బాబు ‘ప్రైవేటు’ మమకారానికి.. 3 పోర్టులు బలి | Chandrababu Govt Making Government Under Ports to Privatization | Sakshi
Sakshi News home page

బాబు ‘ప్రైవేటు’ మమకారానికి.. 3 పోర్టులు బలి

Published Mon, Oct 28 2024 4:26 AM | Last Updated on Mon, Oct 28 2024 4:28 AM

Chandrababu Govt Making Government Under Ports to Privatization

రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులకు సర్కారు ‘టెండర్‌’

రూ.13 వేల కోట్లకుపైగా వ్యయంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పోర్టులు ప్రైవేటు పరం

నిధులు సైతం సమకూర్చిన జగన్‌ సర్కారు

శరవేగంగా పూర్తవుతున్న దశలో ఆపాలని కూటమి ప్రభుత్వం ఆదేశం

నిర్మాణం, నిర్వహణ కోసం ఆసక్తిగల సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానం

రాష్ట్ర ఆదాయానికి తూట్లు.. మరో స్కామ్‌కు నాంది! 

10 ఫిషింగ్‌ హార్బర్లను సైతం ప్రైవేటు పరం చేయడానికి టెండర్లు

మూడు పోర్టులను నాడు ప్రభుత్వ రంగంలోనే చేపట్టిన వైఎస్‌ జగన్‌

ప్రైవేటులో నిర్మిస్తే రాష్ట్రానికి లాభం ఉండదనే ఈ నిర్ణయం

ఇప్పటికే రామాయపట్నంలో 65 శాతం పనులు పూర్తి

ఇక్కడ ఒక బెర్తు వాణిజ్య కార్యకలాపాలకు సిద్ధం

మిగిలిన రెండు పోర్టుల్లో 50 శాతం పనులు పూర్తి  

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిన సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులపై కన్నేశారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు శర వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని ప్రైవేట్‌ పరం చేసి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకొంటున్న విషయం తెలిసిందే. 

ఒకవైపు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని తన వారికి అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 65 శాతానికి పైగా పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టును, 50 శాతానికి పైగా పనులు జరిగిన మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం అధికార, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. 

అంతిమంగా ఇది న్యాయ వివాదాలకు దారి తీసి పోర్టుల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను కూడా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సమకూర్చింది. వివిధ బ్యాంకుల, ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఫైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించారు. 

కాబట్టి ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణ పనులు కొనసాగించడానికి నిధుల కొరత కూడా లేదు. నిర్మాణ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న తరుణంలో అసంబద్ధంగా ప్రైవేటీకరణ చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉండవచ్చని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు మేలు జరిగేలా, లక్షల మందికి ఉపాధి కల్పించి వలసలను నివారించేలా, మత్స్య సంపదను పెంపొందించే దిశగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 10 ఫిషింగ్‌ హార్బర్లను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది.   


వాణిజ్యం, ఉపాధికి ఊతమిచ్చేలా 
రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో రూ.13వేల కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వమే చేపట్టింది. కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టింది. 

ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా  పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కూడా  లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ రంగంలో నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం ఉండదన్న ఉద్దేశంతో గత సర్కారు ల్యాండ్‌లార్డ్‌ మోడల్‌లో పోర్టుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పోర్టుకు ప్రత్యేకంగా స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని వేగంగా పనులు చేపట్టింది.   

న్యాయ వివాదాలతో ఆగిపోయే ప్రమాదం..! 
ఇప్పటికే మూడు పోర్టు పనులను మూడు సంస్థలు చేస్తుండగా.. కొత్తగా తిరిగి నిర్మాణ పనుల కోసం మారిటైమ్‌ బోర్డు ఈవోఐ పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్ల గురించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఓపక్క తాము పనులు చేస్తుండగా మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడంలేదని కాంట్రాక్టు సంస్థలు వాపోతున్నాయి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే అప్‌గ్రెడేషన్, పోర్టు మోడర్నైజేషన్‌ అంటూ టెండర్లు ఎలా పిలుస్తారని పేర్కొంటున్నారు. 

ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎక్కడివక్కడ నిలిపేసి మొత్తం మూడు పోర్టులను ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థలను బెదిరించడానికి టెండరు నోటీసు ఇచ్చినట్లుగా ఉందని మరో సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. 

ఇప్పటికే పలుచోట్ల భూసేకరణ వివాదాలు నడుస్తున్నాయని, పోర్టులు ప్రైవేటు పరమైతే ఇవి మరింత జటిలమై న్యాయపరమైన చిక్కులతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో ప్రవీణ్‌ ఆదిత్య నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

గతంలో పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్‌ పార్టనర్‌íÙప్‌ (పీ 4) పేరుతో అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

ఫిషింగ్‌ హార్బర్లు  


ఫిషింగ్‌ హార్బర్లు కూడా.. 
మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో పది ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పది హార్బర్లు అందుబా­టులోకి వస్తే 10,521 మెకనైజ్డ్‌ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బరు పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 

పోర్టుల నిర్మాణం, నిర్వహణ కోసం బిడ్లు ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన టెండర్‌ 

మిగిలిన హార్బర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం పది పిషింగ్‌ హార్బర్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా టెండర్లను పిలిచింది.

ఒకేసారి 3 పోర్టులు చరిత్రలో తొలిసారి
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 3 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఈ ఘనతను గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సాధించింది. రామాయపట్నం పోర్టు పనులను అరబిందో, మచిలీపట్నం పోర్టును మెగా, మూల­పేట పోర్టు నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థలు దక్కించుకున్నాయి. రామాయపట్నం పోర్టులో బల్క్‌ కార్గో బెర్తు పనులు 100 శాతం పూర్తయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు వస్తే బెర్త్‌ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. 

ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచి ప్రైవేటుకు లబ్ధి చేకూ­ర్చేందుకు సన్నద్ధమైంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూల­పేట పోర్టులను నిర్మించి అభివృద్ధి చేసి నిర్వహించడంపై ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్ల (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్‌ బోర్డు టెండర్లను పిలిచింది. నవంబర్‌ 4లోగా బిడ్లు దాఖలు చేయాలని టెండర్‌ నోటీసులో పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement