కేపిటల్ సిటీ
- భవిష్యత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా విశాఖ నగరం
- రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తితో చిగురిస్తున్న కొత్త ఆశలు
- రాయితీలతో తరలిరానున్న కంపెనీలు
- ఐటీ, ఫార్మా, చమురు, పోర్టులు, సినీ, ఉత్పత్తి రంగాలకు ఊపు
సాక్షి,విశాఖపట్నం: రాష్ట్ర విభజన బాధిస్తున్నా తాజాగా వినిపిస్తున్న మాటలు విశాఖకు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. అన్ని వనరులూ ఉండి వెనుకబడిన ఈ పారిశ్రామిక నగరానికి మంచిరోజులొస్తున్నాయి. విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద నగరమైన విశాఖ అభివృద్ధిలో సింగపూర్, మలేషియాలను తలదన్నుతూ పోటీ ఇచ్చే రీతిలో ఎదగడానికి అవకాశాలు కనిపిన్నాయి. పెట్టుబడులను ఆకర్షించడంలో విశాఖ ముందంజలో ఉంటుందని ఆసోచామ్ సర్వే కూడా ఇదే అంశాన్ని తేటతెల్లం చేసింది. సీమాంధ్రకు ప్రత్యేకహోదా నేపథ్యంలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో ప్రధాన కేంద్రంగా విశాఖ ఎదుగుతుందని పారిశ్రామికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
ఇవీ ఆశారేఖలు..
సింగపూర్‌ను పోలిన వనరులు..సౌకర్యాలు విశాఖలోనూ ఉన్నాయి..చుట్టూ సముద్రం.. భారీ నౌకలుకూడా వచ్చే అవకాశమున్న రెండు రేవులు..చమురు కంపెనీలు ... 24గంటల విదేశీ కార్గో ఎగుమతులు...ఉక్కు ఉత్పత్తి పరిశ్రమలు...వేలకోట్ల ఫార్మా ఎగుమతులు..ఖండాలు దాటుతోన్న ఐటీ సేవలు..షిప్‌యార్డు ...ఏడాదిపొడవునా బారులు తీరే పర్యాటకులు.. 21లక్షల జనాభా..550 కిలోమీటర్ల విస్తీర్ణం..
ఇప్పుడు సింగపూర్ తరహాలో విశాఖ అభివృద్ధి చెందడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. విభజన తర్వాత వర్తించే ప్రత్యేకహోదా మన నగరానికి కొంత ఊపును తీసుకురానుంది. కొత్త రంగాలలో పెట్టుబడులకు ఆస్కారమేర్పడనుంది. ఇప్పుడున్న కంపెనీలు విస్తరణతోపాటు కొత్తవి,అంతర్జాతీయస్థాయి కంపెనీలు క్యూ కట్టనున్నాయి.
నగరంలో 90 ఫార్మా కంపెనీలున్నాయి. దివీస్, రెడ్డి ల్యాబ్స్,కొర్నియాస్,లీఫార్మా, అమెరికాకు చెందిన హోస్పిరా,జపాన్‌కు చెందిన ఈజాయ్,జర్మనీకి చెందిన ఫార్మా జెల్ కంపెనీలు 50వరకు భారీ ప్లాంట్‌లు నెలకొల్పాయి. రానురాను పెరుగుతున్న ఫార్మా కంపెనీలు,కొత్త యూనిట్ల కారణంగా ఎగుమతులు రెండేళ్లలో రూ.15నుంచి నూ.20వేల కోట్లకుపైగానే పెరగవచ్చు.
విశాఖలో 70కిపైగా ఐటీ కంపెనీలు,నాలుగు ఎస్ ఈజెడ్‌లున్నాయి. 10,200మందికిపైగా ఉద్యోగులు పనిచేస్తుండగా, టర్నోవర్ రూ.1450కోట్లు. అయితే ఇప్పుడు ప్రత్యేకహోదా కారణంగా భారీస్థాయిలో పన్నుల మినహాయింపు లభిస్తుందని కంపెనీలు భావిస్తున్నాయి. కొత్త కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఐటీ రంగం అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది. . విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ ఐటీ రాజధానిగా ఎదగడానికి అవకాశం ఉందని నిపుణులంటున్నారు.
ఐటీఐఆర్ వేగంగానే మంజూరు కావచ్చు. ప్రస్తుతం ఎస్‌ఈజెడ్‌ల్లో పనిచేస్తోన్న ఐటీ కంపెనీ భూములను డీ-నోటిఫై చేయడంలేదు. ఐటీ కంపెనీల ఆదాయంపై ప్రభుత్వం 18% మ్యాట్ పన్ను వసూలు చేస్తోంది. ప్రత్యేక హోదాతో కొత్త కంపెనీలకు ఈ సమస్యలు ఉండకపోవచ్చు. దీంతో వచ్చే కొన్నేళ్లలో 50కంపెనీలకుపైగా ఇక్కడ పెరగడానికి అవకాశాలున్నాయి.
విశాఖనుంచి కాకినాడకు పీసీపీఐఆర్ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇందులో చమురు అధారిత కంపెనీలు భారీగా రానున్నాయి.సముద్రతీరానికి సమీపాన వచ్చే ఈ కారిడార్‌కు ఇకపై మంచి డిమాండ్ ఏర్పడనుంది. పదిమండలాల్లో విస్తరించనున్న ఈజోన్‌లో వివిధ కంపెనీలు రానున్నాయి..పీసీపీఐఆర్ కంపెనీలకు పన్నురాయితీలు వర్తిస్తుండగా,ఇప్పుడు ప్రత్యేక హోదాతో జోన్‌కు మరింత డిమాండ్‌పెరగనుంది.
ప్రత్యేకహోదా కారణంగా పన్ను రాయితీలు పెరగనున్నందున అన్నిరకాల వ్యాపార,వాణిజ్యవర్గాలు విశాఖను గమ్యస్థాన నగరంగా ఎంచుకుంటాయని నిపుణుల అంచనా.అందుకే హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఐటీ,ఫార్మా,ఉక్కు,చమురు కంపెనీలు ఇకనుంచి విశాఖలోనూ ప్రధానసంస్థలు ప్రారంభించే అవకాశం ఏర్పడనుంది. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడకు వీటిని తరలించే యోచనలో ఉన్నారు.
ప్రత్యేకంగా ఎయిర్‌పోర్టు కూడా వచ్చే వీలుంది.ప్రస్తుత ఎయిర్‌పోర్టు నేవీ నియంత్రణలో ఉంది. 24గంటలూ విమాన సౌకర్యం ఇటీవలే కలిగింది. భవిష్యత్తులో విదేశాలకు విమానసర్వీసులు నడిపే వీలున్నందున వేరేచోట ప్రత్యామ్నాయ విమానాశ్రయం పెరగడానికి అవకాశాలున్నాయి. ఎయిర్‌పోర్టు నుంచి ఎగుమతులకు ఎయిర్ కార్గో సౌకర్యంలేదు. ప్రత్యేకహోదా ఫలితంగా పన్నుల రాయితీ పెరగడం తదితర కారణాలతో కొత్త కంపెనీలు వచ్చే వీలుంది.
వైజాగ్,గంగవరం పోర్టులకు తోడు నక్కపల్లి,భీమిలిలోను పోర్టులు రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విభజన కారణంగా సీమాంధ్రకు కొత్త ఐఐటీ,ఐఐఐటీల మంజూరుకు వీలున్నందున విశాఖలోనూ దీనిఆధారంగా కంపెనీలు పెరిగేవీలుంది.
అభివృద్ధికి ఇదే సరైన సమయం
విభజన తరువాత ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల పెట్టుబడులు భారీ స్ధాయిలో విశాఖపట్ననికి ఖచ్చితంగా రానున్నాయి. విడిపోయిన తరువాత ఆంప్రదేశ్‌కు రాజదాని విశాఖ అయినా కాకాపోయినా అద్భుతమైన ప్రగతి సాధించడానికి అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పరిశ్రమలు నిర్వహిస్తున్న వ్యాపారుల్లో అధికశాతం సీమాంధ్రులే. ఇప్పుడు వీరందరు విశాఖపై చూస్తున్నారు.పెట్రో కారిడర్ల అనూహ్యంగా విదేశీ కంపెనీలు కూడా పన్ను రాయితీ కోసం ఇక్కడకు వస్తారు. రైల్వే అనూహ్య ప్రగతి సాధించనుంది. రైల్వేజోన్ రావడం మరింత సులువవుతుంది.
- జి.సాంబశివరావు చైర్మన్, సిఐఐ, విశాఖపట్నం