తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు | Sakshi
Sakshi News home page

తీరంలో లంగరు... భవిష్యత్తు బంగరు

Published Thu, Apr 25 2024 6:54 PM

CM Jagan Reddy Lays Foundation for Ramayapatnam Port - Sakshi

ఐదేళ్ల జగన్‌ పాలనలో 4 పోర్టులకు పునాది... 

ప్రారంభానికి సిద్ధంగా రామాయపట్నం పోర్టు... 

మిగిలినవీ శరవేగంగా నిర్మాణం... 

10 ఫిషింగ్‌ హార్బర్లు...6 ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు 

వీటన్నిటికీ రూ.25,000 కోట్ల వ్యయం... 

పోర్టుల పక్కనే పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్‌ పార్కులు 

555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది జాలరులకు లబ్ధి 

రూ.9000 కోట్ల మేరపెరగనున్న జీడీపీ

సాగరమంటేనే జలనిధి...అపార మత్స్య సంపదకు పెన్నిధి... సాగర తీరాన వెలసిన రాజధానులు ఆయా రాష్ట్రాలకు ఆర్థిక సుసంపన్నతను సమకూర్చాయి..మత్స్యకారుల జీవనప్రమాణాలను పెంచాయి...వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు  నింపాయి..పరిశ్రమల స్థాపనకు పునాదులు వేశాయి...ఆయా రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలను మార్చేశాయి...

ఈ ఆలోచనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విశాఖపట్నాన్ని పాలనారాజధానిగా చేయాలన్న  గొప్ప సంకల్పానికి ప్రేరేపించింది...ఇప్పటిదాకా మనం గొప్పగా చెప్పడానికి విశాఖపట్నంలోని పోర్టు ఒక్కటే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ రంగంలో కనిపిస్తోంది... దేశంలోనే సుదీర్ఘ తీరమున్న రెండో రాష్ట్రంగా గుర్తింపు పొందీ  పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు చాలా అవకాశమున్నా ...పాలించడం చేతకాని పద్నాలుగేళ్ల చంద్రబాబు పాలన వల్ల  వాటి ఏర్పాటు సాధ్యం కాలేదు...

సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈ రోజు నాలుగు పోర్టులు, పది ఫిషింగ్‌ హార్బర్లు్ల రాష్ట్రానికి అపార సంపదనివ్వబోతున్నాయి...మత్స్యకారుల ఆర్థిక స్తోమతను పెంచబోతున్నాయి...మరెన్నో పరిశ్రమల స్థాపనకు ఈ పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు వేదికలు కాబోతున్నాయి...  రాష్ట్ర పురోగమనానికి ఇలాంటి ఆలోచన ఉన్న నేతలు ఉంటేనే నలుచెరగులా ప్రగతి లంగరు వేస్తుంది... సీఎం జగన్‌ రూపంలో రాష్ట్రానికి బంగరు భవిష్యత్తు  అద్దుకుంటోంది. – చంద్రశేఖర్‌ మైలవరపు, సాక్షి, అమరావతి 

పది ఫిషింగ్‌ హార్బర్లు...
రాష్ట్రంలోని మత్స్యకారుల సుదీర్ఘ కల సాకారమవుతోంది. ఇంతకాలం వలస కూలీలుగా  పొరుగు రాష్ట్రాలకు వెళ్లే మత్స్యకారులు ఇప్పుడు అధునాతన మెకనైజ్డ్‌ బోట్లు కొనుగోలు చేసుకుని చేపలు పట్టుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మత్స్యకారులకు ప్రయోజనం కలి్పంచే విధంగా పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో  రాష్ట్రంలో ఫిషింగ్‌ హార్బర్లు లేవన్న విషయాన్ని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు.

రాష్ట్రంలో ఫిషింగ్‌ హార్బర్లు లేకపోవడంతో ఉపాధి కోసం గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందంటూ మత్స్యకారులు వాపోయారు.  తాను ముఖ్యమంత్రి కాగానే రాష్ట్రంలోని వీరికి స్థానికంగానే ఉపాధి కల్పించే విధంగా ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటు చేస్తానని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఆ  హమీ మేరకు రూ.3,66.07 కోట్లతో రెండు దశల్లో పది ఫిషింగ్‌ హార్బర్లను, రూ.126.91 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. 

దేశాన్ని సుసంపన్నం చేయడంలో జలధి ప్రాధాన్యం ఎనలేనిదని చైనా, సింగపూర్‌ వంటి దేశాలు ఏనాడో గుర్తించాయి. ఈ సత్యాన్ని గుర్తించే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలను పరుగులు పెట్టించడంలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. అత్యంత రద్డీ ఉండే ఓడరేవుగా సింగపూర్‌ అగ్రస్థానంలో ఉండగా , టాప్‌ 15 పోర్టుల్లో 8కి పైగా పోర్టులు ఒక్క చైనాలోనే ఉన్నాయి. మన దేశంలో చెన్నై, కోల్‌కతా, ముంబైలు మెట్రోపాలిటన్‌ నగరాలుగా మారడంలో పోర్టులు కీలకపాత్ర పోషించాయనడంలో సందేహం లేదు.

