మెక్సికోరల్లో జర్మనీ... | Mexico stun Germany 1-0 | Sakshi
Sakshi News home page

మెక్సికోరల్లో జర్మనీ...

Published Mon, Jun 18 2018 5:04 AM | Last Updated on Mon, Jun 18 2018 12:39 PM

Mexico stun Germany 1-0  - Sakshi

లొజానో గోల్‌ కొడుతున్న దృశ్యం

జర్మనీ... ప్రపంచకప్‌ ఫేవరెట్లలోకెల్లా హాట్‌ ఫేవరెట్‌. 1982 నుంచి, అందునా డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలో దిగిన మూడుసార్లు టోర్నీ తొలి మ్యాచ్‌లో ఓడిపోలేదు. మెక్సికో... సాధారణ జట్టే కానీ ఈసారి తనదైన రోజున ఏ జట్టునైనా పరాజయం పాల్జేసేంత ప్రమాదకారిగా కనిపిస్తోంది....ఆ రోజు ప్రపంచ కప్‌ తొలి మ్యాచ్‌లోనే వచ్చింది. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య తీవ్ర స్థాయి ప్రతిఘటనలతో సాగిన మ్యాచ్‌లో మెక్సి‘కోరల్లో’ చిక్కిన జర్మనీ బయటపడ లేకపోయింది. కనీసం ‘డ్రా’ అయినా చేసుకోలేక అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. ఫేవరెట్లలో ఒకటైన అర్జెంటీనాను శనివారం అనామక ఐస్‌లాండ్‌ నిలువరించి కప్‌పై ఆసక్తి పెంచగా, ప్రపంచ చాంపియన్‌ను ఓడించిన మెక్సికో ఒక్కసారిగా వేడి పుట్టించింది.  

మాస్కో: ప్రపంచ కప్‌లో రసవత్తర మ్యాచ్‌.డిఫెండింగ్‌ చాంపియన్‌ జర్మనీకి షాక్‌. ఆదివారం 78 వేల ప్రేక్షక సందోహం మధ్య ఇక్కడి లుజ్నికి స్టేడియంలో జరిగిన గ్రూప్‌ ‘ఎఫ్‌’ మ్యాచ్‌లో మెక్సికో 1–0తో జర్మనీని బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. విపరీతమైన దాడులను ఎదుర్కొన్నా ఈ దక్షిణ అమెరికా జట్టు నిబ్బరం చూపింది. 35వ నిమిషంలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హిర్విన్‌ లొజానో చేసిన ముచ్చటైన గోల్‌తో ఆధిక్యంలో నిలిచిన మెక్సికో దానిని చివరి వరకు నిలబెట్టుకుంది. ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థిని అందుకోలేకపోయిన జర్మనీ... ఇక గెలుపు ఊహకే దూరంగా ఉండిపోయింది.

దాడులతో మొదలు...
మ్యాచ్‌ తొలి మూడు నిమిషాల్లోనే రెండు జట్లకు చెరోసారి గోల్‌ అవకాశం వచ్చిందంటేనే ఆట ఏ స్థాయిలో ప్రారంభమైందో అర్థం చేసుకోవచ్చు. జర్మనీ ఎప్పటిలానే ఆధిపత్యం కోసం ప్రయత్నించింది. మెక్సికో మాత్రం బంతిని అదుపులో ఉంచుకునే తమ సహజ సిద్ధమైన ఆటను ఎంచుకోలేదు. అయినా ఆ జట్టుపై ఇదేమంత ప్రభావం చూపలేదు. డిఫెన్స్‌ లోపాలున్నా జర్మనీనే కొంత మెరుగ్గా కనిపించింది. అయినా ప్రత్యర్థి తేలిగ్గా లొంగలేదు.

