notes cancellation
-
ఆందోళన వద్దు.. ఆర్టీసీ బస్సుల్లో రూ. 2 వేల నోట్లకు ఓకే
కర్ణాటక: ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించడంతో ప్రజలు తమ వద్దనున్న నోట్లను ఖర్చు చేయడం, లేదా బ్యాంకుల్లో మార్పిడి చేస్తున్నారు. ప్రయాణికులు ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను ఇస్తుంటే కండక్టర్లు తీసుకోవడం లేదు. దీంతో అనేకచోట్ల వాగ్వాదాలు జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో రూ.2 వేల నోట్లను తీసుకోవాలని ఆ కండక్టర్లకు ఉన్నతాధికారులు సూచించారు. బస్సుల్లో ఈ నోట్లను తీసుకుంటారని ఆదివారం స్పష్టం చేశారు. 2 వేల నోట్లను తీసుకోరాదని ఎవరికీ చెప్పలేదని తెలిపారు. హోసకోటేలో మాత్రమే ఇటువంటి తప్పుడు ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరికీ ఆందోళన వద్దని అన్నారు. -
ఫలితం తేలేది నేడే!
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం ♦ 12 గంటల కల్లా స్పష్టత! ♦ కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ♦ రాజ్యసభ లెక్కలపైనే కమలదళం దృష్టి ⇒ ఉత్తరప్రదేశ్ : మొత్తం సీట్లు 403 .. మేజిక్ ఫిగర్ 202 ⇒ పంజాబ్: మొత్తం సీట్లు..117 .. మేజిక్ ఫిగర్ 59 ⇒ ఉత్తరాఖండ్: మొత్తం సీట్లు 70 .. మేజిక్ ఫిగర్ 36 ⇒ మణిపూర్: మొత్తం సీట్లు 60 .. మేజిక్ ఫిగర్ 31 ⇒ గోవా: మొత్తం సీట్లు 40 .. మేజిక్ ఫిగర్ 21 నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలే మిగిలింది. కీలకమైన యూపీతో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలో ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 కల్లా ఫలితాలపై స్పష్టత వస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఈ ఎన్నికలు కీలకం. రాజ్యసభలో మెజారిటీ దక్కాలంటే కమలం పార్టీకి విజయం అత్యంత అవసరం. అటు ఎస్పీ–కాంగ్రెస్ కూటమి అస్తిత్వం నిలుపుకునేందుకు ఈ ఎన్నికలు క్రియాశీలకం. న్యూఢిల్లీ/లక్నో: యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవనుండగా.. 11 గంటలకల్లా ఫలితాలపై ఓ అంచనా, 12 కల్లా స్పష్టత వచ్చే వీలుంది. పోలింగ్ కేంద్రాల వద్ద వేల సంఖ్యలో సాయుధ బలగాలు పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటుచేశాయి. ప్రధాన మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి రెఫరెండంగా భావిస్తున్న ఈ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎక్కువసీట్లున్న యూపీలో బీజేపీ అధిక సీట్లు గెలిచే వీలున్నప్పటికీ.. హంగ్ తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో విపక్షాలన్నీ కలసి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ఈ ఎన్నికలు బీజం వేస్తాయని నిపుణులంటున్నారు. పంజాబ్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటుగా ఉత్తరాఖండ్, మణిపూర్లలో అధికారాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అటు ఢిల్లీ బయట తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాగా, ఎగ్జిట్‌పోల్స్‌పై విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బిహార్ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ.. మహాకూటమే గెలిచిన విషయాన్ని లాలూ గుర్తుచేశారు. రాజ్యసభపై బీజేపీ గురి లోక్‌సభలో తగినంత మెజారిటీ ఉన్న బీజేపీ.. రాజ్యసభలో బలం లేక తన నిర్ణయాలకు ఆమోదం పొందలేకపోతోంది. అందుకే యూపీలో విజయం కోసం శతవిధాలా శ్రమించింది. యూపీ నుంచి గరిష్టంగా 31 మంది రాజ్యసభ ఎంపీలుంటారు. ప్రస్తుతం బీజేపీకి యూపీ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ కలసి మొత్తంగా 12 మంది ఎగువసభకు వెళ్లగలరు. ప్రస్తుతం రాజ్యసభలో కాంగ్రెస్‌కు 59 మంది (యూపీఏ–65) సభ్యులుండగా.. బీజేపీకి 56 మంది (ఎన్డీఏ–74) ఎంపీలున్నారు. మిగిలిన విపక్షాలన్నింటికీ కలసి 106 మంది ఎంపీలున్నారు. యూపీలో బీజేపీ గెలిస్తే 2018లో ఈ లెక్కల్లో భారీ మార్పులు జరగనున్నాయి. యూపీ అసెంబ్లీ ఫలితాలు ఆ రాష్ట్రంలో భవిష్యత్తులో ప్రాంతీయపార్టీల బలాబలాలను నిర్దేశించే అవకాశం ఉంది. ఈ విషయం అఖిలేశ్‌కు అర్థమైందని.. అందుకే బీజేపీని అడ్డుకునేందుకు బీఎస్పీతోనూ దోస్తీకి సిద్ధమనే సంకేతాలిచ్చారని రాజకీయ నిపుణులంటున్నారు. ఎన్నికలకు నెల ముందు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అఖిలేశ్‌కు.. ఇప్పుడు గెలిస్తేనే పార్టీపై పట్టు దక్కుతుంది. లేదంటే నష్టపోక తప్పదు. గోవా సీఎంగా పరీకర్? 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీకి 19–22 సీట్లు రావొచ్చని ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్న నేపథ్యంలో.. సీఎం ఎవరనే దానిపైనే ఆసక్తి నెలకొంది. ప్రచారాన్ని కేంద్రమంత్రి పరీకర్ ముందుండి నడపటంతో ఆయనే మళ్లీ సీఎంగా వస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. -
పంజాబ్‌లో ఆప్–కాంగ్రెస్ హోరాహోరీ!
► మీడియా సర్వే అంచనా ► పంజాబ్‌లో 75%, గోవాలో 83% పోలింగ్ న్యూఢిల్లీ/చండీగఢ్/పణజి: నోట్ల రద్దు పరిణామాలతో బీజేపీకి, ప్రధాని మోదీకి ప్రతిష్టాత్మకంగా మారిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సంచలన తీర్పు ఇవ్వనున్నాయా? పదేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ)–బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోనుందా? విపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మధ్య హోరాహోరీ పోరు సాగి, ఆప్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందా? శనివారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక మీడియా ప్రతినిధులు పలు ప్రాంతాల్లో జరిపిన సర్వే ఫలితాలు ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి. అకాలీ–బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీలో ఆప్ పైచేయి సాధిస్తుందని పలువురు ఓటర్లు చెప్పారు. కాంగ్రెస్‌కు కూడా విజయావకాశాలు ఉన్నాయని కొందరు చెప్పగా, అధికార కూటమికి ఫలితాలు తీసికట్టుగా ఉంటాయని సర్వేలో పాల్గొన్న వారిలో చాలామంది చెప్పారు. మొత్తం 117 సీట్లకుగాను చీపురు పార్టీకి(ఆప్) దాదాపు 60, హస్తానికి 40 వస్తాయన్నారు. మార్పు కోసం తాము ఆప్ ‘జాడూ’కు ఓటేశామని పలువురు తెలిపారు. దాదాపు 800 జనాభా ఉన్న ఒక గ్రామంలో అయితే ఏకంగా 600 మంది కేజ్రీ పార్టీకి ఓటేసి ఉంటారని స్థానికులు చెప్పారు. పదేళ్ల ప్రభుత్వంపై వ్యతిరేకత చాలామందిలో కనిపించింది. రాష్ట్రం అవినీతి, నిరుద్యోగంతో కుదేలైందని, నోట్ల రద్దుతో చిన్నవ్యాపారాలు దెబ్బతిన్నాయని అన్నారు. అవినీతి ప్రక్షాళనకు నడుం కట్టిన ఆప్‌కు ఒకసారి అవకాశమిచ్చి చూడాలనుకుంటున్నామని చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 4 స్థానాలు గెలుచుకున్న ఆప్.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి 112 సీట్లలో పోటీ చేసింది. దాని మిత్రపక్షం లోన్ ఇన్సాఫ్ 5 స్థానాల్లో బరిలో ఉంది. ప్రశాంతంగా పోలింగ్ నోట్ల రద్దు తర్వాత దేశంలో తొలిసారి శనివారం రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. పంజాబ్‌లో 75 శాతం, గోవాలో 83 శాతం మంది ఓటేశారు. 117 స్థానాలున్న పంజాబ్‌లో 1,145 మంది, 40 స్థానాలున్న గోవాలో 251 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చెదురుమదురు ఘటనలు మినహా రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మార్చి 11న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. పంజాబ్‌లో ప్రాథమిక వివరాల ప్రకారం సుమారు 75 శాతం పోలింగ్ నమోదైంది. సంగ్రూర్ జిల్లా సుల్తాన్ పూర్ గ్రామంలో ఆప్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణల్లో ఇద్దరు గాయపడ్డారు. తరన్ తారన్ జిల్లా లాలూ గుమాన్లో అకాలీదళ్ మద్దతుదారుడు పోలింగ్ బూత్ వద్ద కాల్పులు జరపడంతో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు గాయపడ్డారు. ఫతేఘర్ చురియన్ నియోజకవర్గంలోని రోపోవాలి గ్రామంలో కాంగ్రెస్, అకాలీదళ్ కార్యకర్తలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు గాయపడ్డారు. ‘సాంకేతిక’ ఇబ్బందులు పంజాబ్ ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామో తెలియజేసే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీపీఏటీ) యంత్రాలను తొలిసారిగా వినియోగించారు. 6వేలకుపైగా పోలింగ్ బూత్‌లలో వాడారు. మజితా, సంగ్రూర్ల్లోని కొన్ని చోట్ల వీవీపీఏటీ యంత్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, దీనిని ఎన్నికల సంఘానికి తెలియజేశామని అధికారులు చెప్పారు. యంత్రాల్లో సాంకేతిక సమస్యలతో చాలా ప్రాంతాల్లో పోలింగ్‌కు అంతరాయం కలిగిందని పంజాబ్ ముఖ్య ఎన్నికల అధికారి వీకే సింగ్ చెప్పారు. అమృత్సర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య పోలింగ్ జరిగింది. పంజాబ్, గోవా ఎన్నికలు అద్భుతమని, అవి ఒక విప్లవంలా సాగాయని కేజ్రీవాల్ చెప్పారు. తామే అధికారంలోకి వస్తామన్నారు. పోలింగ్ ప్రశాంతంగా సాగినందుకు పంజాబ్ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గోవాలో రికార్డు పోలింగ్ గోవాలో రికార్డు స్థాయిలో 83 శాతం పోలింగ్ నమోదైంది. ఇంత ఎక్కువ పోలింగ్ శాతం నమోదవడం ఇక్కడ ఇదే మొదటిసారి. బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌తో పాటు ఎంజీపీ–శివసేన–జీఎస్ఎం పార్టీల కూటమి కూడా పోటీ పడటంతో పోరు ఉత్కంఠభరితంగా సాగినా.. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రాథమిక అంచనా ప్రకారం 83 శాతం పోలింగ్ నమోదైనా.. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని ఈసీ వర్గాలు తెలిపాయి. పణజీలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్ బయట నిలబడిన 78 ఏళ్ల వృద్ధుడు గుండెపోటుతో మరణించాడు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో 81.8 శాతం పోలింగ్ నమోదైంది. -
పంజాబ్, గోవాల్లో పోల్స్ మాటేంటి?
చండీగఢ్/పణజి: నోట్ల రద్దు తర్వాత దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమరానికి తెరలేసింది. పంజాబ్, గోవాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పంజాబ్‌లోని 117 స్థానాలకు, గోవాలోని 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. పంజాబ్‌లో 1.98 కోట్ల మంది ఓటర్లు 1,145 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. కాంగ్రెస్ మొత్తం సీట్లలో పోటీ చేస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ 112 స్థాన్లాల్లో, లోక్ ఇన్సాఫ్ 5 స్థానాల్లో బరిలో ఉంది. అధికార శిరోమణి అకాలీ దళ్ 94 చోట్ల, దాని మిత్రపక్షం బీజేపీ 23 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక 11 లక్షల మంది ఓటేయనున్న గోవాలో 250 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 34 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ మిగిలిన 5 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతిస్తోంది. కాంగ్రెస్ 48 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆప్ 38 సీట్లలో, మహారాష్ట్రవాదీ గోమంత్ పార్టీ(ఎంజీపీ) 28 సీట్లలో బరిలో ఉన్నాయి. తొలిసారి ఈ–బ్యాలెట్.. ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు తొలిసారి ఈ–బ్యాలెట్‌ను వాడనున్నారు. జవాన్లతో సహా వివిధ సర్వీసు ఉద్యోగులు దీని ద్వారా ఆన్ లైన్ లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గోవాలో అన్ని స్థానాల్లో, పంజాబ్‌లో ఆత్మనగర్, తూర్పు లుధియానా, ఉత్తర లుధియానా, ఉత్తర అమృత్సర్, పశ్చిమ జలంధర్.. మొత్తం 5 స్థానాల్లోనూ వీటిని వాడనున్నారు. ఈ–బ్యాలెట్‌ను ద్వారా డౌన్ లోడ్ చేసుకుని, నచ్చిన వారికి ఓటేసి, రిటర్నింగ్ అధికారులకు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. పంజాబ్, గోవా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కేజ్రీవాల్ ఆప్ రెండు చోట్లా బరిలోకి దిగుతోంది. ఒపీనియన్ పోల్స్ మాటేంటి? పంజాబ్‌లో కాంగ్రెస్ లేదా ఆప్ అధికారంలోకి వచ్చే వీలుందని పలు సర్వేలు చెప్పాయి. 65 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా. ఆప్‌కు 100 సీట్లు రావొచ్చని హఫ్పోస్ట్–సీటర్ సర్వే పేర్కొంది. గోవాలో బీజేపీ గెలవొచ్చని సర్వేలు చెప్పాయి. -
అవే కష్టాలు..!
బ్యాంకుల వద్ద తగ్గని రద్దీబ్యాంకుల వద్ద తగ్గని రద్దీపెద్ద నోట్లు రద్దు అయి మూడు నెలలు కావస్తున్నా ప్రజలకు మాత్రం ఇక్కట్లు తొలగడం లేదు. కుభీర్ మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంకు, దక్కణ్ గ్రామీణ బ్యాంకుల వద్ద ఖాతాదారులకు నిత్యం గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. గురువారం ఉదయం 5 గంటలకే పలువురు యూనియన్ బ్యాంకుకు చేరుకొని క్యూ కట్టారు. గంటలతరబడి నిల్చొన్నా రూ. 10వేలకు మించి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోరోజు వరుసలో ఉండగానే డబ్బులు అయిపోతుండడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటోందని అంటున్నారు. ఓ వైపు ఏటీఎంలు పనిచేయక, బ్యాంకుల్లో సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో కరెన్సీ కష్టాలు తీరడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆంక్షలు పూర్తిస్థాయిలో ఎత్తివేసి గతంలో వలే డబ్బులు చెల్లించాలని వరు కోరుతున్నారు. – కుభీర్ -
పేటీఎం టు చిల్లర్..
ఈకామర్స్ విప్లవంతో ప్రపంచ దేశాలతో పాటు భారతదేశంలోనూ మొబైల్ వ్యాలెట్ల వినియోగం మొదలైనప్పటికీ.. ఇటీవల పెద్ద నోట్ల రద్దు ఫలితంగా వాటి వినియోగం పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో టాప్ టెన్ మొబైల్ వ్యాలెట్ యాప్‌లు ఇవీ... పేటీఎం 2010లో ఆరంభించిన పేటీఎం సెమీక్లోజ్డ్ వ్యాలెట్ ద్వారా.. ఈకామర్స్ లావాదేవీలు, బిల్లు చెల్లింపులు, నగదు బదిలీలతో పాటు.. ప్రయాణం, వినోదం, రిటైల్ పరిశ్రమలోనూ దీని సేవలను వినియోగించుకోవచ్చు. ఇటీవలే ప్రీమియం విద్యా సంస్థలతో కూడా.. ఫీజు చెల్లింపుల కోసం పేటీఎం భాగస్వామ్యం కుదుర్చుకుంది. మొబిక్విక్ అగ్రస్థాయి స్వతంత్ర మొబైల్ చెల్లింపుల వ్యవస్థల్లో ఒకటి మొబిక్విక్. ఈకామర్స్ వెబ్సైట్లు, టెల్కోలు, బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్లు, మొబైల్ కామర్స్ అప్లికేషన్లు, బిల్లర్లు తదితర రిటైలర్ల సమాచారం కూడా ఉంటుంది. ఫ్రీచార్జ్ ఈ యాప్ ద్వారా డీటీహెచ్, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, వినియోగ బిల్లులు చెల్లించవచ్చు. ప్రముఖ ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేదికల్లోనూ చెల్లింపులు జరపవచ్చు. పేయుమనీ నాస్పర్స్ గ్రూప్ సంస్థ పేయు ఇండియా. బుక్ మై షో, ట్రేడస్, గోఐబిబో, జొమాటో, స్నాప్ డీల్, ఫెర్న్స్ అండ్ పెటల్స్, జబాంగ్ తదితర నాలుగు వేలకు పైగా వాణిజ్య సంస్థలు, ఈకామర్స్ సంస్థలతో అనుసంధానం ఉంది. స్టేట్‌బ్యాంక్ బడ్డీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన మొబైల్ వ్యాలెట్ ఇది. దీనిద్వారా మీ నగదును ఇతర బ్యాంకు ఖాతాలకు సులువుగా బదిలీ చేయవచ్చు. బిల్లుల చెల్లింపులు, సినిమా, హోటల్, ప్రయాణాల బుకింగ్ చేయవచ్చు. 13 భాషలలో సేవలు అందిస్తుంది. ఎం పెసా వేగవంతమైన, సౌకర్యవంతమైన, భద్రతమైన మొబైల్ లావాదేవీల కోసం దీనిని ఉపయోగించవచ్చు. వొడాఫోన్ ఎం పెసా లిమిటెడ్ సంస్థ.. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి పనిచేస్తోంది. ఆక్సిజెన్ ఆక్సిజెన్ సర్వీసెస్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన మొబైల్ వ్యాలెట్. ఐఎంపీఎస్ పద్ధతిలో 50కి పైగా బ్యాంకులకు, ఆ బ్యాంకుల నుంచి వ్యాలెట్‌కు నగదు బదిలీ చేయవచ్చు. సిటీ మాస్టర్ పాస్ మాస్టర్ కార్డ్, సిటీ బ్యాంక్ ఇండియా కలిసి ప్రారంభించిన డిజిటల్ వ్యాలెట్ ఇది. దేశంలో తొలి అంతర్జాతీయ వ్యాలెట్. వినియోగదారుల షిప్పింగ్, క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్, లాయల్టీ కార్డులు, చెల్లింపుల సమాచారాన్ని ఒకే చోట స్టోర్ చేస్తుంది. ఐసీఐసీఐ పాకెట్స్ ఏ బ్యాంకు ఖాతా నుంచైనా ఈ వ్యాలెట్లోకి నగదు పంపించవచ్చు. ఏ వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ లో అయినా లావాదేవీలు నిర్వహించవచ్చు. హెచ్డీఎఫ్సీ చిల్లర్ దీనిని నగదు బదిలీ యాప్‌గా అభివర్ణించవచ్చు. నగదు బదిలీలు, చెల్లింపుల ప్రక్రియలను చాలా సులభం చేస్తుంది. దీని ద్వారా మిత్రుల స్మార్ట్ఫోన్లకు నగదు బదిలీ చేయవచ్చు. -
ఆ డిపాజిట్లు అనుమానాస్పదం
‘ఆపరేషన్ క్లీన్ మనీ’ ప్రారంభించిన ఐటీ శాఖ ► 18 లక్షల మంది డిపాజిట్ల గుర్తింపు ► పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లు న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో అనుమానాస్పద డిపాజిట్లు చేసిన 18 లక్షల మందిని ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. వీరిలో రూ.5 లక్షలకు మించి డిపాజిట్ చేసిన వారూ ఉన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వివరణ కోరుతూ ఐటీ అధికారులు వీరికి ఈమెయిళ్లు, ఎస్ఎంఎస్లు పంపనున్నారు. పది రోజుల్లోపు ఆన్ లైన్ లో వివరణ ఇవ్వకపోతే నోటీసులు, ఇతర చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించిన ఐటీ శాఖ మంగళవారం ‘ఆపరేషన్ క్లీన్ మనీ’(స్వచ్ఛ ధన్ అభియాన్ ) ప్రాజెక్టును ప్రారంభించింది. నవంబర్ 8 తర్వాత.. ఆదాయానికి మించిన నగదు డిపాజిట్లు చేసిన వారికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఎలక్ట్రానిక్ మెసేజీలు పంపుతుంది. వారు ఐటీ శాఖకు చెందిన ఈ–ఫైలింగ్ పోర్టల్‌కు సమాధానాలు పంపాలి. ఆపరేషన్ క్లీన్ మనీ ఒక ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అని, దీని ద్వారా డిపాజిటర్ల నుంచి సమాధానాలు రాబట్టి, అవసరమైతే చట్టపర చర్య తీసుకుంటామని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించారు. ఈ ప్రక్రియ అంతా ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనే జరుగుతుందని, అధికారులు భౌతికంగా ప్రశ్నించరని స్పష్టం చేశారు. తొలి దశ కింద రూ. 5 లక్షలు డిపాజిట్ చేసిన వారికి, రూ. 3–5 లక్షల మధ్య అనుమానాస్పద డిపాజిట్లు చేసినవారికి, సరైన పన్ను రిటర్నులు చూపని వారికి సమాచారం పంపుతున్నామని సీబీడీటీ చైర్మన్ సుశీల్ చంద్ర చెప్పారు. రూ.2 లక్షలకుపైగా డిపాజిట్ అయిన కోటి ఖాతాల వివరాలను సేకరించా మని, తొలిదశలో నవంబర్ 9–డిసెంబర్ 30 మధ్య పెద్ద మొత్తంలో డిపాజిట్ అయిన నగదు తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. పన్నుచెల్లింపుదారుల సమాధానాలు సరిగ్గా ఉంటే తనిఖీ పూర్తయిపోతుందని, వారు ఐటీ ఆఫీసుకు రావాల్సిన అవసరముండదన్నారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఐటీ శాఖ ఈ–పోర్టల్‌లో ఉన్నాయని, సమస్యలు ఉంటే 1800–4250–0025 నంబర్‌ను సంప్రదించాలని సీబీడీటీ తెలిపింది. 25 కోట్ల ఆస్తుల అటాచ్ బెంగళూరు: నోట్ల రద్దు తర్వాత జరిగిన మనీల్యాండరింగ్‌కు సంబంధించి కర్ణాటక రాష్ట్ర హైవే అభివృద్ధి విభాగ మాజీ చీఫ్ ప్రాజెక్ట్ అధికారి ఎస్సీ జయచంద్రకు చెందిన రూ. 25 కోట్ల ఆస్తులను ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం అటాచ్ చేసింది. ఆస్తుల్లో సాగు భూములు, 13 ఇళ్లు ఉన్నాయి. డిసెంబర్ లో అరెస్టయిన జయచంద్ర ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. డిసెం బర్లో జయచంద్ర ఇంటితోపాటు మరో ప్రభుత్వ సీనియర్ ఇంజనీర్ ఇంట్లో అధికారులు రూ. 5 కోట్ల నగదు, రూ. 2 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 20–35 శాతం కమీషన్ ఇచ్చి పాతనోట్లకు కొత్తనోట్లు తీసుకున్నారని ఈడీ పేర్కొంది. -
సంక్షోభంలో వ్యవసాయం
ఈ ఘనత కేసీఆర్‌దే: ఉత్తమ్ హుజూర్నగర్: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి పంటకు గత అక్టోబర్ నుంచి బ్యాంకుల ద్వారా రూ.13వేల కోట్ల రుణాలు రైతులకు అందజేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు కేవలం రూ.7,500 కోట్లే ఇచ్చినట్లు తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల వద్ద నోట్ల కొరత తీవ్రంగా ఉండటంతో రైతులకు అప్పులు కూడా పుట్టడం లేదన్నారు. తమ స్వార్థం కోసం, ప్రధానమంత్రి మెప్పు కోసం సీఎం కేసీఆర్ నోట్ల రద్దుకు మద్దతు పలుకుతున్నారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తా మని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పట్టించుకోకపోవడం శోచ నీయమన్నారు. వానాకాలంలో రైతులు సాగు చేసిన కంది, సోయా, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర రాక అప్పు ల పాలై యాసంగి పంటకు పెట్టుబడులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో కాంగ్రెస్ డిమాండ్ మేరకు సీఎం పలురకాల హామీలిచ్చి నేటికీ అమలుచేయక పోవడం దారుణమన్నారు. రుణమాఫీ మూడో దఫా నిధులను విడుదల చేయాల్సి ఉన్నా నేటి వరకు పూర్తికాలేదన్నారు. పంట రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని శాసనసభలో సీఎం హామీ ఇచ్చినప్పటికీ బ్యాంకర్లు రైతుల ముక్కుపిండి వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2015కి పంట నష్ట పరిహారం కింద రూ.720 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకుందని అన్నారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఐఎన్ టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్ రావు, చిట్యాల అమర్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నోట్ల కిలాడీ అరెస్ట్
రూ. 25 కోట్ల నోట్ల మార్పిడి వ్యవహారంలో.... ► పారిపోతుండగా ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుకున్న ఈడీ న్యూఢిల్లీ/రాయ్‌పూర్: రూ. 25 కోట్ల విలువైన పాత నోట్ల మార్పిడి కేసుతో సంబంధమున్న కోల్‌కతా వ్యాపారి పరాస్ ఎం ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లోధాపై అంతకుముందే లుకౌట్ నోటీసు జారీ కాగా... ముంబై ఎయిర్ పోర్టు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సిబ్బంది బుధవారం రాత్రి వలపన్ని పట్టుకున్నారు. శేఖర్ రెడ్డి, రోహిత్ టాండన్ కేసుల్లో రూ. 25 కోట్ల మేర పాత నోట్ల మార్పిడితో లోధాకు సంబంధం ఉన్నట్లు గుర్తించామని ఈడీ అధికారులు వెల్లడించారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద కస్టడీ కోరుతూ అతన్ని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అస్సాంలో రూ. 2.3 కోట్ల కొత్త నోట్లు ఐటీ అధికారులు గురువారం అస్సాంలోని నగౌన్ పట్టణంలో వ్యాపారవేత్త అముల్య దాస్ నుంచి రూ. 2.3 కోట్ల విలువైన కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతని ఇల్లు, వ్యాపార కార్యాలయాలపై నిర్వహించిన దాడుల్లో భారీగా రూ. 2 వేలు, రూ. 500 నోట్లను సీజ్ చేసినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఐటీ అధికారులు ఒక ఫైనాన్షియర్ నుంచి రూ.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 43 లక్షల మేర కొత్త కరెన్సీగా గుర్తించారు. ఆ ఫైనాన్షియర్ ఎన్నడూ పన్ను చెల్లించలేదని, అలాగే ఐటీ రిటర్న్స్ దాఖలు చేయలేదని ఐటీ అధికారులు కనుగొన్నారు. అప్రకటిత ఆదాయం రూ. 10.3 కోట్ల వరకూ ఉన్నట్లు అతను వెల్లడించాడు. పార్లమెంటరీ కమిటీ ముందుకు ఉర్జిత్ జనవర్ 19న ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై నోట్ల రద్దు అంశాలు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై వివరించనున్నారు. వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాౖటెన స్టాండింగ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నోట్ల రద్దు అనంతరం పలువురు నిపుణులు ప్యానల్ ముందు హాజరై తమ అభిప్రాయాల్ని తెలిపినట్లు మెయిలీ పేర్కొన్నారు. -
వెనిజులాలో ఆందోళనలు, లూటీలు
నోట్ల రద్దు ఎఫెక్ట్ కారకస్: వెనిజులాలో పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్ల సరఫరాలో జాప్యంతో ప్రజల కష్టాలు తారస్థాయికి చేరాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక కన్నబిడ్డలను వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో నోట్ల రద్దు ప్రజల జీవితాలను మరింత అగాథంలోకి నెట్టింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తూ వెనిజులా అధ్యక్షుడు మదురో గత ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. అయితే పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక, తినడానికి తిండి లేక ప్రజలు డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగుతూ రెచ్చిపోతున్నారు. క్రిస్మస్ వస్తున్న తరుణంలో కనీసం ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లర లేక శుక్రవారం ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. మరకైబో నగరంలో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లురువ్వారు. (చదవండి: మోదీ బాటలోనే వెనిజులా.. పెద్ద నోట్ల రద్దు) మటురిన్ నగరంలో చికెన్ ట్రక్కును లూటీ చేశారు. పుయెర్టో లా క్రజ్ నగరంలో డబ్బులు తీసుకోడానకి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఆందోళనకు దిగారు. శాంటా బార్బరాలో బ్యాంకు నగదును తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది దోచుకోవడానికి ప్రయత్నించగా డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురికి గాయాలయ్యాయి. వెనిజులా రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను మార్చుకునే వీలుండటంతో బ్యాంకు ముందు వేలమంది క్యూలో నిలబడుతున్నారు. పాతనోట్లను తీసుకొని ’ప్రత్యేక ఓచర్లు’ ఇస్తున్నారే తప్ప కొత్త నోట్లు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇది మోదీ సృష్టించిన వినాశనం
► పెద్ద నోట్ల రద్దుపై రాహుల్ ► పేదలపై దాడి చేసిన తొలి ప్రధాని మోదీ సాక్షి, బెంగళూరు: పెద్ద నోట్ల రద్దు అనేది ‘మోదీ సృష్టించిన వినాశనం అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. దేశ జనాభాలో ఒక శాతం ఉన్న కుబేరుల కోసం మొత్తం ఆర్థిక వ్యవస్థపైనే మోదీ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. శనివారం కర్ణాటకలోని బెల్గావ్లో కాంగ్రెస్ సభలో రాహుల్ పాల్గొన్నారు. ‘భారత చరిత్రలోనే తొలిసారి ఒక మోదీ దేశ ప్రజలపైనే దాడికి పాల్పడ్డారు. సాధారణంగా ప్రధాని దేశం కోసం పనిచేస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం కృషి చేస్తారు. కానీ నరేంద్రమోదీ మన ఆర్థిక వ్యవస్థపైనే దాడికి పాల్పడ్డారు’ అని విమర్శించారు. ‘ మనుషులు సృష్టించిన వినాశనం అంటూ ఉంటాం. అదే మాదిరిగా నోట్ల రద్దు.. ఆ తర్వాత పరిణామాలను మోదీ సృష్టించిన వినాశనం అనాలి’ అని పేర్కొన్నారు. పార్లమెంట్లో ఫిడెల్ క్యాస్ట్రోకు నివాళులర్పించారు కానీ, నోట్ల రద్దుతో దేశంలో ప్రాణాలు కోల్పోయిన వందల మంది కోసం 2నిమిషాల పాటు మౌనం పాటించే సమయం బీజేపీ నేతలకు లేకపోయిందని మండిపడ్డారు. ఈ మరణాలకు మోదీనే కారణమని, రెండున్నరేళ్లుగా మోదీ ప్రభుత్వం పేదలపై అఘాయిత్యాలకు పాల్పడుతోందన్నారు. కరుణకు రాహుల్ పరామర్శ సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో చెన్నై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ శనివారం పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న రాహుల్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి కరుణను పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు రాహుల్ మీడియాతో అన్నారు. అంతకుముందు, డీఎంకే కోశాధికారి స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తదితరులు రాహుల్‌కు స్వాగతం పలికారు. మరోవైపు, రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కరుణను పరామర్శించారు. -
ప్రదేశాలే వేరు...ప్రయాణాలు ఒకటే...
ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం ఉంచితే... అక్కడితో వివాహం పూర్తయినట్లే. మిగతా తంతు అంతా వేడుక కోసమే. అయితే ఈ దంపతులు వేడుకల వరకు వెళ్లలేదు. పెళ్లి మాత్రం అయ్యిందనిపించి, వెంటనే ఎవరి డ్యూటీకి వారు వెళ్లిపోయారు! వాళ్లేమీ సామాన్యులు కాదు... ఇద్దరూ ఐఏఎస్ ఆఫీసర్లు! ఐదు వందల రూపాయల ఖర్చుతో వివాహం చేసుకుని 48 గంటల లోపే మధ్యప్రదేశ్‌కి ఒకరు, ఆంధ్రప్రదేశ్‌కి ఒకరు విధి నిర్వహణకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వధువు ‘సలోని సిదానా’ను సాక్షి ‘ఫ్యామిలీ’ పలకరించింది. ‘‘మా వివాహం గురించి పెద్దగా రాయవలసింది ఏమీ లేదు. మా ఇరుపక్షాల పెద్దల అంగీకారంతోనే ఇలా.. ఖర్చు లేకుండా చేసుకున్నాం. అన్ని వివాహ విధానాలనూ నేను గౌరవిస్తాను. అయితే మేము ఎంచుకున్న విధానం అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే బాధ్యతలలోకి వచ్చాను. ఇంకా ఎన్నో చేయాలి. కొత్తగా చిగుళ్లు తొడుగుతున్న రాజధానికి సబ్‌కలెక్టర్‌గా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అంటున్న సలోని మనోభావాలివి. మెడిసిన్ చదివి... సివిల్స్ లోకి మాది వ్యవసాయ కుటుంబం. పంజాబ్‌లోని జలాలాబాద్‌లోని చిన్న గ్రామం మా ఊరు. మేము ముగ్గురం. తమ్ముడు అనిష్, అక్క మమతా సిదాని, నేను. తమ్ముడు ఐఐటి చదువుతున్నాడు. నేను ఢిల్లీలో ఎంబిబిఎస్ పూర్తి చేసి, ఎయిమ్స్‌లో రేడియాలజిస్టుగా పనిచేశాను. అయితే నా మనసు నన్ను సివిల్స్ వైపు లాగుతుండేది. ఆ సమయంలోనే అమెరికాలోని ఒక విశ్వవిద్యాలయంలో పీజీ సీటు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరాలని ఆసక్తి ఉండటంతో, పీజీ వదులుకున్నాను. సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యాను. 2013లో యుపిఎస్సి పరీక్ష రాశాను. 74వ ర్యాంకు వచ్చింది. సివిల్ సర్వీసులో చేరడం వల్ల నేను ఎక్కువమందికి సేవలు అందించగలుగుతాను. ముఖ్యంగా పేదలకు సహాయం చేయడం కోసమే ఇటువైపు వచ్చాను. పెద్ద నోట్ల రద్దు కారణం కాదు శిక్షణా కాలంలో విజయవాడలో ట్రెయినీ కలెక్టర్‌గా పనిచేశాను. పోస్టింగ్ కూడా విజయవాడలోనే వచ్చింది. తెలుగు వారి కోసం కేవలం నెల రోజుల వ్యవధిలో తెలుగులో మాట్లాడటం నేర్చుకున్నాను. దక్షిణ భారతదేశానికి ఇది నా మొదటి ప్రయాణం. అంతకుముందే ముస్సోరి ట్రైనింగ్‌లో లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో అవినాష్‌కి నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా మారింది. నవంబరు 28 న మధ్యప్రదేశ్‌లోని భిండ్ కోర్టులో అతి సామాన్యంగా మా పెళ్లి జరిగింది. అవినాష్‌ది రాజస్థాన్. అతడి పోస్టింగ్ మధ్యప్రదేశ్‌లో. అక్కడి వశిష్ఠ గోహాడ్‌లో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయిన కారణంగా ఇలా నిరాడంబరంగా మేము పెళ్లి చేసుకోలేదు కానీ, ఆదర్శ వివాహానికి ఒక మంచి అవకాశం లభించిందనుకున్నాం. సంభాషణ: డా. వైజయంతి, సాక్షి, విజయవాడ -
బోసిపోతున్న మార్కెట్‌యార్డు రోడ్డు
చొప్పదండి: మండల కేంద్రంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన మార్కెట్‌యార్డు రోడ్డు బోసిపోతోంది. నిత్యం నిత్యం వందలాది వాహనాల్లో మార్కెట్‌కు ధాన్యం, ప్రత్తి, మొక్కజొన్న నిలువలు తరలిస్తూ కళకళలాడే యార్డు రోడ్డు ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో వెలవెల బోతోంది. కొనుగోలుకు ప్రైవేటు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అమ్మకాలు లేక మార్కెట్ పరిసరాలు, బీటీ రోడ్డు నిర్మానుష్యంగా మారింది. ఈ రోడ్డులో అడ్తి వ్యాపారుల దుకాణాలు, విత్తనాలు, మందుల దుకాణాలు రైతుల హడావిడి కనిపించడం లేదు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనేందుకు వస్తున్నా రద్దు చేసిన నోట్లను వ్యాపారులు స్వీకరించక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నోట్ల చలామణి పెరిగితే తప్ప మార్కెట్ రోడ్డుకు పూర్వ వైభవం వచ్చేలా లేదు. -
3,250 కోట్ల నష్టం
నోట్ల రద్దు పరిణామాలపై కేంద్రానికి నివేదించనున్న రాష్ట్ర ప్రభుత్వం ► సామాన్య ప్రజలు ఎన్నో కష్ట నష్టాలు పడుతున్నారు ► త్వరగా రూ. 500 నోట్లను సరఫరా చేయాలి ► కనీస ఆదాయ పన్ను పరిమితిని పెంచాలి ► రైతుల నగదు డబ్బును వన్‌టైం ఎక్స్ఛేంజీ చేయాలి ► రూ. 2.5 లక్షల జమ నిబంధనను సడలించాలి ► నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేక పథకం తేవాలి ► రాష్ట్రాల అప్పులపై మారటోరియం విధించాలని విజ్ఞప్తులు ► ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్.. నేటి సాయంత్రం ప్రధానితో భేటీ సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు పరిణామాల కారణంగా రాష్ట్రానికి రూ.3,250 కోట్ల మేర నష్టం కలుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అందులో వస్తు సేవలు, వాణిజ్య పన్నుల ఆదాయం రూ. 2,600 కోట్ల మేర తగ్గనుందని, రవాణా శాఖకు రూ. 450 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.200 కోట్ల వరకు కోత పడుతుందని నిర్ధారించింది. ఇక నోట్ల సమస్య కారణంగా సామాన్యులు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారని తేల్చింది. ఈ అంశాలన్నింటినీ విశ్లేషిస్తూ రూపొందించిన ప్రత్యేక నివేదికను.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం ప్రధాని మోదీకి అందించనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రే ఢిల్లీకి వెళ్లారు. నేటి సాయంత్రం భేటీ.. పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చించేందుకు రావాలని సీఎం కేసీఆర్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేసీఆర్ శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం సాయంత్రం అక్కడ మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్.. శుక్రవారం మధ్యాహ్నమే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా కసరత్తు చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో చర్చించి.. సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రాష్ట్రాల ఆదాయంపై పడే ప్రభావాన్ని విశ్లేషించేలా నివేదికను తయారు చేయించారు. ఈ నివేదికను ప్రధానికి అందజేయనున్నారు. అన్ని రంగాలపై దెబ్బ.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కొత్త రాష్ట్రమైన తెలంగాణలో అన్ని రంగాలను దెబ్బతీసింది. రిజిస్ట్రేషన్, రవాణా విభాగాల్లో ఆదాయం బాగా తగ్గింది. ఎకై ్సజ్, సేల్స్ టాక్స్, కమర్షియల్ ట్యాక్స్ విభాగాలపై ప్రభావం పడింది, నిర్మాణ రంగం కుదేలైంది. వివిధ పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఈ ఏడాది దాదాపు రూ.3,250 కోట్లు తగ్గిపోతుందని అధికారులతో కసరత్తు సందర్భంగా సీఎం కేసీఆర్ అంచనా వేశారు. వచ్చే ఐదు నెలల్లో వస్తు సేవలు, వాణిజ్య పన్నుల ఆదాయంలో రూ.2,600 కోట్లు, రవాణా శాఖ ఆదాయంలో రూ.450 కోట్లు, ఎకై ్సజ్ ఆదాయంలో రూ.200 కోట్లు తగ్గుతుందని అంచనా వేశారు. మరోవైపు కేంద్రం రాష్ట్రానికి పంపిణీ చేసే పన్నుల ఆదాయానికి ఈ నెలలోనే రూ.450 కోట్లు కత్తెర వేసింది. దీంతో రాష్ట్ర ఆదాయానికి ఒక్కసారిగా గండి పడిందని కేసీఆర్ ఇటీవలే గవర్నర్ నరసింహన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అప్పుల చెల్లింపును వాయిదా వేయండి ఆదాయం తగ్గిపోతున్న నేపథ్యంలో కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులను కొంతకాలం వాయిదా వేయాలని ప్రధానికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.150 కోట్లను కేంద్రం నుంచి తీసుకున్న అప్పుల కింద తిరిగి చెల్లిస్తోంది. దీనిని ఓ ఏడాది పాటు వాయిదా వేసినా దాదాపు రూ.1,800 కోట్లు కలసి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సామాన్యుల ఇబ్బందులు తప్పించండి కేంద్రం విధించిన నగదు మార్పిడి నిబంధనలు, విత్‌డ్రా ఆంక్షలతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను పరిశీలించిన సీఎం కేసీఆర్... సామాన్యులు, చిన్న వ్యాపారులు, అసంఘటిత రంగం ఇబ్బంది పడకుండా చూడాలని ప్రధానికి నివేదించనున్నారు. ఈ మేరకు పలు సూచనలు చేయనున్నారు. - నల్లధనాన్ని అరికట్టడానికి, దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి తీసుకున్న నిర్ణయం మంచిదే. అరుుతే ప్రజలు పడే అవస్థలు, ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవాలి. ముఖ్యంగా రైతులు, చిన్న వ్యాపారులు, కార్మికులు, చిల్లర వర్తకులు నష్టపోకుండా చూడాలి. - రైతులు వ్యవసాయ పెట్టుబడులకు, ఉత్పత్తుల అమ్మకానికి నగదు లావాదేవీలే జరుపుతారు. గ్రామీణ ప్రాంతాల్లో వారికి రసీదులు కూడా ఉండవు. ఉన్నా దాచుకునే అలవాటుండదు. అందువల్ల రైతులు నష్టపోకుండా తమ డబ్బును బ్యాంకుల్లో జమ చేసుకునే వెసులుబాటు కల్పించాలి. ప్రత్యేక విధానం రూపొందించి మొత్తం ఒకేసారి నగదుగా తీసుకునే (వన్‌టైం ఎక్ఛేంజీ) అవకాశం కల్పించాలి. - వ్యవసాయాదాయంపై పన్ను లేదని చెప్పినప్పటికీ ఈ అంశంపై రైతుల్లో స్పష్టత లేదు. రైతులందరూ బ్యాంకులో ఖాతాలు తెరిచి వ్యవసాయాదాయాన్ని జమ చేసుకోవచ్చని, ఆదాయ పన్ను శాఖకు రిటర్న్స దాఖలు చేసేటప్పుడు వ్యవసాయాదాయంగా ప్రకటించి పన్ను రాయితీ పొందాలని విసృ్తత ప్రచారం చేయాలి. - బ్యాంకుల్లో రూ.2.5 లక్షలలోపు నగదును జమ చేసుకునేందుకు అనుమతించారు. కానీ ఖాతాలు లేని, ఖాతాలుండీ నిర్వహించే అలవాటు లేని వారి దగ్గర అంత డబ్బుంటే ఎలాగనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. పాలు, కూరగాయలు, గుడ్లు, చేపలు, మాంసం అమ్మే వారు నగదు లావాదేవీలే జరుపుతారు. అసంఘటిత రంగంలో వర్తక, వాణిజ్యాలన్నీ నగదుపైనే జరుగుతాయి. వారికి రూ.2.5 లక్షల కంటే ఎక్కువైనా సరే బ్యాంకులో జమ చేసేందుకు అనుమతివ్వాలి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేసే వారిని శిక్షించే క్రమంలో ఇళ్లలో డబ్బు దాచుకునే సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు. - పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బాగా దెబ్బతీసింది. దాంతో నిర్మాణ రంగం కూడా దెబ్బతిన్నది. దానిపై ఆధారపడిన కార్మికులు ఉపాధి కోల్పోయారు. అందువల్ల ఉపాధి హామీ పథకం తరహాలో వారి ఉపాధికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి. - పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రాల ఆదాయం దెబ్బతింటున్నది. కేంద్రానికి రాష్ట్రాలు చెల్లించాల్సిన అప్పులు, వడ్డీలపై కొంతకాలం మారటోరియం విధించాలి. - నగదు కొరత తీర్చేందుకు రూ.500 నోట్లను ఎక్కువగా సరఫరా చేయాలి. మార్కెట్లలో రైతుల నుంచి ఉత్పత్తులు కొనే వ్యాపారులకు ఎక్కువ నగదు ఇచ్చేలా బ్యాంకులకు ఆదేశాలివ్వాలి. - కనీస ఆదాయ పన్ను పరిమితిని రూ.2.5 లక్షల నుంచి మరింత పెంచాలి. - భవిష్యత్తులో ఆన్లైన్, చెక్కుల ద్వారా లావాదేవీలు నిర్వహించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సంఖ్యను పెంచాలి. - ప్రజలకు బ్యాంకింగ్ సర్వీసుల పట్ల అవగాహన కల్పించాలి. ప్రతీ వ్యక్తికి క్రెడిట్ హిస్టరీ ఉండేలా ఆదాయ, వ్యయాల నిర్వహణను అలవాటు చేయాలి. ఆదాయ లోటు అంచనా (డిసెంబర్ నుంచి మార్చి 2017 వరకు) వ్యాట్: రూ.2,600 కోట్లు రవాణా శాఖ: రూ.450 కోట్లు ఎక్సైజ్ శాఖ: రూ.200 కోట్లు