దాకా ఉన్న చారిత్రక కట్టడాలు, నగర వాటికలు అన్నీ హిందూ మతస్తులవే తప్ప, వివిధ ముస్లిం పాలకులవి కావని ఓక్‌ సిద్ధాం తీకరించారు. తలాతోకా లేని ఇలాంటి మత ధోరణులు చరిత్ర అనిపించుకోలేవు.

ఇవేం ధోరణులు?
బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ వంటి వారు సెక్యులర్‌ రాజ్యాంగాన్ని భగ్నం చేసే దారులకు వెళ్లరాదు. కానీ ఈ పనికిమాలిన వివాదంతో వచ్చిన అపకీర్తి నుంచి బీజేపీ–ఆరెస్సెస్‌లను కాపాడుకునేందుకు మోదీ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోయినా, నష్ట నివారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఒక ప్రయత్నం చేశారు. ‘తాజ్‌ భారతీయ శ్రమజీవుల చెమట చుక్కల, రక్తతర్పణల ఫలితం’ అన్నారాయన. గుండెలలో నుంచి కాకున్నా, పెదవుల చప్పుడుతో అయినా ఒక వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే, ఇప్పుడు మన సంపదగా భావిస్తున్న ఎర్రకోట (మొగలుల కట్టడం), రాష్ట్రపతిభవన్, పార్లమెంట్‌ భవనం (ఆంగ్లేయులవి) గురించి కొన్ని ప్రశ్నలు ఎదుర్కొనవలసి వచ్చింది.

సింహాసనాల కోసం రక్తాన్ని చిందించిన చరిత్ర విషయంలో ఏ కాలపు పాలకులకూ మినహాయింపు లేదు. తండ్రిని, అన్నదమ్ములను చంపి అధికారానికి వచ్చినవారి గురించి తెలియంది కాదు. బాబర్, అక్బర్‌లకూ అదే జరిగింది, ఔరంగజేబుకూ అదే జరిగింది. తండ్రి షాజహాన్‌ను బంధించినవాడు ఔరంగజేబు. బాబర్, అక్బర్‌లు మత సామరస్య ప్రబోధకులు, ఆచరించిన వారైనా బిడ్డల నుంచే ప్రమాదాలు ఎదుర్కోవలసి వచ్చింది. కృష్ణదేవరాయలు అధికారంలో ఉన్నప్పుడు రామరాయలు ఇతర శత్రువులతో చేతులు కలిపి రాజ్యాధికారానికి రావడానికి చూశాడు. రాయలు రాజ్య విస్తరణలో లేదా స్వరాజ్య సంరక్షణలో దక్కన్‌ ఆదిల్షా పైన మన ప్రాంతం కాని కటకం గజపతులపైనా కత్తులు దూయవలసి వచ్చింది– అందుకే రాజ్య విస్తరణ కాంక్షకు నిదర్శనగానే రాయల కాలంలోనే ఒక సామెత పుట్టింది: ‘కాదని వాదుకు వస్తే కటకం దాకా రాయలపాలనే’ కొనసాగుతుందన్న మాట. అలాగే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మొగలాయీలపై భీషణ సమరం సాగిస్తున్న తండ్రిని వదిలేసి వైరి శిబిరంతో ఎందుకు చేతులు కలపవలసి వచ్చిందో చెప్పే చరిత్రకారుడు లేడు. అందుకే ‘రాజన్నవాడు/ పాలకుడన్నవాడు ఏ వ్యక్తినీ తన బంధువనిగానీ, సంబంధి అని గానీ చూసుకోడు’ అన్న జహంగీర్‌ మాటల్ని ‘భారత చరిత్ర’ గ్రంథ రచయిత జాన్‌ కేయీ ప్రస్తావించారు. ‘రక్తపుకూడు’ దగ్గర ముస్లిం, హిందూ రాజులకు మధ్య తేడాపాడాలు చూపి మనం ఎవరికీ కొమ్ము కాయనక్కరలేదు.

ఆదానప్రదానాలు సాధారణం
అయితే వారి పాలనలో సాహిత్య, శిల్ప, కళాదిరంగాలలో జరిగిన కృషిని అంచనా వేసేటప్పుడు (అది అధికార విలాసాలలో అంతర్భాగమైనప్పటికీ) విమర్శకుల వైఖరి వేరుగా ఉంటుంది. ఎందుకంటే, తాజ్‌మహల్‌ నిర్మాణానికి అవసరమైన భూమిని షాజహాన్‌కు యమునా తీరంలో ఇచ్చినవాడు హిందూ రాజు అంబర్‌. ఇందుకు ముదరాగా షాజహాన్‌ ఆగ్రాలోని నాలుగు భవంతులను అంబర్‌కి అప్పగించాడని మరవరాదు. ఆ తర్వాతనే తాజ్‌ నిర్మాణం 1632లో మొదలై పదేళ్లలో పూర్తయిందని పదివేల సంవత్సరాల భారత ఉపఖండ చరిత్రను సాధికారికంగా లిఖించిన చరిత్రకారుడు మిఖాయిల్‌ ఉడ్‌ వెల్ల డించాడు (బీబీసీ గ్రంథావళి: ‘ది స్టోరీ ఆఫ్‌ ఇండియా’ 2007, పేజి–251). మనం విస్మరిస్తున్న మరొక అంశం ఉంది. నేటి బ్రాహ్మణ్యానికి పడని ముస్లిముల–మొగలాయీల పాలనలో, దర్బారుల్లో అనేకమంది బ్రాహ్మణులైన సంస్కృత పండితులు, పర్షియన్, హిందీ పండితులు సాహిత్య గోష్ఠులు, కవితా పఠనాలు హృద్యంగా జరిపిన వారే. మొగల్‌ పాలకుల నుంచి సనదులు పొందినవారే. అలాంటి వారిలో ‘పారసి (పర్షియా) ప్రకాశం’ రచించిన కృష్ణదాస, ఇంకా వేదాంగరాయలు, ‘పారసి ప్రకాశ వినోదిని’ గ్రంథకర్త వజ్రఘోషణుడు వంటి బ్రాహ్మణ పండితులు ఉన్నారు.

