చీకటి జాతులపై గూగుల్ వెలుతురు
ఇప్పటివరకూ ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతూ ఉన్న జాతుల సంఖ్య కనీసం వంద వరకూ ఉంటుందని అంచనా. ప్రత్యేకించి దక్షిణ అమెరికాలో వెలుగులోకి రాకుండా చీకటిలోనే ఉండిపోయిన జాతులు ఎన్నో ఉన్నాయని పరిశోధకులు అంటారు. పెరూ, బ్రెజిల్ దేశాల మధ్య దట్టమైన అడవుల్లో అనేక కొండ జాతుల వాళ్లు మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్నారని అంచనా.
ఇప్పుడు ఇలాంటి వారిని గుర్తించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందుకు శాటిలైట్ ఫోటోలనూ, గూగుల్ మ్యాప్స్‌నూ ఉపయోగిస్తున్నట్టు తాజాగా అమెరికాకు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ప్రకటించారు. బ్రెజిల్, పెరూల మధ్య ఉన్న సరిహద్దు ప్రాంతాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా పరిశీలిస్తున్నట్లు అధ్యయనకర్తలు వివరించారు.
మిగిలిన ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా గడుపుతున్న కొన్ని జాతులనైనా దీని ద్వారా వెలుగులోకి తీసుకురాగలమని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికీ నాగరకతకు దూరంగా ఉన్న మనుషులు గూగుల్‌లో ఎలా కనిపిస్తారో మరి!