ఫార్మాపై వెనెజులాతో భారత్ చర్చలు | Pharma on Venezuela in India talks | Sakshi
Sakshi News home page

ఫార్మాపై వెనెజులాతో భారత్ చర్చలు

Published Fri, Sep 23 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

ఫార్మాపై వెనెజులాతో భారత్ చర్చలు

ఫార్మాపై వెనెజులాతో భారత్ చర్చలు

* చమురు రూపంలో బకాయిల సర్దుబాటు ప్రతిపాదనపై కసరత్తు
* కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్గత సంక్షోభం, కరెన్సీ పతనం తదితర సమస్యలతో సతమతమవుతున్న వెనెజులా నుంచి దేశీ ఫార్మా కంపెనీలకు అందాల్సిన చెల్లింపులను రాబట్టడంపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. బకాయిలను చమురు సరఫరా రూపంలో సర్దుబాటు చేసే ముసాయిదా ప్రతిపాదనను వెనెజులా ప్రభుత్వం ముందుంచింది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య విభాగం డెరైక్టర్ అనిస్ జోసెఫ్ చంద్ర తెలిపారు. ఇటు దేశీయంగా ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ, ఆర్‌బీఐ తదితర వర్గాలతో కూడా ఈ అంశంపై చర్చిస్తున్నట్లు ఆమె వివరించారు.  

వెనెజులాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా సమస్య పరిష్కారంలో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఔషధాల ఎగుమతి ప్రోత్సాహక మండలి ఫార్మెక్సిల్ నిర్వహిస్తున్న ఫార్మా సీఈవోల సదస్సులో గురువారమిక్కడ పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు వివరించారు. దేశీ ఫార్మా సంస్థలకు వెనెజులా నుంచి రూ. 2,000 కోట్లు రావాల్సి ఉందని అంచనా.
 ఎగుమతుల్లో 12 శాతం వృద్ధి..: రష్యా వంటి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇతర మార్కెట్లు లోటు భర్తీ చేయగలవని, ఫార్మా ఎగుమతులు మెరుగ్గానే ఉండగలవని ఫార్మెక్సిల్ చైర్మన్, అరబిందో ఫార్మా హోల్‌టైమ్ డెరైక్టర్ మదన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఈ ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో సుమారు  10-12 శాతం వృద్ధి నమోదు కాగలదని ఆయన చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 17 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఈసారి సుమారు 19 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోగలమని ఫార్మెక్సిల్ వైస్ చైర్మన్ దినేష్ దువా పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిసారి ముంబైలో జరిగే ఫార్మా ఎక్స్‌పో ఐఫెక్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఫార్మెక్సిల్ డెరైక్టర్ జనరల్ పీవీ అప్పాజీ తెలిపారు.
 
ఫార్మా సంస్థలకు పురస్కారాలు..
సదస్సు సందర్భంగా వివిధ విభాగాల్లో ఫార్మా సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఎగుమతులకు సంబంధించి బల్క్ డ్రగ్స్ విభాగంలో (లార్జ్) అరబిందో ఫార్మా, ఫార్ములేషన్స్‌లో (మధ్య స్థాయి) హెటెరో ల్యాబ్స్ పురస్కారాలు దక్కించుకున్నాయి. ఆల్ రౌండ్ పార్ ఎక్సలెన్స్ (లార్జ్) పురస్కారాన్ని మైలాన్ ల్యాబరేటరీస్ దక్కించుకోగా, మిడ్ సెగ్మెంట్‌లో క్యాడిలా అవార్డు దక్కించుకుంది. పేటెంట్ అవార్డుల్లో ఎన్‌సీఈ/డ్రగ్ డిస్కవరీకి సంబంధించి సువెన్ లైఫ్ సెన్సైస్ పసిడి పురస్కారం అందుకోగా, బల్క్ డ్రగ్స్/ఏపీఐ విభాగంలో హెటెరో డ్రగ్స్ పసిడి, లారస్ ల్యాబ్స్ .. న్యూలాండ్ ఫార్మా రీసెర్చ్..ఎంఎస్‌ఎన్ ల్యాబ్స్ రజత పురస్కారం దక్కించుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement