ఫలితం తేలేది నేడే!
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
♦ 12 గంటల కల్లా స్పష్టత!
♦ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
♦ రాజ్యసభ లెక్కలపైనే కమలదళం దృష్టి
⇒ ఉత్తరప్రదేశ్ : మొత్తం సీట్లు 403 .. మేజిక్ ఫిగర్ 202
⇒ పంజాబ్: మొత్తం సీట్లు..117 .. మేజిక్ ఫిగర్ 59
⇒ ఉత్తరాఖండ్: మొత్తం సీట్లు 70 .. మేజిక్ ఫిగర్ 36
⇒ మణిపూర్: మొత్తం సీట్లు 60 .. మేజిక్ ఫిగర్ 31
⇒ గోవా: మొత్తం సీట్లు 40 .. మేజిక్ ఫిగర్ 21
నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలే మిగిలింది. కీలకమైన యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. రాజ్యసభలో మెజారిటీ దక్కాలంటే కమలం పార్టీకి విజయం అత్యంత అవసరం. అటు ఎస్పీ–కాంగ్రెస్ కూటమి అస్తిత్వం నిలుపుకునేందుకు ఈ ఎన్నికలు క్రియాశీలకం.
న్యూఢిల్లీ/లక్నో: యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవనుండగా.. 11 గంటలకల్లా ఫలితాలపై ఓ అంచనా, 12 కల్లా స్పష్టత వచ్చే వీలుంది. పోలింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో సాయుధ బలగాలు పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటుచేశాయి.
ప్రధాన మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి రెఫరెండంగా భావిస్తున్న ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కువసీట్లున్న యూపీలో బీజేపీ అధిక సీట్లు గెలిచే వీలున్నప్పటికీ.. హంగ్ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలసి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఈ ఎన్నికలు బీజం వేస్తాయని నిపుణులంటున్నారు.
పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటుగా ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో అధికారాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అటు ఢిల్లీ బయట తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌పై విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బిహార్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ.. మహాకూటమే గెలిచిన విషయాన్ని లాలూ గుర్తుచేశారు.
రాజ్యసభపై బీజేపీ గురి
లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్న బీజేపీ.. రాజ్యసభలో బలం లేక తన నిర్ణయాలకు ఆమోదం పొందలేకపోతోంది. అందుకే యూపీలో విజయం కోసం శతవిధాలా శ్రమించింది. యూపీ నుంచి గరిష్టంగా 31 మంది రాజ్యసభ ఎంపీలుంటారు. ప్రస్తుతం బీజేపీకి యూపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కలసి మొత్తంగా 12 మంది ఎగువసభకు వెళ్లగలరు.
ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్‌కు 59 మంది (యూపీఏ–65) సభ్యులుండగా.. బీజేపీకి 56 మంది (ఎన్డీఏ–74) ఎంపీలున్నారు. మిగిలిన విపక్షాలన్నింటికీ కలసి 106 మంది ఎంపీలున్నారు. యూపీలో బీజేపీ గెలిస్తే 2018లో ఈ లెక్కల్లో భారీ మార్పులు జరగనున్నాయి. యూపీ అసెంబ్లీ ఫలితాలు ఆ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రాంతీయపార్టీల బలాబలాలను నిర్దేశించే అవకాశం ఉంది. ఈ విషయం అఖిలేశ్‌కు అర్థమైందని.. అందుకే బీజేపీని అడ్డుకునేందుకు బీఎస్పీతోనూ దోస్తీకి సిద్ధమనే సంకేతాలిచ్చారని రాజకీయ నిపుణులంటున్నారు. ఎన్నికలకు నెల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్‌కు.. ఇప్పుడు గెలిస్తేనే పార్టీపై పట్టు దక్కుతుంది. లేదంటే నష్టపోక తప్పదు.
గోవా సీఎంగా పరీకర్?
40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 19–22 సీట్లు రావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్న నేపథ్యంలో.. సీఎం ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. ప్రచారాన్ని కేంద్రమంత్రి పరీకర్ ముందుండి నడపటంతో ఆయనే మళ్లీ సీఎంగా వస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.