నాగరికత నేర్చిన మనిషి.. స్వార్థంతో దండకారణ్యంపై దాడులకు దిగాడు. నాశనం చేసే క్రమంలో మారణహోమానికి పాల్పడ్డాడు. అందుకు సజీవ సాక్ష్యంగా మిగిలింది ఆ ఒక్కడు. తన వాళ్లను బలిగొన్నందుకు మనుషుల మీద ద్వేషంతో రగిలిపోయాడు. దాదాపు పాతికేళ్లకు పైనే ఎవరినీ దగ్గరకు రానీయకుండా ‘ఒంటరి’ జీవనం గడిపి.. చివరకు అడవితల్లి ఒడిలో దిక్కుమొక్కులేకుండా ప్రాణం విడిచాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చిన.. అదే సమయంలో ఆలోచింపజేసిన ది మ్యాన్ ఆఫ్ ది హోల్ ఇక లేడు.
బ్రెజిల్ పశ్చిమ ప్రాంతం రోండోనియా రాష్ట్రం అమెజాన్ అడవుల గుండా దాదాపు పాతికేళ్లకు పైనే(వీడియో, ఫొటో రికార్డింగ్‌ల ఆధారంగా) ఈ ఒంటరి మనిషి జీవనం కొనసాగింది. పేరు, ఏ తెగకు చెందిన వ్యక్తి అనే విషయాలపై ఎవరికీ స్పష్టత లేదు. కానీ, 1996లో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం అతన్ని గుర్తించి అనుసరించటం మొదలుపెట్టింది. మార్చి 19, 2011న ఓ వీడియోను తీయగా.. చాలా ఆలస్యంగా 2018లో ఆ వీడియోను బయటి ప్రపంచానికి విడుదల చేశారు.
చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి.. అర్థనగ్నంగా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తుంది. చాలా కాలం అతన్ని వెంబడించాక.. చివరకు అతని ముఖం కెమెరాకు చిక్కింది. కానీ..
దగ్గరికి వెళ్తే.. దాడి
ఎవరైనా అతన్ని చూసినా.. దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తే.. దాడి చేసేవాడు. బాణాలు, ఈటెలు విసరడం లేదంటే.. అడవి గుండా ఉచ్చులు పన్ని వాటిలో పడేలా చేసేవాడు. అయితే.. చంపేవాడు మాత్రం కాదు. తనకు దూరంగా ఉండాలని హెచ్చరించడమే అతని ఉద్దేశంగా ఉండేది. 1970 నుంచి ఆ ప్రాంతంలో మనుషుల దాడులకు బలైన ఆదివాసీ తెగలకు చెందిన వ్యక్తనే అభిప్రాయం మాత్రం ఇన్నాళ్లూ నడుస్తూ వచ్చింది. ఆ అభిప్రాయం ఏర్పడడానికి ప్రధాన కారణం.. అతని జీవన శైలి. గొతులు తవ్వి వాటిలో దాక్కోవడం, వాటి ద్వారానే జంతువులను వేటాడి ఆకలి తీర్చుకోవడం చేస్తూ వచ్చాడు కాబట్టి. అంతేకాదు.. అక్కడొక గుడిసె వేసుకుని కొన్నాళ్లపాటు జీవించాడతను. 2018లో ప్రభుత్వం అతన్ని చిత్రీకరించిన తర్వాత.. అది గమనించి అక్కడి నుంచి మకాం మార్చాడతను.
విషాదం ఉండొచ్చు..!
పేరు, ఏం భాష మాట్లాడతాడో తెలియని ఈ ఆదివాసీకి.. మ్యాన్ ఆఫ్ ది హోల్ అనే పేరు మాత్రం ముద్రపడిపోయింది. కానీ, మనుషులంటే ద్వేషం కలగడానికి ప్రధాన కారణం.. వాళ్లు అతని తెగను బలిగొనడమే!. బ్రెజిల్‌లో అమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతాల్లో పలు 30కిపైగా ఆదివాసీ తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. అయితే 2003లో పాస్ట్రోల్ ల్యాండ్ కమీషన్ యాక్ట్(2003) వచ్చాక భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో భూస్వాములు.. ఆయా తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు. బహుశా అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను అయి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం ఒక అంచానికి వచ్చింది. 1996లో అతని తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనేది మరో అంచనా.
ఆహార సాయం కూడా వద్దనే..
తనారు ప్రాంతంలో 1970 నుంచి ఈ దండకారణ్యంలో భూ ఆక్రమణలతో మారణ హోమం కొనసాగింది. అమెజాన్ అడవులనే నమ్ముకుని బతికిన ఆదివాసీ జాతులెన్నో తుడిచిపెట్టుకుపోయాయి. అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను కావొచ్చని అధికారులు అంటున్నారు. ఆహార సాయం అందించినా కూడా.. ఎవరినీ నమ్మేవాడు కాదతను. వాటిని చీధరించుకుని దూరంగా వెళ్లిపోవడం అందుకు మరింత బలం చేకూర్చిందని చెప్తున్నారు సర్వైవల్ రీసెర్చ్ అండ్ అడ్వొకసీ డైరెక్టర్ ఫియానా వాట్సన్. 80వ దశకంలో ఆదివాసీలకు సాయం పేరిట చక్కెర, ఇతర దినుసుల్లో ఎలుకల మందు కలిపి ఘోరంగా హత్యలు చేసుకుంటూ వెళ్లారని ఆనాటి మారణహోమాన్ని గుర్తు చేస్తున్నారామె.
An isolated Indigenous man known as the “man of the hole” has died in the Amazon; he is thought to be the last of his tribe
— philip lewis (@Phil_Lewis_) August 28, 2022
He resisted all attempts to contact him over decades, during which his family was killed. He shot arrows at anyone who came closehttps://t.co/7dK2NiQt7z pic.twitter.com/lTFuWKyDEO
అమెజాన్ పట్ల నిర్లక్ష్యం, ఆదివాసీల పట్ల చిన్నచూపుతో అధ్యక్షుడు బోల్సోనారో.. ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నాడు. కానీ, ఆ అడవినే నమ్ముకున్న తెగలు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వినాశనాన్ని అడ్డుకుని తీరతామంటూ శపథాలు చేస్తున్నాయి. అలా పోరాటంలోనే ఒంటరి అయిన మ్యాన్ ఆఫ్ ది హోల్ కన్నుమూసి.. కూలిపోయిన స్థితిలో ఓ పాకలో ఆగస్టు 23న కనిపించాడు. అతని మరణానికి గల కారణాలు తెలియరావాల్సి ఉన్నప్పటికీ.. నాగరికత నేర్చిన మనిషి తన మారణహోమం మాత్రం ఎట్టకేలకు పూర్తి అయ్యిందని ఫియానా బాధతో చెప్తోంది.
ఇదీ చదవండి: మేకప్ లేకుండా అందాలపోటీలో ఆమె.. చరిత్రలో తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment