చిలీ తీరంలో భారీ భూకంపం | A massive earthquake off the coast of Chile | Sakshi
Sakshi News home page

చిలీ తీరంలో భారీ భూకంపం

Published Thu, Apr 3 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:29 AM

చిలీ తీరంలో భారీ భూకంపం

చిలీ తీరంలో భారీ భూకంపం

2 మీటర్ల ఎత్తు అలలతో తీరాన్ని తాకిన సునామీ   ఆరుగురి మృతి, పలు చోట్ల రోడ్లు ధ్వంసం
 
 శాంటియాగో: దక్షిణ అమెరికా దేశం చిలీకి ఉత్తరాన పసిఫిక్ మహా సముద్రంలో మంగళవారం రాత్రి 11:46 గంటలకు భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు రిక్టర్‌స్కేలుపై 8.2 త్రీవతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి రెండు మీటర్ల ఎత్తున సునామీ అలలు ఎగిసిపడుతూ చిలీ తీరాన్ని తాకాయి. సునామీ అలల వల్ల ఆరుగురు మరణించినట్లు చిలీ అధికారులు ప్రకటించారు.

సముద్ర అలలు ఇంకా ఒక మీటరు ఎత్తున ఎగిసిపడుతున్నాయని, తీరప్రాంతంలోని సుమారు 9 లక్షల మందిని ఎత్తై, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. సుమారు రెండు నిమిషాల పాటు వచ్చిన భూకంపం వల్ల 10 గంటల తర్వాత కూడా ప్రకంపనలు వస్తున్నాయని, ఇప్పటిదాకా 17 సార్లు ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి తీరప్రాంతంలోని పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగెత్తారు. పలుచోట్ల విద్యుత్ స్తంభించిపోయి అంధకారం అలుముకుంది. అయితే పెద్ద ఎత్తున ఆస్తినష్టమేమీ సంభవించలేదని విపత్తుల సహాయక సంస్థ వెల్లడించింది. ఉత్తర చిలీలోని ఇక్విక్ మైనింగ్ ఏరియాకు 86 కి.మీ. దూరంలో సముద్రంలో 10 కి.మీ.

లోతులోనే భూకంప కేంద్రం ఏర్పడినట్లు యూఎస్ జియోలజికల్ సర్వే వెల్లడించింది. చిలీ తీరంలో భూకంపం వల్ల ఏర్పడిన సునామీ అలలు గురువారం జపాన్ లోని హొకైడో వద్ద తీరాన్ని తాకే అవకాశముందని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా చిలీ మధ్య, దక్షిణ ప్రాంతాల్లో 2010లో 8.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించి భారీ సునామీ విరుచుకుపడటంతో పలు పట్టణాల్లో భారీ విధ్వంసం జరిగింది. సుమారు 500 మంది మరణించగా 30 బిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement