
న్యూఢిల్లీ: అమెరికా ప్రతికార సుంకాలు విధిస్తే.. అప్పుడు భారత ఫార్మా రంగంపై అధిక ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక టారిఫ్‌లతో అమెరికాలో భారత ఫార్మా ఉత్పత్తుల ఖరీదు, ఇతర దేశాలతో పోల్చితే పెరిగిపోతుందంటున్నారు. అదే సమయంలో భారత ఆటోమొబైల్ కంపెనీలపై సుంకాల ప్రభావం చాలా పరిమితంగానే ఉంటుందంటూ.. అమెరికాకు ఆటో ఎగుమతులు చాలా తక్కువగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు మోపుతున్న భారత్‌పై ఏప్రిల్ 2 నుంచి తాము కూడా అదే స్థాయిలో ప్రతిసుంకాలు అమలు చేస్తామని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అదే పనిగా ప్రకటిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం అమెరికా నుంచి దిగుమతి అవుతున్న ఔషధాలపై భారత్ 10 శాతం సుంకం అమలు చేస్తోంది. భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై అమెరికా ఎలాంటి సుంకాలు వసూలు చేయడం లేదు.
చరిత్రను గమనిస్తే దేశీ డిమాండ్‌ను తీర్చుకునేందుకు అమెరికా ఇప్పటి వరకు ఫార్మా ఉత్పత్తుల విషయంలో నికర దిగుమతిదారుగా ఉన్నట్టు శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్‌నర్ అరవింద్ శర్మ తెలిపారు. ‘‘భారత్ నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై గణనీయ స్థాయిలో టారిఫ్‌లు విధించాలని అమెరికా ఇటీవల నిర్ణయించడం భారత ఫార్మా రంగంపైనా చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుంది. అంతిమంగా దేశీ వినియోగంపైనా దీని ప్రభావం ఉంటుంది’’అని చెప్పారు.
అమెరికన్లకు గణనీయంగా ఆదా..
అమెరికాలో ప్రతి నాలుగు ఔషధాల్లో ఒకటి భారత్ నుంచి సరఫరా అవుతుండడం గమనార్హం. చౌకగా భారత్ అందిస్తున్న ఔషధాలతో అమెరికాకు 2022లో 219 బిలియన్ డాలర్లు ఆదా అయినట్టు పరిశ్రమ వర్గాల అంచనా. 2013 నుంచి 2022 వరకు చూస్తే పదేళ్ల కాలంలో 1.3 ట్రిలియన్ డాలర్లను అమెరికన్లు ఆదా చేసుకున్నారు. అంతేకాదు భారత చౌక జనరిక్ ఔషధాలతో అమెరికాకు వచ్చే ఐదేళ్లలో మరో 1.3 ట్రిలియన్ డాలర్లు ఆదా అవుతుందని అంచనా.
భారత ఫార్మా ఎగుమతులకు అమెరికా పెద్ద మార్కెట్ అని శర్మ చెప్పారు. భారత మొత్తం ఔషధ ఎగుమతుల్లో అమెరికా వాటాయే మూడింట ఒక వంతుగా ఉన్నట్టు తెలిపారు. ఉన్నట్టుండి టారిఫ్‌లు పెంచితే, అది భారత్‌లో ఔషధ తయారీని, దిగుమతి వ్యయాలను పెంచుతుందన్నారు. అదే జరిగితే అప్పుడు ఇతర దేశాలతో పోల్చితే భారత ఔషధ ఉత్పత్తులు ఖరీదుగా మారతాయన్నారు. ఇది అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యయాలను పెంచుతుందని, వినియోగదారులపై భారాన్ని మోపుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఫార్మా రంగానికి కొత్త దారులు
అమెరికా అధిక సుంకాలతో కొత్త మార్కెట్ అవకాశాల దిశగా భారత ఫార్మా రంగానికి ప్రోత్సాహం లభిస్తుందని శర్మ అంచనా వేస్తున్నారు. భారత కంపెనీలు యూరప్, ల్యాటిన్ అమెరికా లేదా ఆఫ్రికాలపై ఎక్కువ దృష్టి పెట్టొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు భారత ఆటో ఎగుమతులు చాలా తక్కువ కావడంతో ఈ రంగంపై సుంకాల ప్రభావం తక్కువే ఉంటుందని ఇండస్ లా పార్ట్‌నర్ శశి మాథ్యూస్ అభిప్రాయపడ్డారు. కాకపోతే భారత ఆటో విడిభాగాల కంపెనీలపై కొంత ప్రభావం ఉండొచ్చన్నారు. అమెరికా డిమాండ్ చేస్తున్నట్టు ఆ దేశ ఆటో ఉత్పత్తులపై భారత్ సుంకాలను సున్నా స్థాయికి సమీప కాలంలో తగ్గించకపోవచ్చన్న విశ్లేషణ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment