
జువాన్ గైడో, నికోలస్ మదురో (ఇన్‌సెట్లో డొనాల్డ్ ట్రంప్)
వెనిజులాను తోలు బొమ్మను చేసి అమెరికా అధికారం చెలాయించాలని చూస్తోంది.
కారకస్ : ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. అమెరికా గుర్తించడం పట్ల ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో ఘాటుగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికాతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని పేర్కొన్నారు. 72 గంటల్లోగా అమెరికన్ ప్రతినిధులంతా తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ ఆయన హెచ్చరించారు. వెనిజులా అధ్యక్షుడిగా మదురో గతేడాది మేలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మదురో పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న కారణంగా ఆయనను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా నిరాకరించింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత జువాన్ గైడోను అసలైన అధ్యక్షుడిగా గుర్తిస్తున్నామంటూ పేర్కొంది. ఈ మేరకు.. ‘ వెనిజులా ప్రజలు మదురో పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా నేను ఈ రోజు అధికారికంగా గుర్తిస్తున్నాను’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
ఈ నేపథ్యంలో అగ్రరాజ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో బుధవారం తన మద్దతుదారులతో కలిసి అధ్యక్ష భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిగా.. అమెరికాతో దౌత్యపరమైన, రాజకీయ ఇలా అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించాను. దేశ ప్రజల ముందు, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ విషయం తెలియజేస్తున్నాను. గెట్ అవుట్.. వెనిజులాను వదిలి వెళ్లండి. మాకు ఆత్మగౌరవం ఉంది.. డ్యామిట్’ అని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులాను తోలు బొమ్మను చేసి అమెరికా అధికారం చెలాయించాలని చూస్తోందని ఘాటుగా విమర్శించారు.
కాగా దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఇక ప్రతిపక్ష నేత జువాన్‌ను అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడాన్ని కొలంబియా కూడా సమర్థించింది.
The citizens of Venezuela have suffered for too long at the hands of the illegitimate Maduro regime. Today, I have officially recognized the President of the Venezuelan National Assembly, Juan Guaido, as the Interim President of Venezuela. https://t.co/WItWPiG9jK
— Donald J. Trump (@realDonaldTrump) January 23, 2019