ఏప్రిల్ 13న తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది. భౌతిక దాడులకు దిగి, ఎన్నికల రూపంలో చేయాల్సిన పోరాటాన్ని ఆయుధ పోరాటంగా మార్చిన వ్యక్తులు ఒక అనాగరిక సాంప్రదాయానికి మళ్ళీ తెరతీశారు. కేవలం ఆయనకు వున్న ప్రజాదరణ చూసి, మళ్లీ ముఖ్యమంత్రి కావచ్చునేమో అని ఓర్వలేక వారు అలా దాడి చేశారా?
అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఇదే ఏప్రిల్ నెలలో హత్య కావించబడ్డారు. సామాన్య ప్రజలతో కలిసిపోయి వారిలో ఒకడిగా సంభాషణ చేయగల సామర్థ్యం, సాటి మనిషిపై సహానుభూతి ఆయన ప్రధాన లక్షణాలు. శ్వేత జాతీయుడయినప్పటికీ నల్ల జాతీయుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు.
అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని సమానత్వం ప్రాతిపదికగా పునర్ నిర్మించాలని సంకల్పించారు. బానిసత్వ నిర్మూలన, ఆఫ్రికన్ అమెరికన్‌లకు భూమి హక్కులు, ఓటు హక్కు కల్పించడం అందులో ముఖ్యమైన అంశాలు. ఆధిపత్య శ్వేత జాతీయ దురహంకార రాష్ట్రాలు అంతర్యుద్ధం తీసుకువచ్చినా వెనకాడలేదు. ‘మనుష్యులందరూ సమానంగా సృష్టించ బడ్డారు’ అని నినాదమిచ్చారు.
యూనియన్ విక్టరీ తరువాత శ్వేత జాతీయుల నాయకుడు రాబర్ట్ ఇ. లీ లొంగిపోయిన అయిదు రోజులకు 1865 ఏప్రిల్ 14న సాయంత్రం లింకన్ వాషింగ్టన్ డి.సి.లో నాటకం వీక్షించడానికి సతీ సమేతంగా వెళ్ళారు. జాన్ విల్కిస్ బూత్ అనే నటుడు, శ్వేతజాతి ఆధిక్యతావాది లింకన్‌ను వెనక నుండి అతి దగ్గరగా కాల్చాడు.
మనుషులందరూ సమానమే అని లింకన్ చేసిన ప్రకటన, ఆయన చర్యలు, శ్వేతజాతి దురహంకారి అయిన జాన్ విల్కిస్ బూత్‌ను అలజడికి గురి చేశాయి. బానిసలు తమతో సమానంగా, ఆత్మ గౌరవంతో బతకడం అనే ఆలోచన నిద్ర లేకుండా చేసింది. లింకన్‌ను భౌతికంగా నిర్మూలిస్తే తప్ప నల్ల జాతీయులను అణిచి ఉంచలేమని అతనికీ, అతని తరఫు వారికీ అనిపించింది. జాన్ విల్కిస్ బూత్ కాల్చిన తూటా లింకన్ ప్రాణాలను బలి తీసుకొంది. 1865 ఏప్రిల్ 15న లింకన్ కన్నుమూశారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘ఒక సమాజం విద్యలో సాధించిన పురోగతే ఆ సమాజపు అభివృద్ధిని నిర్ణయిస్తుంది’ అంటారు. జగన్ ఆ సత్యాన్ని పట్టుకున్నారు. అందుకే తన దృష్టిని ప్రధానంగా విద్యపై కేంద్రీకరించారు. మనది ‘పేదవాడు పెత్తందారుపై చేస్తున్న పోరాటం’ అని నినాదం ఇచ్చారు. పేదవాళ్ళు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని సంకల్పించారు. డబ్బున్న వాళ్ళలాగే పేదవాళ్ళు కూడా విదేశాలకు చదువుల కోసం వెళ్లొచ్చని విదేశీ విద్యకు అవకాశం కల్పించారు.
గుడ్లు పెట్టడానికంటే ముందే తల్లిపక్షి గూడు కడుతుంది. ఆ జాగ్రత్త స్త్రీ సహజ లక్షణం. అది గ్రహించినవాడు కనుకనే పిల్లలకు చదువు కోసం డబ్బులిచ్చినా, ఇళ్ల స్థలాలిచ్చినా జగన్ ఆ ఇంటి తల్లికి ఇస్తున్నారు. స్త్రీ పేరిట ఇస్తున్నారు. దీనినే స్త్రీవాదం అని మేధావులు పిలుస్తారు. ఏ రోగమో రొష్టో వచ్చినపుడు ఆసాముల దగ్గర చేయి చాచకుండా ప్రభుత్వ రూపంలో ఆదుకుంటూ డబ్బున్నవాడి పక్క బెడ్డులోనే చికిత్స తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జగన్ చేపడుతున్న ప్రతి కార్యక్రమం, పేదవాడిని పెత్తందారుల సంకెళ్ళనుండి విడిపించేదే!
అబ్రహాం లింకన్ సమయంలోనే కాదు, ఇప్పుడు కూడా పేదలు గుండెల నిండా ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడితే పెత్తందార్లకు కడుపు మంట. ‘ఎవరయినా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా?’ అని హేళనగా మాట్లాడిన చంద్రబాబు లాంటివారికి, పెత్తందార్లకు కాపు కాసే నటులకు, వారికి మద్దతునిస్తూ భౌతిక దాడులకు దిగిన అనుయాయులకు, ప్రధానంగా జగన్ సమానత్వ ఎజెండా మీదే ఆక్రోశం. ఇది కాకతాళీయమే కావొచ్చు... నటుడు జాన్ విల్కిస్ బూత్ ఏప్రిల్ 14న లింకన్ మీద తూటా పేల్చాడు.
ఆంధ్ర ప్రదేశ్‌లో పెత్తందార్లు, నటులు... పేద ప్రజల నాయకుడు జగన్ మీదజుజ ఏప్రిల్ 13న రాయి విసిరారు. జాన్ విల్కిస్ బూత్ తూటా లక్ష్యం కేవలం లింకన్‌ను భౌతికంగా నిర్మూలించడం కాదు, లింకన్ సమానత్వ ఎజెండాను సమాధి చేయడం. అలాగే పేద ప్రజల పక్షపాతి జగన్ మీదకి ఈ పెత్తందార్లు విసిరిన రాయి లక్ష్యం జగన్‌ను కేవలం భౌతికంగా గాయపరచడం కాదు, ప్రగతి పథంలో సాగుతున్న జగన్ ప్రయత్నాన్ని స్తంభింపజేయడం! లింకన్ మరణం ఆఫ్రికన్ అమెరికన్ సమానత్వ ఆకాంక్షలను వంద సంవత్సరాలు ఆపగలిగింది. ఇప్పుడు ఈ పెత్తందారులు జగన్‌పై విసిరిన రాయి, మంచి చదువులు చదువుతూ అభివృద్ధి వైపు పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఏం చేస్తుందో చూడాలి!
సామాన్య
వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి
సమానత్వ సాధనను అడ్డుకునేందుకే...
Published Tue, Apr 16 2024 5:09 AM | Last Updated on Tue, Apr 16 2024 5:09 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment