Military coup
-
Bolivia: నాటకీయ పరిణామాల మధ్య సైనిక తిరుగుబాటు విఫలం!
సూక్రె: బొలీవియాలో బుధవారం నాటకీయ పరిణామాల నడుమ సైనిక తిరుగుబాటు విఫలమైంది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్ధతుగా అక్కడి ప్రజలు ప్రదర్శించిన ఐక్యత ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా అధ్యక్ష భవనాన్ని ఆ దేశ సైన్యం అదుపులోకి తీసుకోగా.. సాధారణ పౌరులు సైన్యానికి ఎదురు తిరిగారు. దీంతో.. సైన్యం వెనక్కి తగ్గక తప్పలేదు.బుధవారం బొలీవియాలో హైడ్రామా నడిచింది. లా పాజ్‌లో ఉన్న ప్లాజా మురిల్లో స్క్వేర్ అధ్యక్ష భవనం(ఇదే పార్లమెంట్ భవనం కూడా) వైపు ఆర్మీ వాహనాలు పరేడ్‌గా వెళ్లాయి. తాజా మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా నేతృత్వంలో ఈ తిరుగుబాటు ప్రయత్నం జరిగింది. సాయుధులైన సైనికులు భవనం ముందు భారీగా మోహరించగా.. మరికొందరు లోపలికి తలుపులు బద్ధలు కొట్టి మరీ ప్రవేశించారు. ఆ సమయంలో అధ్యక్షుడు లూయిస్ ఆసే కుటుంబం లోపలే ఉంది. ఈలోపు ఈ తిరుగుబాటు ప్రయత్నం గురించి దేశమంతా తెలిసింది. అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందన్న అంచనాలతో జనాలు నిత్యావసరాలు ఎగబడ్డారు. మరోవైపు భారీగా జనం అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్నారు. టియర్ గ్యాస్ ప్రయోగం, లాఠీ ఛార్జితో సైన్యం వాళ్లను చెదరగొట్టే యత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈలోపు.. ఏం జరిగిందో తెలియదుగానీ సాయంత్రంకల్లా సైన్యం అధ్యక్ష భవనం నుంచి వెనుదిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ భవనాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. కాసేపటికే తిరుగుబాటు కారకుడైన జూనిగాను అరెస్ట్ చేశారు. సాయంత్రం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన వేల మంది పౌరులను ఉద్దేశించి అధ్యక్షుడు లూయిస్ ఆసే అభివాదం చేశారు. బొలీవియా ప్రజలకు కృతజ్ఞతలు.. ప్రజాస్వామ్యం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేశారు. సైన్యానికి త్రివిధ దళాధిపతులుగా కొత్త వాళ్లను నియమిస్తున్నట్లు ప్రకటించారు.ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నినాదాలు చేస్తూ.. బొలీవియా జెండా ప్రదర్శిస్తూ జాతీయ గీతం ఆలపించారు ప్రజలు.అయితే.. అరెస్ట్ కంటే ముందు మాజీ ఆర్మీ కమాండర్ జువాన్ జోస్ జూనిగా సంచలన ఆరోపణకు దిగారు. ప్రజల్లో తన పరపతిని పెంచుకునేందుకు అధ్యక్షుడు లూయిస్ ఆసే, తనతో కలిసి ఆడించిన డ్రామాగా పేర్కొన్నాడు. అయితే ప్రభుత్వం మాత్రం జుని ఆరోపణలను కొట్టిపారేసింది. మరోవైపు జునిపై ఎలాంటి అభియోగాలు మోపిందనేదానిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.కోటి 20 లక్షల జనాభా ఉన్న బొలీవియాలో.. వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. 2019లో రాజకీయ సంక్షోభం తలెత్తి అప్పటి అధ్యక్షుడు ఎవో మోరేల్స్ అధ్యక్ష పీఠం నుంచి అర్ధాంతంగా దిగిపోవాల్సి వచ్చింది. వచ్చే ఎన్నికల్లోనూ లూయిస్ ఆసేతో ఎవో మోరేల్స్ పోటీ పడాలని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్థికంగా దిగజారిన పరిస్థితులు ఎన్నికలలోపే బొలీవియాలో ఆర్థిక సంక్షోభానికి దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఆదిమ ఖండంలో... నియంత పాలనలు
సైనిక తిరుగుబాట్లతో ఆఫ్రికా ఖండం అతలాకుతలం అవుతోంది. కొన్నేళ్లుగా ఇక దేశం తర్వాత ఒక దేశంలో ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి సైనిక నియంతలు అధికారం చేజిక్కించుకుంటున్నారు. బుర్కినా ఫాసో మొదలుకుని తాజాగా గబాన్ దాకా ఈ జాబితా నానాటికీ పెరుగుతూనే పోతోంది. ఆ సైనిక కుట్రల పట్ల ఆయ దేశాల్లో పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కాకపోవడం విశేషం. పైగా యువ ఆఫ్రికన్లు ఈ పరిణామాన్ని రెండు చేతులా స్వాగతిస్తుండటం విస్మయకర వాస్తవం... ► పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్‌లో సైనిక తిరుగుబాటు జరిగి నెలన్నర కూడా కాలేదు. అప్పుడే ఆదిమ ఖండంలో మరో కుట్ర. మధ్య ఆఫ్రికా దేశం గాబాన్లో గత ఆదివారమే ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయమే ఫలితాలు వెలువడ్డాయి. 2009 నుంచీ దేశాన్ని పాలిస్తూ వస్తున్న అధ్యక్షుడు అలీ బొంగో ఒండింబా మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు. ఆయన పార్టీ ఘన విజయం సాధించినట్టు టీవీల్లో అధికారిక ప్రకటన వెలువడింది. దాంతో ఆయన అభిమానులు పండుగ చేసుకున్నారు. కానీ నిమిషాల్లోనే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఈసారి సైనికాధికారులు టీవీ తెరపైకి వచ్చారు. బొంగోను అదుపులోకి తీసుకుని ఆయన అధికారిక నివాసంలోనే ఖైదు చేసినట్టు, పాలనా పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మరో ఆఫ్రికా ఖండంలో ప్రజాస్వామ్యం మరోసారి పరిహాసానికి గురైంది. మరో దేశం సైనిక కుట్రను చవిచూసింది. వరుస సైనిక కుట్రలు ఆఫ్రికాలో, ముఖ్యంగా పశ్చిమ, సెంట్రల్ ఆఫ్రికాలో కొన్నేళ్లుగా సైనిక కుట్రలు పరిపాటిగా మారాయి. ► గత జూలై 26న నైగర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజొమ్ను ఆయన సొంత ప్రెసిడెన్షియల్ బాడీ గార్డులే నిర్బంధంలోకి తీసుకున్నారు. ► 2022 జనవరిలో బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరేనుఆ దేశ సైన్యాధ్యక్షుడే బందీని చేసి అధికారం చేజిక్కించుకున్నాడు. అయితే 8 నెలల్లోనే కింది స్థాయి సైనికాధికారులు అతన్ని కూడా జైలుపాలు చేసి అధికారాన్ని పంచుకున్నారు! ► 2012 సెపె్టంబర్లో గినియాలో అధ్యక్షుడు ఆల్ఫా కొండేను ప్రత్యేక సైనిక బృందాలు ఖైదు చేసి పాలనా పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. ► 2021 మేలో మాలిలో కల్నల్ అసిమి గొయిటా కూడా సైనిక కుట్రకు పాల్పడ్డాడు. అంతకుముందు కూడా ఇలా ప్రభుత్వాన్ని పడదోసిన చరిత్ర అతనిది. ► 2021 ఏప్రిల్‌లో చాద్ రిపబ్లిక్లో కూడా అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇట్నో మృతి కారణంగా అనిశ్చితి ఏర్పడటంతో సైన్యం జోక్యం చేసుకుంది. అయితే, ఆయన కుమారుడే అధికార పగ్గాలు చేపట్టేలా చక్రం తిప్పి రంగం నుంచి తప్పుకుంది. పాలనపై తమ ఆధిపత్యాన్ని మాత్రం నిరి్నరోధంగా కొనసాగిస్తూనే ఉంది! ఆఫ్రికాలోనే ఎందుకిలా? కేవలం గత మూడేళ్లలో ఆఫ్రికాలో కనీసం 5 దేశాల్లో సైనిక కుట్రలు జరిగా యి. ఇందుకు పలు కారణాలు కనిపిస్థాయి కూడా... ► సంప్రదాయ పాలక వర్గపు మితిమీరిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం తదితర పోకడలతో ఆఫ్రికా యువత తీవ్రంగా విసిగిపోయింది. ► అదే సమయంలో ఇటు జనాదరణలోనూ, అటు ఆర్థికంగా కూడా ఆయా ప్రభుత్వాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని సైనిక పెద్దలు అవకాశంగా మలచుకున్నారు ► ప్రజల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంత యువతలో అధికార పారీ్టల పట్ల ఉన్న ఏహ్య భావాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ...అందుకే ఆఫ్రికా యువతలో అసంతృప్తి! ఆఫ్రికా యువతలో ప్రజాస్వామిక ప్రభుత్వాల పట్ల నెలకొన్న తీవ్ర అసంతృప్తికి కారణాలు లేకపోలేదు... ► ఉపాధి అవకాశాల లేమి ► పెచ్చరిల్లిన అవినీతి ► అధిక వర్గాల్లోనూ వారి మితిమీరిన ఆశ్రిత పక్షపాతం ► ఈ దేశాల్లో చాలావరకు మాజీ ఫ్రెంచి వలస రాజ్యాలే. దాంతో వాటిపై ఇప్పటికీ చాలా విషయాల్లో ఫ్రాన్స్ ప్రభావం కొనసాగుతోంది. ఇది కూడా యువతకు మింగుడు పడడం లేదు. ► ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవడానికి పాలక పార్టీలు చేస్తున్న అక్రమాలతో జనం మరింతగా విసిగిపోయారు. దశాబ్దాలుగా బొంగోల రాజ్యమే! గాబన్పై బొంగో కుటుంబం ఒకరకంగా అర్ధ శతాబ్దానికి పైగా గుత్తాధిపత్యం చెలాయించిందనే చెప్పాలి. ► అలీ బొంగో 14 ఏళ్లుగా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు! ఇది ఆయ నకు మూడో టర్ము. 2018లోనే స్ట్రోక్‌కు గురైనా అధికారాన్ని మాత్రం వీడలేదు. ► అయితే దేశాన్ని ఆధునీకరణ బాట పట్టించేందుకు ఆయన ప్రయత్నాలు చేయకపోలేదు. కానీ జనం ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవి సరిపోలేదు. ► అలీ తండ్రి ఒమర్ బొంగో అయితే ఏకంగా 40 ఏళ్లకు పైగా నియంతలా దేశాన్ని పాలించారు! 2009లో ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అలీ తనను తాను విజేతగా ప్రకటించుకున్నారు. కానీ నిజానికి విపక్ష నేత ఆంద్రే ఎంబా ఒబామే నెగ్గారని చెబుతారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
సైన్యం చెరలో నైజర్
అగ్రరాజ్యాల చంపుడు పందెంలో దశాబ్దాలుగా చిక్కిశల్యమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ నీడలోనే ఇప్పటికీ బతుకీడుస్తున్నాయని నైజర్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటు నిరూపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్ బజూమ్‌ను అధికారం నుంచి పడగొట్టి ఆయన భద్రతా వ్యవహారాల చీఫ్ ఒమర్ చియానీ పీఠం అధిష్ఠించాడు. అతనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతుందని అంటున్నారు. అవిద్య, ఆకలి, ఆర్థిక అసమానతలు పుష్కలంగా ఉన్నచోట నియంతలదే పైచేయి అవుతుందని చరిత్రలో తరచు రుజువవుతున్న సత్యమే. తూర్పున ఎర్ర సముద్ర తీరంలోని సూడాన్‌తో మొదలుపెట్టి, పడమట అట్లాంటిక్ మహాసముద్ర తీరానికి చేరువలో వుండే గినియా బిసావూ మధ్య వరసగా కొలువుదీరిన ఎనిమిది దేశాలున్న ప్రాంతాన్ని సహేల్ ప్రాంతం అంటారు. వీటిల్లో మిగిలినవన్నీ సైనిక పాలకుల పరం కాగా... తాజాగా నైజర్ సైతం ఆ ఖాతాలో చేరింది. తన అండదండలు పుష్కలంగా ఉన్న బజూమ్ ఉన్నట్టుండి అదృశ్యం కావటం, రెండురోజుల తర్వాత తిరుగుబాటు ప్రకటన రావటం అమెరికాకు మింగుడు పడని అంశం. పశ్చిమాసియా, దక్షిణాసియాలతో పోల్చినా జీహాదిస్టుల బెడదను అధికంగా ఎదుర్కొంటూ నిత్యం నెత్తురోడుతున్న ప్రాంతం సహేల్ ఆఫ్రికా. అత్యంత వెనకబడిన ప్రాంతం కావటం వల్ల అక్కడి మరణాలు మీడియాకు పట్టవుగానీ... నిరుడు ఉగ్రవాదుల హింసాకాండకు ప్రపంచ వ్యాప్తంగా బలైన 6,701 మంది అభాగ్యుల్లో 43 శాతం మంది అక్కడివారే! సహేల్ ప్రాంతం గురించి ఐక్యరాజ్యసమితి వెబ్సైట్ వెతికితే దాన్ని ‘అవకాశాల గడ్డ’గా అభివర్ణిస్తుంది. ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న ప్రాంతమని చెబుతుంది. ఆ ప్రాంతానికి చినుకు గగనం కావొచ్చు. అక్కడి నేలపై పంటలు పెద్దగా పండకపోవచ్చు. కానీ దాని లోలోపల యురేనియంతో సహా అపురూపమైన ఖనిజాలున్నాయి. విస్తృతంగా జలాశయాలున్నాయి. పునరు త్పాదక ఇంధన వనరులకు అది నిలయం. జనాభాలో 64.5 శాతం మంది ఇరౖవై అయిదేళ్లలోపువారే. ఇవన్నీ సహేల్ ప్రాంతానికి శాపంగా కూడా మారాయి. అమెరికా, ఫ్రాన్స్‌లు ఈ ప్రాంతంపై పట్టుబిగించేందుకు బాహాటంగా ప్రయత్నిస్తుంటే జర్మనీ, ఇటలీ, చైనా వంటివి చడీచప్పుడూ లేకుండా ఆ పని చేస్తుంటాయి. తిరుగుబాటు జరిగే సమయానికి నైజర్‌లో 1,100 మంది అమెరికా సైనికులున్నారు. అవసరాన్నిబట్టి డ్రోన్ దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక స్థావరం ఉంది. కానీ తన మద్దతుదారును అది కాపాడుకోలేకపోయింది. నిజానికి 2021లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే బజూమ్ సైనిక జనరళ్లకు లక్ష్యంగా మారారు. కానీ అప్పట్లో ఆయన్ను వ్యక్తిగత భద్రతా బలగాలు కాపాడాయి. ఇప్పుడు ఆ బలగాలే అదును చూసి కాటేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, సోవియెట్ యూనియన్ల మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల వనరులను చేజిక్కించుకునేందుకు సాగిన పోటీతో సగటున ప్రతి 55 రోజులకూ ఒక సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని, అందులో చాలా భాగం విజయవంతమయ్యాయని గణాంకాలు చెబు తున్నాయి. తమ ప్రయోజనాలు నెరవేరే వరకూ స్థానికంగా ఏ పాలకులున్నా, వారు ఎలా పాలిస్తున్నా అగ్రరాజ్యాలు పట్టించుకోవు. ఆ ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం సైనిక నియంత లను గద్దె దించేందుకు ప్రజాస్వామ్య మంత్రాన్ని పఠిస్తాయి. అంతక్రితం దశాబ్దాలపాటు అగ్రరాజ్యాల చెరలో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి చేరువైనా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల పడగనీడలోనే ఆ ప్రభుత్వాలు కొనసాగటం వల్ల స్థానికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పేరుకు ఎన్నికలేగానీ పెత్తనమంతా స్థానికంగా ఉండే సాయుధ ముఠా లదే! ఆ ముఠాల ప్రాపకంతోనే ఏ పాలకులైనా ఎన్నికల్లో గద్దెనెక్కుతారు. కూడు, గూడు, విద్య, వైద్యం, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఉపాధి చూపటంలోనూ ఆ పాల కులు ఘోరంగా విఫలం కావటం తరచు కనబడేదే! ప్రజల్లో ఆ పాలకుల పట్ల ఉండే అసంతృప్తిని సైన్యంలోని ఉన్నతాధికారవర్గం సాకుగా తీసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. పర్యవ సానంగా ముందో వెనకో ఆ దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సైనిక కుట్రలకు తలవంచాయి. సహేల్ ప్రాంతంలో తిరుగుబాట్లు చేసినప్పుడల్లా సైనిక నియంతలు చెప్పే మొదటి కారణం అవినీతి. ఇప్పుడు నైజర్‌లో గద్దెనెక్కిన ఒమర్ చియానీ దానికి ఉగ్రవాద బెడదను కూడా జోడించాడు. దేశంలో ఉగ్రవాదం ముప్పు పెరగటం వల్ల సైన్యం జోక్యం తప్పనిసరైందని ప్రకటించాడు. నిజానికి వేరే దేశాల ‘ప్రజాస్వామ్య’ పాలకులతో పోలిస్తే బజూమ్ ఎంతో నయం. అల్ కాయిదా, ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల దాడులను పూర్తిగా అదుపు చేయలేకపోయినా, వాటిని చాలా మేరకు నియంత్రించారు. పాశ్చాత్య దేశాల మద్దతు పుష్కలంగా ఉండటంతో నిధులు కూడా దండిగానే వచ్చాయి. విద్య, వైద్యంతో పాటు ఉపాధి కల్పన చర్యలు ప్రారంభమయ్యాయి. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. బజూమ్‌కు సైన్యం మద్దతు దండిగా ఉన్నదని, దేశంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని అందరూ అనుకుంటుండగానే చియానీ రూపంలో సైనిక నియంత అవతరించాడు. సహేల్ ప్రాంతంలోని వేరే దేశాల్లో ఉగ్రవాద బూచిని చూపి, పాలకుల భద్రతకు పూచీపడుతూ పబ్బం గడుపుకుంటున్న కిరాయి సైనిక ముఠా నాయకుడు ప్రిగోజిన్ ఇప్పుడు నైజర్‌ను ఉద్ధరిస్తానని ముందుకొస్తున్నాడు. అమెరికా, రష్యాల మధ్య సైతం మున్ముందు ఇక్కడ ఘర్షణ రాజుకునే ప్రమాదం ఉంది. ఇన్నిటిమధ్య నైజర్ మనుగడ ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే! -
ఆఫ్రికా దేశం నైగర్‌లో సైనిక కుట్ర
నియామె: పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో సైనిక కుట్ర జరిగింది. బుధవారం ఉదయం ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ నివాసాన్ని చుట్టుముట్టారు. బజౌమ్‌ను, ఆయన భార్యను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ టీవీ కేంద్రాన్ని అధీనంలోకి తీసుకుని, తమను తాము నేషనల్ కౌన్సిల్‌గా గురువారం ప్రకటించుకున్నారు. శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితులు క్షీణించినందునే దేశ రక్షణ బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్మీయే దేశ రక్షణ బాధ్యత వహిస్తుందని, బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి హస్సౌమి మస్సౌదౌ స్పందించారు. ‘సైనిక కుట్ర జరిగింది. కానీ, మేం దానిని అంగీకరించం. అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి. తిరుగుబాటును ప్రజలు తిప్పికొట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు వెనుక ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీ హస్తం ఉందనే అనుమానాలున్నాయి. ఈయన్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు అధ్యక్షుడు బజౌమ్ ప్రయత్నించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. తిరుగుబాటుకు సైన్యం కూడా మద్దతు ప్రకటించింది. ఇలా ఉండగా పొరుగుదేశం బెనిన్ అధ్యక్షుడు పాట్రిస్ టలోన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. ఫ్రాన్సుకు వలసదేశంగా ఉన్న నైగర్‌కు 1960లో స్వాతంత్య్రం వచ్చింది. ఎట్టకేలకు 2021లో మహ్మద్ బజౌమ్ సారథ్యంలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. -
మాలీలో సైనిక తిరుగుబాటు
బమకో: ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మంగళవారం సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది. మాలీలో నివాసముంటున్న భారతీయులు ప్రస్తుతానికి ఇళ్లకే పరిమితం కావాలని ఆక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసర సాయం కావాల్సివస్తే ఎంబసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని ట్విటర్లో ప్రకటించింది. -
టర్కీలో సైనిక తిరుగుబాటు 42 మృతి
-
థాయ్‌లాండ్‌లో సైనిక కుట్ర
సైన్యం చేతుల్లోకి అధికారం.. రాజ్యాంగం రద్దు.. - దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ - టీవీలు, రేడియోల్లో ప్రసారాలపై నిషేధం బ్యాంకాక్: ఇప్పటికే ఎన్నో సైనిక కుట్రలు చవిచూసిన థాయ్‌లాండ్‌లో మళ్లీ సైన్యం తిరుగుబాటు చేసింది. మంగళవారం దేశంలో మార్షల్ లా(సైనిక చట్టం) విధిస్తున్నామని, అయితే ఇది సైనిక కుట్ర కాదని ప్రకటించిన సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రయూత్ చాన్‌వోచా గురువారం హఠాత్తుగా దేశాధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. అలాగే అన్ని టెలివిజన్, రేడియో చానెళ్లలో ప్రసారమయ్యే రోజువారీ కార్యక్రమాలను రద్దు చేసి, వాటి స్థానంలో సైనిక ప్రకటనలను, దేశభక్తి గీతాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆదేశించారు. దేశంలో ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగులు యథావిధిగా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చని తెలిపారు. కొన్ని నెలలుగా థాయ్‌లాండ్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సైన్యాధ్యక్షుడు జనరల్ ప్రయూత్ చాన్‌వోచా టీవీ చానళ్లలో మాట్లాడుతూ..‘‘థాయ్ సైన్యం, రాయల్ ఎయిర్‌ఫోర్స్, పోలీసులతో కూడిన జాతీయ శాంతి పరిరక్షణ కమిటీ.. దేశంలో సంక్షోభం తీవ్రం కాకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది’’ అని తెలిపారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎవరూ ఇల్లు విడిచి బయటకు రాకుండా నిషేధం విధిస్తున్నామన్నారు. వీధుల్లో నిరసనలకు దిగుతున్నవారు వెంటనే తమ ఇళ్లకు వెళ్లాలని, ఈ మేరకు బస్సులు ఏర్పాటు చేశామని సూచించారు. రద్దయిన ప్రభుత్వంలోని కేబినెట్ మంత్రులు గురువారం సాయంత్రానికల్లా సైన్యం ముందు హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటిదాకా థాయ్‌లాండ్‌లో 18 సార్లు సైన్యం తిరుగుబాటు చేయగా.. వాటిలో 11 విజయవంతమయ్యాయి. మరోవైపు దేశంలో సైనిక కుట్ర నేపథ్యంలో భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని బ్యాంకాక్‌లోని భారత రాయబార కార్యాలయం సూచించింది. కర్ఫ్యూ సమయంలో బయటకు రాకుండా ఉండటం ఉత్తమమని పేర్కొంది.