విశాఖే బెస్ట్ | VisakhapatnamTo the selection of the growing demand for capital | Sakshi
Sakshi News home page

విశాఖే బెస్ట్

Published Fri, May 9 2014 11:45 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM

విశాఖే బెస్ట్ - Sakshi

విశాఖే బెస్ట్

  •     రాజధానిగా ఎంపిక చేయాలని పెరుగుతున్న డిమాండ్
  •      ఐటీ, ఫార్మా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్
  •      అనుకూలాంశాలు
  •      శివరామకృష్ణన్ కమిటీకి నివేదించనున్న పారిశ్రామికవేత్తలు
  •      ఏకమవుతున్న సీఐఐ, వీడీసీ, ఇతర రంగాల ప్రముఖులు
  •  సీమాంధ్ర రాజధానిగా అవతరించేందుకు మహా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఈ ప్రాంతీయుల నిశ్చితాభిప్రాయం. రాజధానిగా  ఈ ప్రాంతాన్నే  ప్రకటించాలంటూ అనేక గళాలు ఎలుగెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. రాజధాని ఎంపిక కోసం విశాఖ వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించడానికి సీఐఐ, వీడీసీ, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు సన్నాహాలు చేస్తున్నారు.  ఎవరికివారే ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. శనివారం నగరంలో పర్యటించనున్న శివరామకృష్ణన్ బృందాన్ని కలవడానికి వీరంతా ఏర్పాట్లు చేసుకున్నారు.  
     
     పారిశ్రామిక వైభవం

     జిల్లా పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తరఫున ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం నగరంలోని సీఐఐలో సభ్యత్వం కలిగిన పలువురు పారిశ్రామికవేత్తలంతా దీనిపై సమీక్ష జరిపారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, కంటైనర్ టెర్మినల్స్ నగరాన్ని అన్ని విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరొందేలా చేశాయి. ఇదికాక రూ.800 కోట్లతో మరో కంటైనర్ టెర్మినల్ వస్తోంది. దీనిద్వారా పారిశ్రామిక ప్రగతి శరవేగంగా విస్తరించడానికి అవకాశం ఉందని సభ్యులంతా తేల్చారు. అదికాకుండా విశాఖ నుంచి కాకినాడ వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌తో అనుహ్య అభివృద్ధి సాధించడానికి వీలుందని చర్చించారు. నగరంలోకి కొన్ని వందల ఫార్మా, కెమికల్, మెకానికల్ పరిశ్రమల నుంచి వేల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయని, దీనికి కావలసిన ముడి దిగుమతుల సౌకర్యం కూడా ఇక్కడే ఉందని సభ్యులంతా తేల్చారని సీఐఐ చైర్మన్, పోర్టు డిప్యూటీ చైర్మన్ సత్యకుమార్ వివరించారు.
     
     అభివృద్ధికి ఆలవాలం

     విశాఖ అభివృద్ధి మండలి (వీడీసీ) మరో నివేదిక తయారు చేసింది. సీమాంధ్రలో అతి పెద్ద నగరం విశాఖ మాత్రమే ఉందని, నగరం చుట్టూ 250 కిలోమీటర్ల పరిధిలో సుమారు 3 కోట్ల జనాభా ఉందని, హైదరాబాద్ తర్వాత అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఇక్కడే ఉందని ఇవన్నీ విశాఖకు అనుకూలమని వీడీసీ కన్వీనర్ ఒ.నరేష్‌కుమార్ వివరించారు. దేశంలోని 70 రైల్వే డివిజన్లలో విశాఖ నాలుగో అతి పెద్ద డివిజన్ అని, రూ.15 వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు విశాఖ నుంచి జరుగుతున్నాయని, ఇవన్నీ రాజధానికి పూర్తిగా అనుకూలంగా మారుతాయని వీడీసీ తరఫున ఇవ్వనున్న నివేదికలో పొందుపరిచారు. స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డ్, డాక్‌యార్డ్, జింక్, హెచ్‌పీసీఎల్, చమురు కంపెనీలు, పోర్టులు విశాఖను అంతర్జాతీయస్థాయిలో ఉన్నతంగా నిలబెట్టే ఆభరణాలని వివరించనున్నారు. విభజన కారణంగా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ దక్కడంతో ఈ ప్రాంతానికి   భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఇది రాజధానికి మరింత అనుకూలిస్తుందని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఎండీ, మాజీ సీఐఐ చైర్మన్ సాంబశివరావు వివరించారు. ఈమేరకు పారిశ్రామికవేత్తల తరఫున తాము కూడా నివేదిక ఇవ్వనున్నట్లు వివరించారు. సీమాంధ్రలో విద్యాసంస్థలన్నీ ఉన్నాయని, ఇది రాజధానికి పూర్తిగా అనుకూలమని ఉత్తరాంధ్ర ఇంజనీరింగ్ విద్యాసంస్థల తరఫున మరికొందరు నివేదికలతో కలవనున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement