హవానా: కోపా అమెరికా కప్లో భాగంగా వెనుజులాతో జరుగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్కు అర్జెంటీనా ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ సూచించాడు. పటిష్టమైన వెనుజులాతో జాగ్రత్తగా ఆడితేనే విజయం సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతీ ఆటగాడు గుర్తించాలన్నాడు. గ్రూప్-డిలో టాపర్ గా నిలిచామన్న అతి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేరనీయొద్దని ఆటగాళ్లను మెస్సీ హెచ్చరించాడు.
'వెనుజులా గట్టి ప్రత్యర్థి. ఆ విషయం అర్జెంటీనా ఆటగాళ్లు గుర్తించుకుంటే చాలు. వారు కూడా బలమైన జట్లను ఓడించే క్వార్టర్స్ కు చేరారు. ఆ జట్టును నియంత్రించాలంటే పూర్తిస్థాయి ప్రదర్శన ఒక్కటే మార్గం. అందుకోసం సాధ్యమైనంతవరకూ బాగా సన్నద్ధం కావాలి' అని మెస్సీ తెలిపాడు. మరోవైపు అర్జెంటీనా కోచ్ గెరార్డో మార్టినో కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వెనుజులా జట్టు అసాధారణ ఆటగాళ్లతో పటిష్టంగా ఉందన్నాడు. మెక్సికోను ఓడించి క్వార్టర్స్ కు చేరిన వెనుజులాను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయొద్దని సూచించాడు. ఆదివారం అర్జెంటీనా-వెనుజులా జట్లు క్వార్టర్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.