samanya
-
సమానత్వ సాధనను అడ్డుకునేందుకే...
ఏప్రిల్ 13న తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది. భౌతిక దాడులకు దిగి, ఎన్నికల రూపంలో చేయాల్సిన పోరాటాన్ని ఆయుధ పోరాటంగా మార్చిన వ్యక్తులు ఒక అనాగరిక సాంప్రదాయానికి మళ్ళీ తెరతీశారు. కేవలం ఆయనకు వున్న ప్రజాదరణ చూసి, మళ్లీ ముఖ్యమంత్రి కావచ్చునేమో అని ఓర్వలేక వారు అలా దాడి చేశారా? అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఇదే ఏప్రిల్ నెలలో హత్య కావించబడ్డారు. సామాన్య ప్రజలతో కలిసిపోయి వారిలో ఒకడిగా సంభాషణ చేయగల సామర్థ్యం, సాటి మనిషిపై సహానుభూతి ఆయన ప్రధాన లక్షణాలు. శ్వేత జాతీయుడయినప్పటికీ నల్ల జాతీయుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేశారు. అంతర్యుద్ధం తర్వాత దేశాన్ని సమానత్వం ప్రాతిపదికగా పునర్ నిర్మించాలని సంకల్పించారు. బానిసత్వ నిర్మూలన, ఆఫ్రికన్ అమెరికన్లకు భూమి హక్కులు, ఓటు హక్కు కల్పించడం అందులో ముఖ్యమైన అంశాలు. ఆధిపత్య శ్వేత జాతీయ దురహంకార రాష్ట్రాలు అంతర్యుద్ధం తీసుకువచ్చినా వెనకాడలేదు. ‘మనుష్యులందరూ సమానంగా సృష్టించ బడ్డారు’ అని నినాదమిచ్చారు. యూనియన్ విక్టరీ తరువాత శ్వేత జాతీయుల నాయకుడు రాబర్ట్ ఇ. లీ లొంగిపోయిన అయిదు రోజులకు 1865 ఏప్రిల్ 14న సాయంత్రం లింకన్ వాషింగ్టన్ డి.సి.లో నాటకం వీక్షించడానికి సతీ సమేతంగా వెళ్ళారు. జాన్ విల్కిస్ బూత్ అనే నటుడు, శ్వేతజాతి ఆధిక్యతావాది లింకన్‌ను వెనక నుండి అతి దగ్గరగా కాల్చాడు. మనుషులందరూ సమానమే అని లింకన్ చేసిన ప్రకటన, ఆయన చర్యలు, శ్వేతజాతి దురహంకారి అయిన జాన్ విల్కిస్ బూత్‌ను అలజడికి గురి చేశాయి. బానిసలు తమతో సమానంగా, ఆత్మ గౌరవంతో బతకడం అనే ఆలోచన నిద్ర లేకుండా చేసింది. లింకన్‌ను భౌతికంగా నిర్మూలిస్తే తప్ప నల్ల జాతీయులను అణిచి ఉంచలేమని అతనికీ, అతని తరఫు వారికీ అనిపించింది. జాన్ విల్కిస్ బూత్ కాల్చిన తూటా లింకన్ ప్రాణాలను బలి తీసుకొంది. 1865 ఏప్రిల్ 15న లింకన్ కన్నుమూశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ‘ఒక సమాజం విద్యలో సాధించిన పురోగతే ఆ సమాజపు అభివృద్ధిని నిర్ణయిస్తుంది’ అంటారు. జగన్ ఆ సత్యాన్ని పట్టుకున్నారు. అందుకే తన దృష్టిని ప్రధానంగా విద్యపై కేంద్రీకరించారు. మనది ‘పేదవాడు పెత్తందారుపై చేస్తున్న పోరాటం’ అని నినాదం ఇచ్చారు. పేదవాళ్ళు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ మీడియంలో చదవాలని సంకల్పించారు. డబ్బున్న వాళ్ళలాగే పేదవాళ్ళు కూడా విదేశాలకు చదువుల కోసం వెళ్లొచ్చని విదేశీ విద్యకు అవకాశం కల్పించారు. గుడ్లు పెట్టడానికంటే ముందే తల్లిపక్షి గూడు కడుతుంది. ఆ జాగ్రత్త స్త్రీ సహజ లక్షణం. అది గ్రహించినవాడు కనుకనే పిల్లలకు చదువు కోసం డబ్బులిచ్చినా, ఇళ్ల స్థలాలిచ్చినా జగన్ ఆ ఇంటి తల్లికి ఇస్తున్నారు. స్త్రీ పేరిట ఇస్తున్నారు. దీనినే స్త్రీవాదం అని మేధావులు పిలుస్తారు. ఏ రోగమో రొష్టో వచ్చినపుడు ఆసాముల దగ్గర చేయి చాచకుండా ప్రభుత్వ రూపంలో ఆదుకుంటూ డబ్బున్నవాడి పక్క బెడ్డులోనే చికిత్స తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. జగన్ చేపడుతున్న ప్రతి కార్యక్రమం, పేదవాడిని పెత్తందారుల సంకెళ్ళనుండి విడిపించేదే! అబ్రహాం లింకన్ సమయంలోనే కాదు, ఇప్పుడు కూడా పేదలు గుండెల నిండా ఆత్మగౌరవంతో తల ఎత్తి నిలబడితే పెత్తందార్లకు కడుపు మంట. ‘ఎవరయినా ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా?’ అని హేళనగా మాట్లాడిన చంద్రబాబు లాంటివారికి, పెత్తందార్లకు కాపు కాసే నటులకు, వారికి మద్దతునిస్తూ భౌతిక దాడులకు దిగిన అనుయాయులకు, ప్రధానంగా జగన్ సమానత్వ ఎజెండా మీదే ఆక్రోశం. ఇది కాకతాళీయమే కావొచ్చు... నటుడు జాన్ విల్కిస్ బూత్ ఏప్రిల్ 14న లింకన్ మీద తూటా పేల్చాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో పెత్తందార్లు, నటులు... పేద ప్రజల నాయకుడు జగన్ మీదజుజ ఏప్రిల్ 13న రాయి విసిరారు. జాన్ విల్కిస్ బూత్ తూటా లక్ష్యం కేవలం లింకన్‌ను భౌతికంగా నిర్మూలించడం కాదు, లింకన్ సమానత్వ ఎజెండాను సమాధి చేయడం. అలాగే పేద ప్రజల పక్షపాతి జగన్ మీదకి ఈ పెత్తందార్లు విసిరిన రాయి లక్ష్యం జగన్‌ను కేవలం భౌతికంగా గాయపరచడం కాదు, ప్రగతి పథంలో సాగుతున్న జగన్ ప్రయత్నాన్ని స్తంభింపజేయడం! లింకన్ మరణం ఆఫ్రికన్ అమెరికన్ సమానత్వ ఆకాంక్షలను వంద సంవత్సరాలు ఆపగలిగింది. ఇప్పుడు ఈ పెత్తందారులు జగన్‌పై విసిరిన రాయి, మంచి చదువులు చదువుతూ అభివృద్ధి వైపు పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్‌ను ఏం చేస్తుందో చూడాలి! సామాన్య వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి -
ఆ విషయంలో సిగ్గెందుకు!
ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకుంది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికిది నిదర్శన. ‘‘అవును నా చేతిలో ఉన్నది ప్యాడ్ – నేను సిగ్గుపడాల్సింది ఏమీ లేదు... అది చాలా సహజమైనది! పీరియడ్’’ అని ట్వీట్ చేశారు దీపికా పదుకొనె, ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకుంటూ. ‘ప్యాడ్ మ్యాన్’ ఈ నెల 9వ తేదీ విడుదలవుతున్న అక్షయ్ కుమార్ సినిమా. అరుణాచలం మురుగనంతం జీవితాన్ని ఇది మనకు చూపిస్తుంది. అరుణాచలం తమిళనాడుకి చెందిన వ్యక్తి. తన భార్య నెలసరి రోజులలో పాత గుడ్డముక్కలు, కాగితాలు వాడటం చూసి కలత చెంది, దానికో పరిష్కార మార్గం చూపించాలని భావించాడట. ఈ పరిశోధనలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. విదేశాలనుంచి దిగుమతి అయ్యే శానిటరీ నాప్కిన్ తయారీ మెషీన్ విలువ మూడున్నరకోట్లు. ఇంత ఖరీదైన మెషీన్‌తో ప్యాడ్లు తయారు చేయడం వలన మార్కెట్‌కు చేరేప్పటికీ ప్యాడ్ ఖరీదు పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతుందని గ్రహించాడు. చివరికి అన్ని అడ్డంకులనూ అధిగమించి రూ. 65 వేలకే వచ్చే ప్యాడ్ ఉత్పత్తి మెషీన్‌ను ఆయన కనుగొన్నాడు. పైగా ఆ మెషీన్‌ను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకు మాత్రమే అమ్ముతానని భీష్మించుకున్నాడు. ఈయన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న 100 మంది వ్యక్తులలో ఒకరని టైం మేగజైన్ ప్రకటిం చింది. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సన్మానించింది. ఇండియాలో అధిక శాతం ప్రజలు అల్పాదాయ వర్గాల వారే. వారికి మార్కెట్లో దొరికే ప్యాడ్లను కొనగలిగే స్థోమత ఉండదు. 2016లో చేసిన ఒక పరిశోధన ప్రకారం దేశంలో 84% అమ్మాయిలూ, 92.2% శాతం తల్లులూ ఇప్పటికీ నెలసరి సమయంలో గుడ్డని వాడుతున్నారు. వారిలో కొందరే ఆ గుడ్డని ఎండలో ఆరబెడుతున్నారు. ప్రభుత్వ సర్వే ప్రకారం మనదేశంలో కేవలం 12% మంది మాత్రమే ప్యాడ్లు వాడగలిగే స్థితిలో ఉండటం వలన 37.8% పెళ్లి కాని పిల్లలు యోని దగ్గర దురదతో, దుర్వాసనతో బాధపడుతున్నారు. స్త్రీలను అమితంగా బాధించే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (ఆర్టీఐ)కి, సర్వైకల్ కేన్సర్‌కు 70% కారణం నెలసరి సమయంలో శుభ్రమైన ప్యాడ్లు వాడకపోవడమేనని 97% మంది గైనకాలజిస్టులు అఇ నీల్సన్ సర్వేలో చెప్పారు. మహిళలకు ఏమీ చేయడంలేదనిపించుకోకుండా ప్రభుత్వం 2011లో రుతు సంబంధమైన శుభ్రతా పథకం (ఎమ్హెచ్ఎస్)ని ప్రారంభించి, 100 కోట్లను కేటాయించింది. అయితే ఈ కార్యక్రమం గురించి నెల్లూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్ని అడిగినపుడు ఆమె తన అనుభవాలను పంచుకున్నది. రెండేళ్ల క్రితం ఒకే ఒకసారి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం క్రింద (ఆర్కెఎస్కె) గ్రామాలలో ప్యాడ్లు పంచడం జరిగిందట. ప్యాకెట్టు విలువ రూ. 6లు. అందులో ఆశా వర్కర్‌కి రూపాయి. మరి గ్రామాలలో స్పందన ఎలా ఉండింది అంటే ‘‘చాలా బాగుండిందమ్మా. రేటు తక్కువ కాబట్టి ‘కౌమార బాలికలు’ ఉత్సాహంగా కొన్నారు’’ అన్నది. ‘కానీ అంత రేటు పెట్టి కొనగలిగే స్థోమత తమకు లేద’ని 83% మంది దిగువ తరగతి వారు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఆడవారి రుతుస్రావం చుట్టూ నొప్పుల బాధలు ప్రకృతి ఎలాగూ పెట్టింది. అది కాక రోగాలు రాకుండా శుభ్రతను పాటించాలంటే నెలనెలా ఖర్చు పెట్టాల్సి రావడం చాలామందికి స్థోమతకు మించిన బాధ. అలాంటిది ప్రభుత్వం సానిటరీ ప్యాడ్లను 12% జీఎస్టీలోకి నెట్టడం ఇంకా బాధాకరం. ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థిని జర్మినా ఇస్రార్ ఖాన్ గత ఏడాది ఈ 12% ట్యాక్స్ రాజ్యాంగ విరుద్ధమూ, అన్యాయమూ అని ఢిల్లీ కోర్టులో కేసు వేసినా ప్రభుత్వం చలించలేదు. ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయాలనే డిమాండ్‌కి స్పంది స్తూ అరుణ్‌జైట్లీ ‘12 శాతాన్ని తగ్గించినట్లయితే... భారతీయ ఉత్పత్తిదారులు ఎవరూ మిగలరు’ అని వ్యాపార సూత్రాన్ని చెప్పారు. ఈ జనవరి 22న సుప్రీం కోర్టు ముంబై ఢిల్లీ కోర్టులలో ఉన్న ఈ కేసు ప్రొసీడింగ్స్‌పై స్టే విధించి, దీన్ని తన పరిధిలోకి తీసుకోవడంపై పరిశీలిస్తానని పేర్కొన్నది. ‘తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వ శాఖ’ వారు 2015లో విడుదల చేసిన ‘రుతుసంబంధమైన ఆరోగ్య నిర్వహణ మార్గదర్శకాలు’ చదువుతూ, నేను నా కూతుర్ని ‘మీ స్కూల్ లో ప్యాడ్స్ ఎలా వాడాలో ఎప్పుడన్నా చెప్పారమ్మా’ అని అడిగాను. నా కూతురు ‘అవంతా చెప్పలేదమ్మా, ఎక్కడ పడేయాలో మాత్రం చెప్పారు అంటూనే, ఆ.. ఇంకా మేల్ స్టాఫ్‌తో మాట్లాడొద్దని కూడా చెప్పారమ్మా’ అన్నది. ఆడపిల్లల్ని మగవాళ్ళకి దూరంగా ఉంచి పద్దతిగా పెంచడంలో ఉండేంత శ్రద్ధ.. వాళ్ల బడి వాళ్లకు ఆ పిల్లల శుభ్రత మీద లేదు. దీని వెనుకనున్న భావజాలం పేరు పితృస్వామ్యం. ప్రభుత్వం బొట్టు, గాజులు, పారాణి వంటి సౌభాగ్య చిహ్నాలను అడగకుండానే ట్యాక్స్ ఫ్రీ చేసింది కానీ, స్త్రీలు నోరు తెరిచి అడిగినా ప్యాడ్లను ట్యాక్స్ ఫ్రీ చేయకుండా భీష్మించుకున్నది. పాలకుల పురుషస్వామ్య దృక్పథానికి ఇది నిదర్శన. దీపికా వంటి సెలెబ్రిటీలు ప్యాడ్ మ్యాన్ చాలెంజ్ తీసుకోవాల్సింది, ప్యాడ్‌ని ప్రదర్శించడానికి కాదు, వీటన్నిటి గురించీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి తీసుకోవాలి, అప్పుడే అరుణాచలంపై సినిమాకి ఒక అర్థం ఉంటుంది. - సామాన్య వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి ‘ 80196 00900 -
ధిక్కారం మానవ స్వభావం
అభిప్రాయం దాదాపు 2400 ఏళ్ల క్రితం సోఫోక్లీస్ వ్రాసిన నాటకం ‘‘యాంటిగొని’’. ఈడి పస్ కుమారులిద్దరూ రాజ్యాధికారం కోసం పరస్పరం చేసుకొన్న యుద్ధంలో మరణించాక సింహాసనాన్ని అధి రోహించిన రాజు క్రియాన్, ఆ సోదరులలో ఒకరైన పోలినైసిస్ శవానికి ‘‘ఖననం చేయకూడదని, కాకులకు, గద్దలకు, పురుగులకు వదిలివేయాలనే’’ శిక్షను విధిస్తాడు. తన సోదరునికి విధించిన మరణానంతర శిక్షను పోలినైసిస్ సోదరి యాన్టిగోని తీవ్రంగా గర్హిస్తుంది. ఖనన సంస్కారం చేద్దాం రమ్మని తన సోదరి ‘‘ఇస్మీని’’ని పిలుస్తుంది, అందుకు ఇస్మీని సమ్మతించక పర్యవసానాన్ని వివరించి హెచ్చరిస్తుంది. అప్పుడు యాన్టిగొని అంటుంది ""if i have to die for this pure crime/i am content, for i shall rest beside him'' అంటుంది. ""the city is the king''s అంటూ రాజద్రోహ నేరానికి గాను గృహంలో బంధించి చనిపోయేలా చేయాలని క్రీయాన్ శిక్ష విధిస్తే దాన్ని కూడా ధిక్కరిస్తూ ఉరి వేసుకొని చచ్చిపోతుంది. క్రీ.పూ 4వ శతాబ్దానికి చెందిన సోక్రటీస్‌ను ‘‘దైవ ధిక్కారము, యువతను కలుషిత పరచడం’’ అనే నేరాలను ఆరోపించి ఖైదు చేసినపుడు పారిపోయే అవకాశముండీ, తను ఏమయితే చెప్పేడో వాటి మీదే నిలబడుతున్నానని చెపుతూ విషాపానం చేసి మరణ శిక్షను స్వీకరించాడు. "my kingdom is not of this world''అని క్రీస్తు అన్నప్పటికీ ‘‘నా రాజ్యము’’ అన్న మాటే రాజధిక్కారంగా పరిగణించి సిలువనెక్కిస్తే, క్రీస్తు ‘‘బిడ్డలారా నాకోసం ఏడవకండి మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి’’ అన్నాడే కానీ దేవుని రాజ్యము మిధ్య అని సిలువ శిక్షను తప్పించుకోలేదు. అన్ని వేల ఏళ్ళ క్రితం కూడా మనిషి రాజ ధిక్కార లేదా దేశ ధిక్కార నేరం విధిస్తే శిక్షను అనుభవించాడే కానీ తన భావాన్ని వ్యక్తపరచకుండా వెనుకకు తగ్గలేదు ఎందుకని? ఎందుకంటే భావ వ్యక్తీకరణ అనేది మానవ హక్కులకు పునాది వంటిది. అది మనిషి స్వభావంలో ఒక భాగం, ఆ హక్కును కాపాడు కోవడానికి మనిషి ప్రాణాలను సైతం అర్పిస్తాడు. అది లేని నాడు జార్జ్ వాషింగ్టన్ చెప్పినట్లు ‘‘వధ్యసిల మీదకు వెళుతున్న గొర్రెల’’లాగే మనిషి తనను భావించుకుంటాడు. కన్హయ్య కుమార్ మరియు జేఎన్‌యూ విద్యార్థులు చేసింది భావ ప్రకటన మాత్రమే. ‘‘ప్రతి మనిషికి తన రాజ్యాంగ హక్కులతో పాటు దేశంలో సమాన హోదా కల్పించినప్పుడే అది న్యాయమంటాం, మేం మీ దోపిడీ సంస్కృతిని నాశనం చేయాలనుకుంటున్నాం’’ అని వాళ్లు అన్నారు. అలా అనడానికి కన్హయ్యకే కాదు ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ హక్కు వుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, చర్చించుకునే హక్కుని ఈ రాజ్యాంగం కల్పించింది. భావప్రకటన ఎన్నటికీ దేశ ద్రోహం కాదు. ‘‘ఆలోచనల మీద ఆంక్షల ఆమ్ల వర్షం కురిపించే’’ రాజ్యాలు, ప్రభుత్వాలు కుప్పకూలిన దాఖలాలే చరిత్ర నిండా. అయినా అసలు దేశభక్తి అంటే ఏమిటి? పార్లమెంటులో ఇంత పెద్ద రవీంద్రుని విగ్రహం పెట్టుకున్నారు కదా. ఆయన ‘‘జాతీయత అనేది ఒక పెద్ద విపత్తు.. భారతదేశపు అన్ని సమస్యలకి ఇదే మూల కారణం అయి ఉన్నది. నా దేశ వాసులు మానవీయత కంటే దేశం గొప్పదనే భావనకు వ్యతిరేకంగా పోరాడి నిజమయిన దేశాన్ని పొందుతారని ఆశ పడుతున్నా’’ అని విశ్వ మానవతను గురించి అన్న మాట వీరికి తెలి యదా? ప్రశ్న మొలకెత్తినపుడు, నిరసన స్వరం జ్వలించినపుడు కారణాలు తెలుసుకొని పరిష్కా రం వెదకడం సముచితం కదా? అణచిన స్వరం అలాగే ఉండిపోదు. అలా ఉండిపోక పోవడానికి నాగరికత అని పేరు. ప్రశ్న లేకపోతే జ్ఞానం విస్తృతి పొందదు. నాగరికత ముందుకూ పోదు. చిన్నప్పుడు నేనో కథ విన్నాను, ఒక అడవిలో ఒక యేరు వుంది ఒకరోజు ఒక మేక పిల్ల అక్కడికి నీరు తాగడానికి వచ్చింది. అంతలోకి ఒక పులి కూడా అక్కడికి వచ్చింది. ఏటికి పైన పులి నీరు తాగుతుంది. క్రింద మేకపిల్ల తాగుతుంది. కాసేపటికి పులి ‘ఓ మేకా నిన్ను తినేస్తా’ అన్నది. మేక ఆశ్చర్యపడి ‘నేనేం తప్పు చేసానని తినేస్తావు’ అన్నది. అందుకు పులి ‘నువ్వు నా నీళ్ళు ఎంగిలి చేసావుకదా’ అని బదులిచ్చింది. ‘పులీ నువ్వు పైన తాగుతున్నావ్. నేను క్రింద తాగుతున్నా. ఎంగిలెలా చేయగలను’ అన్నది మేక పిల్ల. అప్పుడు పులి ‘ఇప్పుడు కాదు, నువ్వు కడుపులో వున్నప్పుడు మీ అమ్మ ఎంగిలి చేసింది’ అని ఆ చిన్ని మేక పిల్లను తినేస్తుంది. మొన్నటి వరకు నాకో సందేహం వుండేది ఈ కథ గురించి. పులి కదా శుభ్రంగా తినేయక సాకులు ఎందుకు వెదికింది అని. కన్హయ్య సంఘటనతో సందేహం తీరిపోయింది. ఏమంటే అప్పుడు ఆ పులి ప్రజాస్వామ్య ప్రభుత్వమున్న ఒకానొక అడవికి ‘నాయకుడి’గా ఉండింది. - సామాన్య వ్యాసకర్త రచయిత్రి మొబైల్: 80196 00900 -
రోజానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
సందర్భం సామాన్య ‘‘మహిళలు తమ విద్య, శక్తి సామర్థ్యాలను ముఖ్యమైనవి గా గుర్తించి, వాటిని ఉపయో గించడం ప్రారంభిస్తే చివరికి వారు పోటీపడాల్సివచ్చేది పు రుషులతోనే’’ (బెట్టీ ఫ్రిడాన్, సెకండ్ వేవ్ ఫెమినిస్ట్). ఈసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో ప్రతి పక్ష మహిళా సభ్యురాలు రోజాపై జరిగిన దాడి అసాధా రణమైనది. ఎందుకంటే ఆ దాడిలో రాజకీయ విద్వేషం కంటే ‘మగరాయుడి’లా ప్రవర్తించే ఒక ‘ఆడదానికి’ బుద్ధి చెప్పాలనే పితృస్వామిక ప్రతీకార వాంఛ బలంగా కనిపించింది. దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే చట్ట సభల్లో వినవస్తున్న స్వత ంత్ర మహిళా గళాలను నొక్కేసే ప్రమా దం ఈ ధోరణిలో ఉంది. అందుకే ఇది రాయాల్సి వస్తోం ది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేగా సభా సమావేశాల్లో పాల్గొంటున్న రోజాను ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారు? అవును,‘టార్గెట్’ చేస్తున్నారని నేను సరైన పదమే వాడా ను. ‘ఐరన్ లెగ్’ అనే మూఢ విశ్వాస పద ప్రయోగమూ, ‘లేడీ విలన్’ అనే పురుషాహంకారపు ఉక్రోషం ఎందు కు? రోజా మగవాళ్లకి దీటైన ప్రతిభ, వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి, విషయ పరిజ్ఞానంగల నేత కాబట్టి. అంతకుమించి పితృస్వామ్యపు సంకెళ్లు బంధించలేని స్వేచ్ఛా భావజాలం గలిగిన స్త్రీ కావడం వల్ల ఆమె టార్గెట్ అవుతోంది. సరిగ్గా చెప్పాలంటే పితృస్వామిక ఆధిపత్యపు వ్యవస్థీకృత స్వభావమే రోజాని టార్గెట్ చేస్తోంది. రోజా కన్నీరు పెట్టడాన్ని పదేపదే చూపి మురిసిన మీడియాకు ఆమెను ‘ఐరన్ లెగ్’ అంటూ అదేపనిగా అనాగరికంగా తూలనాడటం పట్టకపోవడంలో ఆశ్చ ర్యం లేదు. కానీ నిండు సభలో ఒక స్త్రీని టార్గెట్ చేసి దాడి చేస్తుంటే తోటి మహిళా ప్రజాప్రతినిధులలో ఒక్క రైనా ఎందుకు ఖండించలేకపోయారు? మనం ఉన్నది వ్యవస్థీకృత పితృస్వామ్య సమాజంలో కాబట్టి. స్త్రీవాది ఉమా చక్రవర్తి చెప్పినట్టు ఈ సమాజంలో స్త్రీలను నియంత్రించే విధానం మూడు భిన్న స్థాయిలలో, మూడు భిన్న సాధనాల ద్వారా అమలవుతుంది. మొద టిది ‘భావజాలం’. అణిగిమణిగి ఉండటం, మౌనంగా ఉండటం, త్యాగం తదితరాలన్నీ స్త్రీత్వపు సుగుణాలని నూరిపోశారు. ఇంట్లోనైనా, వీధిలోనైనా, శాసనసభలో నైనా, మరెక్కడైనా స్త్రీ తండ్రి చాటు కూతురిగా, భర్త చాటు భార్యగా అణిగిమణిగి ఉండాల్సిందే. విషయ పరి జ్ఞానమే లేకుండా ‘‘ఆమె (రోజా) వ్యవహారశైలిని ఒక్క మహిళ సపోర్ట్ చేసినా రాజీనామా చేసి బయటకి వెళ తాను’’ అని తానే స్త్రీలందరి ప్రతినిధినంటూ నిలిచిన కిమిడి మృణాళిని లాగానో లేదా పచ్చి పితృస్వామ్య భావజాలంతో రోజాపై విరుచుకుపడ్డ పీతల సుజాత లాగానో ప్రవర్తిస్తే అది ‘స్త్రీ సహజం’. అలాంటి వారిని శాసనసభ్యులు సహా పురుషులంతా మర్యాద, మన్నన ఎరిగిన, పద్ధతిగల స్త్రీలుగా గుర్తిస్తారు. దీనినే ‘‘పితృవా త్సల్య పూర్వక అధికారంతో కూడిన పితృస్వామ్య రూపం’’ అంటారు గెర్డా లెర్నర్. రోజా, తనని ‘విలన్’ అంటున్న నేతల భావజాల దాడినే కాదు, ‘వాత్సల్యం’ మాయా బంధనాలను కూడా బద్దలు కొట్టుకుని బయ టకి వచ్చారు. పురుషులతో సమంగానూ, వారిని అధిగ మించీ ఎదిగే స్త్రీల మీద, ఆర్థిక, సామాజిక ప్రయోజనా లలో భాగస్వామ్యానికి పోటీపడే స్త్రీల మీద పురుషులు లైంగికపరమైన దాడులకు సైతం దిగుతారు, ‘‘స్త్రీత్వపు ఎర’’ వేయడమే స్త్రీ విజయానికి కారణమని ప్రచారం కూడా చేస్తారు. అలాంటి దాడులకు తిరుగులేని సమా ధానంగానే రోజా ‘‘నన్ను రేప్ చేసే ధైర్యం లేదు’’ అనేసి ‘అబల’గా కాక దైర్యంగల మనిషిగా నిలిచింది. చిన్న సమస్యలకు కూడా క్రుంగిపోయి ఆత్మహత్యలకు మళ్లే అమ్మాయిలు రోజా ప్రదర్శించే ఆ ధైర్యాన్ని గమనిస్తే మంచిది. శాసనసభలో రోజా ప్రవర్తన అసభ్యకరమని అం టున్న వాళ్లు అలాంటి పరిణామాలకు ప్రేరేపించిన ఘట నలను ఎందుకు టెలికాస్ట్ చేయడం లేదు? ‘‘దమ్ము ధైర్య ముంటే అన్నిటినీ టెలికాస్ట్ చెయ్యాలి’’ అన్న ఆమె సవాలుని స్వీకరించరేం? రోజాదే తప్పయితే ప్రజలే ఆమెను తప్పు పడతారుగా? రోజాకి కుల పిచ్చి ఉందా? ఉంటే మరో కులం ఆధిపత్యం ఉందంటున్న పార్టీలో రాజకీయ అరంగేట్రం ఎందుకు చేస్తారు? అని కూడా వారే ఆలోచిస్తారు. నేటి సమాజంలో దళితులూ, మహి ళలూ ఇద్దరూ అణచివేతకు గురవుతున్నవారే. పురుషా ధిక్యతను ధిక్కరించే రోజాని లొంగదీయడానికి దళిత నేత్రి పీతల సుజాతని ప్రయోగించడం ‘నీ వేలుతో నీ కంటినే పొడవడ’మనే రాజకీయం కావచ్చేమో. కానీ అది ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టాన్ని పలచన చేస్తుంది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి పీతల సుజాత లాంటి వారు ఈ విషయాన్ని లోతుగా ఆలోచించాలి. అధిక సంఖ్యలో స్త్రీలు రాజ్యాధినేతలుగా ఉండ టం దక్షిణాసియాలోనే సాధ్యమయింది. సంప్రదాయక మైన ‘స్త్రీ’ గుర్తింపుని అధిగమించి ప్రతిభా ప్రతిపత్తులు, శక్తిసామర్థ్యాలుగల మనుషులుగా, దక్షతగల నేతలుగా వర్తమాన భారతంలో మమతా బెనర్జీ, మాయావతి, జయలలిత, రేణుకా చౌదరి వంటి వారు ప్రజల గుర్తిం పును పొందారు. దృఢమైన నాయకులుగా మన్నన పొం దారు. రోజా కూడా ఆ కోవకే చెందుతుంది. మంచి నాయకురాలిగా ఎదగటానికి అవసరమైన అన్ని దిను సుల మేళవింపు ఆమె. సామ్యవాదం, అస్తిత్వ రాజకీ యాలు, మానవ హక్కులు వంటి అంశాలపై తగు అవ గాహన, సైద్ధాంతిక స్పష్టత కూడా తోడైతే దేశానికి ఆమెలో ఒక మంచి నాయకురాలు దొరుకుతుంది. ఆమెపై దాడి చేస్తున్న పురుష పుంగవులకు ఈ విషయం బాగానే అర్థమైంది. అందుకే ఈ ఉలికిపాటు. (వ్యాసకర్త రచయిత్రి, ఫోన్ నం: 8019000900)