దేశంలోనే రెండో అత్యంత పొడవైన 974 కి.మీ సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులను అభివృద్ధి చేయడం ద్వారా కొత్త మహానగరాలుగా సృష్టించుకునే అవకాశమున్నప్పటికీ, ఆ దిశగా 14 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏరోజూ పట్టించుకోలేదు. అసలు ఆ ఆలోచనే ఆయనకు లేదు. 2019లో ఎన్నికల ముందు ఎటువంటి అనుమతులు లేకుండా కేవలం ప్రచారం కోసం టెంకాయలు కొట్టి చేతులు దులిపేసుకున్నాడాయన. దీనికి భిన్నంగా  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. 

ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బరు... 
ప్రతీ 50 కి.మీ.కు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బరు (మినీ పోర్టు)లు, ఫిష్‌ల్యాండ్‌ సెంటర్లను జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్‌ హార్బర్లు, ఆరు ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. వీటికోసం సుమారు రూ.25,000 కోట్ల వ్యయం చేస్తుండటం అద్భుతం. రూ.3,736.14 కోట్ల వ్యయంతో రామాయపట్నం, రూ.5,155.73 కోట్లతో మచిలీపట్నం, రూ.4,361.91 కోట్లతో మూలపేట పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుండగా, పీపీపీ విధానంలో కాకినాడ సెజ్‌లో  గేట్వే పోర్టును రూ.2,123.43 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.

రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. కేంద్ర కస్టమ్స్‌ శాఖ నుంచి అనుమతులు రాగానే తొలి నౌకను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మచిలీపట్నం, మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ, గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ, రవ్వ క్యాప్టివ్‌ పోర్టు, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, 2025 నాటికి రాష్ట్రంలో పోర్టుల సంఖ్యను 10కి పెంచాలని జగన్‌ ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

వాణిజ్య ఎగుమతుల్లో 5వ స్థానంలో రాష్ట్రం... 
వాణిజ్య ఎగుమతులను పెంచడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా  జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 2019లో దేశ వాణిజ్య ఎగుమతుల్లో తొమ్మిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌  ఈ ఐదేళ్లలో  తీసుకున్న చర్యలతో ఐదో స్థానానికి చేరింది. 2019లో కేవలం రూ.90,000 కోట్లుగా ఉన్న వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24 నాటికి రూ.1.60 లక్షల కోట్లకు పెరిగింది

పోర్టు ఆధారిత పారిశ్రామిక పార్కులు... 
పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని విస్తరించడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. కేవలం పోర్టులను నిర్మించడమే కాకుండా పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  అధికారులను ఆదేశించారు. కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల వద్ద భారీ పారిశ్రామిక పార్కుల నిర్మాణానికి సంబంధించి ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీని వేశారు.

ఈ క్రమంలో తొలుత అందుబాటులోకి వస్తున్న పోర్టుకు సమీపంలో సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గో ఎయిర్‌ పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. తొలి దశలో 4,850 ఎకరాల్లో పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేయనుండగా, దీనికోసం గుడ్లూరు మండలం చేవూరులో 1312.58 ఎకరాలు, రావూరులో 951.77 ఎకరాల భూ సేకరణకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేశారు.  

ఫిషింగ్‌ హార్బర్ల వద్ద ప్రాసెసింగ్‌ యూనిట్లు... 
ఫిషింగ్‌ హార్బర్ల సమీపంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రగతి ఫలితంగా  ప్రస్తుతం 150 మిలియన్‌ టన్నులుగా ఉన్న రాష్ట్ర ఎగుమతుల సామర్థ్యం 300 మిలియన్‌ టన్నులకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పోర్టుల ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపాధి లభించనుండటంతో పాటు వ్యాట్, జీఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది.  

రామాయపట్నం సమీపానే ఇండోసోల్‌ సోలార్‌ ప్రాజెక్టు.... 
రామాయపట్నం పోర్టు సమీపంలో  ఇండోసోల్‌ రూ.25,000 కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ సోలార్‌ ఉపకరణాల తయారీ యూనిట్‌ తొలి దశ పనులను పూర్తి చేసుకుని ఈ మధ్యే ఉత్పత్తిని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. 

ఫిషింగ్‌ హార్బరు లేకపోవడం వల్ల బోట్లను ఒడ్డుకు చేర్చడం చాలా కష్టమయ్యేది. అమావాస్య, పౌర్ణమి సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ సమయంలో ఈ ఇబ్బంది మరింత అధికంగా ఉండేది. కొన్ని సందర్భాల్లో బోట్లు తీరానికి తగలడం వల్ల పగిలిపోయేవి. ఇప్పుడు మచిలీపట్నంలో అత్యాధునిక వసతులతో హార్బర్‌ నిర్మిస్తుండటంతో బోట్లను సురక్షితంగా నిలబెట్టుకోవచ్చు.  –పైకం ఆంజనేయులు, ఫైబర్‌ బోట్ల యజమానుల సంఘం, మచిలీపట్నం

నిన్నటిదాకా కూలీలం... ఇకపై యజమానులవుతాం.
రాష్ట్రంలో ఫిషింగ్‌ హార్బర్లు లేకపోవడంతో నెల్లూ రు, ప్రకాశం జిల్లా తీరప్రాంత మత్స్యకారులు ఇన్నాళ్లూ చెన్నై, మంగళూరు ప్రాంతాలకు వెళ్లి వలస కూలీలుగా పనిచేసుకునేవాళ్లం. ఇప్పుడు ఇక్కడే ఫిషింగ్‌ హార్బర్లు వస్తుండటంతో అత్యాధునిక మెకనైజ్డ్‌ బోట్లు కొనుగోలు చేసుకుని యజమానులుగా మారే అవకాశాన్ని ఈ ప్రభుత్వం కలి్పంచింది. ఫిషింగ్‌ హార్బరు, దీనికి అనుబంధంగా వచ్చే పరిశ్రమల వల్ల ఒక్క జువ్వలదిన్నెలోనే 15,000 మందికి పైగా ఉపాధి లభించనుంది. తుపాన్లు వచ్చినా తట్టుకునే విధంగా జువ్వలదిన్నె హార్బర్‌ను నిర్మిస్తున్నారు.  – కొండూరు అనిల్‌ బాబు, చైర్మన్, ఏపీ ఫిషరీస్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఆఫ్కాఫ్‌) 

మినీపోర్టు స్థాయిలో నిర్మాణం 
ఇప్పటి వరకు బోట్లు నిలపడానికే సరైన సదుపాయాల్లేక ఐదారుచోట్ల ఆపేలా నానా అవస్థలు పడుతుండేవాళ్లం. పాదయాత్ర సమయంలో మా పరిస్థితిని వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొస్తే మినీ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూ.361 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద హార్బరును మినీపోర్టు స్థాయిలో నిర్మిస్తున్నారు. బోట్లు నిలపడం నుంచి రిపేర్లు, డీజిల్, వేలంపాటలు, అమ్మకాలు...ఇలా అన్నీ ఒకేచోట ఉండేలా నిర్మిస్తుండటంతో వ్యయం తగ్గి లాభాలు పెరుగుతాయి.

దీని ద్వారా తొండంగి, కొత్తపల్లి, కాకినాడ రూరల్‌ మండలాలకు చెందిన 50,000 మత్స్యకార ప్రజలకు ప్రయోజనం లభిస్తుంది. ఈ స్థాయిలో హార్బర్‌ నిర్మాణ పనులు ఇంత వేగంగా జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. మేమంతా సీఎం వైఎస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం.  –ఎన్‌. మణికంఠబాబు, సర్పంచ్, అమినాబాద్, ఉప్పాడ 

రామాయపట్నం
► ప్రాజెక్టు వ్యయంరూ.3,736.14 కోట్లు 
►తొలి  దశలో పోర్టు సామర్థ్యం 34.04 ఎంఎంటీపీఏ 
►పూర్తిస్థాయి సామర్థ్యం138.54 టన్నులు 
►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్‌) 
►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ
పనులు ప్రారంభించిన తేదీ జూన్‌ 24, 2022 కార్యకలాపాల ప్రారంభం జనవరి, 2024 

మచిలీపట్నం 
►ప్రాజెక్టు వ్యయం రూ.5,156 కోట్లు 
►తొలి  దశలో పోర్టు సామర్థ్యం 35 ఎంఎంటీపీఏ
►పూర్తిస్థాయి సామర్థ్యం 116 టన్నులు 
►తొలి దశలో బెర్తులు నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్‌) 
►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 80,00 డీడబ్ల్యూటీ 
పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్‌ 21, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 

మూలపేట  
 ►ప్రాజెక్టు వ్యయం : రూ.4,361.91 కోట్లు 
 ►తొలి  దశలో పోర్టు సామర్థ్యం23.50 ఎంఎంటీపీఏ 
 ►పూర్తిస్థాయి సామర్థ్యం: 83.30 టన్నులు 
► తొలి దశలో బెర్తులు: నాలుగు రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి మల్టీపర్పస్‌) 
 ►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం1,20,000డీడబ్ల్యూటీ 
 పనులు ప్రారంభించిన తేదీ ఏప్రిల్‌ 18, 2023 కార్యకలాపాల ప్రారంభం అక్టోబర్, 2025 

కాకినాడ గేట్‌ వే
►ప్రాజెక్టు వ్యయం : రూ.2,123.43 కోట్లు 
►తొలి  దశలో పోర్టు సామర్థ్యం16 ఎంఎంటీపీఏ
► తొలి దశలో బెర్తులు: నాలుగు (రెండు జనరల్, ఒకటి కోల్, ఒకటి క్రాఫ్ట్‌ బెర్త్‌) 
►తొలి దశలో వచ్చే ఓడల పరిమాణం 1,20,000 డీడబ్ల్యూటీ 
పనులు ప్రారంభించిన తేదీ నవంబర్‌ 20, 2021 కార్యకలాపాల ప్రారంభం నవంబర్, 2024

Advertisement
Advertisement