అరచేతిలోఅభివృద్ధి | Palm development | Sakshi
Sakshi News home page

అరచేతిలోఅభివృద్ధి

Published Fri, Sep 5 2014 12:30 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

అరచేతిలోఅభివృద్ధి - Sakshi

అరచేతిలోఅభివృద్ధి

  • పోర్టులు, ఎయిర్ పోర్టు, మెట్రో, మెగాసిటీ నిర్మిస్తామని వెల్లడి
  •  రైల్వేజోన్‌పైనా ఆశలు కల్పించే ప్రయత్నం
  •  సర్కారు మాటలు కార్యరూపం దాల్చితే నగరం ముంగిట ప్రగతి
  • సాక్షి,విశాఖపట్నం :  విశాఖ భవిష్యత్తు అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రజల్లో భారీగా ఆశలు కల్పించారు. పోర్టులు,ఎయిర్‌పోర్టులు, మెగాసిటీ,  మెట్రో, ఉన్నత విద్యాసంస్థలంటూ భారీ ప్రాజెక్టుల జాబితా ప్రకటించి అరచేతిలో అభివృద్ధి మంత్రం జపించారు. అదిగదిగో అభివృద్ధంటూ ఊరించే ప్రయత్నం చేశారు. గురువారం అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులు నిజంగా పూర్తయితే నగరం అభివృద్ధి దిశగా అందనంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఎంతో ఉంది.

    అయితే వీటి కార్యరూపం ప్రభుత్వం చిత్తశుద్ధిపై ఆధారపడి ఉండనుంది. రాజధాని ఎంపికపై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సైతం విజయవాడ తర్వాత రెండోప్రాధాన్య రాజధానిగా విశాఖను తన జాబితాలో చేర్చింది. విజయవాడను ఎంపిక  రాజధానిగా ఎంపిక చేసిన నేపథ్యంలో స్థానికంగా విమర్శలు,ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగకుండా సీఎం తాజా వరాల ప్రకటనతో జాగ్రత్త పడ్డారు.
     
    విమానాశ్రయం..పోర్టులు

    విశాఖకు అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం తీసుకువస్తామని సీఎం ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మరో ఎయిర్‌పోర్టు నిర్మించడం అసాధ్యమని తేల్చింది. నక్కపల్లిలో నిర్మించాలంటే అక్కడున్న కొండలను అడ్డుతొలగించేందుకు రూ.500కోట్లు అవుతుందని స్పష్టం చేసింది. దీంతో పేరుకు విశాఖ అన్నా విజయనగరం సమీపంలో కొత్త ఎయిర్‌పోర్టు రానుందనేనది ప్రభుత్వం పరోక్షంగా చెప్పకనే చెప్పినట్లయింది. భీమిలి,నక్కపల్లిలో ఓడరేవు నిర్మిస్తామన్నారు. ఈరెండూ వస్తే అద్భుత ప్రగతి విశాఖకు సొంతమవుతుంది. వైజాగ్‌పోర్టు, రైట్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో నక్కపల్లిలో నేవీ అభ్యంతరాలు, భీమిలిలో కనీసం కార్గో వచ్చే అవకాశం లేనందున ఈరెండు ప్రాంతాల్లో ఓడరేవుల నిర్మాణం వృథా అని గతంలో తేల్చాయి.  వీటిని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్తుందనేది ప్రభుత్వ చిత్తశుద్ధిని తేటతెల్లం చేయనుంది.
     
    రైల్వేజోన్ : విశాఖకు రైల్వేజోన్‌ను తీసుకవస్తామన్నట్లుగా సీఎం  ప్రకటించడం కొంతవరకు ఆశలు రేపుతున్నా.. విభజన తర్వాత సుదీర్ఘకాలం నాటి పోరాటం ఫలిస్తుందని అంతా భావించారు. బడ్జెట్లో నగరానికి నిరాశే మిగిలింది. ఈనేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విశాఖ రైల్వేజోన్‌పై కేంద్రంపై ఎంతవరకు ఒత్తిడితెచ్చి సఫలమవుతుందనేదే ఇప్పుడు అనేక మందిని వేధిస్తోన్న ప్రశ్న.  ప్రభుత్వం ప్రయత్నిస్తే కనీసం వచ్చే బడ్జెట్లో అయినా సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
     
    ఐఐఎం,ఐఐఎఫ్‌టీ : విభజన తర్వాత విశాఖకు ఈరెండు రాష్ట్రానికి ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు సీఎం ఈరెండూ విశాఖకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఇందులో రాష్ట్రప్రభుత్వపాత్ర కంటే కేంద్రప్రభుత్వమే నిధులు భరించనుంది. కేవలం సరిపడినన్ని భూములు కేటాయిస్తే చాలు. అయితే విశాఖ నగర అభివృద్ధి,అవసరాల దృష్ట్యా ఐఐఎం కన్నా ఐఐటీ ఇస్తేనే మేలని నిపుణులు వివరిస్తున్నారు. కాని ప్రభుత్వం తర్వాత చూద్దామని అసెంబ్లీలో వెల్లడించింది.
     
    మెట్రో రైలు

    విశాఖలో మెట్రో రైలు నిర్మిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. రూ.5వేల కోట్ల ఈ ప్రాజెక్టులో కేంద్రప్రభుత్వం సింహభాగం నిధులు అందజేయనుంది. దీన్ని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా పూర్తిచేయాలని సీఎం భావిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోతో పోల్చితే భూసేకరణ చిక్కుముళ్ల మధ్య అంతవేగంగా పట్టాలకెక్కితే గొప్పవిషయమే.
     
    ఐటీ.. పాత మాటే
     
    ఐటీ ఇంక్యుబేషన్,కన్వెన్షన్ సెంటర్లకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి.  భూములు లేక ఆగిపోయాయి. ప్రభుత్వం ఇప్పుడు వీటిని మళ్లీ కొత్తగా తెరపైకి తెచ్చింది. వీటిని నిర్మిస్తామని ప్రకటించింది. ఆచరణలో పూర్తిచేయడానికి చాలా సమయం పట్టనుంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement