నేడే యూపీ తొలిదశ | Uttar Pradesh Elections 2017 | Sakshi
Sakshi News home page

నేడే యూపీ తొలిదశ

Published Sat, Feb 11 2017 12:58 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

నేడే యూపీ తొలిదశ - Sakshi

నేడే యూపీ తొలిదశ

పశ్చిమ యూపీలోని 73 స్థానాలకు ఎన్నికలు
లక్నో: కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు శనివారం జరగనున్నాయి. పశ్చిమ యూపీలోని మీరట్,  ఆగ్రా తదితర 15 జిల్లాల్లో 73 నియోజకవర్గాలకు జరగనున్న పోలింగ్‌లో 2.6 కోట్ల మంది ఓటేయనున్నారు.  839 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కుమారుడు పంకజ్‌(నోయిడా), ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ అల్లుడు రాహుల్‌ సింగ్‌(బులంద్‌షహర్‌ జిల్లా సికందరాబాద్‌ నుంచి ఎస్పీ తరఫున) బరిలో ఉన్నారు. ముజఫర్‌నగర్‌ అల్లర్ల నిందితుడైన సర్దానా సిటింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ మళ్లీ పోటీ చేస్తున్నారు. ముజఫర్‌నగర్‌లోని 887 పోలింగ్‌ కేంద్రాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

గోమాంసం తిన్నాడనే ఆరోపణలపై 2015లో ఒక ముస్లిం హత్యకు గురైన దాద్రీ నియోజకవర్గం(గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లా) లోనూ ఈ దశలోనే పోలింగ్‌ జరుగుతోంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న పశ్చిమ యూపీలో ఎంఐఎం కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. తొలిదశ పోలింగ్‌ మిగతా ఆరు దశల పోలింగ్‌పై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశాయి.

ఎస్పీ–కాంగ్రెస్‌కు ఓటేయండి: యూపీ తొలిదశ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్‌ కూటమికి ఓటేయాలని కోల్‌కతాలోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్‌ సయ్యద్‌ మహ్మమద్‌ నూరూర్‌ రెహ్మన్  బర్కతీ ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆరెస్సెస్‌లు విభజనవాద రాజకీయాలతో ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నాయని, అవి ముస్లింలకు వ్యతిరేకమని ఆరోపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement