సైన్యం చెరలో నైజర్‌ | Sakshi Editorial On Niger Crisis | Sakshi
Sakshi News home page

Niger Crisis: సైన్యం చెరలో నైజర్‌

Published Wed, Aug 2 2023 12:40 AM | Last Updated on Wed, Aug 2 2023 12:40 AM

Sakshi Editorial On Niger Crisis

అగ్రరాజ్యాల చంపుడు పందెంలో దశాబ్దాలుగా చిక్కిశల్యమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ నీడలోనే ఇప్పటికీ బతుకీడుస్తున్నాయని నైజర్‌లో నాలుగురోజుల క్రితం చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటు నిరూపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మహమ్మద్‌ బజూమ్‌ను అధికారం నుంచి పడగొట్టి ఆయన భద్రతా వ్యవహారాల చీఫ్‌ ఒమర్‌ చియానీ పీఠం అధిష్ఠించాడు.

అతనికి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మద్దతుందని అంటున్నారు. అవిద్య, ఆకలి, ఆర్థిక అసమానతలు పుష్కలంగా ఉన్నచోట నియంతలదే పైచేయి అవుతుందని చరిత్రలో తరచు రుజువవుతున్న సత్యమే. తూర్పున ఎర్ర సముద్ర తీరంలోని సూడాన్‌తో మొదలుపెట్టి, పడమట అట్లాంటిక్‌ మహాసముద్ర తీరానికి చేరువలో వుండే గినియా బిసావూ మధ్య వరసగా కొలువుదీరిన ఎనిమిది దేశాలున్న ప్రాంతాన్ని సహేల్‌ ప్రాంతం అంటారు.

వీటిల్లో మిగిలినవన్నీ సైనిక పాలకుల పరం కాగా... తాజాగా నైజర్‌ సైతం ఆ ఖాతాలో చేరింది. తన అండదండలు పుష్కలంగా ఉన్న బజూమ్‌ ఉన్నట్టుండి అదృశ్యం కావటం, రెండురోజుల తర్వాత తిరుగుబాటు ప్రకటన రావటం అమెరికాకు మింగుడు పడని అంశం. పశ్చిమాసియా, దక్షిణాసియాలతో పోల్చినా జీహాదిస్టుల బెడదను అధికంగా ఎదుర్కొంటూ నిత్యం నెత్తురోడుతున్న ప్రాంతం సహేల్‌ ఆఫ్రికా. అత్యంత వెనకబడిన ప్రాంతం కావటం వల్ల అక్కడి మరణాలు మీడియాకు పట్టవుగానీ... నిరుడు ఉగ్రవాదుల హింసాకాండకు ప్రపంచ వ్యాప్తంగా బలైన 6,701 మంది అభాగ్యుల్లో 43 శాతం మంది అక్కడివారే!

సహేల్‌ ప్రాంతం గురించి ఐక్యరాజ్యసమితి వెబ్‌సైట్‌ వెతికితే దాన్ని ‘అవకాశాల గడ్డ’గా అభివర్ణిస్తుంది. ప్రపంచంలోనే యువత అధికంగా ఉన్న ప్రాంతమని చెబుతుంది. ఆ ప్రాంతానికి చినుకు గగనం కావొచ్చు. అక్కడి నేలపై పంటలు పెద్దగా పండకపోవచ్చు. కానీ దాని లోలోపల యురేనియంతో సహా అపురూపమైన ఖనిజాలున్నాయి. విస్తృతంగా జలాశయాలున్నాయి. పునరు త్పాదక ఇంధన వనరులకు అది నిలయం. జనాభాలో 64.5 శాతం మంది ఇరౖవై అయిదేళ్లలోపువారే. ఇవన్నీ సహేల్‌ ప్రాంతానికి శాపంగా కూడా మారాయి. అమెరికా, ఫ్రాన్స్‌లు ఈ ప్రాంతంపై పట్టుబిగించేందుకు బాహాటంగా ప్రయత్నిస్తుంటే జర్మనీ, ఇటలీ, చైనా వంటివి చడీచప్పుడూ లేకుండా ఆ పని చేస్తుంటాయి. తిరుగుబాటు జరిగే సమయానికి నైజర్‌లో 1,100 మంది అమెరికా సైనికులున్నారు.

అవసరాన్నిబట్టి డ్రోన్‌ దాడులు నిర్వహించేందుకు ప్రత్యేక స్థావరం ఉంది. కానీ తన మద్దతుదారును అది కాపాడుకోలేకపోయింది. నిజానికి 2021లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే బజూమ్‌ సైనిక జనరళ్లకు లక్ష్యంగా మారారు. కానీ అప్పట్లో ఆయన్ను వ్యక్తిగత భద్రతా బలగాలు కాపాడాయి. ఇప్పుడు ఆ బలగాలే అదును చూసి కాటేశాయి. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో అమెరికా, సోవియెట్‌ యూనియన్‌ల మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాల వనరులను చేజిక్కించుకునేందుకు సాగిన పోటీతో సగటున ప్రతి 55 రోజులకూ ఒక సైనిక తిరుగుబాటు ప్రయత్నం జరిగిందని, అందులో చాలా భాగం విజయవంతమయ్యాయని గణాంకాలు చెబు తున్నాయి. తమ ప్రయోజనాలు నెరవేరే వరకూ స్థానికంగా ఏ పాలకులున్నా, వారు ఎలా పాలిస్తున్నా అగ్రరాజ్యాలు పట్టించుకోవు.

ఆ ప్రయోజనాలు దెబ్బతింటే మాత్రం సైనిక నియంత లను గద్దె దించేందుకు ప్రజాస్వామ్య మంత్రాన్ని పఠిస్తాయి. అంతక్రితం దశాబ్దాలపాటు అగ్రరాజ్యాల చెరలో చిక్కుకున్న పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి చేరువైనా, నయా ఉదారవాద ఆర్థిక విధానాల పడగనీడలోనే ఆ ప్రభుత్వాలు కొనసాగటం వల్ల స్థానికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పేరుకు ఎన్నికలేగానీ పెత్తనమంతా స్థానికంగా ఉండే సాయుధ ముఠా లదే! ఆ ముఠాల ప్రాపకంతోనే ఏ పాలకులైనా ఎన్నికల్లో గద్దెనెక్కుతారు. కూడు, గూడు, విద్య, వైద్యం, మంచినీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనలోనూ, ఉపాధి చూపటంలోనూ ఆ పాల కులు ఘోరంగా విఫలం కావటం తరచు కనబడేదే! ప్రజల్లో ఆ పాలకుల పట్ల ఉండే అసంతృప్తిని సైన్యంలోని ఉన్నతాధికారవర్గం సాకుగా తీసుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. పర్యవ సానంగా ముందో వెనకో ఆ దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి సైనిక కుట్రలకు తలవంచాయి.  

సహేల్‌ ప్రాంతంలో తిరుగుబాట్లు చేసినప్పుడల్లా సైనిక నియంతలు చెప్పే మొదటి కారణం అవినీతి. ఇప్పుడు నైజర్‌లో గద్దెనెక్కిన ఒమర్‌ చియానీ దానికి ఉగ్రవాద బెడదను కూడా జోడించాడు. దేశంలో ఉగ్రవాదం ముప్పు పెరగటం వల్ల సైన్యం జోక్యం తప్పనిసరైందని ప్రకటించాడు.  నిజానికి వేరే దేశాల ‘ప్రజాస్వామ్య’ పాలకులతో పోలిస్తే బజూమ్‌ ఎంతో నయం. అల్‌ కాయిదా, ఐఎస్‌ వంటి ఉగ్రవాద సంస్థల దాడులను పూర్తిగా అదుపు చేయలేకపోయినా, వాటిని చాలా మేరకు నియంత్రించారు. పాశ్చాత్య దేశాల మద్దతు పుష్కలంగా ఉండటంతో నిధులు కూడా దండిగానే వచ్చాయి.

విద్య, వైద్యంతో పాటు ఉపాధి కల్పన చర్యలు ప్రారంభమయ్యాయి. వాటి ఫలితాలు కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. బజూమ్‌కు సైన్యం మద్దతు దండిగా ఉన్నదని, దేశంలో రాజకీయ సుస్థిరత ఏర్పడిందని అందరూ అనుకుంటుండగానే చియానీ రూపంలో సైనిక నియంత అవతరించాడు. సహేల్‌ ప్రాంతంలోని వేరే దేశాల్లో ఉగ్రవాద బూచిని చూపి, పాలకుల భద్రతకు పూచీపడుతూ పబ్బం గడుపుకుంటున్న కిరాయి సైనిక ముఠా నాయకుడు ప్రిగోజిన్‌ ఇప్పుడు నైజర్‌ను ఉద్ధరిస్తానని ముందుకొస్తున్నాడు. అమెరికా, రష్యాల మధ్య సైతం మున్ముందు ఇక్కడ ఘర్షణ రాజుకునే ప్రమాదం ఉంది. ఇన్నిటిమధ్య నైజర్‌ మనుగడ ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకమే! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement