జూలో కొత్త అతిథుల సందడి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రెడ్ ఆండ్రేడ్ టమారీన్ (గోల్డెన్) కోతులు సందడి చేస్తున్నాయి. ఇవి చైన్నై నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం జూకు చేరుకున్నాయని జూ క్యూరేటర్ బిఎన్‌ఎన్. మూర్తి తెలిపారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వీటిని జూకు బహుమతిగా అందజేసిందన్నారు.
కొలంబియా, సౌత్ అమెరికా, ఆమెజాన్ ప్రాంతాలకు చెందిన ఈ అరుదైన కోతులు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ దత్తత తీసుకొని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. వీటిని వారం రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి సందర్శనార్ధం ఎన్‌క్లోజర్లలో ఉంచుతామన్నారు. అతి తక్కువ బరువు (250 గ్రాములు) గల ఈ కోతులకు పిగ్‌టెల్ మాకాక్ (పందితోక కోతులు) ఎన్‌క్లోజర్‌లోనే వీటిని ఉంచుతామన్నారు.
జూకు చేరుకున్న ఈ కోతుల్లో మగది 4 ఏళ్లు, అడవి 3 ఏళ్ల వయస్సు గలవి. వీటి జీవిత కాలం 20 ఏళ్లు. ఇవి ఎక్కువగా గుంపులుగా ఉండేందుకు ఇష్టపడుతాయన్నారు. ఈ కోతులకు పండ్లు, చిన్న చిన్న కీటికాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారమన్నారు. జూలో వీటికి మొలకెత్తిన విత్తనాలు, పండ్లతో పాటు సెర్లాక్స్‌ను కూడా అందిస్తామన్నారు. జూకు మరిన్ని కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.