
బ్రెజిల్‌లో ఈ ఏడాది నవంబర్‌లో జరగబోయే ప్రపంచ వాతావరణ సదస్సు(2025 United Nations Climate Change Conference)(కాప్-30) కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ ఏర్పాట్లలో భాగంగా రోడ్డును నిర్మించేందుకు బ్రెజిల్ అమెజాన్ అడవులలోని వేలాది చెట్లను నరికివేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. 50 వేలమంది హాజరయ్యే ఈ సదస్సు కోసం రోడ్డుమార్గాన్ని నిర్మించే పేరుతో పర్యావరణ పరిరక్షణ నిబద్ధతను బ్రెజిల్ ఉల్లంఘించిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం అమెజాన్(Amazon) వర్షారణ్యం.. అధిక మొత్తంలో కార్బన్‌ను గ్రహించడంతో పాటు, అసాధారణ జీవవైవిధ్యాన్ని కలిగివుందనే ఘనతను దక్కించుకుంది. కాప్ సదస్సు కోసం నిర్మిస్తున్న నూతన రహదారి తమ జీవనోపాధిని దూరం చేస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే వన్యప్రాణులకు ఇది ప్రమాదకరమని జంతు ప్రేమికులు అంటున్నారు. కాగా ఈ నాలుగు లేన్ల రహదారి 50 వేల మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇచ్చే ‘బెలెమ్’కు చేరేందుకు ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుందని బ్రెజిల్ పేర్కొంది.
అయితే వాతావరణ శిఖరాగ్ర సమావేశం నిర్వహణ ఉద్దేశ్యానికి విరుద్ధంగా బ్రెజిల్ నిర్ణయం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఈ సదస్సు అమెజాన్ అడవుల గురించి ప్రపంచానికి మరింతగా తెలియజేస్తుందని బ్రెజిల్ పేర్కొంది. ఈ ఆడవులను కాపాడేందుకు తమ ప్రభుత్వం ఏమి చేస్తున్నదీ అందరికీ తెలుస్తుందని, కాప్-30 సదస్సు చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం అవుతుందని బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?