ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అవుతుందని ‘హిందూ’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం విశాఖపట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలన్న ఆయన కృత నిశ్చ యాన్ని మరోసారి తెలియజేస్తోంది. గత టరమ్‌లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు పదేళ్లపాటు ఉమ్మడి రాజ ధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదలి సడన్‌గా విజయవాడకు వచ్చి కూర్చున్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబు పట్టు బడిన సంగతి తెలిసిందే. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తెలంగాణ సీఎం కేసీఆర్ షరతు మేరకు ఆయన హైదరాబాద్‌ను రాత్రికి రాత్రే వదలిపెట్టారు. దీంతో హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసిన వందల కోట్లు వృధా అయ్యాయి. అప్పుడు చంద్రబాబు కూర్చున్న ప్రదేశమే రాజధాని అయినప్పుడు, ఇప్పుడు జగన్ చెబుతున్నట్లుగా ఆయన విశాఖవెళ్లి కూర్చుంటే అదే రాజధాని అనుకోవచ్చు కదా.
జగన్ మూడు రాజధానుల విధానం ప్రకటించినప్పటి నుంచి ఆయన ప్రతిపాదన ముందుకు వెళ్లకుండా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుపుల్లలు వేస్తోంది. దానికి మరికొన్ని ఇతర రాజకీయ పక్షాలు కూడా వంతపాడుతున్నాయి. అయిన ప్పటికీ జగన్ మాత్రం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయా లన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకు ఆయన చూపుతున్న కారణాలు కూడా ఆలోచించదగినవే. విశాఖలో అయితే లక్షల కోట్ల వ్యయం చేయకుండానే రాజధాని భవన సముదాయాలను నిర్మించుకోవచ్చన్నది ఒక భావన. ఇది వాస్తవమే.
ఆనాటి సీఎం చంద్రబాబు ‘అమరావతి’ పేరుతో 33 వేల ఎకరాల భూమిని సమీకరించడం, దానిని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉండడం, తొలి దశలోనే ప్రాథమిక సదు పాయాలకే 1,08,000 కోట్ల రూపాయలు అవసరమని, కనుక నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. కేంద్రం ఆ లేఖను పక్కన పెట్టేసింది. తాను ఇవ్వదలిచిన 1,500 కోట్లను ఇచ్చి చేతులు దులుపుకుంది. దాంతో మొత్తం వ్యయభారం అంతా ఏపీ ప్రభుత్వంపైన పడుతుంది. మరి ఒక్క ప్రదేశంలో అంత మొత్తం ఎప్పటికి వ్యయం చేయాలి.
అసలు చంద్రబాబు రైతుల నుంచి అన్నివేల ఎకరాలు సేకరించి, వారికి కోట్ల రూపాయల లాభం వస్తుందని ఆశ చూపించడం ఎంత వరకు సమంజసం? ఇన్ సైడ్ ట్రేడింగ్, అస్సైన్డ్ భూముల కుంభ కోణాల గురించి చెప్పనవసరం లేదు. ప్రజలందరికీ అక్కడ జరిగిన భాగోతం తెలుసు. టీడీపీ నేతలు, ఒక వర్గానికి చెందినవారు అత్యధికంగా వేల ఎకరాల భూమి కొన్న తీరు వెలుగులోకి వచ్చాక అంతా విస్తుపోవడం జరిగింది. తాజా వార్తల ప్రకారం సుమారు వెయ్యి ఎకరాల అస్సైన్డ్ భూములను పేద దళితుల నుంచి బలవంతులైన రాజకీయ నేతలు, దళారులు లాక్కుని, అర్ధరాత్రి రిజిస్ట్రేషన్‌లు చేయించు కున్నారో కథలు, కథలుగా చెబుతున్నారు. ఇక్కడ మరో సంగతి ఏమిటంటే అమరావతిగా గుర్తించిన గ్రామాలలో గజం ఇరవై వేల నుంచి ముప్పైవేల వరకు ధర పలికినా, ప్రభుత్వం మాత్రం గజం ధర ఐదువేల లోపే ఉంచింది. అంటే మిగిలినదంతా బ్లాక్ మనీగానే లావాదేవీలు సాగాయన్నమాట.
ఇక అవుటర్ రింగ్ రోడ్డు మాయాజాలం మరో కథ. పలుకుబడి కలిగిన ఆసాములు తమ భూములు రాజధాని భూ సమీకరణలో పోకుండా జాగ్రత్తపడ్డారని ఆరోపణలు వచ్చాయి. అందులో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు మకాం చేసిన కరకట్ట నివాసం యజమాని లింగమనేని రమేష్‌కు చెందిన భూములు కూడా ఉన్నాయని ప్రభుత్వం ఆధార సహితంగా వెల్లడించింది. ఇన్ని తంతులు ఇక్కడ జరిగితే ఎక్కడా వార్తలు ఇవ్వని ఈనాడు, తదితర టీడీపీ మద్దతు మీడియా సంస్థలు విశాఖలో కబ్జాలు జరుగు తున్నాయనీ, మరొకటనీ విషం కక్కుతున్నాయి. కబ్జాల వంటి నేరాలు అన్ని పట్టణాలలో జరుగుతూనే ఉంటాయి. వాటిని ప్రభుత్వాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాయి. గతంలో టీడీపీ హయాంలో విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై ఆనాటి ప్రభుత్వమే సిట్ నియమించింది.
మరి అప్పుడు కబ్జాలు జరిగినా ఫర్వాలేదని ఈనాడు మీడియా భావించిందా? హైదరా బాద్‌లో నిత్యం కబ్జా వార్తలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రాన హైదరాబాద్ రాజధాని నగరంగా పనికి రాదని ఎన్నడైనా ఈనాడు రాసిందా? మరి విశాఖ విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు? దానికి ఒకే కారణం కనిపి స్తుంది. అమరావతిలో టీడీపీకి, ఈనాడు వంటి మీడియా సంస్థలకు వ్యాపార ప్రయోజనాలు ముడిపడి ఉండడం కావచ్చు. విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ అయితే రాజకీయంగా టీడీపీకి నష్టం కలుగుతుందన్న భావన కావచ్చు.
విశాఖ రాజధాని అయితే దేశ వ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. సముద్ర తీర ప్రాంత నగరాలలో ఒక ముఖ్యమైన నగరంగా ఉన్న విశాఖకు ప్రపంచ స్థాయిలో పోటీ పడే అవకాశం వస్తుంది. పోనీ అమరావతే తక్కువ వ్యయంతో సకాలంలో అభివృద్ధి చెందే అవకాశం ఉందా అంటే అది జరిగే పని కాదని అర్థం అవుతుంది. అందువల్లే అప్పట్లో చంద్రబాబు తాత్కాలిక భవనాల నిర్మాణం పేరుతో కథ నడిపారు. ఆయన నవ నగరాలని చెబుతూ అన్నిటినీ అమరావతిలోనే నిర్మిస్తామని ప్రజలను మభ్య పెట్టే యత్నం చేశారు. తాము కట్టే పన్నుల డబ్బు అంతా ఒక ప్రాంతంలో, అదీ ఒక వర్గం ఎక్కువగా ఉన్న చోట వారికి లబ్ధి చేకూరేలా చంద్రబాబు అమరావతి నిర్మాణం చేస్తున్నారని వివిధ ప్రాంతాల ప్రజలు భావించి టీడీపీని ఘోరంగా ఓడించారు. పోనీ అమరావతిగా చెప్పిన ప్రాంతంలో అయినా గెలిచారా అంటే అదీ జరగలేదు. కేవలం ఒక వర్గం కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారనీ, మిగిలిన సామాజిక వర్గాలు అనుమానించి టీడీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశాయి.
ఈ విషయాలను గమనించకుండా చంద్రబాబు తన ఓటమి తర్వాత కూడా మళ్లీ అమరా వతి పాట అందుకున్నారు. రైతుల పేరుతో కొందరిని ఆందోళనకు పురికొల్పారు. పాద యాత్రల ప్రహసనం సృష్టించారు. అమరావతి నుంచి అరసవెల్లి పాద యాత్రలో కొందరు రైతులు, మహిళలు, టీడీపీ నేతలు తొడలు చరచడం, చెప్పులు చూపడం వంటివి చేసి ఉత్తరాంధ్ర ప్రజలలో సెంటిమెంట్ రగలడానికి కారకులయ్యారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సంబంధం లేకుండా వారి ఇష్టం వచ్చినట్లు యాత్రలు సాగించి రాజకీయ డ్రామాలు సృష్టించబోయి బొక్క బోర్లాపడి, చివరికి రామచంద్రాపురం నుంచి సర్దుకుని వెనుదిరి గారు. మళ్లీ పాదయాత్ర చేస్తారా? లేదా అన్నది వేరే విషయం.
కానీ ఈలోగా విశాఖపట్టణంలోనూ, ఉత్తరాంధ్ర అంతటా విశాఖ రాజధాని కావాలన్న నినాదం ఊపు అందు కుంది. విశాఖతోపాటూ, వివిధ పట్టణాలలో దీనికి సంబం ధించిన సదస్సులు, ర్యాలీలు, సభలు జరుగుతున్నాయి. అలాగే రాయల సీమలో కూడా ఇదే తరహా ఉద్యమాలు వచ్చాయి. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీనే దీనికి నిద ర్శనం అని చెప్పాలి. కర్నూలు తదితర పట్టణాలలో కూడా శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాయలసీమకు ఇవ్వాలన్న డిమాండ్‌కు ప్రజల నుంచి విశేష మద్దతు వస్తోంది.
నిజానికి విశాఖ రాజధాని అయితే మొత్తం రాష్ట్రానికి ప్రయోజనం. తాజాగా అక్కడ ప్రధాని మోదీ పలు భారీ కార్య క్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఐటీ పరిశ్రమ కూడా అక్కడ పెరగడానికి ఆస్కారం ఉంది. రాజధాని విషయంలో చంద్ర బాబు చేసిన తప్పును సరిచేయడానికి జగన్ సంకల్పించారు. అమరావతిని సైతం అభివృద్ధి చేస్తామని ఆయన చెబుతున్నారు. తమ ప్రతిపాదన మూడు ప్రాంతాల సమతుల అభివృద్ధికి ఉప యోగపడుతుందని ఆయన వివరిస్తున్నారు.
కాగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఒక చిత్రమైన తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి శాసనం చేసే హక్కులేదనీ, ఆరు నెలల్లో రాజధాని నిర్మించాలనీ హైకోర్టు వ్యాఖ్యా నించడంపై వివిధ వర్గాలలో వ్యతిరేకత వచ్చింది. ఏపీ శాసన సభ సైతం ఈ తీర్పును వ్యతిరేకిస్తూ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తాను వెళ్లి విశాఖలో కూర్చుంటాననీ, తానెక్కడ ఉంటే మంత్రులూ, ప్రభుత్వ కార్యదర్శులూ అక్కడే ఉంటారనీ, అప్పుడు అదే రాజధాని అవుతుందని అంటున్నారు. ఏదో రకంగా ఈ సమస్యకు సత్వర పరిష్కారం వస్తే మంచిదని చెప్పాలి.
కొమ్మినేని శ్రీనివాసరావు
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment