
ఇది ఎలుగుల సృష్టి...!
ఈ ఫొటోల్లోని భారీ సొరంగాలను చూడండి చాలా అందంగా.. మనిషి నడవడానికి సరిపడినంత విశాలంగా ఉన్నాయి కదా.
ఈ ఫొటోల్లోని భారీ సొరంగాలను చూడండి చాలా అందంగా.. మనిషి నడవడానికి సరిపడినంత విశాలంగా ఉన్నాయి కదా. ఇలాంటి సొరంగాలు దక్షిణ అమెరికాలోని ఉత్తర ప్రాంతంలో అనేకచోట్ల ఉన్నాయి. వీటి నిర్మాణం చూసి బాగా చేయితిరిగిన ఇంజనీర్ ఇలా ఏర్పాటు చేసి ఉంటాడని అనుకుంటున్నారా.. అయితే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఈ సొరంగాలను మనిషి తవ్వలేదు..అలాగని ప్రకృతి మార్పుల వల్ల కూడా ఏర్పడ లేదు. సొరంగాలను ఎలుగుబంట్లు తవ్వాయట.. నమ్మడం లేదా అయితే సొరంగంలోని గోడలపై ఎలుగుబంట్లు తవ్వినట్లు నిరూపించే వాటి కాలు, చేతుల గోళ్ల ముద్రలు ఉన్నాయి ఓసారి చూడండి. ‘పాలియోబుర్రో’ అనే పిలిచే ఈ సొరంగాలను 10 వేల ఏళ్ల క్రితం దక్షిణ అమెరికాలో ప్రాంతంలో నివసించిన భల్లూకాలు తమ అవసరాల కోసం తవ్వి ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
అప్పట్లో వాటి ఆకారం ఇప్పుడున్న ఏనుగుల సైజులో ఉండేవని, అందుకే ఇలాంటి సొరంగాలను తవ్వడం సాధ్యపడిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన హెన్రిచ్ ఫ్రాంక్ అనే ప్రొఫెసర్ 2000 సంవత్సరంలో రియో గ్రాండ్ డాసుల్ ప్రాంతంలో మొదటి సొరంగాన్ని కనుగొన్నాడు. ఇప్పటివరకు ఫ్రాంక్, అతని బృందం కలిపి ఇలాంటి సొరంగాలనే 1,500లకు పైగా కనుగొన్నారు. వీటిలో కొన్ని సొరంగాలు వందల అడుగులకు పైగా పొడవు ఉండడంతోపాటు లోపల అనేక చిన్న చిన్న సొరంగ మార్గాలు ఉన్నాయని ఫ్రాంక్ తెలిపారు. 2000 అడుగుల పొడవు, ఆరడుగుల ఎత్తు, ఐదడుగుల వెడల్పున్న సొరంగాన్ని తాజాగా కనుగొన్నారు. ఇంకా ఈ సొరంగాలకు సంబంధించి అంతుచిక్కని అనేక ప్రశ్నలు శాస్త్రవేత్తలను వేదిస్తున్నాయి.