నాలుగేళ్లలో 14 మంది ముఖ్యమంత్రులు! | BJP winning States in last Four years | Sakshi
Sakshi News home page

Published Sun, Mar 4 2018 7:41 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

BJP winning States in last Four years - Sakshi

దాదాపు నాలుగేళ్ల క్రితం 2014 మే 26న కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక జరిగిన 19 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అప్పటికే బీజేపీ పాలనలో ఉన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు, తర్వాత ఫిరాయింపులతో అధికారంలోకి వచ్చిన అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమా ఖండూ, కొద్ది రోజుల్లో ప్రమాణం చేసీ త్రిపుర సీఎంతో కలిపి బీజేపీ ముఖ్యమంత్రుల సంఖ్య 14కు పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన కేంద్రంలో ఎన్డీఏ(బీజేపీ) ప్రభుత్వం ఏర్పడ్డాక 2014 ద్వితీయార్థంలో  అసెంబ్లీ ఎన్నికలు జరిగిన హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో తొలిసారి బీజీపీ ముఖ్యమంత్రులు (వరుసగా మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, దేవేంద్ర ఫడణవీస్‌, రఘుబర్‌ దాస్‌) అధికారంలోకి వచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికల తర్వాత శివసేనతో చేతులు కలిపి సంకీర్ణ సర్కారుకు నాయకత్వం చేపట్టింది. జమ్మూకశ్మీర్‌లో సీఎం మెహబూబూ ముఫ్తీ నేతృత్వంలోని జమ్మూకశ్మీర్‌ పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీతో చేతులు కలిపి సంకీర్ణ భాగస్వామిగా కొత్త సర్కారులో చేరింది. మరుసటి ఏడాది 2015లో జరిగిన దిల్లీ (కేంద్రపాలిత ప్రాంతం), బిహార్‌ ఎన్నికల్లో కాషాయపక్షం ఓడిపోయింది. అయితే, 2017 జులైలో బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌(జేడీయూ) తన సంకీర్ణ సర్కారు ప్రధాన భాగస్వామి ఆర్జేడీతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో చేతులు కలిపారు. బీజేపీ భాగస్వామిగా వెంటనే సంకీర్ణ ప్రభుత్వం నితీష్‌ నాయకత్వాన ఏర్పడడంతో బిహార్‌ కూడా ఏన్డీఏ పాలిత రాష్ట్రాల జాబితాలో చేరింది.

బీజేపీ ఖాతాలో మొదటిసారి చేరిన అస్సాం
2016లో కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ, అస్సాం అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ తొలిసారి అస్సాంలో మెజారిటీ సాధించి అధికారం చేపట్టింది. బీజేపీ నేత సర్బానంద సోనోవాల్‌ ప్రాంతీయపక్షమైన ఏజీపీ, బీపీఎఫ్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి అతి స్వల్ప సంఖ్యలో సీట్లు దక్కాయి. తొలిసారి కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు గెలుచుకుంది. తర్వాత పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ రెండో స్థానం సాధించి సీపీఎంను మూడో స్థానానికి పరిమితం చేసింది. బీజేపీ నెమ్మదిగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా అవతరిస్తుందేమో అనేలా బలపడుతోంది.

2017లో ఆరు రాష్ట్రాల్లో విజయం
2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన గోవాలో అతికష్టం మీద బీజేపీ అధికారం నిలబెట్టుకుంది. పంజాబ్‌లో అకాలీదళ్‌-బీజేపీ కూటమి ఘోర పరాజయం పాలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మణిపూర్‌లో కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ మొదటి మూడు రాష్ట్రాల్లో కాషాయపక్షానికి మంచి మెజారిటీ వచ్చింది. మణిపూర్‌లో కాంగ్రెస్‌ కన్నా తక్కువ సీట్లు వచ్చినాగాని చిన్న పార్టీల మద్దతు కూడగట్టి సీఎం పదవి కైవసం చేసుకుంది బీజేపీ. దాదాపు 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న గుజరాత్‌లో అతి కష్టంమీద బీజేపీ హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.


2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన త్రిపురలో బీజేపీ తన మిత్రపక్షం ఐపీఎఫ్‌టీతో కలిసి 59 సీట్లలో 43 కైవసం చేసుకుని ఘన విజయం సాధించింది.  కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో రెండుశాతం కూడా సీట్లు రాని ఈ చిన్న బెంగాలీ రాష్ట్రంలో తొలిసారి బీజేపీ నేత సీఎం పదవి చేపట్టబోతున్నారు. నాగాలాండ్‌లో ఎక్కువ సీట్ల గెలుచుకున్న మిత్రపక్షం ఎన్డీపీపీ నాయకత్వంలో ఏర్పడే సంకీర్ణ సర్కారులో బీజేపీ భాగస్వామిగా చేరాలని భావిస్తోంది. మేఘాలయలో బీజేపీకి కేవలం రెండే సీట్లు దక్కడంతో ఇక్కడ ఈ పార్టీ పాత్ర పరిమితమే. ఈ ఏడాది చివర్లో అసెంబీ‍్ల ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో బీజేపీ 2003 డిసెంబర్‌ నుంచీ అధికారంలో కొనసాగుతోంది. ఈ రెండింటితో పాటు ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో 2013లో అధికారంలోకి వచ్చింది. ఈ మూడు హిందీ రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని వస్తున్న అంచనాల నేపథ్యంలో బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోవడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలోని కర్ణాటకలో వచ్చే మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడానికి బీజేపీ నేతలు గట్టి వ్యూహాలు పన్నుతున్నారు. మొత్తం 29 రాష్ట్రాల్లో త్రిపురతో కలిపి 14 చోట్ల బీజేపీ ముఖ్యమంత్రుల పాలనలోకి వచ్చాయి. జమ్మూకశ్మీర్‌, ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ను పాలిస్తున్న సంకీర్ణ ప్రభుత్వాల్లో బీజేపీ జూనియర్‌ భాగస్వామిగా ఉంది. (సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement