![వెనిజులాలో ఆందోళనలు, లూటీలు](/styles/webp/s3/article_images/2017/09/4/51482008690_625x300.jpg.webp?itok=P5XUb5cQ)
వెనిజులాలో ఆందోళనలు, లూటీలు
నోట్ల రద్దు ఎఫెక్ట్
కారకస్: వెనిజులాలో పెద్ద నోట్ల రద్దు, కొత్త నోట్ల సరఫరాలో జాప్యంతో ప్రజల కష్టాలు తారస్థాయికి చేరాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి బతకలేక కన్నబిడ్డలను వదిలేస్తున్న దారుణ పరిస్థితుల్లో నోట్ల రద్దు ప్రజల జీవితాలను మరింత అగాథంలోకి నెట్టింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి 100 బొలివర్ నోట్లను రద్దు చేస్తూ వెనిజులా అధ్యక్షుడు మదురో గత ఆదివారం నిర్ణయం తీసుకున్నారు.
అయితే పాత నోట్లు చెల్లక, కొత్త నోట్లు రాక, తినడానికి తిండి లేక ప్రజలు డెలివరీ ట్రక్కులను దోచుకుంటుంటూ పోలీసులతో గొడవలకు దిగుతూ రెచ్చిపోతున్నారు. క్రిస్మస్ వస్తున్న తరుణంలో కనీసం ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లర లేక శుక్రవారం ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేశారు. మరకైబో నగరంలో పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లురువ్వారు. (చదవండి: మోదీ బాటలోనే వెనిజులా.. పెద్ద నోట్ల రద్దు)
మటురిన్ నగరంలో చికెన్ ట్రక్కును లూటీ చేశారు. పుయెర్టో లా క్రజ్ నగరంలో డబ్బులు తీసుకోడానకి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు ఆందోళనకు దిగారు. శాంటా బార్బరాలో బ్యాంకు నగదును తీసుకెళ్తున్న ట్రక్కును కొంతమంది దోచుకోవడానికి ప్రయత్నించగా డ్రైవర్లు కాల్పులు జరపడంతో నలుగురికి గాయాలయ్యాయి. వెనిజులా రిజర్వు బ్యాంకులో మాత్రమే 100 బొలివర్ నోట్లను మార్చుకునే వీలుండటంతో బ్యాంకు ముందు వేలమంది క్యూలో నిలబడుతున్నారు. పాతనోట్లను తీసుకొని ’ప్రత్యేక ఓచర్లు’ ఇస్తున్నారే తప్ప కొత్త నోట్లు ఇవ్వడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.