సూక్రె: బొలీవియాలో బుధవారం నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్ధతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా.. సాధారణ పౌరులు సైన్యానికి ఎదురు తిరిగారు. దీంతో.. సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.
బుధవారం బొలీవియాలో హైడ్రామా నడిచింది. లా పాజ్‌లో ఉన్న ప్లాజా మురిల్లో స్క్వేర్ అధ్యక్ష భవనం(ఇదే పార్లమెంట్ భవనం కూడా) వైపు ఆర్మీ వాహనాలు పరేడ్‌గా వెళ్లాయి. తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. సాయుధులైన సైనికులు భవనం ముందు భారీగా మోహరించగా.. మరికొందరు లోపలికి తలుపులు బద్ధలు కొట్టి మరీ ప్రవేశించారు. ఆ సమయంలో అధ్యక్షుడు లూయిస్ ఆసే కుటుంబం లోపలే ఉంది.
ఈలోపు ఈ తిరుగుబాటు ప్రయత్నం గురించి దేశమంతా తెలిసింది. అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాలతో జనాలు నిత్యావసరాలు ఎగబడ్డారు. మరోవైపు భారీగా జనం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జితో సైన్యం వాళ్లను చెదరగొట్టే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈలోపు.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రంకల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనుదిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే తిరుగుబాటు కారకుడైన జూనిగాను అరెస్ట్ చేశారు.
సాయంత్రం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన వేల మంది పౌరులను ఉద్దేశించి అధ్యక్షుడు లూయిస్ ఆసే అభివాదం చేశారు. బొలీవియా ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సైన్యానికి త్రివిధ దళాధిపతులుగా కొత్త వాళ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. బొలీవియా జెండా ప్రదర్శిస్తూ జాతీయ గీతం ఆలపించారు ప్రజలు.
అయితే.. అరెస్ట్ కంటే ముందు మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా సంచలన ఆరోపణకు దిగారు. ప్రజల్లో తన పరపతిని పెంచుకునేందుకు అధ్యక్షుడు లూయిస్ ఆసే, తనతో కలిసి ఆడించిన డ్రామాగా పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం జుని ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు జునిపై ఎలాంటి అభియోగాలు మోపిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
కోటి 20 లక్షల జనాభా ఉన్న బొలీవియాలో.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాజకీయ సంక్షోభం తలెత్తి అప్పటి అధ్యక్షుడు ఎవో మోరేల్స్ అధ్యక్ష పీఠం నుంచి అర్ధాంతంగా దిగిపోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ లూయిస్ ఆసేతో ఎవో మోరేల్స్ పోటీ పడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఎన్నికలలోపే బొలీవియాలో ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment