ఆడాళ్లూ.. హెయిర్ డ్రయర్ వాడొద్దు!
ఆడవాళ్లు తలంటు పోసుకున్న తర్వాత.. జుట్టు ఆరబెట్టుకోడానికి హెయిర్ డ్రయర్లు వాడటంపై వెనిజువెలా అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. డ్రయర్లు వాడటం కంటే ఎంచక్కా చేతి వేళ్లను జుట్టులోకి పోనిచ్చి.. సహజంగానే ఆరబెట్టుకుంటే చాలా బాగుంటుందని ఆయన అన్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రస్తుతం ఆ దేశంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది. అందుకోసం విద్యుత్ వాడకాన్ని తగ్గించడానికి అధ్యక్షుడు నికొలస్ మదురో ఈ తరుణోపాయం చూపించారు. డ్రయర్లు వాడుతుంటే విద్యుత్తు ఎక్కువగా ఖర్చవుతుందని, అందువల్ల వాడకం తగ్గాలంటే చేతివేళ్లతోనే జుట్టు ఆరబెట్టుకోవాలని ఆడాళ్లకు ఆయన సూచించారు. ఇలా చేస్తే సహజంగా ఉండటంతో పాటు చాలా అందంగా కనిపిస్తారని కూడా ఆయన అంటున్నారు.
కానీ మహిళలు మాత్రం అధ్యక్షుడి సూచన విని ఆశ్చర్యపోతున్నారు. దేశంలో విద్యుత్ సమస్య దశాబ్ద కాలానికి పైగా ఉందని, దాన్ని అరికట్టడానికి తగిన చర్యలు ఏవీ తీసుకోలేదని మండిపడుతున్నారు. తమ జుట్టు వల్లే విద్యుత్ వాడకం ఎక్కువైపోతోందా అంటూ ఒంటి కాలిమీద లేస్తున్నారు.