మీరట్: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చరిత్రాత్మకంగా తాజ్‌మహల్‌కు ఎటువంటి ప్రాధాన్యం లేదని, హిందువులను లక్ష్యంగా చేసుకోవటంతోపాటు తండ్రిని జైల్లో పెట్టిన వ్యక్తిని చరిత్రలో గొప్పవాడిగా చూపారని సోమ్ వ్యాఖ్యానించారు. నిజానికి తాజ్‌మహల్‌ను నిర్మించిన షాజహాన్‌ను ఆయన కుమారుడు ఔరంగజేబు చెరసాలలో బంధించాడు. అంతేకానీ షాజహాన్ తన తండ్రిని చెరసాలలో బంధించలేదు. ఇలా చరిత్రను తప్పుగా వక్రీకరించిన సోమ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ఆదివారం మీరట్ జిల్లా పర్యటనలో ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఆనంగ్‌పాల్ సింగ్ తోమర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాబర్, అక్బర్, ఔరంగజేబులు ద్రోహులని, వారి పేర్లను చరిత్రపుటల్లోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తాజ్‌మహల్‌ను యూపీ టూరిజం బుక్‌లెట్ నుంచి తొలగించినందుకు కొందరు బాధపడు తున్నారని, అసలు తాజ్‌మహల్‌కున్న చరిత్ర ఏంటని ఆయన ప్రశ్నించారు. మహారాణా ప్రతాప్, శివాజీలు నిజమైన యోధులని, వారి జీవితచరిత్ర గురించి స్కూళ్లు, కాలేజీల్లో బోధించాలని సూచించారు.
మరి ఎర్రకోటనూ వారే కట్టారు కదా: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: తాజ్ మహల్æపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఎర్రకోటను కూడా మీరన్న ఆ దేశ ద్రోహులే నిర్మించారని.. అక్కడి నుంచి ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించకుండా ఆపుతారా? ఓవైసీ ప్రశ్నించారు. అలాగే అదే దేశద్రోహులు నిర్మించిన హైదరాబాద్ హౌస్‌లో దేశ పర్యటనకు వచ్చిన విదేశీ నేతలకు ఇస్తున్న ఆతిథ్యాన్ని కూడా మోదీ ఆపేస్తారా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించే సత్తా కేంద్రానికి ఉందా అని ఆయన సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment