breaking news
nicholas maduro
-
శ్రుతి మించుతున్న ట్రంప్... వెనెజువెలాపై యుద్ధం!
వాషింగ్టన్: ఆసియా, యూరప్ అనంతరం అమెరికా ఖండాన్ని సైతం యుద్ధ మేఘాలు వేగంగా కమ్ముకుంటున్నాయి. తమకు చిరకాలంగా కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. వెనెజులాలో డ్రగ్స్ కార్టెళ్ల విధ్వంసం ముసుగులో అక్కడి అపార చమురు నిక్షేపాలను చేజిక్కించుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే వందల సంఖ్యలో భీకర, భారీ క్షిపణులను వెనెజువెలాపైకి ఎక్కుపెట్టింది. ట్రంప్ ఊ అన్న మరుక్షణమే విరుచుకుపడేందుకు అమెరికా యుద్ధనౌకలు, అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ బాహుబలి దాడిని కాచుకునేందుకు నిరుపేద వెనెజువెలా కాలూ చేయీ కూడదీసుకుంటోంది. యుద్ధాలను ఆపేస్తానంటూ ఆదర్శాలు వల్లించి రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ ఈ ఎనిమిది నెలల్లో ఏ యుద్ధాన్నీ ఆపలేకపోగా ఇలా పొరుగు ఖండంలోనే స్వయంగా రణన్నినాదాలకు దిగుతుండడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనెజువెలా డ్రగ్స్ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకూ వెనుకాడబోమని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అన్నట్టుగానే వెనెజువెలాను సముద్ర మార్గాన చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించారు. దాంతో అత్యాధునిక యుద్ధ నౌకలు యూఎస్ఎస్ గ్రేవ్లీ, యూఎస్ఎస్ జాసన్ డన్హమ్ ఆగమేఘాలపై దక్షిణ కరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి వెనెజువెలాపైకి గైడెడ్ మిసైల్స్ ఎక్కుపెట్టాయి. అప్పటికే అక్కడున్న డి్రస్టాయర్ నౌక యూఎస్ఎస్ సామ్సన్ వాటికి తోడైంది. ఇవి చాలవన్నట్టు పసిఫిక్ మహా సముద్రం నుంచి యూఎస్ఎస్ లేక్ ఏరీ నౌకను రప్పిస్తున్నారు. యూఎస్ఎస్ ఇవో జిమా, యూఎస్ఎస్ సాన్ ఆంటోనియో, యూఎస్ఎస్ ఫోర్ట్ లాడెర్డేల్ వంటి యుద్ధ నౌకలూ యుద్ధ ప్రాతిపదికన వచ్చి చేరుతున్నాయి. ఇలా 8 అత్యాధునిక యుద్ధ నౌకలు వెనెజువెలా తీరం వెంబడి అంతర్జాతీయ జలాలను అష్టదిగ్బంధనం చేశాయి. 4,000 మంది సెయిలర్లు, మెరైన్ కమెండోలు సిద్ధంగా ఉన్నారు. వెనెజువెలా డ్రగ్స్ ముఠాలపై ఆకాశ మార్గంలో కూడా విరుచుకుపడేందుకు 10 అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను కూడా అమెరికా శనివారమే ప్యూర్టోరికోకు తరలించి ఉంచింది!వెనెజువెలా ‘తగ్గేదే లే’! సైనికపరంగా అమెరికాతో వెనెజువెలా ఏమాత్రం తూగలేదు. అమెరికా, యూరప్ కఠిన ఆంక్షల దెబ్బకు నికొలాస్ మదురో సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధ, సైనిక సంపత్తిని సమకూర్చుకోలేకపోయింది. ఉన్నవల్లా కాలం చెల్లిన పాతకాలపు ఎఫ్–16 యుద్ధ విమానాలే! సైన్యం కూడా 1.5 లక్షల కన్నా లేదు. అన్ని విభాగాలూ కలిపినా 3.5 లక్షల లోపే! అయినా సరే, అమెరికా వంటి తిరుగులేని సైనిక శక్తిని యథాశక్తి ప్రతిఘటించి తీరతామని మదురో ఇటీవలే ప్రకటించారు. అతి త్వరగా ఏకంగా 50 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తానని చెప్పారు! చమురు నిక్షేపాలపై కన్ను పేద దేశమైనా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలకు వెనెజువెలా కేంద్రం. దేశంలో దాదాపు 48 వేల మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. అమెరికా కఠిన ఆంక్షల వల్ల వాటిని వెలికితీయటం సాధ్యపడటం లేదు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే ఆ చమురు నిల్వలపై కన్నేశారు. వెనెజువెలా చమురంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు చేశారు. అందుకోసం అవసరమైతే అక్కడి చమురు క్షేత్రాలను ఆక్రమించుకుంటామన్నారు! మరోవైపు కమ్యూనిస్టు నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. ట్రంప్ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణచివేశారు. దాంతో మదురోను పట్టించినవారికి రూ.450 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. వెనెజువెలాలో చైనా భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు 90 శాతం చమురు కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. -
వెనిజులా ఆ ఆయుధాన్ని వదిలింది: అమెరికా
వాషింగ్టన్/కారకస్: నార్కో టెర్రరిజాని(మాదక ద్రవ్యాల అక్రమ రవాణా)కి పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా అభియోగాలు దాఖలు చేసింది. ఆయనతో పాటు ఆ దేశ పలువురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసింది. తాము ఉగ్రవాద సంస్థగా గుర్తించిన రెవల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా(ఎఫ్ఏఆర్సీ)తో మదురో అనుచరులు సంబంధాలు కొనసాగిస్తున్నారని అమెరికా ఆరోపించింది. కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసే ‘ది కార్టెల్ ఆఫ్ ది సన్స్’ గ్యాంగ్‌కు మదురో నాయకత్వం వహిస్తున్నారని.. వారి సహాయంతో టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అమెరికాకు చేరవేస్తున్నారని మండిపడింది.(‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’) గత రెండు దశాబ్దాలుగా ఈ తతంగం కొనసాగుతోందని... ఈ వ్యాపారం ద్వారా వాళ్లు మిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్జించారని ఆరోపించింది. ఈ మేరకు న్యూయార్క్, వాషింగ్టన్, మియామీ తదితర ప్రాంతాల్లో ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది. అదే విధంగా వెనిజులా డ్రగ్ మాఫియాకు సంబంధించిన సమాచారాన్ని అందించిన వారికి 15 మిలియన్ డాలర్ల భారీ రివార్డు ప్రకటించింది.(అమెరికాతో యుద్ధానికి సిద్ధం ) అమెరికాను నాశనం చేసేందుకే ఈ విషయం గురించి అమెరికా అటార్నీ జనరల్ బిల్ బార్ మాట్లాడుతూ... ‘‘ అమెరికాను నాశనం చేసేందుకు మదురో, ఆయన ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు ఎఫ్ఏఆర్సీతో కుట్రపన్ని... దాదాపు 20 ఏళ్ల నుంచి టన్నుల కొద్దీ కొకైన్‌ను ఇక్కడికి పంపిస్తున్నారు. అమెరికా సమాజాన్ని నాశనం చేసేందుకు కొకైన్ అనే ఆయుధాన్ని వదిలారు. మదురో పాలనాదక్షత ఏంటో ఇప్పుడే అర్థమవుతోంది. ఆయన పాలన అవినీతి, నేరాలతో నిండిపోయింది’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురో ఉద్దేశపూర్వకంగానే కొకైన్‌ను సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. మదురో అంటే నేరగాడు.. డ్రగ్ మాఫియా! ఇక అమెరికా అభియోగాలపై స్పందించిన వెనిజులా విదేశాంగ శాఖ మంత్రి జార్జ్ అర్రెజా .. తమ దేశాధినేతపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వెనిజులా ప్రజలు, ప్రజాస్వామ్య వ్యవస్థపై ట్రంప్ ప్రభుత్వం మరోసారి దాడికి దిగిందని దుయ్యబట్టారు. అత్యంత హేయమైన, నీచమైన ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాగా వెనిజులా అధ్యక్షుడిగా మదురోను గుర్తించేందుకు అమెరికా సహా 50 ఇతర దేశాలు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా తాము గుర్తిస్తున్నట్లు ట్రంప్ గతంలో ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో అమెరికా తాజా ఆరోపణలకు జువాన్ గైడో విదేశీ వ్యవహారాల కమిషనర్ జులియో బోర్గ్స్ మద్దతు పలికారు. ‘‘ మదురో అంటే డ్రగ్ మాఫియా. మదురో అంటే వ్యవస్థీకృత నేరగాడు’’అని వ్యాఖ్యానించారు. -
‘వారు యుద్ధం, హింస కోరుకుంటున్నారు’
కరాకస్ : దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో సంక్షోభం తారస్థాయికి చేరింది. ఆర్థికమాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న వెనిజులా నుంచి లక్షలాది మంది పౌరులు పొట్టచేతబట్టుకుని... పెరు సహా ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు. తమకు వచ్చిన విద్యను ప్రదర్శిస్తూ చిల్లర పోగుచేసుకుంటూ దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో వ్యవహారశైలి వల్లే ఆ దేశ పౌరులకు ఇలాంటి దుర్గతి పట్టిందంటూ ప్రతిపక్షాలతో పాటు మానవ హక్కుల సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వెనిజులన్ మహిళ దీనస్థితిని కళ్లకుగట్టే వీడియోను ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషనర్ మంగళవారం షేర్ చేసింది. ‘ మీరు ఈరోజు వినాల్సిన సుందరగానం ఇది’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ వీడియోలో...తన తొమ్మిది నెలల పాపాయిని చేతుల్లో పెట్టుకుని...గానం చేస్తూ ఆ తల్లి డబ్బు యాచిస్తోంది. ఈ దృశ్యాలు చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. ‘తల్లి పొత్తిళ్లలో కేరింతలు కొడుతూ... హాయిగా పడుకోవాల్సిన ఆ చిన్నారి నేడు ఇలా రోడ్డుపై అమ్మ చేతుల్లో నిద్రపోతోంది. ఈ దుస్థితి కారణం ఎవరు’ అంటూ దేశ అధ్యక్షుడి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం ఏడాది కాలంలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల మంది వెనిజులన్లు పెరూకు వలస వచ్చారు. వారిలో చాలా మందిని అక్రమవలసదారులుగా గుర్తించిన పెరూ ప్రభుత్వం... పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నవారిని మాత్రమే దేశంలో ఉండేందుకు అనుమతినిచ్చింది. వీసాలు లేని వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు కొలంబియా యుద్ధాన్ని కోరుకుంటోందని...వారి కుట్రలు తిప్పికొట్టేందుకు తమ సైన్యం సన్నద్ధంగా ఉన్నదంటూ వెనిజులా అధ్యక్షుడు మదురో ప్రకటన జారీ చేశారు. వివిధ రక్షణ విభాగాలకు చెందిన సైన్య దళాధిపతులతో సమావేశమైన ఫొటోలను విడుదల చేశారు. ‘కొలంబియా యుద్ధం, హింస కోరుకుంటోంది. అందుకు మేము ధీటుగా బదులిస్తాం’ అని మదురో హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: అమెరికాతో తెగదెంపులు! ఇక ఈ ఏడాది జరిగిన వెనిజులా ఎన్నికల్లో ప్రముఖ ప్రతిపక్ష నాయకులు నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించుకున్నారు. ఇందుకు నిరసనగా మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు.అప్పటి నుంచి దేశంలో రాజకీయ అనిశ్చితితో పాటు ఆర్థిక సంక్షోభం కూడా ముదిరింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. గుర్తిస్తున్నామంటూ అమెరికా ప్రకటన విడుదల చేసింది. ఇందుకు కొలంబియా సహా ఇతర దేశాలు వంతపాడాయి. ఈ క్రమంలో అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో.. అగ్రరాజ్యంతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
ఆడాళ్లూ.. హెయిర్ డ్రయర్ వాడొద్దు!
ఆడవాళ్లు తలంటు పోసుకున్న తర్వాత.. జుట్టు ఆరబెట్టుకోడానికి హెయిర్ డ్రయర్లు వాడటంపై వెనిజువెలా అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రయర్లు వాడటం కంటే ఎంచక్కా చేతి వేళ్లను జుట్టులోకి పోనిచ్చి.. సహజంగానే ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుందని ఆయన అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. అందుకోసం విద్యుత్ వాడకాన్ని తగ్గించడానికి అధ్యక్షుడు నికొలస్ మదురో ఈ తరుణోపాయం చూపించారు. డ్రయర్లు వాడుతుంటే విద్యుత్తు ఎక్కువగా ఖర్చవుతుందని, అందువల్ల వాడకం తగ్గాలంటే చేతివేళ్లతోనే జుట్టు ఆరబెట్టుకోవాలని ఆడాళ్లకు ఆయన సూచించారు. ఇలా చేస్తే సహజంగా ఉండటంతో పాటు చాలా అందంగా కనిపిస్తారని కూడా ఆయన అంటున్నారు. కానీ మహిళలు మాత్రం అధ్యక్షుడి సూచన విని ఆశ్చర్యపోతున్నారు. దేశంలో విద్యుత్ సమస్య దశాబ్ద కాలానికి పైగా ఉందని, దాన్ని అరికట్టడానికి తగిన చర్యలు ఏవీ తీసుకోలేదని మండిపడుతున్నారు. తమ జుట్టు వల్లే విద్యుత్ వాడకం ఎక్కువైపోతోందా అంటూ ఒంటి కాలిమీద లేస్తున్నారు.