అధ్యక్షుడి భార్య మేనల్లుళ్ల అరెస్టు
న్యూయార్క్: వెనిజులా అధ్యక్షుడి భార్య సిలియా ఫ్లోర్స్ మేనల్లుళ్లను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల వద్ద కొకైన్ ఉన్నట్లు గుర్తించి తాము అరెస్టు చేసినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 800 కేజీల కొకైన్ అనే మత్తుపదార్థం అక్రమ రవాణాకు వారు కుట్రచేశారని ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ అరెస్టులతో మరోసారి వెనిజులా, అమెరికాల మధ్య విభేదాలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ఆ రెండు దేశాల మధ్య పొరపొచ్చాలు ఏర్పడి ఇరు దేశాల్లో కూడా తమ తమ విదేశాంగ ప్రతినిధులను వెనక్కి పిలుచుకున్నారు. మళ్లీ ఇప్పటివరకు నియామకం చేయలేదు. స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం ఈఫ్రెయిన్ ఆంటోనియో కాంపో ఫ్లోర్స్, ఫ్రాన్సిస్కో ఫ్లోర్స్ డే ప్రెయితాస్ అనే వెనిజులా అధ్యక్షుడు మధురో సతీమణి మేనళ్లులను న్యూయార్క్ పోలీసులు హైతీ వద్ద అరెస్టు చేశారు.
వీరిద్దరికి మత్తుతపదార్థాల అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉందని చెప్పారు. వారిద్దరిని గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు. గత అక్టోబర్ నెలలో వీరిద్దరు కూడా అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫోన్ చేసి 800 కిలోల కొకైన్ తరలించేందుకు సహకరించాలని కోరినట్లు తెలిసింది. దీనిపై అమెరికాలోని అధికార యంత్రాంగం స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి మొత్తం ఆధారాలు రికార్డు చేసినట్లు సమాచారం.