దేవరకద్ర మండలం పేరూర్ పాఠశాలకు శివరామకృష్ణ పంపించిన సైకిళ్లు
దేవరకద్ర రూరల్: కష్టపడి సంపాదించిన సొమ్ములో ఇతరులకు రూపాయి ఖర్చుపెట్టడానికి వెనకాడే ఈ రోజుల్లో తండ్రి బాటలో నడుస్తూ ఆయన ఆశయాలను నెరవేరుస్తున్నాడో సుపుత్రుడు. చిన్న వయసులోనే ప్రజాసేవకు అంకితమై తనవంతుగా పేదలకు సహాయ పడుతున్నాడు. ఇదీ సమస్య అని అడగడమే లేటు.. వెంటనే స్పందించి ప్రజాభిమానాన్ని పొందుతున్నాడు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సింతనూర్ గ్రామానికి చెందిన శివరామకృష్ణ.
తండ్రిబాటలోనే తనయుడు..
శాంతమ్మ, ఈశ్వరయ్యస్వామి దంపతుల ఏకైక కుమారుడు శివరామకృష్ణ. తండ్రి తన స్వగ్రామంలో విద్యారంగంతో పాటు పలు ప్రజాసేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. ప్రజాసేవలోనే ఆనందం ఉందని.. దానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ పదేపదే తన కొడుకుతో చెప్పేవారు. చిన్నప్రాయంలోనే తండ్రిని కోల్పోయిన శివరామకృష్ణ ఆయన స్ఫూర్తితో కష్టపడి చదివి ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించాడు. తండ్రి బాటలో నడుస్తూ ఇతరులకు సేవ చేస్తున్నాడు. స్వగ్రామంలో ఆరోగ్య కేంద్రం, పాఠశాల భవనాలకు తన భూమిని అందజేసి ఔదర్యాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా తాను చదివిన పాఠశాలలో నేటి విద్యార్థులకు కావల్సిన లైబ్రరీతో పాటు బస్‌షెల్టర్ నిర్మాణానికి కూడా తన సొంత నిధులతో కట్టించాడు. ఉత్సవాలకు, అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. చిన్న సాయం చేసి పెద్దగా ప్రచారం చేసుకునే నేటి తరంలో తరచూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఏనాడూ సొంత ప్రచారం చేసుకోలేదు.
పేరూర్ ప్రజలకు సేవలు
దేవరకద్ర మండలం పేరూర్ గ్రామానికి చెందిన జగదీశ్వరయ్య, సుశీల దంపతుల కూతురు శ్రీదేవితో వివాహమాడిన శివరామకృష్ణ తన సొంత గ్రామంలో చేపట్టే ప్రజాసేతోపాటు అత్తగారి ఊరిలోనూ తండ్రి ఆశయాల కోసం పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో నిర్మించే శివాలయానికి ఇటీవల రూ. 3 లక్షలను విరాళంగా అందజేశారు. గ్రామంలో నిర్వహించే ఉత్సవాలకు లక్షల్లో ఆర్థికసాయం చేస్తున్నారు. పేరూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు చుట్టుముట్టు గ్రామాలనుంచి వస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఇటీవలే ఉపాధ్యాయులు గ్రామానికి వచ్చిన శివరామకృష్ణకు సమస్యను వివరించారు. వెంటనే స్పందిస్తూ విద్యార్థుల కోసం రూ. 5లక్షలతో 90 సైకిళ్లను తెప్పించారు. వాటిలో 45 సైకిళ్లు బాలురకు, 45 సైకిళ్లు బాలికలకు కేటాయించారు.
నేడు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ
ప్రజాసేవకుడు శివరామకృష్ణ అందజేసిన సైకిళ్లను గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసే ఓ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, డీఈఓ సోమిరెడ్డి, శివరామకృష్ణ తల్లి శాంతమ్మ చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఈ సైకిళ్లు పాఠశాలలోనే ఎప్పుడు ఉంచి విద్యా సంవత్సరం పూర్తి అయిన తర్వాత మళ్లీ కొత్త వారికి అందజేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
సేవచేసి జన్మధన్యం చేసుకుంటా..
ఎన్ని డబ్బులున్నా తృప్తి లభించదు. కేవలం ప్రజాసేవతోనే జన్మ ధన్యమవుతుంది. మనం సంపాదించే దాంట్లో కాస్త పేదలకు ఇస్తే ఆ అనుభూతే వేరు. నాన్న చేసిన సేవా కార్యక్రమాలను మరువలేదు. ఆయనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నా. – మూలగుండం శివరామకృష్ణ, ప్రజాసేవకుడు
మాకు నడకబాధ తప్పింది
మాకు కొత్త సైకిళ్లు కొనే స్థోమత లేక ఇన్నాళ్లూ ఇబ్బంది పడుతూ బడికి వచ్చేవాళ్లం. మా సమస్యలను సారోళ్లు శివరామకృష్ణ గారికి చెప్పారు. ఆయన స్పందించి లక్షలు పెట్టి మాకోసం సైకిళ్లు తెప్పించి ఇవ్వడం ఆనందంగా ఉంది. – ఝాన్సీ, విద్యార్థిని, పేరూర్
చాలా సంతోషంగా ఉంది
మాఊరి దత్తపుత్రుడిలా శివరామకృష్ణ విద్యార్థుల కోసం సైకిళ్లను పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. విద్యాభివృద్ధి కోసం శివరామకృష్ణ చేస్తున్న కృషి అభినందనీయం. అడిగిన వెంటనే కాదనకుండా విద్యార్థులకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినందుకు కృతజ్ఞతలు. – రవీందర్, హెచ్‌ఎం, పేరూర్
Comments
Please login to add a commentAdd a comment