అభిప్రాయం
‘అనుచిత ఉచితాలకు నేడో రేపో భారీ మూల్యం చెల్లించడం ఖాయం’ అంటారు అమెరికన్ రచయిత విల్లీమన్. ఎన్నికల సమయంలో ఆ యా రాజకీయ పార్టీలు ఉచితాలతో కూడిన హామీలిస్తున్నాయి. అయితే పేదవారి కనీస అవసరాలు తీర్చే సముచిత ఉచితాలు కొంతకాలం అవస రమే. కానీ కేవలం అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అనుచిత ఉచితాల పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఆర్థిక సంక్షోభ సునామీలో కొట్టుకు పోవడం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సముచిత ఉచితాలతో గరిష్ఠ స్థాయిలో సంక్షేమ పథకాల రూపంలో ఏటా సుమారు రూ. 80 వేల కోట్లు వ్యయం చేసినప్పటికీ... కొందరు కోరుకున్నట్లుగా రాష్ట్రం శ్రీలంక కాలేదు.
అధికార దాహార్తితో అల్లాడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్ని కల్లో ఎలాగైనా గెలవాలనే కోరికతో అనేక అనుచిత ఉచితాలు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఇచ్చిన అనుచిత ఉచితాలను అమలు చేయడానికి యేటా మరో రూ.70 వేల కోట్ల ఖర్చవుతుంది. అంటే వీటివల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. లక్షా 50 వేల కోట్ల భారం పడుతుంది.
నిజానికి రాష్ట్రానికి పన్ను, పన్నేతర ఆదాయాలు, కేంద్ర గ్రాంట్లు అన్నీ కలిపితే ఏడాదికి వస్తోంది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు. దీనిలో ఉచితాలకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు పోతే మిగిలేది రూ. 50 వేల కోట్లు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్‌లకు ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఇవి కాక వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, వైద్యం లాంటి 21 శాఖలకు సుమారు లక్షా 30 వేల కోట్లు కేటా యించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్‌లో సుమారు 56 వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు చూపించారు. చంద్రబాబు అనుచిత పథకాలను కూడా అమలు చేయాల్సి వస్తే ఈ లోటు లక్షా 26 వేల కోట్లకు పెరుగుతుంది. ఇదే జరిగితే ఈ లోటు రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ఖాయం.
మేనిఫోస్టోలకు మాతృక 1848లో లండన్‌లో కార్ల్‌మార్క్స్– ఫ్రెడెరిక్ ఏంగెల్స్ ప్రచురించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అట్టడుగు శ్రామిక , పేద వర్గాలకు సంపద పంచడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం ఈ మేనిఫెస్టోలోని అంశాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ చేసింది ఇదే. ముందు వారి ఆర్థిక అవస రాలు తీర్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందజేశారు. దీనిలో సుమారు రూ. 2.70 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా అందజేశారు.
మోదీ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఈ పద్ధతి ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు రూ. 22 లక్షల కోట్లు బదిలీ చేయగా దానిలో పదో వంతు పైనే ఏపీలో పంపిణీ జరగడం విశేషం. ఇలా ఇవ్వడం వల్ల ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా స్థాని కంగా ఖర్చు చేయడంతో వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడింది. ఫలితంగా ఉత్పత్తి, ఉపాధి పెరిగింది. ప్రతి లావాదేవీలోనూ కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో రాబడి పెరిగింది. ఇదే మొత్తం బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల చేతికి వెళితే దానిలో అత్యధికం నల్లధనంగా మారేది.
పేదలను ఆర్థికంగా ఆదుకున్న జగన్ తర్వాత వారి సంపదను పెంచారు. సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు, లక్షన్నర గృహాలు ఉచితంగా అందజేశారు. పేదలకు ఇచ్చిన ఒక్కో ఇళ్ళ స్థలం విలువ కనీసం మూడు లక్షలు, ఇంటి విలువ పది లక్షల రూపాయల చొప్పున లెక్కిస్తే వాటి మొత్తం విలువ సుమారు పది లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర బడ్జెట్ కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. దేశంలో మరే రాష్ట్రం పేదల కోసం ఇటువంటి ఆలోచన చేయలేదు, ఇంత సంపద సమకూర్చలేదు.
రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదంటూ విపక్షాలు, వారి అనుకూల మీడియా విషప్రచారం చేశాయి. 2023–24లో దేశ జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం కాగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 16.5 శాతం. దేశంలో ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 2018–19లో స్థూల జాతీయోత్పత్తి విలువ రూ. 8.73 లక్షల కోట్లు కాగా అది 2023–24 నాటికి రూ. 16 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ. 1,54,031 నుంచి రూ. 2. 60 లక్షలకు పెరిగింది. ఈ ఐదేళ్ళలో 122 భారీ పరిశ్రమలు, 5 లక్షల చిన్న తరహా పరి శ్రమలు వచ్చాయి.
క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా సుమారు రూ. 75 లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులు జరుగుతుంటే వాటిలో ఏపీలోనే సుమారు రూ. 6 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. దేశ ఎగుమతుల్లో 10.42 శాతం ఏపీ నౌకాశ్రయాల నుంచే జరుగుతున్నాయి. సామాజిక రంగ వ్యయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోక్, పొగాకు, మత్స్య ఉత్పత్తులు, పండ్ల తోటల విస్తీర్ణం, పౌల్ట్రీ , ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య , సినిమా హాళ్ళు, ఇంజనీరింగ్ టాలెంట్ తదితర రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది.
దేశంలో అతి తక్కువ నిరుద్యోగం (4.2 శాతం) ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కాని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవంటూ ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. దానికి ఉదాహరణ రాష్ట్రంలో పెరిగిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలే. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2019లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలుంటే అవి 2024 నాటికి 60,73,000కు పెరిగాయి. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా కొత్తగా 18 లక్షల ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరారు. ఇదో జాతీయ రికార్డు.
దేశంలో అత్యధిక సంఖ్యలో ఏడు వందలకు పైగా పౌర సేవలందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12 కోట్ల పౌర సేవా అర్జీలను పరిష్కరించి జాతీయ రికార్డు నెలకొల్పింది. నిజానికి ఈ ఐదేళ్ళలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. జగన్ ప్రభుత్వం మేనిఫోస్టోను పవిత్ర గ్రంథంగా భావించి త్రికరణ శుద్ధిగా అమలు చేసిందనడంలో సందేహం లేదు. గతంలో పసుపు– కుంకుమ వంటి తాయిలాలను తిరస్కరించిన రాష్ట్ర ఓటర్లు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం– జనసేన కూటమి అనుచిత ఉచితాల వలకు చిక్కే అవకాశం కనిపించడం లేదు.
వి.వి.ఆర్. కృష్ణంరాజు
వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్
మొబైల్: 89859 41411
Comments
Please login to add a commentAdd a comment