వాషింగ్టన్/కారకస్: నార్కో టెర్రరిజాని(మాదక ద్రవ్యాల అక్రమ రవాణా)కి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా అభియోగాలు దాఖలు చేసింది. ఆయనతో పాటు ఆ దేశ పలువురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసింది. తాము ఉగ్రవాద సంస్థగా గుర్తించిన రెవల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్‌ఏఆర్‌సీ)తో మదురో అనుచరులు సంబంధాలు కొనసాగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసే ‘ది కార్టెల్ ఆఫ్ ది సన్స్’ గ్యాంగ్‌కు మదురో నాయకత్వం వహిస్తున్నారని.. వారి సహాయంతో టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అమెరికాకు చేరవేస్తున్నారని మండిపడింది.(‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’)
గత రెండు దశాబ్దాలుగా ఈ తతంగం కొనసాగుతోందని... ఈ వ్యాపారం ద్వారా వాళ్లు మిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్జించారని ఆరోపించింది. ఈ మేరకు న్యూయార్క్, వాషింగ్టన్, మియామీ తదితర ప్రాంతాల్లో ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా వెనిజులా డ్రగ్ మాఫియాకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి 15 మిలియన్ డాలర్ల భారీ రివార్డు ప్రకటించింది.(అమెరికాతో యుద్ధానికి సిద్ధం )
అమెరికాను నాశనం చేసేందుకే
ఈ విషయం గురించి అమెరికా అటార్నీ జనరల్ బిల్ బార్ మాట్లాడుతూ... ‘‘ అమెరికాను నాశనం చేసేందుకు మదురో, ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎఫ్‌ఏఆర్‌సీతో కుట్రపన్ని... దాదాపు 20 ఏళ్ల నుంచి టన్నుల కొద్దీ కొకైన్‌ను ఇక్కడికి పంపిస్తున్నారు. అమెరికా సమాజాన్ని నాశనం చేసేందుకు కొకైన్ అనే ఆయుధాన్ని వదిలారు. మదురో పాలనాదక్షత ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది. ఆయన పాలన అవినీతి, నేరాలతో నిండిపోయింది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురో ఉద్దేశపూర్వకంగానే కొకైన్‌ను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.
మదురో అంటే నేరగాడు.. డ్రగ్ మాఫియా!
ఇక అమెరికా అభియోగాలపై స్పందించిన వెనిజులా విదేశాంగ శాఖ మంత్రి జార్జ్ అర్రెజా .. తమ దేశాధినేతపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెనిజులా ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి దాడికి దిగిందని దుయ్యబట్టారు. అత్యంత హేయమైన, నీచమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా వెనిజులా అధ్యక్షుడిగా మదురోను గుర్తించేందుకు అమెరికా సహా 50 ఇతర దేశాలు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా తాము గుర్తిస్తున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో అమెరికా తాజా ఆరోపణలకు జువాన్ గైడో విదేశీ వ్యవహారాల కమిషనర్ జులియో బోర్గ్స్ మద్దతు పలికారు. ‘‘ మదురో అంటే డ్రగ్ మాఫియా. మదురో అంటే వ్యవస్థీకృత నేరగాడు’’అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment