South America
-
పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి
భూగోళంపై ఎన్ని రకాల జీవులున్నాయో లెక్కేలేదు. ఎన్నో రకాల జీవులు ఇప్పటికే అంతరించిపోయినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. మరోవైపు కొత్తరకం జీవుల ఉనికి బయటపడుతూనే ఉంది. దక్షిణ అమెరికా ఖండంలోని పెరూ, చిలీ దేశాల సముద్ర తీరంలో ఒక జీవిని గుర్తించారు. తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తున్నట్లు కనిపెట్టారు. యాంఫీపాడ్ పాడ్ వర్గానికి చెందిన ఈ జీవికి డుల్సిబెల్లా కమాంచక అని పేరుపెట్టారు. కమాంచక అంటే స్థానిక భాషలో చీకటి అని అర్థం. ఈ చీకటి జీవి మాంసాహారి. ఇతర జీవులే దీని ఆహారం. ఇవి ఇక్కడ పెద్దగా కనిపించలేదు కాబట్టి అంతరించేపోతున్న జీవుల జాబితాలో చేర్చారు. ఇంటిగ్రేటెడ్ డీప్–ఓషియన్ అబ్జర్వింగ్ సిస్టమ్(ఐడీఓఓఎస్)లో భాగంగా గత ఏడాది సముద్రం అడుగు భాగంలో శోధించారు. ఉపరితలం నుంచి 7,902 మీటర్ల లోతులో కొత్త రకం జీవి ఉన్నట్లు బయటపడింది. అంటే దాదాపు 8 కిలోమీటర్ల లోతున ఇది సంచరిస్తుండడం గమనార్హం. వాస్తవానికి అక్కడ అత్యధిక నీటి ఒత్తిడి ఉంటుంది. జలాంతర్గాములు సైతం అంత లోతుకి చేరుకోవడం కష్టం. మానవుడు ఇప్పటికీ చూడని సముద్రాల అడుగు భాగంలో జీవ వైవిధ్యానికి కొదవ లేదు. మనకు తెలియని ఎన్నో ప్రాణులు అక్కడ ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అటకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం. ఇక్కడ సముద్రం లోతు 6,000 మీటర్ల నుంచి 11,000 మీటర్ల దాకా ఉంటుంది. ఎన్నో విశిష్టమైన జీవులకు అటకామా ట్రెంచ్ నెలవుగా మారింది. అరుదైన యాంఫీపాడ్స్, స్నెయిల్ ఫిష్, మడ్ డ్రాగన్స్ ఇక్కడ కనిపిస్తాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Bolivia: నాటకీయ పరిణామాల మధ్య సైనిక తిరుగుబాటు విఫలం!
సూక్రె: బొలీవియాలో బుధవారం నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్ధతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా.. సాధారణ పౌరులు సైన్యానికి ఎదురు తిరిగారు. దీంతో.. సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.బుధవారం బొలీవియాలో హైడ్రామా నడిచింది. లా పాజ్‌లో ఉన్న ప్లాజా మురిల్లో స్క్వేర్ అధ్యక్ష భవనం(ఇదే పార్లమెంట్ భవనం కూడా) వైపు ఆర్మీ వాహనాలు పరేడ్‌గా వెళ్లాయి. తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. సాయుధులైన సైనికులు భవనం ముందు భారీగా మోహరించగా.. మరికొందరు లోపలికి తలుపులు బద్ధలు కొట్టి మరీ ప్రవేశించారు. ఆ సమయంలో అధ్యక్షుడు లూయిస్ ఆసే కుటుంబం లోపలే ఉంది. ఈలోపు ఈ తిరుగుబాటు ప్రయత్నం గురించి దేశమంతా తెలిసింది. అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాలతో జనాలు నిత్యావసరాలు ఎగబడ్డారు. మరోవైపు భారీగా జనం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జితో సైన్యం వాళ్లను చెదరగొట్టే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈలోపు.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రంకల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనుదిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే తిరుగుబాటు కారకుడైన జూనిగాను అరెస్ట్ చేశారు. సాయంత్రం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన వేల మంది పౌరులను ఉద్దేశించి అధ్యక్షుడు లూయిస్ ఆసే అభివాదం చేశారు. బొలీవియా ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సైన్యానికి త్రివిధ దళాధిపతులుగా కొత్త వాళ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. బొలీవియా జెండా ప్రదర్శిస్తూ జాతీయ గీతం ఆలపించారు ప్రజలు.అయితే.. అరెస్ట్ కంటే ముందు మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా సంచలన ఆరోపణకు దిగారు. ప్రజల్లో తన పరపతిని పెంచుకునేందుకు అధ్యక్షుడు లూయిస్ ఆసే, తనతో కలిసి ఆడించిన డ్రామాగా పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం జుని ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు జునిపై ఎలాంటి అభియోగాలు మోపిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.కోటి 20 లక్షల జనాభా ఉన్న బొలీవియాలో.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాజకీయ సంక్షోభం తలెత్తి అప్పటి అధ్యక్షుడు ఎవో మోరేల్స్ అధ్యక్ష పీఠం నుంచి అర్ధాంతంగా దిగిపోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ లూయిస్ ఆసేతో ఎవో మోరేల్స్ పోటీ పడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఎన్నికలలోపే బొలీవియాలో ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
గుహలు అనుకుంటే పొరబడ్డట్టే.. వాటి వెనుక చాలా పెద్ద కథే ఉంది!
ఈ భూమి కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని మిస్టరీల్లా ఉంటాయి. అవి ఎవరు ఏర్పాటు చేశారన్నది కూడా కనిపెట్టలేం. కానీ వాటి నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. నాటి ఇంజనీరింగ్ నైపుణ్యం ఇంతలా ఉండేదా అనిపిస్తుంది. అలాంటి అంతుచిక్కని మిస్టరీలాంటి సొరంగాలే ఇవి. చూసేందుకు గుహల్లా ఉంటాయి. అయితే ఇందులో ఎవరుండేవారన్నది ఓ మిస్టరీ. కానీ లోపల ఉండే భూగర్భ నగరం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడంటే.. దక్షిణ అమెరికాలో బ్రెజిల్ భూభాగంలో రెండు సొరంగాలును గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇవి చూడటానికి గుహల్లా కనిపించే సొరంగాలు మాదిరిగా ఉన్నాయి. అయితే ఎవరూ వీటిని చేశారనేది తెలియరాలేదు. అయితే ఇవి మానవులకు సంబంధించిన సొరంగాలా లేక జంతువులు వాటి సంరక్షణ కోసం చేసుకునేవా అనేది మిస్టరీగా ఉంది. అయితే దక్షిణ అమెరికాలో పాంపతేరియంకి చెందిన హోల్మెసినా అనే ఒక అంతరించిపోయిన జంతువు తాబేలు మాదిరి షెల్‌తో పెద్దగా ఉండేదని, అదే ఈ సొరంగాలు చేసి ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అలా ఈ సొరంగాలు ఏ జాతుల జంతువులకు సంబంధించిన అని పరిశోధను చేయగా..పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమ అధ్యయనంలో దక్షిణ బ్రెజిల్,అర్జెంటీనా అంతటా దాదాపు 15 వందలకు పైగా ఇలాంటి సొరంగాలను గుర్తించారు పరిశోధకులు. అలాగే 2009లో ఒక రైతు బ్రెజిల్‌లోని దక్షిణ ప్రాంతంలో తన మొక్కజొన్న పొలం గుండా వెళ్తున్నప్పుడూ ఇలాంటి సొరంగాన్ని చూసినట్లు తెలిపాడు. తాను ఆ టైంలో ట్రాక్టర్‌పై అటువైపుగా వెళ్తుండగా ట్రాక్టర్ ఒకవైపుకి ఒరిగిపోయి ఆగిపోయిందని, అప్పుడే వీటిని గుర్తించానని చెప్పుకొచ్చాడు. దీంతో పరిశోధకుల బృందం ఆ దిశగా అధ్యయనం చేయగా, ఆ సొరంగా మొక్కజొన్న పొలం నుంచి రైతు ఇంటి కింద ఉన్న భూగర్భం వరకు ఉండటం చూసి కంగుతిన్నారు. దాదాపు రెండు మీటర్లు ఎత్తు, రెండు మీటర్ల వెడల్పూ, 15 మీటర్ల పొడవాటి పొలం మీదుగా రైతు ఇంటి వరకు సొరంగం ఉన్నట్లు తెలిపారు. అయితే గోడలపై ఉన్న లోతైన పంజాగుర్తులను చూసి నాటి మానవుల గుర్తులే సూచిస్తున్నాయన్నారు. ఇక ఆ పరిశోధకులు బృందలోని ఓ శాస్త్రవేత్త ఇది దాదాపు 10 వేల ఏళ్ల నాటిదని నిర్థారించారు. ఇందులో సుమారు 20 వేల మంది ఉండేవారని అన్నారు. అయితే ఇలా సొరంగం తవ్వే ఇజనీరింగ్ వర్క్ మాత్రం చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ సొరంగా 280 అడుగు దిగువన ఉంది. బహుశా క్రీస్తూ పూర్వం 1200 ఏళ్ల క్రితం ఫిజియన్లు అనే పూర్వీకులు ఉండే వారని భావిస్తున్నారు. వారు గృహ జీవితం ఇలా ఉండి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే కొందరూ మాత్రం రోమన సామ్రాజ్యంలో క్రైస్తవ నివాసులు గుహ వ్యవస్థ ఇలా ఉండేదని, ఇవి వారి ప్రార్థన మందిరాలుగా ఉండేవని అన్నారు. కాలక్రమేణ వైన్, ఆలివ్ వంటి వాటిని తయారు చేసే ప్రదేశాలుగా మారినట్లు భావిస్తున్నారు. బహుశా అప్పటి ప్రజలకు ఈ భూగర్భ నగరం భూతల స్వర్గంగా ఉండి ఉండొచ్చు అందువల్లే ఇలా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చన్నారు. అలాగే నాటి ప్రపంచంపై దండయాత్రలు జరిగేవి కాబట్టి నాటి విజేతలు, ఆక్రమణదారులు వీటిని ఉపయోగించి ఉండొచ్చు అని పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. అయితే చివరికి సొరంగాలు ఏంటన్నవీ శాస్తవేత్తలు నిర్థారించలేకపోయారు. దీంతో అవి ఓ అంతు చిక్కని మిస్టరీ సొరంగాలుగా మిగిలిపోయాయి. These tunnels were once believed to hide religious fortunes deep in their chambers, but the real treasure is found in who - or what - created them. In 2009, a farmer was driving through his corn field in the south of Brazil when he suddenly felt his tractor sink and lurch to… pic.twitter.com/leRQyDpkA5 — Fascinating (@fasc1nate) March 18, 2024 (చదవండి: రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెడితే..ఈ బ్రదర్స్ కారునే ఏకంగా..!) -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
42 ఏళ్లకు అమ్మను చూశాడు!
వాషింగ్టన్: దక్షిణ అమెరికా దేశం చిలీలో నెలలు నిండకుండానే జన్మించిన ఓ శిశువు అపహరణకు గురయ్యాడు. కిడ్నాపర్లు ఆ శిశువును అమెరికాకు చెందిన దంపతులకు దత్తతకిచ్చేశారు. ఇది జరిగి 42 ఏళ్లయింది. ప్రస్తుతం అతడి పేరు జిమ్మీ లిపర్ట్ థైడెన్. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం ఆష్‌బర్న్‌లో ఉంటూ లాయర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, 1970, 80ల్లో నియంత ఫినోచెట్ హయాంలో చిలీలో వందలాదిగా శిశువులు అపహరణకు గురయ్యారు. ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో వారిలో కొందరు తిరిగి కన్నవారి చెంతకు చేరుతున్నారనే వార్తను మొన్న ఏప్రిల్‌లో థైడెన్ చూశాడు. ఆ సంస్థను సంప్రదించి తన డీఎన్ఏ వివరాల సాయంతో కన్న తల్లి జాడ కనుక్కున్నాడు. తోబుట్టువులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఇంకేముంది? భార్య, ఇద్దరు పిల్లలను తీసుకుని చిలీలోని వల్దీవియాలో ఉండే తల్లి మరియా అంజెలికా గొంజాలెజ్ వద్దకు వెళ్లాడు. ‘హాస్పిటల్ సిబ్బంది నెలలు నిండని నా కొడుకు చనిపోయాడని చెప్పగా విని, గుండెలవిసేలా రోదించాను. నా చిన్నారి ఎక్కడున్నా సుఖంగా ఉండాలని దేవుణ్ని కోరుకున్నా. నా ప్రార్థన ఫలించింది’అంటూ ఆమె కొడుకును హత్తుకుంది. తల్లి, కొడుకు కలుసుకున్న వేళ ఆ ఊరంతా పండగ చేసుకుంది. -
అమెజాన్ అడవుల్లో అద్భుతం
బొగొటా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో దట్టమైన అమెజాన్ అడవుల్లో ఒక అద్భుతం జరిగింది. విమాన ప్రమాదంలో చిక్కుకొని అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు ఏకంగా 40 రోజుల తర్వాత మృత్యుంజయులుగా బయటపడ్డారు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడమే ఒక అద్భుతమైతే, క్రూరమృగాలు తిరిగే అడవుల్లో 40 రోజులు ప్రాణాలతో ఉండడం మరో అద్భుతం. దట్టమైన అటవీ ప్రాంతంలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న సైనికులు వారిని క్షేమంగా వెనక్కి తీసుకువచ్చి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పౌష్టికాహార లోపంతో బాగా బలహీనపడిపోవడంతో పాటుగా ఆ చిన్నారుల శరీరంపై పురుగు పుట్రా చేసిన కాట్లు ఉన్నాయి. ఒకే తల్లి బిడ్డలైన నలుగురు చిన్నారుల్లో 13, 9. 4 ఏళ్లతో పాటుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. చరిత్రలో నిలిచిపోతారు : అధ్యక్షుడు పెట్రో అడవుల్లో కనిపించకుండా పోయిన నలుగురు చిన్నారులు క్షేమంగా వెనక్కి తిరిగి రావడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్టావో పెట్రో మృత్యుంజయులు అన్న మాటకి వీరంతా ఉదాహరణగా నిలుస్తున్నారని అన్నారు. వీరు ప్రాణాలతో ఉండడం చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఇదొక మేజికల్ డే అని సైనికులు చేసిన కృషిని అభినందించారు. అసలేం జరిగింది? అమెజాన్ అటవీ ప్రాంతం పరిధిలో అరారాక్యూరా నుంచి శాన్‌జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి గత నెల మే 1న ఒక సింగిల్ ఇంజిన్ విమానం బయల్దేరింది. నలుగురు చిన్నారులు, వారి తల్లి, ఒక గైడ్, ఒక పైలెట్‌తో విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తి ఇంజిన్ విఫలం కావడంతో దట్టమైన కీకారణ్యంలో కుప్పకూలిపోయింది. విమానం రాడార్ నుంచి అదృశ్యం కావడంతో అధికారులు వారిని కాపాడేందుకు సైన్యాన్ని రంగంలోకి దించారు. ఆపరేషన్ హోప్ పేరుతో సహాయ చర్యలు మొదలు పెట్టారు. విమాన ప్రమాదం జరిగిన రెండు వారాల అనంతరం మే 16న అధికారులు విమాన శకలాలను గుర్తించగలిగారు. అక్కడ పైలెట్, గైడ్, చిన్నారుల తల్లి మృతదేహాలు మాత్రమే లభించడంతో పిల్లలు నలుగురు సజీవంగా ఉన్నారని నిర్ణారణకి వచ్చారు. పిల్లలు క్షేమంగానే ఉన్నారనడానికి సైనికుల గాలింపుల్లో పాలసీసా, సగం తిని పారేసిన పండు, జడకు కట్టుకునే రిబ్బన్ వంటివి దొరకడంతో సహాయ చర్యలు మరింత ముమ్మరం చేశారు. పిల్లల అడుగు జాడలు కూడా చాలా చోట్ల కనిపించాయి. వాటి ఆధారంగా దాదాపుగా 150 మంది సైనికులతో పాటుగా జాగిలాల సాయంతో దట్టమైన అడవుల్లో గాలించారు. అడవుల్లో ఉండే గిరిజన తెగలు వారికి సహకారం అందించారు. మొత్తానికి ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత అధికారులు ఆ పిల్లల జాడ కనిపెట్టగలిగారు. హెలికాప్టర్లో రాజధాని బొగొటాలో ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఎలా మనుగడ సాగించారు? అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇన్నాళ్లూ పులులు, పాములు ఇతర క్రూరమృగాల మధ్య ఎలా మనుగడ సాగించారో వివరాలు తెలియాల్సి ఉంది.ఆ పిల్లలు హ్యూటోటో అనే స్థానిక తెగకు చెందినవారు. పుట్టినప్పట్నుంచి అటవీ ప్రాంతాల్లోనే వారు నివాసం ఉంటున్నారు. అడవుల్లో చెట్లకు కాసే ఏ పళ్లు తినాలో , క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తమని తాము కాపాడుకోవాలో కొంతవరకు వారికి అవగాహన ఉంది. అందుకే కీకారణ్యంలో తప్పిపోయినా ప్రాణాలు నిలబెట్టుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ కార్యక్రమాల్లో భాగంగా హెలికాప్టర్ల ద్వారా జారవిడిచిన ఆహార పొట్లాలు బహుశా పిల్లలను కాపాడి ఉంటాయని సైనికాధికారులు భావిస్తున్నారు. పిల్లలు క్షేమంగా తిరిగిరావడంతో వారి బామ్మ ఫాతిమా వాలెన్సియా ఆనందానికి హద్దులే లేవు. పిల్లల తల్లి పనిలో ఉన్నప్పుడు పెద్దమ్మాయి మిగిలిన చిన్నారుల ఆలనాపాలనా చూసేదని, అదే ఇప్పుడు అడవుల్లో వాళ్లు ఇన్నాళ్లూ గడపడానికి ఉపయోగపడిందని చెప్పారు. -
ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా!
ఏ దేశంలోని రోడ్లయినా వివిధ ప్రాంతాలను కలుపుతాయనే విషయం మనకు తెలిసిందే. వివిధ రోడ్లపై ప్రయాణించడం ద్వారా మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవచ్చు. అయితే కొన్ని రోడ్లు చిన్నవిగా, మరికొన్ని రోడ్లు పెద్దవిగా ఉండటాన్ని మనం గమనించేవుంటాం. మనదేశంలోని అతిపెద్ద రోడ్డు విషయానికివస్తే అది నేషనల్ హైవే-44. ఇది 3,745 కిలోమీటర్ల దూరం కలిగివుంది. ఇది కన్యాకుమారితో మొదలై శ్రీనర్ వరకూ ఉంటుంది. అయితే ప్రపంచంలో దీనికి మించిన అతిపెద్ద హైవే ఉందని, దానిపై ప్రయాణిస్తే ఏకంగా 14 దేశాలు చుట్టేయచ్చనే సంగతి మీకు తెలుసా? ఉత్తర అమెరికా- దక్షిణ అమెరికాలను కలిపే పాన్ అమెరికా హైవే ప్రపంచంలోనే అతి పెద్ద రహదారి. అలస్కాలో మొదలై అర్జెంటీనా వరకూ ఈ రహదారి కొనసాగుతుంది. రెండు మహా ద్వీపాలను అనుసంధానించే ఈ సింగిల్ రూట్ నిర్మాణానికి 1923లో తొలి అడుగు పడింది. ఈ హైవేను మొత్తం 14 దేశాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ రహదారిలోని 110 కిలోమీటర్ల ఒక భాగం నిర్మాణం ఇప్పటివరకూ పూర్తి కాలేదు. ఈ భాగాన్ని డారియన్ గ్యాప్ అని అంటారు. ఇది పనామా కొలంబియాల మధ్య ఉంది. కాగా ఈ డారియన్ గ్యాప్ ప్రాంతం కిడ్నాప్‌లు, డ్రగ్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ తదితర అక్రమ కార్యకలాపాలకు నిలయంగా మారింది. దీంతో జనం ఈ మార్గాన్ని దాటేందుకు బోటు లేదా ప్లెయిన్ మాధ్యమంలో బైపాస్ చేస్తారు. చదవండి: ఖండాంతరాలు దాటిన ప్రేమ.. భార్య కోసం ఇండియా నుంచి యూరప్‌కు సైకిల్‌పై ఆ 14 దేశాలు ఇవే.. 1. యునైటెడ్ స్టేట్స్ 2.కెనడా 3. మెక్సికో 4. గ్వాటెమాల 5. ఎల్ సల్వడార్ 6.హోండురాస్ 7. నికరాగ్వా 8. కోస్టా రికా 9.పనామా 10.కొలంబియా 11. ఈక్వెడార్ 12. పెరూ 13.చిలీ 14. అర్జెంటీనా ప్రయాణానికి ఎంత సమయం పడుతుందంటే... ఎవరైనా ప్రతీరోజూ సుమారు 500 కిలోమీటర్ల మేరకు ప్రయాణించగలిగితే వారు 60 రోజుల్లో ఈ రహదారి ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. కార్లెస్ సాంటామారియా అనే సైకిలిస్టు ఈ రహదారిని 177 రోజుల్లో చుట్టివచ్చాడు. ఈ నేపధ్యంలో అతని పేరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదయ్యింది. ఈ రహదారి మొత్తం పొడవు 48 వేల కిలోమీటర్లు. The Pan-American highway is the longest highway in the world. This road is about 19.000 miles/30.000km long #nowyouknow #FridayThoughts pic.twitter.com/oRdBTMhFRD — 🇺🇦Evan Kirstel #B2B #TechFluencer (@EvanKirstel) November 6, 2020 -
బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి
లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూలోని ఓ బంగారు గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 27 మంది మృతి చెందారు. ఇద్దరిని మాత్రమే రక్షించగలిగామని అధికారులు తెలిపారు. అరెక్విపా ప్రాంతంలోని ఎస్పెరాంజా గనిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఈ ఘటన చోటుచేసుకుంది. గనిలో సుమారు 100 మీటర్ల లోతులో సిబ్బంది పనిచేస్తున్న చోట మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులు పెరూలో ఉన్నాయి. ఏటా వీటి నుంచి 100 టన్నుల బంగారాన్ని వెలికితీస్తుంటుంది. ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో ఇది 4%. -
Lionel Messi: 'వొడువని ముచ్చట'.. అరుదైన గౌరవం
మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా జట్టు ఫిఫా వరల్డ్‌కప్ సాధించి ఇప్పటికి మూడు నెలలు కావొస్తుంది. కానీ ఇంకా అది ఒడవని ముచ్చటలాగానే కనిపిస్తుంది. ఎందుకంటే మూడు నెలలైనా ఇంకా మెస్సీ నామస్మరణ మారుమోగుతూనే ఉంది. వరల్డ్‌కప్ సాధించినప్పటి నుంచి మెస్సీకి ఏదో ఒక చోట గౌరవ సత్కారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ కౌన్సిల్ మెస్సీకి అరుదైన గౌరవంతో సత్కరించింది. సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ హెడ్‌క్వార్టర్స్ అయిన కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్‌కప్‌ను అందించినందుకు గానూ ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్ కౌన్సిల్ పేర్కొంది. కాగా ఫుట్‌బాల్‌లో దిగ్గజాలుగా పేరు పొందిన డీగో మారడోనా, పీలే తర్వాత కాన్‌మిబోల్ మ్యూజియంలో ఈ గౌరవం అందుకున్న మూడో ఆటగాడిగా మెస్సీ రికార్డుకెక్కాడు. ఇక గతేడాది డిసెంబర్లో ఫ్రాన్స్‌పై పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించిన అర్జెంటీనా 36 ఏళ్ల తర్వాత మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం అంతా తానై నడిపించిన మెస్సీ ఏడు గోల్స్ కొట్టి గోల్డెన్ బాల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఇటీవలే బ్యూనస్ ఎయిర్స్లో పనామాతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు 2-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మెస్సీ ఒక గోల్ చేశాడు. ఇది మెస్సీకి 800వ గోల్ కావడం విశేషం. ఇక అర్జెంటీనా తరపున 99వ గోల్స్ సాధించిన మెస్సీ వందో గోల్‌కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. Statue for the best player in history. #Messi 🐐🇦🇷pic.twitter.com/BrW2XqShh8 — Leo #Messi 🐐 (@LeoCuccittini_) March 27, 2023 చదవండి: దుమ్మురేపిన రొనాల్డో.. పోర్చుగల్ ఖాతాలో రెండో విజయం -
ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్ సమీరా గోజైన్ బుధవారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని నగరం డేవిడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది. కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తున్నారు. -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
Monkeypox: బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం
బ్రెసిలియ: మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించి వారం గడవక ముందే మరిన్ని దేశాలకు వైరస్ విస్తరించింది. తాజాగా ప్రపంచంలో బయటిదేశాల్లో తొలి మంకీపాక్స్ మరణం రికార్డు అయ్యింది. మంకీపాక్స్ మొదటగా వెలుగు చూసింది ఆఫ్రికాలోనే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్రికా దేశాల్లోనే అత్యధిక మంకీపాక్స్ కేసులు, మరణాలు సంభవించాయి. అయితే తొలిసారిగా ఓ బయటిదేశంలో మంకీపాక్స్ మరణం నమోదు కావడం విశేషం. దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్లో 41 ఏళ్ల వ్యక్తి Monkeypoxతో మరణించాడని అక్కడి వైద్యాధికారులు ప్రకటించారు. 👉🏽 బ్రెజిల్ రాష్ట్రం మినాస్ గెరాయిస్ రాజధాని బెలో హోరిజోంటేలో సదరు వ్యక్తి మంకీపాక్స్‌తో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే అతనిలో రోగనిరోధక వ్యవస్థ(ఇమ్యూనిటీ) అత్యంత బలహీనంగా ఉందని, రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. 👉🏽 ఇదిలా ఉంటే.. జూన్ 10వ తేదీన యూరప్ నుంచి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ నిర్ధారణ కావడంతో బ్రెజిల్లో తొలి కేసు నమోదు అయ్యింది. ఇప్పటిదాకా వెయ్యి దాకా మంకీపాక్స్ కేసులు బ్రెజిల్లో నమోదు అయ్యాయి. సావో పాలో, రియో డీ జనెరియోలోనే ఎక్కువ కేసులు వెలుగు చూశాయి. 👉🏽జ్వరం, హై ఫీవర్, వాపు లక్షణాలు, చికెన్‌పాక్స్ తరహా ఒంటిపై దద్దర్లు తదితర లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 👉🏽డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. మంకీపాక్స్ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన వైరస్. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటిదాకా 78 దేశాల్లో మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 70 శాతం యూరప్ దేశాల్లో, 25 శాతం అమెరికాలో బయటపడ్డాయి. 👉🏽 మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చు. గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మంకీపాక్స్ ఒకరి నుంచి ఒకరిని వ్యాపిస్తోంది. చికిత్సతో వైరస్ నుంచి బయటపడొచ్చు. 👉🏽 అయితే ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో ఎక్కువ శాతం కేసులు లైంగిక ధోరణి వల్లే నమోదు అయ్యాయి. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన WHO.. సెక్స్ పార్ట్నర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు సైతం జారీ చేసింది. చదవండి: మంకీపాక్స్‌తో సీరియస్ అయితే ఈ టీకా వాడొచ్చు! -
కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్
బొగొటా: దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. దేశ కొత్త అధ్యక్షుడిగా వామపక్ష మాజీ తిరుగుబాటు నేత గుస్తావో పెట్రో ఆగస్ట్ 7న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆఫ్రో–కొలంబియన్ అయిన ఫ్రాన్సియా మార్కెజ్(40) చిన్నతనం నుంచే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలను ముందుండి నడిపారు. నల్లజాతి కొలంబియన్ల తరఫున పోరాడారు. సుదీర్ఘకాలం కొనసాగిన సాయుధ పోరాటం కారణంగా సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేస్తామని మార్కెజ్ మీడియాతో అన్నారు. లా టొమా అనే మారుమూల గ్రామంలోని పేద కుటుంబంలో జన్మించిన మార్కెజ్ 16 ఏళ్ల వయస్సులోనే తల్లి అయ్యారు . తన కూతురు కోసం ఎంతో కష్టపడ్డారు. ఒకవైపు రెస్టారెంట్లో పనిచేసుకుంటూనే లా డిగ్రీ పూర్తి చేశారు. చుట్టు పక్కల గ్రామాల్లోని అఫ్రో–కొలంబియన్లకు చెందిన భూముల్లో అక్రమ బంగారు గనుల తవ్వకాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు. ఆమె కృషికి గాను 2018లో గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్మెంటల్ బహుమతి అందుకున్నారు. డెమోక్రటిక్ పోల్ పార్టీలో గత ఏడాది జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి గుస్తావో పెట్రో చేతిలో ఓడిపోయారు. కానీ, పార్టీలోని మిగతా సీనియర్ నేతల కంటే ఎక్కువ ఓట్లు ఆమెకే పడ్డాయి. సాయుధ వామపక్ష తిరుగుబాటు నేత అయిన పెట్రోకు ప్రజల్లో అంతగా పలుకుబడి లేదు. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పేదలు, యువత, పట్టణ ప్రాంత మహిళలు మార్కెజ్ వైపు మొగ్గు చూపారు. ఆఫ్రో–కొలంబియన్ల ప్రాంతాల్లో మెజారిటీ ఓట్లు పెట్రోకు పడ్డాయి. మార్కెజ్ జనాదరణ కూడా విజయానికి బాటలు వేసిందని స్పష్టం చేస్తున్నారు. -
ముప్పు ముంగిట అమెజాన్.. కథ మారకపోతే కష్టాలకు తలుపులు బార్లా తెరిచినట్టే!
ఒకపక్క వాతావరణ మార్పులు, మరోపక్క అడవుల నరికివేతతో ప్రఖ్యాత అమెజాన్ వర్షారణ్యం (రెయిన్ ఫారెస్ట్) ఎండిపోతోంది. మానవ తప్పిదాల కారణంగా అమెజాన్ అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు క్షీణిస్తున్నాయని, దీంతో ఇవి క్రమంగా అడవుల స్థాయి నుంచి సవన్నా (గడ్డి మైదానాలు)లుగా మారిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇదే నిజమైతే కేవలం అమెజాన్ విస్తరించిన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతటిపై పెను ప్రభావం పడుతుందని తెలిపింది. అమెజాన్ బేసిన్‌లోని వర్షారణ్యం ప్రపంచ వర్షారణ్యాల్లో సగానికిపైగా ఉంటుంది. ప్రపంచ కార్బన్‌డైఆక్సైడ్ (co2) స్థాయి నియంత్రణలో అమెజాన్ వర్షారణ్యానిది కీలకపాత్ర. అయితే ఈ అడవులు క్షీణించి సవన్నాలుగా మారితే co2 నియంత్రణ బదులు co2 వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని పర్యావరణ నిపుణులు వివరించారు. గతంలో ఊహించినదాని కన్నా వేగంగా ఈ అడవులు అంతర్ధానం అంచుకు చేరుతున్నాయన్నారు. 25 సంవత్సరాల శాటిలైట్ డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ అడవి వేగంగా క్షీణిస్తోందని నేచర్ క్లైమెట్ ఛేంజ్‌లో పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా చెట్ల నరికివేత, కరువు సంభవించిన ప్రాంతాల్లో తిరిగి అడవి కోలుకోవడం దాదాపు సగానికిపైగా తగ్గిందని అధ్యయన సహ రచయత టిమ్ లెంటాన్ చెప్పారు. మానవ తప్పిదాలకు తోడు పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు అమెజాన్ అడవుల రికవరీ సామర్థ్యం పూర్తిగా నశించిపోయేందుకు కారణమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా కార్బన్ కాలుష్యాన్ని తగ్గించకపోతే శతాబ్ది మధ్యకు వచ్చేసరికి ఈ అడవులు పూర్తిగా కనుమరుగవుతాయని అంచనా వేశారు. ప్రపంచానికే డేంజర్ ఇప్పటికే ధ్రువాల వద్ద మంచు కరగడం, వాతావరణంలో co2 స్థాయిలు పెరగడం, దక్షిణాసియాలో అనూహ్య రుతుపవనాలు, క్షీణిస్తున్న కోరల్ రీఫ్ పర్యావరణ వ్యవస్థలు, అట్లాంటిక్ సముద్ర ప్రవాహాల్లో మార్పులతో ప్రపంచమంతా ప్రమాదం అంచుల్లోకి పయనిస్తోంది. వీటికి అమెజాన్ అడవుల క్షీణత తోడైతే కార్చిచ్చుకు వాయువు తోడైనట్లు ప్రమాదకర పర్యావరణ మార్పులు సంభవిస్తాయని నిపుణుల అంచనా. అమెజాన్ అడవులు అధిక శాతం విస్తరించిన బ్రెజిల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అడవుల నరికివేత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ కారణంగా ఒకప్పుడు co2 సింక్ (కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకునే)గా ఉన్న అమెజాన్ ఫారెస్టు ప్రస్తుతం co2 సోర్స్ (ఉత్పత్తి కారకం)గా మారిందని సైంటిస్టులు హెచ్చరించారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో అమెజాన్ అడవులు వదిలే కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం 20 శాతం మేర పెరిగిందన్నారు. వాతావరణంలో co2 పెరగడం ఉష్ణోగ్రతలు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ వాయువును పీల్చుకోవడంలో చెట్లు, మృత్తిక కీలక పాత్ర పోషిస్తాయి. ఎప్పుడైతే చెట్ల నరికివేత ఊపందుకొని, మృత్తికలు సారహీనం కావడం జరుగుతుందో co2 నియంత్రణ అదుపుతప్పుతుంది. అమెజాన్ అడవులు దాదాపు 9000 కోట్ల టన్నుల co2ను నియంత్రిస్తుంటాయి. ఈ అడవుల క్షీణతతో ఇంత స్థాయిలో co2 వాతావరణంలోకి విడులయ్యే అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు దక్షిణఅమెరికాతో పాటు ప్రపంచమంతా ఫలితం అనుభవించాల్సిఉంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం ఇంకా ఉందని అధ్యయన రచయతలు తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలను నియంత్రించగలిగితే ఆటోమేటిగ్గా అరణ్య రికవరీ సామర్ధ్యం పెరుగుతుందన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం, చెట్ల నరికివేతను నియంత్రించడం, పంటమార్పిడి ద్వారా మృత్తిక సారహీనం కాకుండా కాపాడడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేకతలు.. ► 9 దేశాల్లో దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల పైచిలుకు విస్తీర్ణంలో అమెజాన్ వర్షారణ్యం వ్యాపించి ఉంది. ► అమెజాన్ పరీవాహక ప్రాంతంలో 75 శాతాన్ని ఈ అడవులు ఆక్రమించాయి. ► కలప, బయో ఇంధనం, పోడు వ్యవసాయం కోసం 1970 నుంచి ఈ అరణ్యంలో 20 శాతాన్ని మనిషి కబళించాడు. ► ఈ అడవుల్లో దాదాపు 3,344 ఆదిమ జాతుల ప్రజలు నివాసముంటున్నారు. ► వీటిపై ఆధారపడి సుమారు 3 కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నారు. ► ప్రపంచంలోని జీవ ప్రజాతుల్లో పదింట ఒకటి ఈ వర్షారణ్యాల్లో కనిపిస్తుంది. ► ప్రపంచంలోనే అత్యధిక వృక్ష, జీవ ప్రజాతులకు ఈ అడవులు ఆవాసం. ► ఇందులో సుమారు 16 వేల ప్రజాతులకు చెందిన దాదాపు 39,000 కోట్ల చెట్లున్నట్లు అంచనా. ► ఈ అడవుల్లో 25 లక్షల రకాల కీటకాలు, 2, 200 రకాల చేపలు, 1,294 రకాల పక్షులు, 427 రకాల క్షీరదాలు, 378 రకాల సరీసృపాలు నివసిస్తున్నాయి. – నేషనల్ డెస్క్, సాక్షి. -
బంగారంలో బప్పీ లహరిని మించిపోయాడు.. శరీరంపై 2 కిలోలు, కారు, బైక్ అన్నీ..
బప్పీలహిరి.. సంగీతమే కాదు.. ఆయన ఆహార్యమూ స్పెషలే.. ముఖ్యంగా బంగారం. అది తనకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుందన్నది ఆయన నమ్మకం.. ఈ చిత్రంలోని వియత్నాంవాసి ట్రాన్డక్లాయ్ అయితే.. దాన్ని మరింత ఎక్కువ నమ్ముతాడు.. అందుకే ఎప్పుడూ తన శరీరం మీద రెండు కిలోలకు తక్కువ కాకుండా ఇలా గోల్డ్ ఉంచుకుంటాడు. అదొక్కటేనా.. తన కారు, బైక్ అన్నీ గోల్డ్ ప్లేటింగ్ చేయించేశాడు.. దాని వల్ల లోకల్‌గా పాపులర్ కూడా అయ్యాడు. ఇంత బంగారం ఉంది.. ఏం చేస్తాడు అనేదేగా మీ డౌట్.. వియత్నాంలో దక్షిణ అమెరికా బల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు.. వాటిని తెచ్చి.. అమ్మడమే మనోడి పని. చదవండి: "భార్యలను కొట్టండి" భర్తలకు సలహలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి! -
లోయలో పడిన బస్సు.. 24 మంది మృతి
లాపాజ్(బొలివియా): దక్షిణ అమెరికాలోని బొలివియాలో విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడడంతో 24 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బస్సు దాదాపు 100 మీటర్ల లోతు ఉన్న లోయలో పడడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
డెలివరీ బాయ్‌గా మారిన అంతర్జాతీయ క్రికెటర్
ఒలింపిక్ చాంపియన్... ఈ ఒక్క మాట చాలు ఆటగాళ్ల రాతను మార్చేందుకు... మనలాంటి దేశంలో అయితే ఒలింపిక్ స్వర్ణం సాధించిన ఆటగాడు మిగతా జీవితం గురించి ఆలోచించాల్సిన, బెంగ పడాల్సిన పనే ఉండదు. కోట్ల రూపాయలు, కానుకలతో కనకాభిషేకం కురుస్తుంది. కానీ అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. ఒలింపిక్ విజయం సాధించినా సరే... అవసరమైనప్పుడు బతుకుతెరువు కోసం ఎలాంటి చిన్న పనికైనా సిద్ధం కావాల్సిందే. అదీ వెనిజులా లాంటి దేశం నుంచి వచ్చిన ఆటగాడి పరిస్థితి అయితే మరీ ఇబ్బందికరం. లాడ్జ్ (పోలాండ్): దక్షిణ అమెరికా దేశం వెనిజులా... ఆ దేశం తరఫున ఇద్దరు ఆటగాళ్లు ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. 1968లో బాక్సర్ ఫ్రాన్సిస్కో రోడ్రిగ్స్ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్‌లో ఫెన్సింగ్ క్రీడాంశంలో రూబెన్ లిమార్డో గాస్కన్ బంగారు పతకం సాధించాడు. అయితే ఆ తర్వాత కూడా లిమార్డోకు పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ లోటు లేకుండా మాత్రం జరిగిపోయింది. 2016 రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... ఇప్పుడు మళ్లీ టోక్యో ఒలింపిక్స్ కోసం అతను సన్నద్ధమవుతున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా రూబెన్ లిమార్డో; ‘లండన్’ స్వర్ణంతో... రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ రజతాలు కూడా గెలుచుకున్న 35 ఏళ్ల లిమార్డో... ఇందుకోసం యూరోపియన్ దేశం పోలాండ్‌లో శిక్షణ పొందుతున్నాడు. ఇంత కాలం ఒక ఆటగాడిగా స్పాన్సర్షిప్ నుంచే వచ్చే డబ్బులతో అంతా సవ్యంగానే సాగింది. అయితే కరోనా ఒక్కసారిగా అన్నీ మార్చేసింది. టోక్యో క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో పాటు స్పాన్సర్లు కూడా వెనక్కి తగ్గారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము అండగా నిలవలేమంటూ చేతులెత్తేశారు. ఒకవైపు శిక్షణ, మరోవైపు భార్య, ఇద్దరు పిల్లల బాధ్యత కూడా ఉంది. ఒక క్రీడాకారుడిగా ఇన్నేళ్లు గడిపిన తనకు మరో పని తెలీదు. దాంతో కుటుంబ పోషణ కోసం లిమార్డో ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్ అవతారమెత్తాడు. ఉదయమే ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం తన సైకిల్‌పై ఫుడ్ ఆర్డర్లు అందించేందుకు బయల్దేరడం, సాయంత్రం వచ్చి మళ్లీ సాధన కొనసాగించడం అతని దినచర్య. అయితే డెలివరీ బాయ్‌గా పని చేయడం పట్ల తాను బాధ పడడం లేదని, కోవిడ్–19 కాలంలో కనీసం బతికేందుకు ఒక ఆధారం దొరికినందుకు సంతోషిస్తున్నానని చెప్పినప్పుడు లిమార్డోలో ఒక ఒలింపిక్ చాంపియన్ కాకుండా ఎలాగైనా పోరాటం సాగించాలనుకునే ఒక సామాన్యుడు కనిపించాడు. మరో ఒలింపిక్ పతకం తన కల అని, దానిని నెరవేర్చుకునేందుకు ఎంతౖకైనా కష్టపడతానని అతను చెబుతున్నాడు. అతని స్వదేశం వెనిజులా నుంచి అయితే అసలు ఆశించడానికి ఏమీ లేదు. తీవ్ర రాజకీయ సంక్షోభం కారణంగా ఆ దేశం ప్రస్తుతం కనీస ఆహారం, మందులు కూడా లేకుండా భయంకర పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ 1 యూఎస్ డాలర్ విలువ సుమారు 10 వేల వెనిజులన్ బొలీవర్స్కు పడిపోవడం దాని తీవ్రతను చూపిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్ కూడా... నెదర్లాండ్స్‌కు చెందిన 28 ఏళ్ల పాల్ ఆడ్రియాన్ వాన్ మీకెరన్ది కూడా ఇదే తరహా బాధ. నెదర్లాండ్స్ క్రికెట్ జట్టులో ప్రధాన ఆటగాడైన ఈ ఫాస్ట్ బౌలర్ జాతీయ జట్టు తరఫున 5 వన్డేలు, 41 టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2020 టి20 వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన నెదర్లాండ్స్ జట్టులో అతను కూడా సభ్యుడు. అయితే ఇప్పుడు టి20 ప్రపంచకప్ వాయిదా పడటం అతడికి సమస్య తెచ్చిపెట్టింది. సాధారణంగా నెదర్లాండ్స్ క్రికెటర్లు వేసవిలో మాత్రమే క్రికెట్ బరిలోకి దిగి ఆటకు అనువుగా ఉండని శీతాకాలంలో ఇతర ఉద్యోగాలు చేసుకుంటారు. అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియా గడ్డపై ప్రపంచ కప్ జరిగి ఉంటే వారికి డబ్బు వచ్చి ఉండేది. కానీ ఆ అవకాశం లేకపోవడంతో వాన్ మీకెరన్ కూడా ‘ఉబెర్ ఈట్స్’ డెలివరీ బాయ్‌గా పని మొదలు పెట్టాడు. ‘ఈ రోజు ప్రపంచకప్ క్రికెట్ ఆడుతూ ఉండాల్సింది. కానీ ఈ శీతాకాలంలో డబ్బుల కోసం ఉబెర్ ఈట్స్ డెలివరీలు చేయాల్సి వస్తోంది. పరిస్థితులు ఎలా మారిపోతాయో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అయితే బాధేమీ లేదు. అంతా నవ్వుతూ ఉండండి’ అని మీకెరన్ ట్వీట్ చేశాడు. -
ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగలవు!
ప్రకృతిలోని అద్భుతమైన ‘నిర్మాణాల్లో’ సాలెగూడు కూడా ఒకటి. ఆహారాన్ని సంపాదించుకునేందుకు సాలీడు పురుగులు దీనిని అల్లుకుంటాయి. ఇందులో చిక్కిన జీవి(సూక్ష్మజీవులు) ఏదైనా సరే విలవిల్లాడుతూ ప్రాణాలు విడవాలే తప్ప.. తప్పించుకోవడం అసాధ్యం. ఆహారం సంపాదించుకునేందుకు అంత పక్కాగా ప్లాన్ చేస్తాయి సాలీడులు. ఇక సాధారణంగా ఇప్పటి వరకు సాలీడులు చిన్న చిన్న జీవులను తినడం మాత్రమే మనం చూశాం. అయితే తరంతుల అనే జాతికి చెందిన ‘పింక్ టో తరంతుల’ అనే పెద్ద సాలీడు ఓ పక్షిని ముందరి కాళ్లతో బంధించి దానిని నోట కరచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘సాలీడు, పక్షిని తింటుందా. మా షెడ్లో కూడా సాలీడు గూళ్లు ఉన్నాయి. ఇకపై అక్కడికి వెళ్లను. ఇది చాలా భయంకరంగా ఉంది’’అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.(చదవండి: ఈ కుక్క పిల్ల చాలా తెలివైంది) ఇక ఈ విషయం గురించి జాసన్ డన్లోప్ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ.. ‘‘చెట్లపై నివసించే ఇలాంటి పెద్ద సాలీడులు సాధారణంగా చిన్న చిన్న పక్షులు, ఎలుకలను చంపి తింటాయి. అయితే ఎటువంటి ఆహారాన్నైనా సరే చప్పరించి, జ్యూస్‌లా మార్చుకుని తాగేస్తాయి. ఇక ఈ వీడియోలో ఉన్న పక్షి ఎముకలు, ఈకలు తప్ప ఇంకేం మిగిలే అవకాశం లేదు’’అని చెప్పుకొచ్చారు. కాగా పింక్ టో తరంతుల సాలీడులు ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. -
పక్షిని నోట కరచుకున్న సాలీడు
-
వామ్మో! ఖైదీల లాక్డౌన్ అంటే ఇలానా?