క్రమంగా మెక్సికో ప్రతి దాడులకు దిగడంతో మ్యాచ్‌ ఆసక్తిగా మారింది. 35వ నిమిషంలో హెర్నాండెజ్‌ నుంచి వచ్చిన పాస్‌ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లిన లొజానో... కీపర్‌ న్యూర్‌ను బోల్తా కొట్టిస్తూ గోల్‌గా మలిచాడు. తర్వాత కూడా ఇదే తీవ్రతతో ఆడిన మెక్సికో... జర్మనీని ఇబ్బందికి గురి చేసింది. పాస్‌లు సరిగా అందిపుచ్చుకోకపోవడం ఆ జట్టును దెబ్బతీసింది. వందశాతం ఆటను చూపలేకపోవడంతో ప్రత్యర్థి పని సులువైంది. బంతి జర్మనీ ఆధీనంలోనే ఉన్నా, వారిని అనుసరించే వ్యూహాన్ని పక్కాగా అమలు చేసిన మెక్సికో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

ప్రయత్నించినా చిక్కలే...
చావోరేవో తేల్చుకోవాల్సిన రెండో భాగంలో జర్మనీ ఆటలో తీవ్రతను పెంచింది. కానీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయింది. ఇదే సమయంలో మెక్సికో ఆటగాళ్లు అలసిపోయినట్లు కనిపించారు. ఈ అవకాశాన్నీ ప్రపంచ చాంపియన్‌ వినియోగించుకోలేదు. లాభం లేదని సీనియర్‌ గోమె జ్‌ను బరిలో దింపింది.

అయినా ఆ జట్టు కొట్టిన షాట్లు గోల్‌పోస్ట్‌పైగా వెళ్లాయి. చివరి నిమిషాల్లోకి వచ్చేసరికి పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అవకాశాలు సృష్టించుకోలేని పరిస్థితుల్లో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మ్యాచ్‌ మొత్తంలో 60 శాతం పైగా సమయం బంతి తమ ఆధీనంలోనే ఉన్నా, 25 సార్లు దాడులు చేసినా జర్మనీకి చేదు ఫలితమే మిగిలింది. మొదటి భాగంలో ప్రతిదాడి, రెండో భాగంలో రక్షణాత్మక ఆటను నమ్ముకున్న మెక్సికోనే విజయం వరించింది. తదుపరి ఈనెల 23న కొరియాతో మెక్సికో; స్వీడన్‌తో జర్మనీ తలపడతాయి.   


                     గోల్‌ చేశాక లొజానో ఆనందహేళ...


మ్యాచ్‌ ముగిశాక నిరాశలో జర్మనీ ఆటగాళ్లు ముల్లర్, హామెల్స్‌.

36 ప్రపంచకప్‌లో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం 36 ఏళ్ల తర్వాత జర్మనీకిదే తొలిసారి. చివరిసారి పశ్చిమ జర్మనీ 1982 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో 1–2తో అల్జీరియా చేతిలో పరాజయం పాలైంది.
5 గత ఆరు ప్రపంచకప్‌లలో తాము ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెక్సికో గెలుపొందడం ఇది ఐదో సారి. మరో మ్యాచ్‌ను ఆ జట్టు ‘డ్రా’ చేసుకుంది.
6 ప్రపంచకప్‌ చరిత్రలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఓడిపోవడం ఇది ఆరోసారి. 1950లో ఇటలీ 2–3తో స్వీడన్‌ చేతిలో... 1982లో అర్జెంటీనా 0–1తో బెల్జియం చేతిలో... 1990లో అర్జెంటీనా 0–1తో కామెరూన్‌ చేతిలో... 2002లో ఫ్రాన్స్‌ 0–1తో సెనెగల్‌ చేతిలో... 2014లో స్పెయిన్‌ 1–5తో నెదర్లాండ్స్‌ చేతిలో... 2018లో జర్మనీ 0–1తో మెక్సికో చేతిలో ఓడిపోయాయి.
2 జర్మనీ జట్టును మెక్సికో ఓడించడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో ఏకైకసారి మెక్సికో 1985 జూన్‌లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో జర్మనీపై గెలిచింది.
3ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మెక్సికో ప్లేయర్‌ రాఫెల్‌ మార్కెజ్‌ (2002, 06, 2010, 14, 18) అత్యధికంగా ఐదు ప్రపంచకప్‌లలో ఆడిన మూడో ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో ఆంటోనియో కర్‌బజాల్‌ (మెక్సికో–1950, 54, 58, 62, 66), లోథర్‌ మథియాస్‌ (జర్మనీ–1982, 86, 90, 94, 98) మాత్రమే ఈ ఘనత సాధించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement