sivarama krishna
-
స్వాతంత్య్ర సమరయోధుడు 'పావులూరి' కన్నుమూత
తెనాలిరూరల్/వేమూరు/గుంటూరు వెస్ట్: తెనాలికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య (98) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1923 నవంబర్ 15న తెనాలి సమీపంలోని గోవాడ గ్రామంలో జన్మించిన ఆయన తురుమెళ్లలో ప్రాథమిక విద్య అనంతరం గోవాడలో ఉన్నత విద్య అభ్యసించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్, మద్రాసు యూనివర్సిటీ నుంచి హిందీ పట్టా, ఆగ్రా యూనివర్సిటీ నుంచి హిందుస్థానీ, భారతీయ పారంగత్ పట్టా అందుకున్నారు. హిందీ ఉపాధ్యాయుడిగా చేస్తూ భారత స్వాతంత్య్ర పోరాటంలో జైలు జీవితాన్ని అనుభవించారు. జాతీయ భాష హిందీని ఉచితంగా బోధిస్తూ శివయ్య మాస్టారుగా ఖ్యాతిని ఆర్జించారు. మహాత్మాగాంధీ సేవాగ్రామ్‌లో ఏడాది పాటు ఉండి మహాత్ముడికి సేవలందించారు. 1933లో కావూరు వినయాశ్రమంలో గాంధీజీకి స్వాగతం పలికారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆలీపూర్‌లో కారాగార శిక్ష అనుభవించారు. జిల్లా పరిషత్ హైస్కూలులో ప్రథమ శ్రేణి హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేసి 1979లో రిటైరయ్యారు. శివరామకృష్ణయ్య తన స్వగ్రామం గోవాడలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పార్లమెంటు నిధులతో తన గ్రామంలో కమ్యూనిటీ హాలు కూడా నిర్మించారు. శంకర్‌దయాళ్‌శర్మ, మన్మోహన్సింగ్, సోనియాగాంధీ, సుష్మాస్వరాజ్, ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వంటి ప్రముఖుల సత్కారాలను అందుకోవడంతో పాటు 2018లో జరిగిన విశ్వహిందీ సమ్మేళనంలో విశిష్ట సన్మానం అందుకున్నారు. శివరామకృష్ణయ్యకు భార్య మంగమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు విజయకుమార్ వ్యవసాయశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా రిటైరయ్యారు. రెండో కుమారుడు కృష్ణకుమార్ అధ్యాపకుడిగా చేసి, గుంటూరులో వ్యాపారంలో స్థిరపడ్డారు. కుమార్తె జయశ్రీ గృహిణిగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడమీ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ పట్టు పరిశ్రమ సలహాసంఘ సభ్యుడిగా, ఆంధ్రప్రదేశ్ స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, కావూరు వినయాశ్రమం ధర్మకర్తల మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘసంస్కర్త పావులూరి శివరామకృష్ణయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. చంద్రబాబు సంతాపం స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధేయవాదంతో నేటి తరానికి శివరామకృష్ణయ్య స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీతో పాటు ఆశ్రమంలో ఉన్న వ్యక్తుల్లో శివరామకృష్ణయ్య ఒకరని, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. రైతు బాంధవుడిగా పేరు గడించిన శివరామకృష్ణయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
మాజీ డీఎస్పీ శివరామకృష్ణ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంబంధ కేసుల దర్యాప్తులో దిట్ట.. ఉమ్మడి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ)కు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చిన అధికారి.. ఘరానా దొంగలు, కిడ్నాపర్లను పట్టుకున్న అనుభవజ్ఞుడు.. మాజీ డీఎస్పీ జి.శివరామకృష్ణ గౌడ్ (66) శుక్రవారం ఉదయం కన్ను మూశారు. ఎనిమిదేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఆయన మాదాపూర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలకు చెందిన అధికారులకూ సలహాలు, సూచనలు ఇచ్చిన ఆయన మరణం తీరని లోటు అని పలువురు అధికారులు వ్యాఖ్యానించారు. శివరామకృష్ణ భార్య వైద్యురాలు కాగా ఆయనకు ఓ కుమారుడు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్జీఆర్ఐలో శాస్త్రవేత్తగా పని చేసిన శివరామకృష్ణ పోలీసు విభాగంపై ఉన్న మక్కువతో.. 1985లో ఎస్సైగా డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టారు. సైఫాబాద్, జీడిమెట్ల తదితర ఠాణాలకు ఇన్స్పెక్టర్గా, ఎస్వోటీ ఇన్చార్జ్గా, సరూర్‌నగర్, సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా సేవలందించారు. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడిన కొత్తలో అంతర్రాష్ట్ర బందిపోటు ముఠాల హల్చల్ ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ఎస్వోటీకి నేతృత్వం వహించిన శివరామకృష్ణ కరుడుగట్టిన పార్థీ, కంజరభట్, కొర్చ గ్యాంగ్స్‌కు చెక్ చెప్పారు. 2003–06 మధ్య శివార్లలో రియల్ఎస్టేట్ బూమ్ జోరుగా ఉన్న రోజుల్లో భూ వివాదాలకు సంబంధించి పలు నేరాలను కొలిక్కి తెచ్చారు. ఉగ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తులో నిష్ణాతుడిగా పేరున్న శివరామకృష్ణ అనేక మాడ్యూల్స్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 2002లో జరిగిన దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు కేసు, 2003లో గుజరాత్లో చోటు చేసుకున్న ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్య హత్య కేసు, గుజరాత్ పేలుళ్లకు కుట్ర కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు. ఆఖరి వరకు ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్‌లోనే సేవలు చేసిన ఆయన 2010లో పదవీ విరమణ చేశారు. పోలీసు, నిఘా వర్గాల నివాళులు దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శివరామకృష్ణ పార్థివ దేహాన్ని అనేక మంది పోలీసు, నిఘా వర్గాలకు చెందిన అధికారులు సందర్శించి నివాళులర్పించారు. పార్శిగుట్టలోని శ్మశానవాటికలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. -
పేరూర్.. దత్తపుత్రుడు
దేవరకద్ర రూరల్: కష్టపడి సంపాదించిన సొమ్ములో ఇతరులకు రూపాయి ఖర్చుపెట్టడానికి వెనకాడే ఈ రోజుల్లో తండ్రి బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నాడో సుపుత్రుడు. చిన్న వయసులోనే ప్రజాసేవకు అంకితమై తనవంతుగా పేదలకు సహాయ పడుతున్నాడు. ఇదీ సమస్య అని అడగడమే లేటు.. వెంటనే స్పందించి ప్రజాభిమానాన్ని పొందుతున్నాడు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సింతనూర్ గ్రామానికి చెందిన శివరామకృష్ణ. తండ్రిబాటలోనే తనయుడు.. శాంతమ్మ, ఈశ్వరయ్యస్వామి దంపతుల ఏకైక కుమారుడు శివరామకృష్ణ. తండ్రి తన స్వగ్రామంలో విద్యారంగంతో పాటు పలు ప్రజాసేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ప్రజాసేవలోనే ఆనందం ఉందని.. దానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ పదేపదే తన కొడుకుతో చెప్పేవారు. చిన్నప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన శివరామకృష్ణ ఆయన స్ఫూర్తితో కష్టపడి చదివి ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. తండ్రి బాటలో నడుస్తూ ఇతరులకు సేవ చేస్తున్నాడు. స్వగ్రామంలో ఆరోగ్య కేంద్రం, పాఠశాల భవనాలకు తన భూమిని అందజేసి ఔదర్యాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా తాను చదివిన పాఠశాలలో నేటి విద్యార్థులకు కావల్సిన లైబ్రరీతో పాటు బస్‌షెల్టర్ నిర్మాణానికి కూడా తన సొంత నిధులతో కట్టించాడు. ఉత్సవాలకు, అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. చిన్న సాయం చేసి పెద్దగా ప్రచారం చేసుకునే నేటి తరంలో తరచూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఏనాడూ సొంత ప్రచారం చేసుకోలేదు. పేరూర్ ప్రజలకు సేవలు దేవరకద్ర మండలం పేరూర్ గ్రామానికి చెందిన జగదీశ్వరయ్య, సుశీల దంపతుల కూతురు శ్రీదేవితో వివాహమాడిన శివరామకృష్ణ తన సొంత గ్రామంలో చేపట్టే ప్రజాసేతోపాటు అత్తగారి ఊరిలోనూ తండ్రి ఆశయాల కోసం పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నిర్మించే శివాలయానికి ఇటీవల రూ. 3 లక్షలను విరాళంగా అందజేశారు. గ్రామంలో నిర్వహించే ఉత్సవాలకు లక్షల్లో ఆర్థికసాయం చేస్తున్నారు. పేరూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు చుట్టుముట్టు గ్రామాలనుంచి వస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఇటీవలే ఉపాధ్యాయులు గ్రామానికి వచ్చిన శివరామకృష్ణకు సమస్యను వివరించారు. వెంటనే స్పందిస్తూ విద్యార్థుల కోసం రూ. 5లక్షలతో 90 సైకిళ్లను తెప్పించారు. వాటిలో 45 సైకిళ్లు బాలురకు, 45 సైకిళ్లు బాలికలకు కేటాయించారు. నేడు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ ప్రజాసేవకుడు శివరామకృష్ణ అందజేసిన సైకిళ్లను గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసే ఓ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, డీఈఓ సోమిరెడ్డి, శివరామకృష్ణ తల్లి శాంతమ్మ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఈ సైకిళ్లు పాఠశాలలోనే ఎప్పుడు ఉంచి విద్యా సంవత్సరం పూర్తి అయిన తర్వాత మళ్లీ కొత్త వారికి అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సేవచేసి జన్మధన్యం చేసుకుంటా.. ఎన్ని డబ్బులున్నా తృప్తి లభించదు. కేవలం ప్రజాసేవతోనే జన్మ ధన్యమవుతుంది. మనం సంపాదించే దాంట్లో కాస్త పేదలకు ఇస్తే ఆ అనుభూతే వేరు. నాన్న చేసిన సేవా కార్యక్రమాలను మరువలేదు. ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నా. – మూలగుండం శివరామకృష్ణ, ప్రజాసేవకుడు మాకు నడకబాధ తప్పింది మాకు కొత్త సైకిళ్లు కొనే స్థోమత లేక ఇన్నాళ్లూ ఇబ్బంది పడుతూ బడికి వచ్చేవాళ్లం. మా సమస్యలను సారోళ్లు శివరామకృష్ణ గారికి చెప్పారు. ఆయన స్పందించి లక్షలు పెట్టి మాకోసం సైకిళ్లు తెప్పించి ఇవ్వడం ఆనందంగా ఉంది. – ఝాన్సీ, విద్యార్థిని, పేరూర్ చాలా సంతోషంగా ఉంది మాఊరి దత్తపుత్రుడిలా శివరామకృష్ణ విద్యార్థుల కోసం సైకిళ్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. విద్యాభివృద్ధి కోసం శివరామకృష్ణ చేస్తున్న కృషి అభినందనీయం. అడిగిన వెంటనే కాదనకుండా విద్యార్థులకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు. – రవీందర్, హెచ్ఎం, పేరూర్ -
విశాఖే బెస్ట్
రాజధానిగా ఎంపిక చేయాలని పెరుగుతున్న డిమాండ్ ఐటీ, ఫార్మా, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్ అనుకూలాంశాలు శివరామకృష్ణన్ కమిటీకి నివేదించనున్న పారిశ్రామికవేత్తలు ఏకమవుతున్న సీఐఐ, వీడీసీ, ఇతర రంగాల ప్రముఖులు సీమాంధ్ర రాజధానిగా అవతరించేందుకు మహా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఈ ప్రాంతీయుల నిశ్చితాభిప్రాయం. రాజధానిగా ఈ ప్రాంతాన్నే ప్రకటించాలంటూ అనేక గళాలు ఎలుగెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. రాజధాని ఎంపిక కోసం విశాఖ వచ్చిన శివరామకృష్ణన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించడానికి సీఐఐ, వీడీసీ, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరికివారే ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. శనివారం నగరంలో పర్యటించనున్న శివరామకృష్ణన్ బృందాన్ని కలవడానికి వీరంతా ఏర్పాట్లు చేసుకున్నారు. పారిశ్రామిక వైభవం జిల్లా పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) తరఫున ప్రత్యేకంగా నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు. ఈమేరకు శుక్రవారం నగరంలోని సీఐఐలో సభ్యత్వం కలిగిన పలువురు పారిశ్రామికవేత్తలంతా దీనిపై సమీక్ష జరిపారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, కంటైనర్ టెర్మినల్స్ నగరాన్ని అన్ని విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరొందేలా చేశాయి. ఇదికాక రూ.800 కోట్లతో మరో కంటైనర్ టెర్మినల్ వస్తోంది. దీనిద్వారా పారిశ్రామిక ప్రగతి శరవేగంగా విస్తరించడానికి అవకాశం ఉందని సభ్యులంతా తేల్చారు. అదికాకుండా విశాఖ నుంచి కాకినాడ వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌తో అనుహ్య అభివృద్ధి సాధించడానికి వీలుందని చర్చించారు. నగరంలోకి కొన్ని వందల ఫార్మా, కెమికల్, మెకానికల్ పరిశ్రమల నుంచి వేల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయని, దీనికి కావలసిన ముడి దిగుమతుల సౌకర్యం కూడా ఇక్కడే ఉందని సభ్యులంతా తేల్చారని సీఐఐ చైర్మన్, పోర్టు డిప్యూటీ చైర్మన్ సత్యకుమార్ వివరించారు. అభివృద్ధికి ఆలవాలం విశాఖ అభివృద్ధి మండలి (వీడీసీ) మరో నివేదిక తయారు చేసింది. సీమాంధ్రలో అతి పెద్ద నగరం విశాఖ మాత్రమే ఉందని, నగరం చుట్టూ 250 కిలోమీటర్ల పరిధిలో సుమారు 3 కోట్ల జనాభా ఉందని, హైదరాబాద్ తర్వాత అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం ఇక్కడే ఉందని ఇవన్నీ విశాఖకు అనుకూలమని వీడీసీ కన్వీనర్ ఒ.నరేష్కుమార్ వివరించారు. దేశంలోని 70 రైల్వే డివిజన్లలో విశాఖ నాలుగో అతి పెద్ద డివిజన్ అని, రూ.15 వేల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు విశాఖ నుంచి జరుగుతున్నాయని, ఇవన్నీ రాజధానికి పూర్తిగా అనుకూలంగా మారుతాయని వీడీసీ తరఫున ఇవ్వనున్న నివేదికలో పొందుపరిచారు. స్టీల్‌ప్లాంట్, షిప్‌యార్డ్, డాక్‌యార్డ్, జింక్, హెచ్‌పీసీఎల్, చమురు కంపెనీలు, పోర్టులు విశాఖను అంతర్జాతీయస్థాయిలో ఉన్నతంగా నిలబెట్టే ఆభరణాలని వివరించనున్నారు. విభజన కారణంగా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ దక్కడంతో ఈ ప్రాంతానికి భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఇది రాజధానికి మరింత అనుకూలిస్తుందని శ్రావణ్ షిప్పింగ్ కంపెనీ ఎండీ, మాజీ సీఐఐ చైర్మన్ సాంబశివరావు వివరించారు. ఈమేరకు పారిశ్రామికవేత్తల తరఫున తాము కూడా నివేదిక ఇవ్వనున్నట్లు వివరించారు. సీమాంధ్రలో విద్యాసంస్థలన్నీ ఉన్నాయని, ఇది రాజధానికి పూర్తిగా అనుకూలమని ఉత్తరాంధ్ర ఇంజనీరింగ్ విద్యాసంస్థల తరఫున మరికొందరు నివేదికలతో కలవనున్నారు. -
ఆర్టీఏ అధికారిపై ట్రావెల్స్ యజమాని దాడి
కర్నూలు: ప్రైవేటు ట్రావెల్ యజమానుల ఆగడాలకు హద్దులేకుండా పోతోంది. తనిఖీలు చేస్తున్న ట్రాన్స్పోర్ట్ అధికారులపై దాడులకు కూడా వెనుకాడటంలేదు. పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీ చేస్తున్న ఆర్టీఏ అధికారి శివరామకృష్ణపై ప్రొద్దుటూరుకు చెందిన శ్రీలక్ష్మీ ట్రావెల్స్ యజమాని దాడి చేశాడు. ఆర్టీఏ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బస్సుల యజమానులు ఇటీవల కాలంలో అక్రమంగా బస్సులను తిప్పడం ఎక్కువైపోయింది. బస్సు ప్రమాదాలు కూడా ఎక్కువయ్యాయి. దాంతో ఆర్టీఏ అధికారులు ముమ్మరంగా దాడులు చేస్తున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే ప్రైవేటు బస్సుల యజమానులు, డ్రైవర్లు కూడా ఆర్టీఏ అధికారులు, సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ ఆర్టీఏ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అతనిని గాయపరిచాడు.