పెద్దలు దోచుకుంటే వెనిజులా కాదా? | CNS Yajulu Guest Column On Welfare Schemes | Sakshi
Sakshi News home page

పెద్దలు దోచుకుంటే వెనిజులా కాదా?

Published Sun, Sep 26 2021 1:15 AM | Last Updated on Sun, Sep 26 2021 5:15 AM

CNS Yajulu Guest Column On Welfare Schemes - Sakshi

పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినా.. పేదల ఖాతాల్లో ప్రభుత్వాలు నేరుగా నగదు బదిలీ చేసినా.. గుండెలు బాదేసుకోవడం ఈ మధ్య ఒక ఫ్యాషన్‌ అయిపోయింది.
‘ఏంటి పేదల్ని సోమరిపోతులుగా మార్చేస్తారా?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ఇలాగే పోతే రాష్ట్రం వెనిజులాగా మారిపోతుం’దంటూ అంతర్జాతీయ మేధావుల్లా శాపాలూ పెట్టేస్తున్నారు.
ఎంత దుర్మార్గమైన వ్యాఖ్యలివి?

రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కానీ బతుకు బండి ముందుకు నడవని పేదలు ఎప్పటికీ సోమరిపోతులు కారు. కాలేరు. వారి గురించి ఎవరూ బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు. మరి సోమరిపోతులెవరు?  బ్యాంకులకు వేల కోట్ల రూపాయల బాకీలు ఎగ్గొట్టి.. అరెస్ట్‌ చేసే ముందు పాలకుల అండతో విదేశాలకు చెక్కేసే విజయ్‌ మాల్యాలూ.. నీరవ్‌ మోదీలు.. మొహుల్‌ ఛోక్సీలే నిజానికి సోమరిపోతులు. ఎందుకంటే వాళ్లు ఏనాడూ ఎండలో ఓ గంట సేపు కష్టపడిన వారు కాదు. ఏసీ గదుల్లో కూర్చుని.. బ్యాంకుల్లో ఏసీ గదుల్లో ఉన్నతాధికారులను బుట్టలో వేసుకుని వేల కోట్ల రూపాయల రుణాలు కొట్టేసి వాటిని దారి మళ్లించేసి అసలు వ్యాపారాలు దివాలా తీశాయని కాగితాలపై కట్టుకథలు రాసే కార్పొరేట్‌ దొంగలే సోమరిపోతులు.

రాష్ట్రాలైనా..దేశాలైనా ఇలాంటి వారి వల్లనే దివాళా తీస్తాయి కానీ నిరుపేద రైతులు, శ్రామిక వర్గాల కిచ్చే చిల్లర పైసల వల్ల కాదు. అసలు వెనిజులా విషయంలోనూ వీళ్లకి అవగాహన లేదు. వెనిజులా దివాలా తీయడానికి కారణం కేవలం సంక్షేమ పథకాలు కాదు. చమురు ధరలు పడిపోవడంతో ఆదాయం తగ్గింది. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఉంది కాబట్టి అమెరికా పగబట్టింది. వెనిజులాకి ఆహార ఉత్పత్తులు, మందులు సరఫరా చేయకుండా తన మిత్ర దేశాలపై పరోక్ష ఆంక్షలు విధించింది అమెరికా. అటువంటి వెనిజులాను బూచిలా చూపించి పేదల నోళ్లు కొట్టేయడానికి మన దగ్గర చాలా మంది మేధావులు పేట్రేగిపోతున్నారు.

ఏ దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ఆర్థిక అసమానతలు పెరిగిపోయినపుడు ధనవంతులు మరింత ధనవంతులుగానూ పేదలు మరింత పేదలుగానూ మారిపోతున్నప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలో ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పారు. పేదల దగ్గర కొనుగోలు శక్తి లేకపోతే అన్ని వ్యవస్థలూ.. ఉత్పాదక సంస్థలు దివాలా తీస్తాయి. అది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుంది. అటువంటి సమయాలలో ఏదో ఒక రూపంలో ప్రజల చేతుల్లో డబ్బులు చేరేలా చేయడం ద్వారా కొనుగోలు శక్తి పెంచాలి. అలా పెంచడం వల్లనే ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా నిలబడుతుంది.

కరోనా వంటి సంక్షోభ కాలంలో మహా మహా ఆర్థిక శక్తులే కుప్పకూలిపోయాయి. కోట్లాదిమంది ఉపాధి కోల్పోయారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేయడమొక్కటే వ్యవస్థను కాపాడుకోడానికి మార్గమని ఆర్థిక మేధావులు అంటున్నారు. దాన్నే ‘హెలికాప్టర్‌ మనీ’ అంటారు. మన అధికార యంత్రాంగాలు ఎలా ఆలోచిస్తాయంటే రైతులకు రుణమాఫీ ఇవ్వాలని డిమాండ్‌ వస్తే.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన అరుంధతీ భట్టాచార్య ‘అయ్య బాబోయ్‌ రుణమాఫీయే.. అలా అయితే రైతుల్లో ఆర్థిక క్రమశిక్షణ అనేదే ఉండదు. అది ఎంత మాత్రం కుదరదు‘ అని నిర్మొహమాటంగా చెప్పేశారు.

ఇదే అరుంధతీ భట్టాచార్య బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన విజయ్‌ మాల్యాకి సంబంధించిన అయిదున్నర వేల కోట్ల బాకీని మాత్రం రైటాఫ్‌ చేసేశారు. అలా చేస్తూ.. ‘పాపం వ్యాపారంలో నష్టపోయినపుడు ఆదుకోకపోతే ఎలాగ?‘ అన్నారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు పేదలపై ఎంత చులకన భావం ఉంటుందో.. పెద్దలపై ఎంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోడానికి. పేదల జేబుల్లోకి రూపాయి వెళ్తోందంటే చాలు నయా మేధావులు చాలా బెంగపెట్టేసుకుంటారు. మాల్యా వంటి పెద్దలు కోట్లకు కోట్లు ఎగనామం పెట్టేసి ఆ భారాన్ని ప్రభుత్వ ఖజానాలపై మోదేసినా ఎవ్వరూ మాట్లాడరు.

మాట్లాడితే వెనిజులా అనే వాళ్లు అందరికీ ఉచిత విద్యుత్‌ను అందించే క్యూబా గురించి మాట్లాడరు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఏడు దేశాల్లో పన్నుల్లేకపోయినా.. విద్య, వైద్యాలు ఉచితంగానే అందిస్తోన్నా... ‘ఇలా ఎలా ఇస్తారు‘ అని ఎవ్వరూ అడగరు. కమ్యూనిస్టు దేశాలు ఉండకూడదని అమెరికా ఎలా అనుకుంటుందో.... అలానే పేదలకు సంక్షేమ పథకాలు ఉండనే కూడదని వీళ్లు అనుకుంటారు. పేదలపై ఎందుకో మరి అంత కోపం? పేదరికం అంటే ఎందుకో అంత ఏహ్యభావం! నిజానికి మాల్యాల వంటి వాళ్లు అదే పనిగా దోచుకుంటే దేశం వెనిజులాగా కాదు... సోమాలియాలా మారిపోయే ప్రమాదం ఉంది. అందరూ దృష్టి సారించాల్సింది దానిపై మాత్రమే.
– సి.ఎన్‌.ఎస్‌. యాజులు
మొబైల్‌ : 95055 55384 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement