పేరు తెలీదు.. ఊరూ ఏంటో తెలీదు. దట్టమైన కారడవి.. ఎండా.. వాన.. చిమ్మచీకటి ఏదీ లెక్కచేయటం లేదు. ఎవరి తోడు, అండ లేకుండా 22 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తూ వస్తున్నాడో వ్యక్తి. తాజాగా బ్రెజిల్‌లోని ఇండియన్ ఫౌండేషన్ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే...
బ్రసీలియా: రోండోనియా రాష్ట్రం అమెజాన్ అడవుల గుండా వెళ్తే ఈ ఒంటరి మనిషి కథ మొదలవుతుంది. 1996లో తొలిసారిగా ది ఇండియన్ ఫౌండేషన్ బృందం అతన్ని గుర్తించి అనుసరించటం మొదలుపెట్టింది. మార్చి 19, 2011న ఓ వీడియోను తీయగా.. తాజాగా దాన్ని ఈ మధ్యే రిలీజ్ చేశారు. చెట్టును నరుకుతూ కనిపిస్తున్న ఆ వ్యక్తి.. అర్థనగ్నంగా ఉన్నాడు. ముఖం స్పష్టంగా కనిపించటం లేదు. చాలా దూరం నుంచి అతన్ని వీడియో తీసినట్లు తెలుస్తుంది. అతన్ని చివరిసారిగా ఈ మే నెలలో చూసినట్లు ఇండియన్ ఫౌండేషన్ బృంద ప్రతినిధి అల్టెయిర్ అలగైర్ చెబుతున్నారు. అడుగు జాడల ఆధారంగా అతన్ని వెంబడిస్తూ.. అతని జీవన శైలిపై అధ్యయనం చేస్తూ వస్తున్నారు. ‘అతనో శాఖాహారి. దుంపలు, పండ్లు మాత్రమే తింటూ జీవిస్తున్నాడు. వీడియో వైరల్ అవుతుండగా.. అతని గురించి లక్షల్లో ఎంక్వైరీలు వచ్చిపడుతున్నాయని అలగైర్ పేర్కొన్నారు. ప్రమాదకరమైన ఆ పరిస్థితుల్లో ఎలా జీవిస్తున్నాడు?.. అసలు అతనింకా బతికే ఉన్నాడా? అన్న ఆత్రుతే ఎక్కువ మంది అడుగుతున్నారని ఆయన తెలిపారు. అయితే 1990లోనే అతని గురించి ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ప్రపంచానికి పరిచయం చేయటం గమనించదగ్గ విషయం.
తెగలపై దాడులు... అయితే బ్రెజిల్‌లో అమెజాన్ సరిహద్దు గుండా అటవీ ప్రాంతాల్లో పలు తెగలకు చెందిన ప్రజలు జీవిస్తూ ఉండేవారు. అయితే 2003లో పాస్ట్రోల్ ల్యాండ్ కమీషన్ యాక్ట్(2003) వచ్చాక భూ ఆక్రమణలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో భూస్వాములు.. ఆయా తెగలపై దాడులు చేసి వాళ్ల ప్రాణాలను బలిగొన్నారు. బహుశా అలాంటి ఓ తెగకు చెందిన వ్యక్తే ఇతను అయి ఉంటాడని ఇండియన్ ఫౌండేషన్ బృందం భావిస్తోంది. 1996లో అతని తెగ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఉంటుందనే ఓ అంచనా. అయితే ఇన్నేళ్లలో అతన్ని పలకరించే సాహసం ఆ బృందం చేయకపోవటం విశేషం. ‘ఆధునిక నాగరికతకు చెందిన మనుషులు అతనికి తారసపడితే ఎలా స్పందిస్తాడో అన్న ఆత్రుత మాలోనూ ఉంది’ అని అల్టెయిర్ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment