లా పాజ్ : అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం దక్షిణ అమెరికా దేశం బొలీవియా రక్తసిక్తమవుతోంది. అధికార మూమెంట్ ఫర్ సోషలిజం పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు ఉధృతం చేశాయి. ఈ క్రమంలో ఇరు పక్షాలకు మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటికే ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా.. ఎంతో మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్ల విద్యార్థి మృతికి కొచాబాంబ పట్టణ మేయర్ పేట్రిసియా ఆర్సే కారణమంటూ నిరసనకారులు గురువారం ఆందోళన చేపట్టారు. మేయర్ కార్యాలయానికి నిప్పంటించి ఆమెను వీధిలోకి ఈడ్చుకువచ్చి... హంతకురాలు అని అరుస్తూ మోకాళ్లపై కూర్చోబెట్టారు. అనంతరం ఆమెపై ఎరుపు రంగు కుమ్మరించి... ఆపై జుట్టు కత్తిరించి.. చెప్పుల్లేకుండా రోడ్డుపై నడిపిస్తూ అమానుషంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని... పేట్రిసియాను ఆస్పత్రికి తరలించారు.
కాగా బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరాల్స్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళా మేయర్‌పై దాడి ప్రతిపక్షాల దురహంకారానికి నిదర్శమని మండిపడ్డారు. ‘ తన అనుచరులను కాపాడేందుకు ప్రయత్నించినందుకు ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించారు. పేదల పక్షాన నిలబడినందుకు ఇంతటి దారుణానికి పాల్పడ్డారు’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక దేశ ఉపాధ్యక్షుడు అల్వారో గ్రేసియా ఘటనపై స్పందిస్తూ.. ‘ మహిళగా పుట్టడమే ఆమె చేసిన నేరం. నిజాయితీగా ఉండటమే ఆమె తప్పు. మహిళ అయినందుకే ఈ ఘోరం అని వ్యాఖ్యానించారు. ఇక అధికార పార్టీ మహిళా విభాగం కూడా ఘటనపై తీవ్రంగా స్పందించింది. మేయర్‌పై దాడిని.. జాత్యహంకార, వివక్షాపూరిత, హింసాత్మక ఘటనగా అభివర్ణించింది. ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని.. ఫాసిస్టు నాయకుల అహంకారానికి నిదర్శనమని పేర్కొంది. కాగా 2006లో బొలీవియా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఎవో మారెల్స్.... ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడి మరోసారి అధికారం చేజిక్కించుకున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment