బ్రెసీలియా : ప్రపంచంలోనే అత్యధిక పొడవైన వర్షాధార ఉష్ణమండల అడవి(రెయిన్‌ఫారెస్ట్)గా ప్రసిద్ధికెక్కిన అమెజాన్‌లో కార్చిచ్చు రగులుతోంది. ఈ అడవిలో తరచుగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రస్తుతం ఆందోళన కలిగించే అంశంగా పరిణమించింది. గత కొన్నాళ్లుగా మంటల ధాటికి ఈ అడవిలోని చెట్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్‌లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్‌పీఈ వెల్లడించింది. గడిచిన ఐదేళ్లలో(2013-2018) వీటి సంఖ్య 83 శాతం పెరిగిందని పేర్కొంది. దీంతో దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ అలుముకుందని తెలిపింది. బ్రెజిల్‌పై ఈ మంటల ప్రభావం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ముఖ్యంగా అమెజానస్, రోండోనియా రాష్ట్రాల్లో పూర్తిగా పొగ అలుముకుందని తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆగష్టు మొదటివారంలో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరగడంతో బ్రెజిల్‌లో అత్యవసర పరిస్థితి విధించారు. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో పాలనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడిగా బోల్సోనారో విఫలమయ్యారని..ఆయన అడవుల నరికివేతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. విమర్శలపై స్పందించిన బోల్సోనారో పర్యావరణ కార్యకర్తలుగా చెప్పుకొనే కొంతమంది వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగానే అడవులను తగులబెడుతున్నారని ఆరోపిస్తున్నారు.కాగా అటవీ సమీపంలోని భూములను వ్యవసాయానికి అనువుగా మార్చుకునే సమయంలో, పంట చేతికొచ్చిన తర్వాత రైతులు వ్యర్థాలను కాల్చే క్రమంలో మంటలు వ్యాప్తిస్తున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ప్రమాదాల సంఖ్యతో పాటు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ద లంగ్స్ ఆఫ్ ప్లానెట్’ గా వ్యవహరించే అమెజాన్ ఈ స్థాయిలో కాలుష్య కారకాలను వెదజల్లడంతో దక్షిణ అమెరికా దేశాల్లోని వివిధ రాష్ట్రాల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ జనాభాకు 20 శాతం ప్రాణవాయువు(ఆక్సీజన్) అందించడంతో పాటు జీవవైవిధ్య సమతౌల్యంలో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్ క్రమంగా అంతరించిపోయినట్లయితే.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడి కనీసం తాగునీరు కూడా లభించని దుస్థితి దాపురిస్తుందని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నారు.
అమెజాన్‌ను కాపాడండి!
ఇక పచ్చని అడవి కార్చిచ్చు దాటికి బుగ్గిపాలవుతున్న ఫొటోలు, వీడియోలను నాసాకు చెందిన ఆక్వా సాటిలైట్, యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన సెంటినల్ 3 ఉపగ్రహం విడుదల చేశాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో #Prayfor Amazonas, #AmazonRainforest హ్యాష్‌ట్యాగ్‌లతో అమెజాన్‌ను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత గురించి పెద్ద ఉద్యమం నడుస్తోంది. అదే విధంగా మానవాళి మనుగడకు దోహదపడుతున్న అడవిని మంటల నుంచి కాపాడుకునేందుకు విరాళాలు అందజేయాల్సిందిగా నెటిజన్లు పలువురు బిలియనీర్లకు విఙ్ఞప్తి చేస్తున్నారు. అడవులను సంరక్షించుకునే ఉద్యమంలో ప్రతీ పౌరుడు భాగస్వామ్యం కావాలని కోరుతున్నారు.
ఈ క్రమంలో 1988 నుంచి అమెజాన్‌లో భూములు కొనే వీలు కల్పిస్తున్న రెయిన్‌ఫారెస్ట్ ట్రస్టు.. తమ ద్వారా అటవీ భూములు కొనుగోలు చేయవచ్చని సూచిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా సంస్థ ఇప్పటికే 23 మిలియన్ ఎకరాల అటవీ భూమిని సంరక్షించగలిగింది. ఇక రెయిన్‌ఫారెస్ట్ యాక్షన్ నెట్‌వర్క్ కూడా అమెజాన్ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తోంది. అదే విధంగా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటూ అమెజాన్, ప్రపంచంలోని వివిధ అడవుల్లో ఆశ్రయం పొందుతున్న అనేక జీవజాతులను రక్షిస్తోంది. ఇదిలా ఉండగా Ecosia.org అనే సెర్చ్ ఇంజన్ తమ ప్లాట్‌ఫారమ్‌కు వచ్చే ప్రతీ 45 సెర్చ్‌లకు ఒక మొక్కను నాటే వీలు కల్పిస్తుంది. దీనిని ఆశ్రయించడం ద్వారా ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటే మహోద్యమంలో పరోక్షంగా భాగస్వాములు అవ్వొచ్చు. అంతేకాకుండా అమెజాన్ వాచ్, అమెజాన్ కన్జర్వేషన్ టీమ్‌లకు విరాళాలు అందజేయడం ద్వారా వాతావరణ మార్పులను అదుపు చేయగలిగే అడవులను కాపాడుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment