
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంబంధ కేసుల దర్యాప్తులో దిట్ట.. ఉమ్మడి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటీ)కు రాష్ట్ర వ్యాప్తంగా పేరు తెచ్చిన అధికారి.. ఘరానా దొంగలు, కిడ్నాపర్లను పట్టుకున్న అనుభవజ్ఞుడు.. మాజీ డీఎస్పీ జి.శివరామకృష్ణ గౌడ్ (66) శుక్రవారం ఉదయం కన్ను మూశారు. ఎనిమిదేళ్ల క్రితం పదవీ విరమణ చేసిన ఆయన మాదాపూర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం రాష్ట్ర, కేంద్ర నిఘా వర్గాలకు చెందిన అధికారులకూ సలహాలు, సూచనలు ఇచ్చిన ఆయన మరణం తీరని లోటు అని పలువురు అధికారులు వ్యాఖ్యానించారు.
శివరామకృష్ణ భార్య వైద్యురాలు కాగా ఆయనకు ఓ కుమారుడు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఎన్‌జీఆర్‌ఐలో శాస్త్రవేత్తగా పని చేసిన శివరామకృష్ణ పోలీసు విభాగంపై ఉన్న మక్కువతో.. 1985లో ఎస్సైగా డిపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టారు. సైఫాబాద్, జీడిమెట్ల తదితర ఠాణాలకు ఇన్‌స్పెక్టర్‌గా, ఎస్‌వోటీ ఇన్‌చార్జ్‌గా, సరూర్‌నగర్, సైబరాబాద్ ఎస్బీ ఏసీపీగా సేవలందించారు. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పడిన కొత్తలో అంతర్రాష్ట్ర బందిపోటు ముఠాల హల్‌చల్ ఎక్కువగా ఉండేది.
ఆ సమయంలో ఎస్‌వోటీకి నేతృత్వం వహించిన శివరామకృష్ణ కరుడుగట్టిన పార్థీ, కంజరభట్, కొర్చ గ్యాంగ్స్‌కు చెక్ చెప్పారు. 2003–06 మధ్య శివార్లలో రియల్‌ఎస్టేట్ బూమ్ జోరుగా ఉన్న రోజుల్లో భూ వివాదాలకు సంబంధించి పలు నేరాలను కొలిక్కి తెచ్చారు. ఉగ్రవాద సంబంధిత కేసుల దర్యాప్తులో నిష్ణాతుడిగా పేరున్న శివరామకృష్ణ అనేక మాడ్యూల్స్‌ను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 2002లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు కేసు, 2003లో గుజరాత్‌లో చోటు చేసుకున్న ఆ రాష్ట్ర మాజీ హోంమంత్రి హరేన్‌పాండ్య హత్య కేసు, గుజరాత్ పేలుళ్లకు కుట్ర కేసుల దర్యాప్తులో కీలకపాత్ర పోషించారు. ఆఖరి వరకు ఉమ్మడి సైబరాబాద్ కమిషనరేట్‌లోనే సేవలు చేసిన ఆయన 2010లో పదవీ విరమణ చేశారు.
పోలీసు, నిఘా వర్గాల నివాళులు
దాదాపు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం రాత్రి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శివరామకృష్ణ పార్థివ దేహాన్ని అనేక మంది పోలీసు, నిఘా వర్గాలకు చెందిన అధికారులు సందర్శించి నివాళులర్పించారు. పార్శిగుట్టలోని శ్మశానవాటికలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment