ఆరుగురు విదేశీయుల అరెస్టు: వెనిజులా
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్‌తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు.
ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు.
వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
– కారాకస్
Comments
Please login to add a commentAdd a comment