వాషింగ్టన్: ఎల్ సాల్విడార్‌లో శుక్రవారం ఒక్క రోజే 22 మంది హత్యకు గురవడంతో దేశ అధ్యక్షుడు నయీబ్ బ్యూక్‌లే, ఇజాల్కోలోని జైల్లో 24 గంటల లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆ జైల్లో ముఠా నాయకులు శిక్షలు అనుభవిస్తుండడం, వారి ఆదేశాలు, వ్యూహాల ప్రకారమే బయట నగరంలో హత్యలు జరగుతున్నాయని నయీబ్ భావించడమే అందుకు కారణం. ఆయన దేశ అధ్యక్షుడిగా గత జూన్ నెలలో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే రోజు 22 హత్యలు జరగడం ఇదే మొదటి సారి. ఈ నేపథ్యంలో జైల్లోని ఖైదీలెవరూ ఒకరికొకరు మాట్లాడకుండా వారందరిని ఒకే చోట నిర్బంధించడం ద్వారా లాక్డౌన్ అమలు చేయాలని నయీబ్ జైలు అధికారులను ఆదేశించారు. అయితే కరోనా వైరస్ విజంభిస్తోన్న నేపథ్యంలో ఎల్ సాల్విడార్ గత మార్చి నెల నుంచి దేశ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. అందులో భాగంగా ప్రజలంగా మాస్క్‌లు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఇజాల్కోలోని జైల్లో ఖైదీలను ఒకో చోట నిర్బంధించడం వల్ల సామాజిక దూరం నిబంధన గాలిలో కలసిపోయింది. పైగా ఊపిరాడనంతగా ఖైదీలను ఒకరిపై ఒకరు ఆనుకునేలా బంధించారు. కొన్నేళ్ల క్రితం వరకు ఎల్ సాల్విడార్‌లో వీధి ముఠాల మధ్య కుమ్ములాటలు జరిగేవి. వాటిని మరాస్‌లని పిలిచేవారు. ఆ కుమ్ములాటల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించేవి. దేశాధ్యక్షుడి నయీబ్ వచ్చాకే కుమ్ములాటలు పూర్తిగా నిలిచి పోయాయి. కొన్ని నెలలుగా ఒక్కరంటే ఒక్కరు కూడా మరణించలేదు. శుక్రవారం నాడు ఒక్క రోజే 22 మంది హత్య జరగడంతో ఆయన జైలు లాక్‌డౌన్‌కు నిర్ణయం తీసుకున్నారు. -
అమెజాన్ కార్చిచ్చుల ఎఫెక్ట్
వాషింగ్టన్: పుడమికి ఊపిరితిత్తుల్లాంటి అమెజాన్ అడవుల్లో ఏర్పడిన కార్చిచ్చు వల్ల ఏర్పడిన దుష్పరిణామాలు ఇంకా కొనసాగుతున్నాయి. అమెజాన్ అడవులకు దాదాపుగా 2 వేల కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అండిస్ పర్వత శ్రేణుల్లోని హిమనీనదాలు కరిగిపోతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు. అడవులు తగలబడడంతో సూక్ష్మమైన కాలుష్యకారక బొగ్గు కణాలు గాల్లో కలుస్తాయి. ఇవి వాయువేగంతో ప్రయాణించి అండీన్ హిమనీనదంపై పేరుకుంటున్నాయి. బ్రెజిల్‌కు చెందిన రియోడీజనీరో స్టేట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అమెజాన్ కార్చిచ్చులకు, హిమనీనదాలు కరగడానికి మధ్య సంబంధంపై అధ్యయనం చేసి ఈ విషయాలు వెల్లడించారు. -
జుట్టు కత్తిరించి.. ఈడ్చుకెళ్తూ..
లా పాజ్ : అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణ అమెరికా దేశం బొలీవియా రక్తసిక్తమవుతోంది. అధికార మూమెంట్ ఫర్ సోషలిజం పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు ఉధృతం చేశాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా.. ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల విద్యార్థి మృతికి కొచాబాంబ పట్టణ మేయర్ పేట్రిసియా ఆర్సే కారణమంటూ నిరసనకారులు గురువారం ఆందోళన చేపట్టారు. మేయర్ కార్యాలయానికి నిప్పంటించి ఆమెను వీధిలోకి ఈడ్చుకువచ్చి... హంతకురాలు అని అరుస్తూ మోకాళ్లపై కూర్చోబెట్టారు. అనంతరం ఆమెపై ఎరుపు రంగు కుమ్మరించి... ఆపై జుట్టు కత్తిరించి.. చెప్పుల్లేకుండా రోడ్డుపై నడిపిస్తూ అమానుషంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని... పేట్రిసియాను ఆస్పత్రికి తరలించారు. కాగా బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరాల్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళా మేయర్‌పై దాడి ప్రతిపక్షాల దురహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. ‘ తన అనుచరులను కాపాడేందుకు ప్రయత్నించినందుకు ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించారు. పేదల పక్షాన నిలబడినందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక దేశ ఉపాధ్యక్షుడు అల్వారో గ్రేసియా ఘటనపై స్పందిస్తూ.. ‘ మహిళగా పుట్టడమే ఆమె చేసిన నేరం. నిజాయితీగా ఉండటమే ఆమె తప్పు. మహిళ అయినందుకే ఈ ఘోరం అని వ్యాఖ్యానించారు. ఇక అధికార పార్టీ మహిళా విభాగం కూడా ఘటనపై తీవ్రంగా స్పందించింది. మేయర్‌పై దాడిని.. జాత్యహంకార, వివక్షాపూరిత, హింసాత్మక ఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని.. ఫాసిస్టు నాయకుల అహంకారానికి నిదర్శనమని పేర్కొంది. కాగా 2006లో బొలీవియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఎవో మారెల్స్.... ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి మరోసారి అధికారం చేజిక్కించుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
మంటల్లో ‘అమెజాన్’; విరాళాలు ఇవ్వండి!
బ్రెసీలియా : ప్రపంచంలోనే అత్యధిక పొడవైన వర్షాధార ఉష్ణమండల అడవి(రెయిన్‌ఫారెస్ట్)గా ప్రసిద్ధికెక్కిన అమెజాన్‌లో కార్చిచ్చు రగులుతోంది. ఈ అడవిలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. గత కొన్నాళ్లుగా మంటల ధాటికి ఈ అడవిలోని చెట్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్‌లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్‌పీఈ వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో(2013-2018) వీటి సంఖ్య 83 శాతం పెరిగిందని పేర్కొంది. దీంతో దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ అలుముకుందని తెలిపింది. బ్రెజిల్‌పై ఈ మంటల ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా అమెజానస్, రోండోనియా రాష్ట్రాల్లో పూర్తిగా పొగ అలుముకుందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆగష్టు మొదటివారంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడంతో బ్రెజిల్లో అత్యవసర పరిస్థితి విధించారు. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడిగా బోల్సోనారో విఫలమయ్యారని..ఆయన అడవుల నరికివేతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విమర్శలపై స్పందించిన బోల్సోనారో పర్యావరణ కార్యకర్తలుగా చెప్పుకొనే కొంతమంది వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగానే అడవులను తగులబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.కాగా అటవీ సమీపంలోని భూములను వ్యవసాయానికి అనువుగా మార్చుకునే సమయంలో, పంట చేతికొచ్చిన తర్వాత రైతులు వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు వ్యాప్తిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రమాదాల సంఖ్యతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ద లంగ్స్ ఆఫ్ ప్లానెట్’ గా వ్యవహరించే అమెజాన్ ఈ స్థాయిలో కాలుష్య కారకాలను వెదజల్లడంతో దక్షిణ అమెరికా దేశాల్లోని వివిధ రాష్ట్రాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ జనాభాకు 20 శాతం ప్రాణవాయువు(ఆక్సీజన్) అందించడంతో పాటు జీవవైవిధ్య సమతౌల్యంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ క్రమంగా అంతరించిపోయినట్లయితే.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కనీసం తాగునీరు కూడా లభించని దుస్థితి దాపురిస్తుందని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు. అమెజాన్‌ను కాపాడండి! ఇక పచ్చని అడవి కార్చిచ్చు దాటికి బుగ్గిపాలవుతున్న ఫొటోలు, వీడియోలను నాసాకు చెందిన ఆక్వా సాటిలైట్, యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన సెంటినల్ 3 ఉపగ్రహం విడుదల చేశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో #Prayfor Amazonas, #AmazonRainforest హ్యాష్‌ట్యాగ్‌లతో అమెజాన్‌ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి పెద్ద ఉద్యమం నడుస్తోంది. అదే విధంగా మానవాళి మనుగడకు దోహదపడుతున్న అడవిని మంటల నుంచి కాపాడుకునేందుకు విరాళాలు అందజేయాల్సిందిగా నెటిజన్లు పలువురు బిలియనీర్లకు విఙ్ఞప్తి చేస్తున్నారు. అడవులను సంరక్షించుకునే ఉద్యమంలో ప్రతీ పౌరుడు భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు. ఈ క్రమంలో 1988 నుంచి అమెజాన్‌లో భూములు కొనే వీలు కల్పిస్తున్న రెయిన్‌ఫారెస్ట్ ట్రస్టు.. తమ ద్వారా అటవీ భూములు కొనుగోలు చేయవచ్చని సూచిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా సంస్థ ఇప్పటికే 23 మిలియన్ ఎకరాల అటవీ భూమిని సంరక్షించగలిగింది. ఇక రెయిన్‌ఫారెస్ట్ యాక్షన్ నెట్వర్క్ కూడా అమెజాన్ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది. అదే విధంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ అమెజాన్, ప్రపంచంలోని వివిధ అడవుల్లో ఆశ్రయం పొందుతున్న అనేక జీవజాతులను రక్షిస్తోంది. ఇదిలా ఉండగా Ecosia.org అనే సెర్చ్ ఇంజన్ తమ ప్లాట్‌ఫారమ్‌కు వచ్చే ప్రతీ 45 సెర్చ్‌లకు ఒక మొక్కను నాటే వీలు కల్పిస్తుంది. దీనిని ఆశ్రయించడం ద్వారా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే మహోద్యమంలో పరోక్షంగా భాగస్వాములు అవ్వొచ్చు. అంతేకాకుండా అమెజాన్ వాచ్, అమెజాన్ కన్జర్వేషన్ టీమ్‌లకు విరాళాలు అందజేయడం ద్వారా వాతావరణ మార్పులను అదుపు చేయగలిగే అడవులను కాపాడుకోవచ్చు. -
పెట్రోల్ పట్టుకునేందుకు ఎగబడ్డ జనం.. అంతలోనే
త్లాహులిల్పాన్: దక్షిణ అమెరికాలోని మెక్సికోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హిడాల్గో రాష్ట్రంలోని త్లాహులిల్పాన్ పట్టణంలో శుక్రవారం రాత్రి ఓ ఆయిల్ పైప్‌లైన్‌కు అక్రమంగా అమర్చిన ట్యాప్ లీక్ కావడంతో పెట్రోల్‌ను పట్టుకునేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఇంతలో ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 67 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 76 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారికి అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ సంతాపం తెలిపారు. ప్రభుత్వరంగ ఆయిల్ సంస్థ పెమెక్స్ పైప్లైన్ల నుంచి మాఫియా, డ్రగ్ డీలర్లు ఇంధనాన్ని దొంగలించడం మెక్సికోలో సర్వసాధారణం. దీనివల్ల ఒక్క 2017లోనే రూ.21,376 కోట్ల ఆదాయాన్ని మెక్సికో కోల్పోయింది. -
చుట్టేసి ఆరగిస్తాయ్.!
ఇటీవల ఇండోనేషియాలోని మకస్పర్లో తోటలో కూరగాయలు కోయడానికి వెళ్లిన ఓ మహిళను భారీ అనకొండ మింగేసింది. అలాగే రెండ్రోజుల కిందట అసోంలో జనావాసాల్లోకి వచ్చిన కొండచిలువను పట్టుకొన్న ఓ అటవీ అధికారి, దానితో సెల్ఫీ తీసుకుంటుండగా అది ఆయన మెడను చుట్టుకొని బిగించింది. చుట్టుపక్కల వారు వేగంగా స్పందించి దాని పట్టునుంచి అధికారిని విడిపించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ క్రమంలో అనకొండ గురించి క్లుప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,500 రకాల పాములున్నాయి. వీటిలో అతి పెద్దదే అనకొండ(పైథాన్). సరీసృపాల్లోని యునెక్ట్స్ ప్రజాతికి చెందిన ఇవి విషరహితం. యునెక్ట్స్ అంటే గ్రీకు భాషలో గుడ్ స్విమ్మర్(మంచి ఈతగాడు) అని అర్థం. అనకొండల రూపం, పరిమాణాన్ని బట్టి వీటిని నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి.. గ్రీన్(ఆకుపచ్చ) అనకొండ, ఎల్లో(పసుపు) లేదా పరాగ్వేయన్ అనకొండ, బ్లాక్ స్పాటెడ్ (నల్లమచ్చల) అనకొండ, బేని లేదా బొలివియన్ అనకొండ. మనదేశంతోపాటు ఉపఖండంలో కనిపించే కొండచిలువ ఇందులో ఒకటి. దక్షిణ అమెరికాలో అత్యధికం ఒక్క అంటార్కిటాకాలో మినహా మిగిలిన అన్ని ఖండాల్లోనూ అనకొండలు ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య దక్షిణ అమెరికాలో అత్యధికం. అక్కడి వాతావరణ పరిస్థితులు దీనికి కారణం. అనకొండల్లోని నాలుగు రకాలూ ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి పురాణాల్లోనూ వీటి ప్రసక్తి ఉంది. వీటికి కొన్ని అతీత శక్తుల్ని ఆపాదిస్తూ రాసిన పుస్తకాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనుషుల్ని తినేవిగానూ వీటిని పేర్కొన్నారు. అనకొండ పేరు మీద వచ్చిన అనేక ఇంగ్లిష్ సినిమాలకు ఇవే ప్రేరణ. చిత్తడి నేలలు, తీరాల్లో ఆవాసం అనకొండలు అన్ని ప్రాంతాల్లోనూ నివసించగలిగినప్పటికీ ఇవి ఎక్కువగా నది, సముద్ర తీర ప్రాంతాలు, చిత్తడి నేలల్లో ఉండడానికి ఆసక్తి చూపుతాయి. ఇక్కడ ఇవి సంచరించడానికి అనుకూలంగా ఉండడంతోపాటు వీటి ఆహారమైన చిన్నచిన్న జంతువులు నీళ్లు తాగేందుకు రావడం మరో కారణం. బలమైన కండరాలతో ఏర్పడిన వీటి ఆకారం నేలమీద కంటే నీటిలో చురుగ్గా ప్రయాణించేందుకు వీలుగా ఉండడమూ చెప్పుకోవచ్చు. ఇవి నీళ్లలో ఈదుతూ లేదా దాక్కొని ఉంటూ ఎక్కువ సమయం గడుపుతాయి. ప్రవాహ వేగం తక్కువగా ఉండే నదులు, జలపాతాల సమీపంలో ఎత్తైన చెట్ల కొమ్మలను చుట్టుకొనీ ఉంటాయి. ఇవి గరిష్ఠంగా 100 అడుగుల వరకూ పెరుగుతాయని వాదనలు ఉన్నప్పటికీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన ప్రకారం ఇప్పటివరకు 25 అడుగుల పొడవైన అనకొండే అతి పెద్దది. అలాగే వీటి బరువు 250 కిలోల వరకూ ఉంటుందని అంచనా. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం గరిష్టంగా 45–68 కిలోల వరకు ఉన్నవాటినే ఇప్పటిదాకా గుర్తించారు. ఊపిరి ఆడకుండా .. రక్తప్రసరణ జరగకుండా.. ఏటా వసంత కాలంలో అనకొండలు జతకూడతాయి. ఆడ అనకొండలు వదిలే ఒకరకమైన ద్రవం వాసనను బట్టి మగవి వెతుక్కుంటూ వస్తాయి. గర్భస్థ కాలం ఏడు నెలలు. ఈ కాలంలో పిల్లల్ని మోసే ఆడవి వేటాడవు. ఒక్కదఫా కనీసం 30 పిల్లల్ని కంటాయి. పుట్టగానే వాటిని వదిలేసి వెళ్లిపోతాయి. అనకొండ గరిష్ఠ జీవిత కాలం 30 ఏళ్లు. జింకలు, కుందేళ్లు, చేపలు, మొసళ్లు, తదితర జంతువుల్ని ఆహారంగా తీసుకొనే అనకొండలు.. ఆకలేస్తే మనిషి మీద దాడి చేయడానికీ వెనకాడవు. ఈ క్రమంలో ఇవి తమ ఆహారాన్ని మొదట బలంగా చుట్టుకొని ఊపిరి ఆడకుండా, రక్తప్రసరణ జరగకుండా చేస్తాయి. అవి చనిపోయాక వాటిని మింగి ఆరగిస్తాయి. అడవుల నరికివేత.. ఆవాసం ధ్వంసం సాధారణంగా అడవుల్లోనే నివసించే అనకొండలు ఇటీవల తరచూ మానవ నివాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. పెంపుడు జంతువులు, మనుషుల మీద దాడి చేస్తున్నాయి. కలప, వ్యవసాయం కోసం అడవులను నరికివేయడంతో ఇవి జనావాసాల్లోకి వస్తున్నాయని పరిశోధకులు అంటున్నారు. చిత్తడి నేలలు, నదీ తీర ప్రాంతాల్లో మానవ కార్యకలాపాలు ఎక్కువ అవడంతో వీటి ఆహారమైన ఇతర జంతువుల రాక తగ్గింది. దీంతో అనకొండలు ఆహారం వెతుక్కుంటూ జనావాసాల్లోకి చేరుతున్నాయని చెబుతున్నారు.