Venezuela
-
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!
వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు -
మదురో హత్యకు సీఐఏ కుట్ర!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్‌తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు. వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. – కారాకస్ -
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
మదురో విమానం సీజ్
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్లో అమెరికా స్వా«దీనం చేసుకుంది. దాన్ని సోమవారం ఫ్లోరిడాకు తరలించింది. వెనిజులా– అమెరికాల మధ్య చాలాఏళ్లుగా సంబంధాలు బెడిసికొట్టాయి. వెనిజులాపై ఆర్థిక ఆంక్షలే కాకుండా పలుఇతర ఆంక్షలను కూడా అమెరికా విధించింది. వెనిజులాలో బతుకు దుర్భరమై లక్షల మంది మెక్సికో– అమెరికా సరిహద్దు ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయానికి సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా వెనిజులా నుంచి నిర్దిష్ట పోల్ డేటాను కోరింది. వెనిజులాకు చెందిన ఈ డసాల్డ్ ఫాల్కన్ 900 విమానం ఖరీదు రూ.109 కోట్లు. కొద్దినెలలుగా ఇది డొమినికన్ రిపబ్లిక్లో ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మదురో విమానాన్ని స్వా«దీనం చేసుకొని ఫ్లోరిడాకు తరలించాయి. అమెరికా దీన్ని జప్తు చేసుకొనేందుకు చర్యలు చేపట్టింది. -
40 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లో...
పారిస్: ఒలింపిక్స్‌లో ఆటగాళ్ల విజయగాథలే కాదు... వీటిలో పాల్గొనే వారిలో ఎన్నో భిన్నమైన, ఆసక్తికర నేపథ్యాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. వెనిజులాకు చెందిన షూటర్ లియోనెల్ మార్టినెజ్ పారిస్‌లో ట్రాప్ ఈవెంట్లో పోటీ పడ్డాడు. ఓవరాల్‌గా 28వ స్థానంతో ముగించాడు. అయితే అతను పోటీల్లో పాల్గొనడం విశేషం కాదు... 60 ఏళ్ల వయసున్న మార్టినెజ్ 40 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒలింపిక్స్ బరిలోకి దిగడమే అసలు ఘనత! 20 ఏళ్ల కుర్రాడిగా 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో మార్టినెజ్ పాల్గొన్నాడు. ఆ తర్వాత ఆటకు దూరమై పలు వ్యాపారాల్లో స్థిరపడ్డాడు. అయితే చాలా ఏళ్ల తర్వాత అతనికి మళ్లీ షూటింగ్ వైపు మనసు మళ్లింది. మొదటి నుంచి రెగ్యులర్‌గా జిమ్‌కు వెళుతూ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్న మారి్టనెజ్కు మరోసారి క్రీడల్లోకి అడుగు పెట్టడం కష్టం కాలేదు. తన షూటింగ్‌కు పదును పెట్టుకున్న అతను 2023 పాన్ అమెరికన్ క్రీడల్లో రజతం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. 2028 లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ పాల్గొనాలనేదే మారి్టనెజ్ తర్వాతి లక్ష్యం. అప్పటికి 64 ఏళ్లు వచ్చినా సరే... ఎక్కడ మొదలు పెట్టానో అక్కడే ముగిస్తాను అంటూ అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. మారి్టనెజ్కు ముందు జపాన్ ఈక్వె్రస్టియన్ ఆటగాడు హొకెసు హిరోషి మాత్రమే రెండు ఒలింపిక్స్ మధ్య ఎక్కువ విరామం (44 ఏళ్లు) తీసుకున్నవాడిగా నిలిచాడు. తొలిసారి 1964 ఒలింపిక్స్‌లో పాల్గొన్న అతను ఆ తర్వాత 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మళ్లీ బరిలోకి దిగాడు. -
మస్క్ వర్సెస్ మడురో: ఆయన గెలిస్తే గనుక..
వెనిజులా అధ్యక్షుడు(నూతన)నికోలస్ మడురో విసిరిన సవాల్‌కు ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్పందించారు. మడురోపై పోటీకి తాను సిద్ధమని అన్నారాయన. పోటీకి ఎక్కడైనా, ఎప్పుడైనా నేను సిద్ధం అంటూ ఎక్స్ వేదికగా ప్రకటించారాయన.నాతో పోరాడాలనుకుంటే బరిలో దిగమని మస్క్‌కు నికోలస్ మడురో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీంతో టెస్లా సీఈవో మస్క్ తాను సిద్ధమని ప్రకటించారు. ఆయన ఎక్కడ పోటీ అంటే అక్కడికి వస్తానని, తన వెంట మడురో ప్రియమైన గాడిదను కూడా తీసుకొస్తానంటూ వ్యంగ్యంగా బదులిచ్చారాయన. ఒకవేళ మడురో ఓడిపోతే.. ఆయన రాజకీయ సన్యాసం చేయాలి. తాను ఓడిపోతే గనుక ఉచితంగా ఆయన్ని మార్స్ ప్రయాణానికి తీసుకెళ్తానని స్పేస్ ఎక్స్ అధినేత ప్రకటించారు. వెనిజులా ఎన్నికల్లో మడురో విజయం సాధించారు. అయితే ఆయన అప్రజాస్వామ్యిక పద్ధతుల్లో గెలిచారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలకు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. మడురో ఆయన్ని లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. వెనిజులాలో మస్క్ కంప్యూటర్ల హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలకు దిగారు. దీంతో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోంది. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ దేశానికి వెళ్లొద్దు.. అమెరికా హెచ్చరిక
వెనిజులా దేశ సందర్శనకు ఎవరూ వెళ్లొద్దని అమెరికా తమ పౌరులను హెచ్చరించింది. పౌర అశాంతి, నియంతృత్వం వైపు పయనించడం, నిరంతర ఉగ్రవాద బెదిరింపులు, అమెరికా వ్యతిరేక సెంటిమెంట్ పెరుగుతన్న నేపథ్యంలో వెనిజులా సందర్శన విషయంలో అమెరికా అత్యున్నత స్థాయి ప్రయాణ సలహాను మరోసారి జారీ చేసింది.వెనిజులా సందర్శనలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే తాము ఏమీ చేయలేమని అమెరికా పౌరులను ఆ దేశ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని, తప్పనిసరై వెనిజులాను సందర్శించాలనుకునేవారు తమ కుటుంబ సభ్యులు, కావాల్సినవారితో 'ప్రూఫ్ ఆఫ్ లైఫ్' ప్రోటోకాల్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నాన్నారు. ఎవరైనా కిడ్నాప్, అపహరణ లేదా నిర్బంధానికి గురైనప్పుడు ఆ వ్యక్తి ఇంకా జీవించి ఉన్నాడా లేదా అని ధ్రువీకరించుకునేందుకు పాటించే ప్రక్రియే ఈ ప్రూఫ్ ఆఫ్ లైఫ్ ప్రోటోకాల్. వెనిజులాలో అమెరికా పౌరులను అక్రమంగా నిర్బంధించే ప్రమాదం ఉందని, అక్కడి భద్రతా దళాలు అమెరికా పౌరులను ఐదేళ్ల వరకు నిర్బంధించాయని విదేశాంగ శాఖ తెలిపింది.విస్తారమైన కరేబియన్ సముద్రతీరానికి, సుందరమైన ద్వీపాలకు వెనిజులా ప్రసిద్ధి. ఒకప్పుడు ఏటా లక్షలాది అమెరికన్ పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించేవారు. 2013లో నియంత హ్యూగో చావెజ్ మరణం తరువాత నికోలస్ మదురో అధికారం చేపట్టినప్పటి నుంచి సందర్శకుల సంఖ్య బాగా క్షీణించింది. 2019లో వెనిజులా నుంచి అమెరికా సిబ్బందిని ఉపసంహరించుకోవడం ప్రారంభించినప్పుడు మొదటిసారి ఇలాంటి హెచ్చరికను జారీ చేసిన అమెరికా.. ఇప్పుడు మరోసారి తమ పౌరులను హెచ్చరించింది. -
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లేజర్ ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు షాకింగ్ ఘటన ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు రావడంతో.. అత్యవసర స్లైడ్ ద్వారా విమానం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికులు గాయపడ్డారు. వెనెజులా రాజధాని కారకాస్ శివారులోని మైక్వేటియా సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది.వివరాలు లేజర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం వెనెజులా నుంచి డొమినికన్ రిపబ్లికన్‌కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో విమానంలో 91 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా ఉన్నట్టుండి విమానంలో పొగలు గుర్తించిన సిబ్బంది వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. విమానాన్ని ఖాళీ చేయాల్సిందిగా ప్రకటన చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.కొందరు వెంటనే అత్యవసర స్లైడ్ ద్వారా బయట పడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో విమానం నుంచి స్లైడ్ ద్వారా బయటపడే సమయంలో తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. విమానంలో పొగకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Following an APU failure aboard a <a href="https://twitter.com/laserairlines?ref_src=twsrc%5Etfw">@laserairlines</a> MD-80, passengers were evacuated due to smoke in the cabin. Regrettably, most passengers exited with their carry-on luggage, resulting in avoidable hazards. <a href="https://t.co/7FsfZ3Zkuk">pic.twitter.com/7FsfZ3Zkuk</a></p>&mdash; Enrique Perrella (@Enrique77W) <a href="https://twitter.com/Enrique77W/status/1784737773464735912?ref_src=twsrc%5Etfw">April 29, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script> -
ప్రపంచంలోనే అత్యంత వృద్దుడి కన్నుమూత
కారకాస్ (వెనెజులా): ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వ్యక్తిగా గిన్నిస్ రికార్డుకెక్కిన వెనెజులాకు చెందిన 114 ఏళ్ల జువాన్ విసెంటీ పెరీజ్ మోరా మంగళవారం మరణించారు. ఆయనకు ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. ఏకంగా 41 మంది మనవలు, మనవరాళ్లు, 18 మంది మునిమనవలు, మనవరాళ్లున్నారు! ఆ తర్వాత తరంలోనూ ఇంకో 12 మంది వారసులుండటం విశేషం. జువాన్ 1909 మే 27న పుట్టారు. చనిపోయేదాకా పొలంలో పనిచేశారు. బాల్యం నుంచీ రోజూ పొలం పని, త్వరగా నిద్రపోవడం, రోజూ ఒక మద్యం తన దీర్ఘాయు రహస్యమనేవారు! -
వెనెజులాలో ట్రక్కు బీభత్సం.. 16 మంది మృతి
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌ను కలిపే జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ట్రక్కు పలు కార్లను ఢీకొట్టుకుంటూ ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 17 వాహనాలు ఒకదానినొకటి ఢీకొట్టి కుప్పగా రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. మంటల్లో చిక్కుకున్న వాహనాలు, ఉవ్వెత్తున ఎగసిన పొగతో కూడిన ఫొటోలు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనలో 16 మంది చనిపోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
బతికుండగానే అంత్యక్రియలు, మోడల్ అరియానా కన్నుమూత
బ్యూటీ క్వీన్, వెనిజులా మోడల్ అరియానా వీర రోడ్డుప్రమాదంలో మరణించింది. జూలై 13న ఫ్లోరిడాలో జరిగిన కారు యాక్సిడెంట్లో తీవ్ర గాయాలపాలైన ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందిస్తున్న క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో ప్రాణాలు విడిచింది. కారు నడిపే క్రమంలో అలసటకు లోనైన అరియానా డ్రైవింగ్‌లో రెప్పవాల్చడంతోనే ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని అరియానా తల్లి వివియన్ ఓచోవా మీడియాకు వెల్లడించింది. తను ఎంతోమందికి సాయం చేసిందని, అలాంటి నా కూతుర్ని భగవంతుడు త్వరగా తీసుకెళ్లిపోయాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది. కాగా ఈ బ్యూటీ మే నెలలో అంత్యక్రియల వీడియో పోస్ట్ చేసింది. 'నా వీడియోలను నేనే తీసుకుంటాను. నేను చనిపోయాక నా అంత్యక్రియలను ఎవరైనా రికార్డు చేస్తారో లేదో? అందుకే ఎప్పుడో జరగాల్సిన నా అంత్యక్రియలను ఓసారి నేనే రికార్డు చేసి పెట్టుకుంటున్నాను' అంటూ సదరు వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. కాగా అరియానా మోడల్ మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలోనూ ఆమెకు ప్రావీణ్యం ఉంది. తను ఫుల్ హౌస్ క్లీనింగ్ సర్వీస్ అనే కంపెనీ కూడా నిర్వహిస్తోంది. ఇకపోతే అక్టోబర్‌లో జరగబోయే 'మిస్ లాటిన్ అమెరికా ఆఫ్ ద వరల్డ్ 2023' పోటీల్లో అరియానా.. వెనిజులా తరుపున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే ఈ దారుణం జరగడంతో అభిమానులు భావోద్వేగానికి లోనవుతున్నారు. View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) View this post on Instagram A post shared by Ariana Valentina (@arianaviera__) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే? -
World Athletics Championship: ‘ట్రిపుల్’ ధమాకా
యుజీన్ (అమెరికా): వెనిజులా స్టార్ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత యులిమర్ రోజస్ మరోసారి అద్భుత ప్రదర్శనతో ట్రిపుల్ జంప్‌లో సత్తా చాటింది. వరుసగా మూడో ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ రోజస్ స్వర్ణంతో మెరిసింది. ఫైనల్లో రోజస్ 15.47 మీటర్ల దూరం దూకి మొదటి స్థానంలో నిలిచింది. ఈ పోటీలో షనీకా రికెట్స్ (అమెరికా – 14.89 మీ.) రజతం సాధించగా, టోరీ ఫ్రాంక్లిన్ (అమెరికా – 14.72 మీ.) కాంస్యం గెలుచుకుంది. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు ఇది హ్యాట్రిక్ స్వర్ణం కావడం విశేషం. 2017 (లండన్), 2019 (దోహా)లలో కూడా ఆమె కనకపు పతకాన్ని అందుకుంది. ట్రిపుల్ జంప్‌లో ప్రస్తుత ప్రపంచ రికార్డు (15.74 మీటర్లు) రోజస్ పేరిటే ఉంది. తన రెండో ప్రయత్నంలోనే 15.47 మీటర్లు నమోదు చేసిన రోజస్ తర్వాతి నాలుగు ప్రయత్నాల్లో కూడా దానిని దాటలేకపోయింది. దాంతో పోలిస్తే చాలా తక్కువ దూరం ఆమె దూకగలిగినా...ఈ మెగా ఈవెంట్లో బంగారం గెలుచుకునేందుకు అది సరిపోయింది. ‘రికార్డు స్థాయిలో ఎక్కువ దూరం దూకాలనే బరిలోకి దిగినా అది సాధ్యం కాలేదు. అయితే తాజా ఫలితంతో చాలా సంతోషంగా ఉన్నా. ఇంత మంది ప్రేక్షకుల మధ్య మళ్లీ పోటీలో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. పెద్దగా సన్నాహకాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను. గాయాలతో కూడా ఇబ్బంది పడ్డాను. అయితే వాటన్నింటినీ అధిగమించి ఇక్కడ గెలవగలిగాను’ అని రోజస్ వ్యాఖ్యానించింది. సబ్లేకు 11వ స్థానం పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాశ్ ముకుంద్ సబ్లే తీవ్రంగా నిరాశపర్చాడు. ఫైనల్‌ను 8 నిమిషాల 31.75 సెకన్లలో పూర్తి చేసిన సబ్లే 11వ స్థానంలో నిలిచాడు. ఇదే సీజన్లో తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ రికార్డు (8 నిమిషాల 12.48 సెకన్లు)ను నెలకొల్పిన అతను దాంతో పోలిస్తే చాలా పేలవ ప్రదర్శన నమోదు చేశాడు. ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించిన సబ్లే...అసలు పోరులో ప్రభావం చూపలేకపోయాడు. 2019లో దోహాలో జరిగిన గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అతను 13వ స్థానం సాధించాడు. ఈ విభాగంలో ఒలింపిక్ చాంపియన్, మొరాకోకు చెందిన సూఫియాన్ బకాలి (8 నిమిషాల 25.13 సె.), లమేచా గిర్మా (ఇథియోపియా – 8 నిమిషాల 26.01 సె.), కాన్సెస్‌లన్ కిప్రు టో (కెన్యా – 8 నిమిషాల 27.92 సెకన్లు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
ఇదేం పిచ్చో.. బాల్కనీ అంతా దెయ్యం బొమ్మలతో నింపేశాడు!
బొమ్మలతో మనం మాట్లాడితే పర్వాలేదు. అవే బొమ్మలు మనతో మాట్లాడితే భయపడక తప్పదు. ఇలా బొమ్మలతో భయపెట్టే సినిమాలు ఎన్నో! విచిత్రంగా ఓ సామాన్యుడు కూడా బొమ్మలతో భయపెట్టిస్తున్నాడు. నిజానికి అతని ఉద్దేశం వేరే అయినా స్థానికులు మాత్రం అతని ఇంటిలోపలికి కాదుకదా కనీసం కింద నుంచి బాల్కనీ వైపు చూడ్డానికి కూడా భయపడుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. వెనెజులా రాజధాని కారకస్‌కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ ఎటాన్లస్ గోన్‌సాల్వెజ్‌కు ఓ డ్రైవర్‌తో మంచి స్నేహం ఉండేది. అతని కారులో ఎప్పుడూ బొమ్మలు ఉండేవి. అది చూసిన గోన్సాల్వెజ్ కొడుకు తనకు కూడా ఇలా బొమ్మలను ఒక చోట సెట్ చేయమని కోరాడు. దీంతో, గోన్సాల్వెజ్ మూడేళ్లపాటు శ్రమించి బాల్కనీ నిండా బొమ్మలతో విచిత్రంగా నింపాడు. అయితే, ఆ బొమ్మల బాల్కనీ చూసిన కొడుకు సంతోషించినా, స్థానికులు మాత్రం కలవరపడుతున్నారు. అచ్చం దెయ్యం బొమ్మల్లా కనిపించే వాటిని చూసి, అతనేదో క్షుద్రపూజలు చేస్తున్నాడని, వాటిని తీసేయాల్సిందే అంటూ గొడవకు దిగారు. ఇలా కొన్ని నెలలపాటూ ఈ బొమ్మలపై గొడవ జరిగింది. ఏం చేసినా గోన్సాల్వెజ్ వెనక్కి తగ్గకపోవడంతో.. స్థానికులే సైలెంటైపోయారు. దీంతో, ప్రస్తుతం ఈ బొమ్మల బాల్కనీ అక్కడ ఓ ల్యాండ్ మార్క్‌గా మారింది. కొంతమంది కేవలం ఆ బాల్కనీని చూడ్డానికి అదేపనిగా వస్తున్నారు. ప్రస్తుతం అతను ఇంటిలోనికి అనుమతించడటం లేదు కానీ, కింద నుంచి చూసే అవకాశం మాత్రం ఉంది. -
పెద్దలు దోచుకుంటే వెనిజులా కాదా?
పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేదల ఖాతాల్లో ప్రభుత్వాలు నేరుగా నగదు బదిలీ చేసినా.. గుండెలు బాదేసుకోవడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. ‘ఏంటి పేదల్ని సోమరిపోతులుగా మార్చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇలాగే పోతే రాష్ట్రం వెనిజులాగా మారిపోతుం’దంటూ అంతర్జాతీయ మేధావుల్లా శాపాలూ పెట్టేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలివి? రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కానీ బతుకు బండి ముందుకు నడవని పేదలు ఎప్పటికీ సోమరిపోతులు కారు. కాలేరు. వారి గురించి ఎవరూ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. మరి సోమరిపోతులెవరు? బ్యాంకులకు వేల కోట్ల రూపాయల బాకీలు ఎగ్గొట్టి.. అరెస్ట్ చేసే ముందు పాలకుల అండతో విదేశాలకు చెక్కేసే విజయ్ మాల్యాలూ.. నీరవ్ మోదీలు.. మొహుల్ ఛోక్సీలే నిజానికి సోమరిపోతులు. ఎందుకంటే వాళ్లు ఏనాడూ ఎండలో ఓ గంట సేపు కష్టపడిన వారు కాదు. ఏసీ గదుల్లో కూర్చుని.. బ్యాంకుల్లో ఏసీ గదుల్లో ఉన్నతాధికారులను బుట్టలో వేసుకుని వేల కోట్ల రూపాయల రుణాలు కొట్టేసి వాటిని దారి మళ్లించేసి అసలు వ్యాపారాలు దివాలా తీశాయని కాగితాలపై కట్టుకథలు రాసే కార్పొరేట్ దొంగలే సోమరిపోతులు. రాష్ట్రాలైనా..దేశాలైనా ఇలాంటి వారి వల్లనే దివాళా తీస్తాయి కానీ నిరుపేద రైతులు, శ్రామిక వర్గాల కిచ్చే చిల్లర పైసల వల్ల కాదు. అసలు వెనిజులా విషయంలోనూ వీళ్లకి అవగాహన లేదు. వెనిజులా దివాలా తీయడానికి కారణం కేవలం సంక్షేమ పథకాలు కాదు. చమురు ధరలు పడిపోవడంతో ఆదాయం తగ్గింది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కాబట్టి అమెరికా పగబట్టింది. వెనిజులాకి ఆహార ఉత్పత్తులు, మందులు సరఫరా చేయకుండా తన మిత్ర దేశాలపై పరోక్ష ఆంక్షలు విధించింది అమెరికా. అటువంటి వెనిజులాను బూచిలా చూపించి పేదల నోళ్లు కొట్టేయడానికి మన దగ్గర చాలా మంది మేధావులు పేట్రేగిపోతున్నారు. ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఆర్థిక అసమానతలు పెరిగిపోయినపుడు ధనవంతులు మరింత ధనవంతులుగానూ పేదలు మరింత పేదలుగానూ మారిపోతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలో ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పారు. పేదల దగ్గర కొనుగోలు శక్తి లేకపోతే అన్ని వ్యవస్థలూ.. ఉత్పాదక సంస్థలు దివాలా తీస్తాయి. అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది. అటువంటి సమయాలలో ఏదో ఒక రూపంలో ప్రజల చేతుల్లో డబ్బులు చేరేలా చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెంచాలి. అలా పెంచడం వల్లనే ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా నిలబడుతుంది. కరోనా వంటి సంక్షోభ కాలంలో మహా మహా ఆర్థిక శక్తులే కుప్పకూలిపోయాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయడమొక్కటే వ్యవస్థను కాపాడుకోడానికి మార్గమని ఆర్థిక మేధావులు అంటున్నారు. దాన్నే ‘హెలికాప్టర్ మనీ’ అంటారు. మన అధికార యంత్రాంగాలు ఎలా ఆలోచిస్తాయంటే రైతులకు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్ వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన అరుంధతీ భట్టాచార్య ‘అయ్య బాబోయ్ రుణమాఫీయే.. అలా అయితే రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేదే ఉండదు. అది ఎంత మాత్రం కుదరదు‘ అని నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇదే అరుంధతీ భట్టాచార్య బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్ మాల్యాకి సంబంధించిన అయిదున్నర వేల కోట్ల బాకీని మాత్రం రైటాఫ్ చేసేశారు. అలా చేస్తూ.. ‘పాపం వ్యాపారంలో నష్టపోయినపుడు ఆదుకోకపోతే ఎలాగ?‘ అన్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పేదలపై ఎంత చులకన భావం ఉంటుందో.. పెద్దలపై ఎంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోడానికి. పేదల జేబుల్లోకి రూపాయి వెళ్తోందంటే చాలు నయా మేధావులు చాలా బెంగపెట్టేసుకుంటారు. మాల్యా వంటి పెద్దలు కోట్లకు కోట్లు ఎగనామం పెట్టేసి ఆ భారాన్ని ప్రభుత్వ ఖజానాలపై మోదేసినా ఎవ్వరూ మాట్లాడరు. మాట్లాడితే వెనిజులా అనే వాళ్లు అందరికీ ఉచిత విద్యుత్‌ను అందించే క్యూబా గురించి మాట్లాడరు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ఏడు దేశాల్లో పన్నుల్లేకపోయినా.. విద్య, వైద్యాలు ఉచితంగానే అందిస్తోన్నా... ‘ఇలా ఎలా ఇస్తారు‘ అని ఎవ్వరూ అడగరు. కమ్యూనిస్టు దేశాలు ఉండకూడదని అమెరికా ఎలా అనుకుంటుందో.... అలానే పేదలకు సంక్షేమ పథకాలు ఉండనే కూడదని వీళ్లు అనుకుంటారు. పేదలపై ఎందుకో మరి అంత కోపం? పేదరికం అంటే ఎందుకో అంత ఏహ్యభావం! నిజానికి మాల్యాల వంటి వాళ్లు అదే పనిగా దోచుకుంటే దేశం వెనిజులాగా కాదు... సోమాలియాలా మారిపోయే ప్రమాదం ఉంది. అందరూ దృష్టి సారించాల్సింది దానిపై మాత్రమే. – సి.ఎన్.ఎస్. యాజులు మొబైల్ : 95055 55384 -
విషాదం: ఈ తల్లి త్యాగానికి చేతులెత్తి మొక్కాల్సిందే!
Venezuela Mother Sacrifice Story: మనిషికి మాత్రమే కాదు.. మిగతా జీవరాశికి తల్లి స్పర్శే మొదటి ప్రేమ. అమ్మ ప్రేమ జీవికి ఆప్యాయతను పరిచయం చేస్తుంది. ‘అమ్మ’.. మాటల్లో వర్ణించలేని ఓ మధురానుభూతి. అందుకేనేమో తల్లికి మాత్రమే సాధ్యపడే త్యాగానికి ఆమె సిద్ధపడింది. ప్రాణం పోతోందని తెలిసి కూడా సాహసానికి పూనుకుంది. తాను నరకం అనుభవిస్తూ.. బిడ్డల ఆకలిని తీర్చింది. చివరికి ప్రాణ త్యాగంతో పిల్లల్ని బతికించుకుని.. మృత్యువు ఒడిలోకి ఒదిగిపోయింది. ఆ తల్లి గాథ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరితో కంటతడి పెట్టిస్తోంది. వెనిజులా బోట్ ప్రమాదం.. సెప్టెంబర్ 3న కరేబియన్ దీవులవైపు వెళ్లిన వెనిజులా టూరిస్ట్ క్రూజ్ బోట్ ఒకటి అదృశ్యం అయ్యిందని నావికా అధికారులకు సమాచారం అందింది. దీంతో సిబ్బంది సహాయక చర్యలు మొదలుపెట్టారు. నాలుగు రోజుల తర్వాత ‘లా టార్టు’ దీవి సమీపంలో ఓ చిన్నసైజు లైఫ్ బోట్‌ను గుర్తించి.. దగ్గరి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. తల్లి మృతదేహం పక్కనే ఒదిగిన ఇద్దరు చిన్నారుల్ని గుర్తించి వెంటనే కాపాడారు. ఆ తల్లి పేరు మార్లేస్ బీట్రిజ్ చాకోన్ మర్రోక్విన్. తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి సరదా ట్రిప్ కోసం వెళ్తే.. అది కాస్త వాళ్ల జీవితాల్లో విషాదాన్ని నింపింది. నరకం ఓర్చుకుంది.. భారీ అలల కారణంగా క్రూజ్ దెబ్బతినగా.. చిన్న లైఫ్ బోట్ సాయంతో మార్లేస్, తన బిడ్డల్ని రక్షించుకునే ప్రయత్నం చేసింది. వెనిజులా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అక్వాటిక్ స్పేసెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగాక నాలుగు రోజులపాటు ఆ తల్లీబిడ్డలు ఆ చిన్న లైఫ్బోట్లోనే ఉన్నారు. తన ఇద్దరు బిడ్డల్ని(ఒకరికి రెండేళ్లు, ఒకరికి