న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు కంపెనీ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 24 శాతం పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.2,589 కోట్ల నుంచి రూ.3,201 కోట్లకు చేరుకుంది. ఆదాయం సైతం 54 శాతం వృద్ధి చెంది రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైంది. గత కొంత కాలంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మెరుగైన పనితీరుకు తోడ్పడింది. చమురు కంపెనీలు ముడి చమురును కొనుగోలు చేసి, శుద్ధి చేసిన అనంతరం వివిధ ఉత్పత్తులుగా విక్రయిస్తుంటాయి.
కొనుగోలు చేసి, విక్రయించే నాటికి ధరలు పెరగడం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ప్రతీ బ్యారెల్ ముడిచమురు శుద్ధిపై 5.11 డాలర్లను ఆర్జించినట్టు బీపీసీఎల్ తెలిపింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఒక్కో బ్యారెల్ శుద్ధిపై మార్జిన్ 3.19 డాలర్లుగానే ఉండడం గమనార్హం. సెప్టెంబర్ త్రైమాసికంలో 9.91 మిలియన్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తులను సంస్థ విక్రయించింది. వ్యాపారాలు కుదురుకోవడం, చమురు డిమాండ్ పెరుగుతూ ఉండడంతో మంచి వృద్ధిని చూసినట్టు కంపెనీ సీఎఫ్‌వో వీఆర్‌కే గుప్తా తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం రిఫైనరీ మార్జిన్ల విస్తరణకు సాయపడినట్టు చెప్పారు.
ఈక్విటీ మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి.
బీఎస్‌ఈలో షేరు ఒక శాతం నష్టంతో రూ.418 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment