
అభిప్రాయం
జూన్ 4న ఎన్నికల ఫలితాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ప్రజలకోసం అమలు చేసిన కార్యక్రమాలు లోతుగా పరిశీలిస్తే గెలుపు ఎవరిది అనేది స్పష్టంగానే బోధపడుతుంది.
బాబు పాలన ఎక్కువకాలం రాజధాని అమరావతి చుట్టూ తిరిగింది. ఒక పెద్ద స్కామ్‌ను నడిపింది. బాబు ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి తాత్కాలిక సచివాలయం, కోర్టు భవనాలు నిర్మించారే తప్ప శాశ్వతమైన నిర్మాణాలు ఏవీ జరగలేదు.
జగన్ మోహన్ రెడ్డి జూన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మనసా, వాచా, కర్మణా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టి నిర్వహించారు. గ్రామస్థాయికి అధికార వికేంద్రీకరణ చేశారు. గ్రామ సచివాలయం, దానికి అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను గ్రామాలలో ఏర్పాటు చేసి ప్రజలకు కావలసిన అన్ని సేవలు ఇంటి వద్దకే చేర్చారు.
బాబు పాలనలో ప్రభుత్వ పాఠాశాలలు నిర్వీర్యం అయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో కావలసిన వైద్య పరికరాలు, రోగులకు కావలసిన మందులు ఇవ్వలేదు. వైద్యులు, నర్సుల ఖాళీలు నింపలేదు. ప్రైవేట్ పాఠశాలలను, వైద్యశాలలను బాగా ప్రొత్సహించారు బాబు. అయితే జగన్ పాలన ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలకు స్వర్ణయుగం అయ్యింది. వైద్యులు, నర్సుల పోస్టులు ¿ý ర్తీ చేశారు. ఆరోగ్యశ్రీ కింద పరిమితిని ఇరవై ఐదు లక్షల వరకు పెంచి, అధిక రోగాలకు ఆ పథకాన్ని వర్తింపజేశారు. కొత్తగా జగన్ ప్రభుత్వం 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం, బడికి పిల్లలను పంపించే తల్లులకూ, బడికి వచ్చే పిల్లలకూ అనేక పథకాలను వర్తింపచేయడం తెలిసిందే.
బాబు 2014లో ఇచ్చిన మ్యేనిఫెస్టోలోని ముఖ్య హామీలైన రైతు, డ్వాక్రా గ్రూపుల రుణమాఫీ చేయలేదు. పుట్టిన బిడ్డకు రూ. 25,000 డిపాజిట్ చేసే ‘మహాలక్ష్మి’ పథకం పూర్తిగా అమలు కాలేదు. ఇంటింటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలు 99 శాతం అమలు చేశారు. ఇళ్లస్థలాలను మహిళల పేర ఇవ్వడం, వారికి రాజకీయాల్లోనూ మంచి అవకాశాలు ఇవ్వడం, అనేక రకాల పెన్షన్‌లు అమలుచేయడం చూస్తే ఆయన మహిళా పక్షపాతి అని అర్థమవుతుంది.
2014 మేనిఫెస్టో అమలులో పూర్తిగా విఫలమైన బాబు 2024లో ‘బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ’ పేరుతో 177 హామీలు, ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం వంటివాటిని చేర్చారు. అయితే సంక్షేమ పథకాలతో జగన్ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని విమర్శించిన బాబు ఇప్పుడు ఆయన కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల్లో చెప్పడాన్ని ప్రజలు నమ్మలేదు. అందుకే మే 13న రాష్ట్రంలో జరగిన ఎన్నికలలో 80 శాతం మంది వృద్ధులు, 65 శాతం మంది మహిళలు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేసినట్లు అంటున్నారు. కావున ఎన్నికలలో జగన్ విజయం సునాయాసమే!
ఎ. జయప్రదా రాఘవరెడ్డి
వ్యాసకర్త సామాన్య గృహిణి, కడప