ఆరేళ్లు) డీహైడ్రేషన్, అలల నుంచి కాపాడుకునేందుకు మార్లేస్ వీలైనంత ప్రయత్నం చేసింది. వాళ్ల ఆకలి తీర్చేందుకు పాలు పట్టింది. తన మూత్రాన్ని తానే తాగి ఆకలి తీర్చుకుంది. వేడికి ఆమె ఒళ్లంతా మంటలు పుట్టాయి. అయినా ఓర్చుకుంది. తనకేమైనా పర్వాలేదనుకుని.. బిడ్డల్ని అక్కున చేర్చుకుని వేడి తగలకుండా చూసుకుంది. చివరికి డీహైడ్రేషన్ కారణంగా అవయవాలు దెబ్బతిని ప్రాణం విడిచిందామె. మొత్తం తొమ్మిది మంది లైఫ్ బోటులో తల్లి మృతదేహంలో ఒదిగి పడుకున్న పిల్లలను.. కారాకస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పిల్లల ఒంటిపై సూర్య తాపానికి బొబ్బలు వచ్చాయి. తిండి లేక నీరసించిపోయిన ఆ పిల్లల్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొచ్చారు కూడా. మరోవైపు ఈ ఇద్దరు పిల్లల్ని చూసేందుకు నియమించిన యువతి వెరోనికా మార్టినెజ్(25).. పక్కనే ఓ ఐస్ బాక్స్‌లో పడుకుని బతికి బట్టకట్టింది. ప్రస్తుతం కోలుకున్న ఆ యువతి.. మానసికంగా మాత్రం కోలుకోలేకపోతోంది. అయితే ఆ మార్లేస్ భర్త రెమిక్ డేవిడ్ కాంబ్లర్ ఆచూకీ మాత్రం తెలియరాలేదు. సరదా ట్రిప్‌లో భాగంగా వెనిజులా హిగుయిరోట్ నుంచి లా టార్టుగా ఐల్యాండ్(కరేబియన్ దీవులు) వైపు తొమ్మిది మందితో వెళ్లింది. భారీ అల కారణంగా మొదట పాడైన బోటు.. ఆ తర్వాత అలల ధాటికి చెల్లాచెదురై ఉంటుందని, సుమారు 70 మైళ్ల దూరం కొట్టుకుని పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో మిగిలిన వాళ్లెవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. సెప్టెంబర్ 11న ఆ మాతృమూర్తికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చదవండి: ఇలాంటి కూతురు చచ్చినా పర్లేదు అన్నారు -
ఒక రూపాయికే పెట్రోలు.. ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డు స్థాయికి చేరిన పెట్రోలు ధరలు వాహనదారులను వణికిస్తున్నాయి. ఇటీవలికాలంగా వరుసగా పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా సెగలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100దాటేసింది. ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా 13 సార్లు ధరలు పెరిగాయంటేనే ధరల మంట తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీంతో పెట్రో ధరలపై ఇటీవల బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. తాజాగా మరో వార్త ఆసక్తికరంగా మారింది. ఒకపక్క పొరుగు దేశాలతో పోలిస్తే దేశీయంగా పెట్రో ధరలు మండిపోతున్నాయి. మరోపక్క దక్షిణ అమెరికా దేశాల్లో ఒకటైన వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూపాయి మాత్రమే. ప్రపంచంలో వెనకబడిన దేశమైన వెనిజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.020 డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.1.45గా ఉండటం విశేషంగా నిలిచింది. అత్యంత చౌకగా పెట్రోలు విక్రయించే మొదటి పది దేశాల్లో ఐదు ఆసియాలో, నాలుగు ఆఫ్రికాలో, దక్షిణ అమెరికాలో ఒకటి ఉన్నాయి. మరోవైపు 2.40 డాలర్ల వద్ద హాంకాంగ్‌లో పెట్రోలు అత్యంత ఎక్కువ రేటు పలుకుతోంది. తరువాత స్థానాల్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , నెదర్లాండ్స్ ఉన్నాయి. (బాబోయ్ పెట్రోలు : 11వ రోజూ వాత) పొరుగు దేశాలలో పెట్రోల్ ధర భారత్‌తో పోలిస్తే, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ , భూటాన్ దేశాల్లో పెట్రోల్ తక్కువ రేటుకేఅందుబాటులోఉంది. ముఖ్యంగా భూటాన్‌లో పెట్రోలు ధర బాగా చౌక. భారత కరెన్సీ ప్రకారం, పాకిస్తాన్లో పెట్రోల్ ధర లీటరుకు 51.14 రూపాయలు. భూటాన్‌లో పెట్రోల్ లీటరుకు రూ .49.56 వద్ద లభిస్తుంది. శ్రీలంకలో పెట్రోల్ ధర రూ .60.26. బంగ్లాదేశ్‌లో రూ. 76.41 రూపాయలు, నేపాల్‌లో 68.98 రూపాయలు వద్ద ఉంది. ఇరాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.4.50 ఉండగా, అంగోలాలో రూ.17.78 ఉంది. అల్జీరియాలో రూ.25.10 ఉండగా, కువైట్ లో రూ.25.18 ఉన్నది. సూడాన్ లో రూ.27.50, నైజీరియాలో రూ.31.65 గా ఉన్నది. మనదేశంలో ఒక్క ఫిబ్రవరిలో ఇప్పటివరకు పెట్రోల్ రూ .3.24, డీజిల్ రూ .3.47 పెరిగింది. మొత్తంమీద ఏడాది కాలంలో పెట్రోల్ ధర లీటరుకు రూ .17 పెరగడం గమనార్హం. -
మిస్టరీ: ఒడ్డుకు కొట్టుకొచ్చిన బంగారం..
కారకాస్: ఆశ్చర్యపరిచే సంఘటన... ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. కానీ ఈ దేశంలో మాత్రం బంగారం నెలకు దిగొచ్చి సామన్యుడి చేతికందొచ్చింది. భారీ స్థాయిలో బంగారం సముద్రపు అలలతో ఒడ్డుకు కొట్టుకొచ్చింది. నమ్మశక్యం కానీ ఈ సంఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. ఆదివారం గ్వాకలోని సముద్ర తీరానికి బంగారు, వెండి ఆభరణాలు వేల సంఖ్యలో కొట్టుకొచ్చాయట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 2 వేలకు పైగా మత్స్యాకార కుటుంబాలు ఈ బీచ్ వద్ద నివసిస్తుంటాయి. ఈ క్రమంలో ఓ మత్స్యకారుడు చేపల వేట కోసం ఉదయాన్నే తీరానికి రాగా అతడికి ఒడ్డున ఇసుకలో మెరుస్తున్న వస్తువు కనిపించింది. అదేంటని చేతిలోకి తీసుకుని చూడగా అది బంగారు ఆభరణం. (చదవండి: వైరల్: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి!) దాంతో ఆశ్చర్యపోయిన ఆ మత్స్యకారుడు బంగారం దొరికిందోచ్..! అంటూ గట్టిగా కేకలు వేశాడు. అతడి కేకలు విన్న మిగతా గ్రామస్తులు, మత్స్యకారులు వచ్చి చూసేసరికి బీచ్ ఒడ్డున ఇసుకల్లో బంగారం, వెండి ఆభరణాలు కనిపించాయి. అనంతరం గ్రామస్తులు బీచ్ మొత్తం జల్లెడ పట్టడం ప్రారంభించారు. బంగారు ఆభరణాలు దొరకడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ.. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదని, ఇదే మొదటిసారని చెప్పారు. ఈ బంగారం ఒడ్డుకు ఎలా వచ్చిందో, అసలు సముద్రంలోకి ఎలా చేరాయో ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలిసిన వెనిజులా నిపుణులు ఒడ్డుకు బంగారు ఆభరణాలకు ఎలా కొట్టుకువచ్చాయని శోధించే పనిలో పడ్డారట. (చదవండి: పాకిస్తాన్: ‘అందుకే విగ్రహం ధ్వంసం చేశా’) -
డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్‌గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్‌గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
లాక్డౌన్ : వైన్‌తో పండుగ చేసుకున్నారు
కరాకస్ : కరోనా నేపథ్యంలో అక్కడికి ప్రజలకు ఈ మహమ్మారి సోకకుండా మార్చి నుంచే వెనిజులా తమ దేశంలో లాక్డౌన్ అమలు చేసింది. దీంతో అక్కడి ప్రజలకు ఎటు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో బోర్‌గా ఫీలయ్యేవారు. దీంతో పాటు అక్కడి ప్రభుత్వం ఎవరు బయటికి రాకుండా సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని అక్కడి అధికారులు ఆదేశించారు. వెనిజులాకి చెందిన రియల్ ఎస్టేట్ ఏంజెంట్ బెర్తా లోపెజ్ అనే యువతి లాస్ పాలోస్ అనే ప్రాంతంలో ఉంటుంది. ఆమె ఉంటున్న నివాసానికి అన్ని వైపుల అపార్ట్మెంట్లే కావడంతో బెర్తాకు వెంటనే ఒక ఆలోచన తట్టింది. ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటిస్తూనే తను ఉంటున్న రూఫ్ టాప్ మీదకు ఎక్కి వైన్ తాగాలని భావించింది. ఇదే విషయాన్ని తన తోటివాళ్లకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. మొదట ఆమె చేస్తున్న పనిని ఒప్పుకోకున్నా.. తరువాత ఆలోచించి చూస్తే నిబంధనలు బేఖాతరు చేయడం లేదని వారు భావించారు. అపార్ట్మెంట్లో ఉంటున్న వారు తమ బిల్డింగ్ రుఫ్టాప్ ఎక్కి చేపలు పట్టే యంత్రానికి గ్లాసును కట్టేసి వైన్ తాగడం ప్రారంభించారు. ('ఆ రెండు లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయాల్సిందే') వైన్ తాగడానికి ఇంత చేయడం అవసరమా అని బెర్తాను అడిగితే.. ఆమె స్పందిస్తూ.. ' లాక్డౌన్ వల్ల ఇంట్లో బోర్‌గా పీలవుతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ప్రభుత్వం చెప్పిన భౌతిక దూరాన్ని కూడా పాటిస్తున్నాం. ఇక ఫిషింగ్ లైన్ ఎందుకంటే ఎదుటివారికి చీర్స్ చెప్పేందుకు ఉపయోగిస్తున్నాం. ఇక రూఫ్‌టాప్ మీద వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. వారు నాకు కనిపించేంత దూరంలో ఉండడంతో ఆనందంగా గడిపేస్తున్నాంటూ' చెప్పుకొచ్చింది. అయితే బెర్తా చేసిన చిన్న పని లంచ్, డిన్నర్ల వరకు తీసుకెళ్లింది. అయితే అందరు భౌతిక దూరం పాటిస్తూనే ఈ పని చేస్తుండడం విశేషం. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 44 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 3లక్షలకు చేరువలో ఉంది. (కరోనా: ఫ్రాన్స్‌ను దాటేసిన బ్రెజిల్) -
వెనిజులా ఆ ఆయుధాన్ని వదిలింది: అమెరికా
వాషింగ్టన్/కారకస్: నార్కో టెర్రరిజాని(మాదక ద్రవ్యాల అక్రమ రవాణా)కి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా అభియోగాలు దాఖలు చేసింది. ఆయనతో పాటు ఆ దేశ పలువురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసింది. తాము ఉగ్రవాద సంస్థగా గుర్తించిన రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్ఏఆర్సీ)తో మదురో అనుచరులు సంబంధాలు కొనసాగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసే ‘ది కార్టెల్ ఆఫ్ ది సన్స్’ గ్యాంగ్‌కు మదురో నాయకత్వం వహిస్తున్నారని.. వారి సహాయంతో టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అమెరికాకు చేరవేస్తున్నారని మండిపడింది.(‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’) గత రెండు దశాబ్దాలుగా ఈ తతంగం కొనసాగుతోందని... ఈ వ్యాపారం ద్వారా వాళ్లు మిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్జించారని ఆరోపించింది. ఈ మేరకు న్యూయార్క్, వాషింగ్టన్, మియామీ తదితర ప్రాంతాల్లో ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా వెనిజులా డ్రగ్ మాఫియాకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి 15 మిలియన్ డాలర్ల భారీ రివార్డు ప్రకటించింది.(అమెరికాతో యుద్ధానికి సిద్ధం ) అమెరికాను నాశనం చేసేందుకే ఈ విషయం గురించి అమెరికా అటార్నీ జనరల్ బిల్ బార్ మాట్లాడుతూ... ‘‘ అమెరికాను నాశనం చేసేందుకు మదురో, ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎఫ్ఏఆర్సీతో కుట్రపన్ని... దాదాపు 20 ఏళ్ల నుంచి టన్నుల కొద్దీ కొకైన్‌ను ఇక్కడికి పంపిస్తున్నారు. అమెరికా సమాజాన్ని నాశనం చేసేందుకు కొకైన్ అనే ఆయుధాన్ని వదిలారు. మదురో పాలనాదక్షత ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది. ఆయన పాలన అవినీతి, నేరాలతో నిండిపోయింది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురో ఉద్దేశపూర్వకంగానే కొకైన్‌ను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మదురో అంటే నేరగాడు.. డ్రగ్ మాఫియా! ఇక అమెరికా అభియోగాలపై స్పందించిన వెనిజులా విదేశాంగ శాఖ మంత్రి జార్జ్ అర్రెజా .. తమ దేశాధినేతపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెనిజులా ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి దాడికి దిగిందని దుయ్యబట్టారు. అత్యంత హేయమైన, నీచమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా వెనిజులా అధ్యక్షుడిగా మదురోను గుర్తించేందుకు అమెరికా సహా 50 ఇతర దేశాలు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా తాము గుర్తిస్తున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో అమెరికా తాజా ఆరోపణలకు జువాన్ గైడో విదేశీ వ్యవహారాల కమిషనర్ జులియో బోర్గ్స్ మద్దతు పలికారు. ‘‘ మదురో అంటే డ్రగ్ మాఫియా. మదురో అంటే వ్యవస్థీకృత నేరగాడు’’అని వ్యాఖ్యానించారు. -
ఆ దేశాలపై అమెరికా ఆంక్షలు
వాషింగ్టన్: గతంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతా నిబంధనలను పాటించడంలో విఫలమైన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధించే పత్రంపై సంతకం చేశారు. ఇవి అమెరికా భద్రతకు ప్రమాదకరంగా మారాయని ఆయన వైట్ హౌస్ వెల్లడించింది. ఇరాన్, లిబియా, ఉత్తర కొరియా, సిరియా, వెనెజులా, యెమన్, సోమాలియా పౌరుల అమెరికా ప్రవేశంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తూ ప్రకటన విడుదల చేసింది. మయన్మార్, ఎరిట్రియా, కిర్గిజిస్తాన్, నైజీరియా వలసదారులకు వీసాల అనుమతిపై నిషేధం విధించింది. సూడాన్, టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానియా గ్రెషమ్ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ ఆంక్షలేవీ పర్యాటకులకు, వ్యాపారస్తులకు, వలసేతర ప్రయాణికులకు వర్తించవనిన్నారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనలను పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ నిషేధమని యాక్టింగ్ సెక్రటరీ చాడ్ ఎఫ్ వోల్ఫ్ వెల్లడించారు. ‘దేశ భద్రత, ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రథమ బాధ్యత అనీ, ఈ ఆంక్షలు ఆ లక్ష్యాన్ని చేరుకుంటాయని’ వోల్ఫ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
వైరల్ : 8 ప్యాంట్లు తొడుక్కొని.. అడ్డంగా బుక్కైంది
మనం సాధారణంగా వస్త్ర దుకాణానికి వెళితే కావలిసినవి కొనుక్కుంటాం. కానీ ఓ యువతి మాత్రం షాప్‌కు వెళ్లి చోరీ చేద్దామని భావించి అడ్డంగా బుక్కైంది. ఈ వింత ఘటన వెనిజులాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోనూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వెనిజులాలో ఓ యువతి వస్త్ర దుకాణానికి వెళ్లింది. అక్కడ జీన్స్ ర్యాక్ వద్దకు వెళ్లి 8 ప్యాంట్లు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఒకదాని మీద ఒకటి ధరించి చోరీ చేసేందుకు యత్నించింది. కాగా, యువతి ప్రవర్తనపై అనుమానం కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డగించి వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. ఆమె వేసుకున్న ప్యాంట్‌ను విప్పమన్నారు. దీంతో సదరు యువతి ఒక్కొక్క ప్యాంట్ విప్పుతూ.. మొత్తం 8ప్యాంట్లను బయటికి తీయడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఇదంతా వీడియో తీసీ ఫేస్బుక్లో షేర్ చేయడంతో 4.2 మిలియన్స్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. ' ఈమె చోరీలు చేయడంలో చాలా నేర్పరి. కొంచెం అజాగ్రత్తగా వ్యవహరించి ఉంటే దర్జాగా బయటకు వెళ్లిపోయేదే' అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.