నియామె: పశ్చిమ ఆఫ్రికా దేశం నైగర్‌లో సైనిక కుట్ర జరిగింది. బుధవారం ఉదయం ప్రెసిడెన్షియల్ గార్డ్స్ సభ్యులు అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్ నివాసాన్ని చుట్టుముట్టారు. బజౌమ్‌ను, ఆయన భార్యను నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రభుత్వ టీవీ కేంద్రాన్ని అధీనంలోకి తీసుకుని, తమను తాము నేషనల్ కౌన్సిల్‌గా గురువారం ప్రకటించుకున్నారు. శాంతిభద్రతలు, ఆర్థిక పరిస్థితులు క్షీణించినందునే దేశ రక్షణ బాధ్యతను తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్మీయే దేశ రక్షణ బాధ్యత వహిస్తుందని, బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. దీనిపై విదేశాంగ మంత్రి హస్సౌమి మస్సౌదౌ స్పందించారు. ‘సైనిక కుట్ర జరిగింది. కానీ, మేం దానిని అంగీకరించం. అధ్యక్షుడిని వెంటనే విడుదల చేయాలి. తిరుగుబాటును ప్రజలు తిప్పికొట్టాలి’అని ఆయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు వెనుక ప్రెసిడెన్షియల్ గార్డ్స్ జనరల్ ఒమర్ టిచనీ హస్తం ఉందనే అనుమానాలున్నాయి.
ఈయన్ను బాధ్యతల నుంచి తప్పించేందుకు అధ్యక్షుడు బజౌమ్ ప్రయత్నించడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. తిరుగుబాటుకు సైన్యం కూడా మద్దతు ప్రకటించింది. ఇలా ఉండగా పొరుగుదేశం బెనిన్ అధ్యక్షుడు పాట్రిస్ టలోన్ మధ్యవర్తిగా రంగంలోకి దిగారు. ఫ్రాన్సుకు వలసదేశంగా ఉన్న నైగర్‌కు 1960లో స్వాతంత్య్రం వచ్చింది. ఎట్టకేలకు 2021లో మహ్మద్ బజౌమ్ సారథ్యంలో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటైంది. ఆయన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అప్పటి నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment