అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది.
బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి...
దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి.
ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు.
ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు!
రంగంలోకి అమెరికా
గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు.
దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు.
శతాబ్దాల వివాదం...
వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది.
రాజకీయ ఎత్తుగడే!
నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు.
సహజ వనరుల గని
► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం
► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు
► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది
► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే
► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి
► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment