Petroleum Corporation
-
బీపీసీఎల్ మెరుగైన పనితీరు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,589 కోట్ల నుంచి రూ.3,201 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 54 శాతం వృద్ధి చెంది రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైంది. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మెరుగైన పనితీరుకు తోడ్పడింది. చమురు కంపెనీలు ముడి చమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసిన అనంతరం వివిధ ఉత్పత్తులుగా విక్రయిస్తుంటాయి. కొనుగోలు చేసి, విక్రయించే నాటికి ధరలు పెరగడం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతీ బ్యారెల్ ముడిచమురు శుద్ధిపై 5.11 డాలర్లను ఆర్జించినట్టు బీపీసీఎల్ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒక్కో బ్యారెల్ శుద్ధిపై మార్జిన్ 3.19 డాలర్లుగానే ఉండడం గమనార్హం. సెప్టెంబర్ త్రైమాసికంలో 9.91 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను సంస్థ విక్రయించింది. వ్యాపారాలు కుదురుకోవడం, చమురు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో మంచి వృద్ధిని చూసినట్టు కంపెనీ సీఎఫ్‌వో వీఆర్కే గుప్తా తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం రిఫైనరీ మార్జిన్ల విస్తరణకు సాయపడినట్టు చెప్పారు. ఈక్విటీ మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో షేరు ఒక శాతం నష్టంతో రూ.418 వద్ద ముగిసింది. -
జీఎస్పీసీ వాటాలు కొన్న ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ)లో గుజరాత్ రాష్ట్ర పెట్రోలియం కార్పొరేషన్‌కు (జీఎస్పీసీ) ఉన్న 80% వాటాలను ఓఎన్ జీసీ కొనుగోలు చేసింది. ఇందుకు రూ.7,738 కోట్లు చెల్లించింది. ఇందుకు సంబంధించి ఈ ఏడాది మార్చిలోనే ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. దీనికి గత నెలలో కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో కొనుగోలును పూర్తి చేసినట్టు ఓ ఎన్జీసీ తాజాగా ప్రకటించింది. డీడీడబ్ల్యూలో మిగిలిన 20 శాతం వాటాలో 10% జియో గ్లోబల్ రీసోర్సెస్‌కు, 10 శాతం జులిలెంట్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ లిమిటెడ్‌కు ఉన్నాయి. ఇందులో జియో గ్లోబల్ 10 % వాటాను జీఎస్పీసీ కొనుగోలు చేయనుంది. -
ఏం..తమాషా చేస్తున్నారా..!
అనంతపురం రూరల్ : ‘ఏం..తమాషా చేస్తున్నారా.. సిలిండర్లలో గ్యాస్ నింపడం ఇలాగేనా.. ఇంత తక్కువగా నింపితే ఎలా..? ప్రజలు అమాయాకుల్లా కన్పిస్తున్నారా మీకు’ అంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అనంతపురం రూరల్ మండలం తాటిచెర్ల వద్ద గల హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) గ్యాస్ రీ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీ ఫిల్లింగ్‌స్టేషన్‌ను ఆదివారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొమెస్టిక్ (గృహావసరాలకు) సిలిండర్‌లో 200 గ్రాములు, కమర్షియల్ (వాణిజ్య అవసరాలకు) సిలిండర్లలో 4 కిలోల మేర గ్యాస్ తక్కువగా నింపుతుండటం గమనించారు. సిలిండర్‌పై సీలు సరిగా లేకపోవడం, గడువు తేదీ ముద్రణ అస్తవ్యస్తంగా ఉండటం గుర్తించారు. దీనిపై నిర్వాహకులను ప్రశ్నించగా.. వారు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో ఆగ్రహించిన మంత్రి తమాషాలు చేస్తున్నారా.. ప్రజలను పిచ్చోళ్లను చేసి ఇష్టానుసారంగా గ్యాస్ సిలిండర్లను నింపి విక్రయిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అనంతరం హెచ్‌పీసీఎల్ ఆర్ఎంఓ ఎక్కడంటూ ప్రశ్నించగా ఆయన క్యాంపు వెళ్లారని సిబ్బంది చెప్పారు. ఇక్కడి లోపాలపై అక్కడే ఉన్న సివిల్ సప్లై జిల్లా మేనేజర్ వెంకటేశం, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, తూనికలు, కొలతల ఇన్స్‌స్పెక్టర్ దయాకర్‌రెడ్డిలతో మంత్రి రికార్డు చేయించారు. అనంతపురం మంత్రి మాట్లాడుతూ సిలిండర్లలో తక్కువ గ్యాస్ నింపుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సమక్షంలోనే అధికారులు హెచ్‌పీసీఎల్ ఫిల్లింగ్‌స్టేషన్‌ను సీజ్ చేశారు. -
జూలో కొత్త అతిథుల సందడి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో రెడ్ ఆండ్రేడ్ టమారీన్ (గోల్డెన్) కోతులు సందడి చేస్తున్నాయి. ఇవి చైన్నై నుంచి ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం జూకు చేరుకున్నాయని జూ క్యూరేటర్ బిఎన్ఎన్. మూర్తి తెలిపారు. గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వీటిని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. కొలంబియా, సౌత్ అమెరికా, ఆమెజాన్ ప్రాంతాలకు చెందిన ఈ అరుదైన కోతులు గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ దత్తత తీసుకొని జూకు బహుమతిగా అందజేసిందన్నారు. వీటిని వారం రోజులపాటు ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి సందర్శనార్ధం ఎన్క్లోజర్లలో ఉంచుతామన్నారు. అతి తక్కువ బరువు (250 గ్రాములు) గల ఈ కోతులకు పిగ్టెల్ మాకాక్ (పందితోక కోతులు) ఎన్‌క్లోజర్‌లోనే వీటిని ఉంచుతామన్నారు. జూకు చేరుకున్న ఈ కోతుల్లో మగది 4 ఏళ్లు, అడవి 3 ఏళ్ల వయస్సు గలవి. వీటి జీవిత కాలం 20 ఏళ్లు. ఇవి ఎక్కువగా గుంపులుగా ఉండేందుకు ఇష్టపడుతాయన్నారు. ఈ కోతులకు పండ్లు, చిన్న చిన్న కీటికాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారమన్నారు. జూలో వీటికి మొలకెత్తిన విత్తనాలు, పండ్లతో పాటు సెర్లాక్స్ను కూడా అందిస్తామన్నారు. జూకు మరిన్ని కొత్త వన్యప్రాణులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.