అక్బర్‌ ఆస్థానంలోని ‘నీలకంధరుడు’ కూడా సనద్‌ అందుకున్నాడు. ప్రయాగ, బనారస్‌లను సందర్శించే యాత్రికులపై పన్ను రద్దు చేసేటట్టు షాజహాన్‌ను ఒప్పించిన సంస్కృత కవి కవీంద్రాచార్య సరస్వతికి నివాళిగా వెలసిందే– ‘కవీంద్ర చంద్రోదయ’ సంపుటం. షాజహాన్‌ కాలంలో తెలుగువారైన అప్పయ్య దీక్షితులు, ‘రసగంగాధరం’ కర్త జగన్నాథ పండిత రాయలు (ముంగండ) తమ పాండితీ కీర్తి పతాకాల్ని ఎగరవేసిన వాళ్లే. ముస్లిం యువతి ‘లవంగి’ని ప్రేమించి, మేలం ఆడుతున్నాడన్న నెపంపైన పండితరాయలను ఎవరో కాదు, కొందరు కుహనా బ్రాహ్మణ పండితులే వెలివేయడానికి ప్రయత్నించారన్న సంగతినీ మరవలేం. పాలనలో ‘పరమానంద’ అనే పండితుడు భారత ఖగోళ శాస్త్రం మీద గ్రంథం రాశాడు. ఇందుకు వెండి, బంగారు నాణాలను పురస్కారంగా పొందాడు. నాడు పర్షియన్, సంస్కృతం, హిందీ భాషా రచనల మధ్య ఆదాన ప్రదానాలు నడిచాయన్నది నిజం. పర్షియన్‌ ఖగోళ శాస్త్ర గ్రంథం ‘జి జియి–షా–జహానీ’ సంస్కృతంలోకి అనువదించడానికి నిత్యానంద పండితుడిని నియమించారు.
 
ఇలా రుతు చక్ర భ్రమణంలో ఎన్ని మార్పులు జరిగినా కుల మతాలపై ఆధారపడి, ఆ రంగు కళ్లద్దాల్లోంచి మానవ సంబంధాల్ని కొలవడానికి ప్రయత్నించకూడదు. ఆ మాటకొస్తే– వాస్తు శిల్పకళలో అంతర్భాగమైన ఆలంకారిక ప్రవేశద్వారాలు, గుమ్మటాలు, వరండా ‘పయిజాలు’, పచ్చదనాన్ని నిత్యం తలపించే వృక్షపంక్తులు, సరంబీలు, కమాన్లు ఇత్యాది అమరికలలో ఇండో–ఇస్లామిక్‌ శిల్ప కళారీతులు పరస్పరం ప్రభావితమవుతూ వచ్చినవే. రసాత్మకత మిశ్రమ కళా సంప్రదాయాలకూ మౌలిక ధర్మమే. చివరికి కుంభస్వామి వైష్ణవ దేవాలయం సహితం ఈ మిశ్రమ వాస్తు శిల్ప రీతుల్ని తప్పిం చుకొనలేక పోయిందని చరిత్రకారుల భావన. గుజరాత్‌ సంప్రదాయం వేరని భావించే కొందరు వేర్పాటువాదులు గుజరాతీ కవి తన ‘అర్థ రత్నావళి’ గ్రంథాన్ని అక్బర్‌కి అంకితమిచ్చాడని మరవరాదు. ఇంతకూ ముక్తాయింపుగా ఒక ఆఖరిమాట– ఒక కథనం ప్రకారం ఔరంగజేబు గుజరాత్‌లోని జైన దేవాలయాన్ని కూల్చేశాడని కథ అల్లినా, గుజరాతీ దేశ భాషా పత్రికలన్నీ ఔరంగజేబు పాలనలో సర్వత్రా మత సామరస్యం వెల్లివెరిసిందని పేర్కొనడం మనకు తెలియని ఒక సత్యాన్ని తెలుసుకోవడమే. ఆమాటకొస్తే దక్కన్‌లోనూ ఔరంగజేబు హిందూ దేవాలయాలకు కానుకలిచ్చాడనీ వినలేదూ?! తెలి యని మరిన్ని వివరాలకు ఇటీవలి తాజా బృహత్‌ సాధికార రచన మేడం ఆంధ్రే ట్రస్కీ రాసిన ‘కల్చర్‌ ఆఫ్‌ ఎన్‌కౌంటర్స్‌’ గ్రంథరాజాన్ని (2016) పరి శీలించడం మన జ్ఞాన పరిధుల్ని విస్తరించుకోవడమే.

abkprasad2006@yahoo.co.in
సీనియర్‌ సంపాదకులు ఏబీకే ప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement