
త్రిపుర బెలోనియాలో లెనిన్ విగ్రహాన్ని కూలుస్తున్న దృశ్యం
అగర్తలా : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన సరిగ్గా 48 గంటలకే.. ప్రఖ్యాత కమ్యూనిస్టు నేత లెనిన్ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. త్రిపురలోని బెలోనియా పట్టణంలో లెనిన్‌గా ప్రసిద్ధుడైన వ్లాదిమిర్ ఇల్యీచ్ ఉల్యొనోవ్ విగ్రహం నెలకొని ఉంది. త్రిపురలో సీపీఎం పాలన 21ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. అయితే, తాజా ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించిన నేపథ్యంలో ఈ విగ్రహాన్ని కొందరు జేసీబీతో కూల్చేశారు.
కాషాయ దుస్తులు, టోపీలు ధరించిన యువకులు ‘భారత్‌మతాకీ’ జై నినాదాలు చేస్తుండగా ఈ విగ్రహాన్ని జేసీబీతో కూల్చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా ఏఎన్‌ఐ ట్వీట్ చేసింది. కొందరి ‘కమ్యూనిస్టు ఫోబియో’కు ఈ ఘటన నిదర్శనమని సీపీఎం విమర్శించగా.. వామపక్ష పాలనలో అణచివేయబడ్డ ప్రజలే ఆ విగ్రహాన్ని కూల్చేశారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. త్రిపురలో బీజేపీ గెలిచిన అనంతరం ఆ పార్టీ కార్యకర్తలు సీపీఎం కార్యాలయాలపై దాడులు చేసి.. విధ్వంసానికి దిగుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ నేతల సహకారంతో ఆ పార్టీ శ్రేణులు.. సీపీఎం కార్యకర్తలు, నాయకుల లక్ష్యంగా దాడులకు దిగితూ.. హింసకు పాల్పడుతున్నారని, త్రిపురలో బీజేపీ శ్రేణులు రౌడీయిజానికి పాల్పడుతున్నారని వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

త్రిపులో బీజేపీ శ్రేణులు విధ్వంసం అంటూ సీపీఎం ట్వీట్ చేసిన ఫొటో
Comments
Please login to add a commentAdd a comment